కశ్మీర్‌: ‘మోదీ ప్రభుత్వ ప్రచార ఎత్తుగడలో భాగం కావాలనుకోలేదు’ - ఈయూ ఎంపీ క్రిస్ డేవిస్

  • గగన్ సబ్బర్వాల్
  • బీబీసీ ప్రతినిధి, లండన్ నుంచి
ఎంపీ క్రిస్ డేవిస్

ఫొటో సోర్స్, CHRIS DAVIES MEP/TWITTER

యూరప్ ఎంపీల బృందం కశ్మీర్ పర్యటనలో ఉంది. యూరోప్ పార్లమెంటు సభ్యుడు క్రిస్ డేవిస్ కూడా వారితో రావాలని అనుకున్నారు. కానీ తనకు పంపిన ఆహ్వానాన్ని తర్వాత వెనక్కు తీసుకున్నారని, ఆ ప్రతినిధి బృందంలో తనకు చోటు ఇవ్వలేదని ఆయన చెబుతున్నారు.

ఈ పర్యటన కోసం భారత ప్రభుత్వం ముందు తాను ఒక షరతు పెట్టానని వాయవ్య ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్ డేవిస్ చెప్పారు. కశ్మీర్లో ఎక్కడైనా తిరగడానికి, ప్రజలతో మాట్లాడ్డానికి తనకు స్వేచ్ఛనివ్వాలని కోరినట్లు తెలిపారు.

బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడిన డేవిస్ "కశ్మీర్లో నేను ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లేలా, ఎవరితో మాట్లాడాలనుకుంటే వారితో మాట్లాడగలిగేలా నాకు స్వేచ్ఛ కావాలని కోరాను. నాతో సైన్యం, పోలీసులు లేదా భద్రతా బలగాలకు బదులు స్వతంత్ర జర్నలిస్టులు, టెలివిజన్ బృందం ఉండాలని చెప్పాను. వార్తల్లో కత్తిరింపులు, కుదించడాన్ని మేం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోమని చెప్పాం. అక్కడ ఏం జరుగుతోందో దాని గురించి నిజమైన, నిజాయితీ రిపోర్టింగ్ ఉండాలని చెప్పానని" తెలిపారు.

అలా చెప్పిన కొన్ని రోజుల తర్వాత తనకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కు తీసుకున్నట్లు డేవిస్ చెప్పారు.

ఫొటో సోర్స్, EUROPEAN PHOTOPRESS AGENCY

ఫొటో క్యాప్షన్,

శ్రీనగర్‌లో యూరోపియన్ యూనియన్ ఎంపీల కాన్వాయ్

మోదీని సమర్థించే సంస్థ నుంచి ఆహ్వానం

తనకు కశ్మీర్ పర్యటన ఆహ్వానం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మద్దతుదారులుగా చెబుతున్న 'ఉమెన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ థింక్ ట్యాంక్' తరఫున వచ్చిందని చెప్పారు. ఈ పర్యటన ఏర్పాట్లను భారత ప్రభుత్వ సహకారంతో చేస్తున్నట్లు అందులో స్పష్టంగా చెప్పారని" డేవిస్ తెలిపారు.

"ఈ పర్యటన ఖర్చును 'ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ నాన్ అలైన్డ్ స్టడీస్' భరిస్తుందని నాకు చెప్పారు. అయితే ఆ సంస్థకు లభించే ఆ నిధుల సోర్స్ ఏదనేదానిపై నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు" అని డేవిడ్ చెప్పారు.

"నిర్వాహకులు మొదట్లో కాస్త 'భద్రత అవసరం' అవుతుంది అన్నారు. కానీ రెండ్రోజుల తర్వాత నాకు ఆహ్వానం రద్దు చేసినట్లు చెప్పారు. ఎందుకంటే పర్యటనకు వెళ్లేవారి సంఖ్య పూర్తైందన్నారు. నా ఆహ్వానం పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు" చెప్పారు.

ఫొటో సోర్స్, CHRIS DAVIES MEP/TWITTER

'ఆల్ ఈజ్ వెల్' అనడానికి రెడీగా లేను

ఆహ్వానం వెనక్కు తీసుకోవడానికి కారణం ఏమని చెప్పారు అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. నిర్వాహకులకు తన షరతులు సరిగా అనిపించకపోయుండచ్చని చెప్పారు.

"నేను మోదీ ప్రభుత్వం పీఆర్ స్టంట్‌లో భాగం కావడానికి, 'ఆల్ ఈజ్ వెల్' అని చెప్పడానికి రెడీగా లేను. నా ఈమెయిల్ ద్వారా వారికి ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పాను. కశ్మీర్‌లో ప్రజాస్వామ్య సిద్ధాంతాలను కాలరాస్తుంటే, ప్రపంచానికి దాని గురించి తెలియాలి. భారత ప్రభుత్వం ఏం దాచాలనుకుంటోంది? జర్నలిస్టులు, పర్యటించే నేతలకు స్థానిక ప్రజలతో స్వేచ్ఛగా మాట్లాడేందుకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదు? వారి సమాధానం చూస్తుంటే, నా అభ్యర్థన వారికి నచ్చలేదని అనిపిస్తోంది" అని డేవిస్ చెప్పారు.

"నేను ఏ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానో, అక్కడ కశ్మీరీ వారసత్వంలో భాగమైన వారు కొన్ని వేల మంది ఉన్నారు. వారి బంధువులు చాలా మంది కశ్మీర్లో ఉన్నారు. కశ్మీరీలను ప్రభావితం చేస్తున్న చాలా అంశాలను వారు నా ముందుకు తెచ్చారు. వాటిలో సమాచార మాధ్యమాలపై విధించిన నిషేధం కూడా ఉంది" అని డేవిస్ చెప్పారు.

ఫొటో సోర్స్, CHRIS DAVIES MEP/TWITTER

ఆందోళన చెందలేదు

ఈ పర్యటన నుంచి మీరు ఏం సాధించాలనుకున్నారు? అనే ప్రశ్నకు డేవిస్ జవాబిస్తూ.. "నేను కశ్మీర్ లోయలో ప్రాథమిక స్వేచ్ఛ మళ్లీ నెలకొంటోందని చూపించాలని, ప్రజల రాకపోకలు, అభిప్రాయం పంచుకోవడం, లేదా శాంతియుత వ్యతిరేక ప్రదర్శన హక్కుపై ఎలాంటి నిషేధం లేదు అని చెప్పాలనుకున్నా. కానీ నిజం చెప్పాలంటే.. అలా కనిపిస్తుందని నాకు ఎప్పుడూ అనిపించలేదు. భారత ప్రభుత్వం తన చర్యలపై స్వతంత్ర్య సమీక్షకు అనుమతించేందుకు సిద్ధంగా ఉందా అనేదానికి ఇది ఒక లాంటి పరీక్ష" అన్నారు.

కశ్మీర్ పర్యటన ఆహ్వానం వెనక్కు తీసుకోవడం గురించి తను ఆందోళన చెందలేదని డేవిస్ చెప్పారు.

"నాకు మొదటే ఈ పర్యటన పీఆర్ స్టంట్‌లా అనిపించింది. దాని లక్ష్యం నరేంద్ర మోదీకి సాయం చేయడమే. నాకు తెలిసి, కశ్మీర్‌లో భారత ప్రభుత్వం చర్యలు గొప్ప ప్రజాస్వామ్య సూత్రాలను వంచించడం లాగే భావిస్తున్నాను. ప్రపంచం ఈ స్థితిపై ఎంత తక్కువ దృష్టి పెడితే, ఆయన అంత సంతోషిస్తారు" అని డేవిస్ చెప్పారు.

ఫొటో సోర్స్, CHRIS DAVIES MEP/TWITTER

సరైన సమాచారం లేదు

కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి మీరేమనుకుంటున్నారు అని అడగ్గా డేవిస్ స్పందిస్తూ.. "కశ్మీర్లో ఏమేం జరుగుతున్నాయో, వాటి గురించి కచ్చితమైన సమాచారం లేదు. కానీ ప్రజలను జైళ్లలో పెట్టినట్లు, మీడియాపై నిషేధం, సమాచార మాధ్యమాలపై కఠిన ఆంక్షలు, సైన్యం నియంత్రణ గురించి మేం వింటున్నాం. ప్రభుత్వ చర్యల గురించి ఎంత సానుభూతి ఉన్నా, ఈ చర్య మత పక్షపాతంతో తీసుకున్నదని కూడా ఆలోచించాలి. ముస్లింలు హిందూ జాతీయవాదాన్ని సమర్థవంతమైన వ్యవస్థగా చూస్తున్నారు. అది భవిష్యత్తులో మంచిది కాదు. ప్రస్తుతం దేశాల మధ్య శాంతి ప్రాధాన్యం వేగంగా, అసమర్థంగా మారుతోంది" అన్నారు.

లండన్లో ఇటీవల కశ్మీర్ అంశంపై జరిగిన నిరసన ప్రదర్శనల్లో కొందరు గుడ్లు, రాళ్లు విసరడం గురించి మాట్లాడిన క్రిస్ డేవిడ్, తన మద్దతు శాంతియుత ప్రదర్శనలకే అన్నారు. కానీ, ప్రజలకు నష్టం కలిగించే ఏ వస్తువునైనా ఉపయోగించడం చట్టవిరుద్ధం, తప్పు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)