కశ్మీర్‌లో పర్యటించిన 23 మంది యూరప్ ఎంపీలు ఏమంటున్నారు?

ఈయూ ఎంపీలు

ఫొటో సోర్స్, Getty Images

కశ్మీర్‌లో యూరోపియన్ యూనియన్ ఎంపీల బృందం పర్యటనపై వివాదం రేగుతోంది.

కశ్మీర్‌కు వెళ్లకుండా సొంత ఎంపీలు, ఉద్యమకారులను ఆపిన ప్రభుత్వం విదేశీ ఎంపీలను ఎలా పంపుతోందని ప్రతిపక్ష పార్టీలు మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.

కశ్మీర్‌లో పరిస్థితులంతా సాధారణంగా ఉంటే ఎంపిక చేసిన కొందరు విదేశీల ఎంపీలను మాత్రమే అక్కడికి ప్రభుత్వం ఎందుకు వెళ్లనిస్తోందని కాంగ్రెస్, సీపీఎం ప్రశ్నించాయి.

కశ్మీర్ భారత అంతర్గత విషయమని వాదించి, ఇప్పుడు విదేశీ ఎంపీలను ఆ ప్రాంతంలో పర్యటింపజేయడంపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

23 మందితో కూడిన యూరోపియన్ యూనియన్ ఎంపీల బృందం మంగళవారం శ్రీనగర్‌కు చేరుకుని, అక్కడ భారత సైనిక అధికారులతో సమావేశమైంది. ఆ తర్వాత దాల్ సరస్సును సందర్శించింది. ఈ బృందం వెంట భద్రతా దళాల సిబ్బంది పెద్ద సంఖ్యలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

కశ్మీర్ పర్యటన తర్వాత బుధవారం ఉదయం ఈ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. తమ అనుభవాల గురించి వెల్లడించారు.

అయితే, ఈ మీడియా సమావేశానికి స్థానిక మీడియాను అనుమతించలేదని బీబీసీ ప్రతినిధి రియాజ్ మస్రూర్ తెలిపారు.

''కశ్మీర్‌కు వచ్చిన వెంటనే ఆ 23 మంది ఎంపీలను సైనిక ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి వారిని నియంత్రణ రేఖ వద్దకు సైన్యం తీసుకువెళ్లింది. ఈ పర్యటన అంతర్జాతీయ సమాజాన్ని మోసపుచ్చేందుకు చేస్తున్న ప్రయత్నమని నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ అక్బర్ లోన్ ఆరోపించారు'' అని రియాజ్ వివరించారు.

ఒక ఈయూ ఎంపీ మీడియాతో మాట్లాడుతూ, ''అంతర్జాతీయ ప్రతినిధి బృందంలో మేం భాగం. ఉగ్రవాదాన్ని అంతం చేసి, శాంతిని స్థాపించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. మేం దీనికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. మాకు ఆత్మీయ స్వాగతం పలికినందుకు భారత ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు ధన్యవాదాలు'' అని అన్నారు.

కశ్మీర్‌లో ఉగ్రవాద సమస్య తీవ్రంగా ఉందని, అయితే భారత ప్రభుత్వం దీన్ని పరిష్కరించగలదని ఇంకొందరు ఈయూ ఎంపీలు విశ్వాసం వ్యక్తం చేశారు.

మంగళవారం కశ్మీర్‌లో మిలిటెంట్లు ఐదుగురు కార్మికులను హత్య చేశారు. ఈ ఘటనపైనా ఈయూ ఎంపీలు స్పందించారు.

''ఆర్టికల్ 370 భారత్ అంతర్గత విషయం. మా ఆందోళన ఉగ్రవాదం గురించే. ఇది అంతర్జాతీయ సమస్య. దీన్ని ఎదుర్కోవడంలో భారత్‌కు మద్దతుగా మేమున్నాం. కార్మికుల హత్యలను ఖండిస్తున్నాం'' అని ఫ్రాన్స్‌కు చెందిన ఈయూ ఎంపీ హెన్రీ మాలోసె వ్యాఖ్యానించినట్లు పీటీఐ వార్తాసంస్థ పేర్కొంది.

''కొన్నేళ్ల సంఘర్షణ తర్వాత ఇక్కడ శాంతి నెలకొంటోంది. ప్రపంచంలోనే భారత్ అత్యంత శాంతిపూరిత దేశంగా మారాలని నేను ఆశిస్తున్నా. ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత్‌తో కలిసి మనం నిలబడాల్సిన అవసరం ఉంది. ఇది కళ్లు తెరిపించే పర్యటన'' అని బ్రిటన్‌కు చెందిన ఈయూ ఎంపీ న్యూటన్ డన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

అయితే, ఈయూ ఎంపీల పర్యటన వారి వ్యక్తిగతమైనదేనని యూరోపియన్ యూనియన్ తమకు తెలిపిందని దిల్లీలోని జర్మనీ రాయబార కార్యాలయ అధికారి వాల్టర్ జే లిండ్నర్ ఏఎన్ఐ వార్తాసంస్థతో అన్నారు.

జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన తర్వాత ఆ ప్రాంతంలో ఏదైనా విదేశీ ప్రతినిధుల బృందం పర్యటించడం ఇదే మొదటిసారి.

గత ఆగస్టు 5న ఆర్టికల్ 370కి సవరణ చేయడం ద్వారా ప్రత్యేక ప్రతిపత్తిని మోదీ ప్రభుత్వం తొలగించి, జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే.

కశ్మీర్ పర్యటనకు వచ్చిన ఈయూ ఎంపీలు ప్రముఖులు కాదని, ఇదంతా ప్రభుత్వం దగ్గరుండి నడిపిస్తున్న ఓ కార్యక్రమమని హైదరాబాద్ ఎంసీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. అమెరికాకు చెందిన ఓ సెనేటర్ కశ్మీర్‌లో పర్యటిస్తానని అనుమతి కోరితే ప్రభుత్వం నిరాకరించిందని అన్నారు.

ఇంతకుముందు అమెరికా సెనేటర్ క్రిస్ వాన్ హోలెన్ కశ్మీర్‌లో పర్యటించడానికి భారత ప్రభుత్వం అనుమతి కోరారు. ఆయన అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఈయూ ఎంపీల పర్యటనలో ముఖ్యాంశాలు

  • కశ్మీర్‌లో ఈయూ ఎంపీలు బులెట్ ప్రూఫ్ వాహనం వినియోగించారు. వీరి వెంట భద్రతదళాల బృందం ఉంది. శ్రీనగర్ విమానాశ్రయం నుంచి సైన్యం స్థానికంగా ఉన్న ఓ హోటల్‌కు తీసుకువచ్చింది. ఈ ఎంపీల్లో చాలా మంది మితవాద (రైట్ వింగ్) పార్టీలకు చెందినవారున్నారు. వ్యక్తిగత హోదాలోనే ఈ పర్యటనకు వచ్చారు.
  • జమ్మూకశ్మీర్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బీబీఆర్ సుబ్రహ్మణ్యం, పోలీస్ చీఫ్ దిల్‌బాగ్ సింగ్‌లను ఈయూ ఎంపీల బృందం కలిసింది. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన కొందరు వ్యక్తులతోనూ మాట్లాడింది. స్థానిక ప్రజలను ఈ బృందం కలవలేదని, సైన్యం వెంటే వివిధ ప్రదేశాలకు వెళ్లిందని బీబీసీ ప్రతినిధి రియజ్ మస్రూర్ చెప్పారు.
  • ప్రముఖ పర్యాటక ప్రదేశమైన దాల్ సరస్సునూ ఈయూ ఎంపీలు సందర్శించారు. సరస్సులో బోటింగ్ చేస్తూ సెంటార్ హోటల్ సమీపం నుంచి వారు వెళ్లారని, ఆ హోటల్‌లోనే 30కిపైగా మంది స్థానిక నాయకులు నిర్బంధంలో ఉన్నారని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters

  • యూరప్ పార్లమెంటు సభ్యుడు క్రిస్ డేవిస్ కూడా ఈ బృందంతో రావాల్సి ఉంది. కశ్మీర్లో ఎక్కడైనా తిరగడానికి, ప్రజలతో మాట్లాడ్డానికి తనకు స్వేచ్ఛనివ్వాలని భారత ప్రభుత్వం ముందు షరతు పెట్టానని, తనకు పంపిన ఆహ్వానాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుందని డేవిస్ చెప్పారు.
  • "కశ్మీర్లో నేను ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లేలా, ఎవరితో మాట్లాడాలనుకుంటే వారితో మాట్లాడగలిగేలా నాకు స్వేచ్ఛ కావాలని కోరాను. నాతో సైన్యం, పోలీసులు లేదా భద్రతా బలగాలకు బదులు స్వతంత్ర జర్నలిస్టులు, టెలివిజన్ బృందం ఉండాలని చెప్పాను. వార్తల్లో కత్తిరింపులు, కుదించడాన్ని మేం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోమని చెప్పాం. అక్కడ ఏం జరుగుతోందో దాని గురించి నిజమైన, నిజాయితీ రిపోర్టింగ్ ఉండాలని చెప్పానని" అని డేవిస్ బీబీసీతో చెప్పారు.
  • ''యూరప్ నుంచి వచ్చిన ఎంపీలను స్వాగతించి మరీ ప్రభుత్వం పర్యటన చేయిస్తోంది. భారత ఎంపీలను మాత్రం అడ్డుకుంటోంది. కచ్చితంగా ఇందులో ఏదో పెద్ద తప్పు ఉంది'' అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)