నల్లగా ఉన్నావంటూ భర్త చేసే వేధింపులకు తట్టుకోలేక భార్య ఆత్మహత్య

ఫెయిర్‌నెస్ క్రీమ్

ఫొటో సోర్స్, Getty Images

నల్లగా ఉన్నావంటూ భర్త చేస్తున్న వేధింపులు తట్టుకోలేక రాజస్థాన్‌లో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఆ యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్తపై కేసు నమోదైంది.

అయితే, ఇంతవరకూ ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు బీబీసీ హిందీతో చెప్పారు.

తనపై వచ్చిన ఆరోపణలపై ఆ భర్త ఇంకా స్పందించలేదు.

నల్లగా ఉన్నవంటూ తమ కుమార్తెను ఆమె భర్త తరచూ అవమానించేవాడని మృతురాలి తండ్రి ఫిర్యాదులో ఆరోపించారు. అవమానాలను తాళలేకే ఆమె ప్రాణాలు తీసుకుందని అన్నారు.

2014లో గురుగ్రామ్‌లో నల్లగా ఉన్నందుకు భర్త వేధించడంతో 29 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకున్నారు.

గత ఏడాది హైదరాబాద్‌లో కూడా ఓ 14 ఏళ్ల బాలిక తన తోటి విద్యార్థులు నల్లగా ఉన్నావంటూ ఏడిపించడంతో ప్రాణాలు తీసుకుంది.

ఫొటో సోర్స్, Getty Images

తెలుపుపై 'ప్రమాదకరమైన' మోజు

గీతా పాండే, బీబీసీ న్యూస్

తెల్ల రంగే అందమన్న అపోహతో, ఆ రంగు పట్ల జనాలు మోజును పెంచుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ విషాదం మరోసారి చాటిచెప్పింది.

చిన్నప్పటి నుంచే శరీర రంగు విషయంలో అమ్మాయిలు వేధింపులు ఎదుర్కొంటున్నారు. నలుపు రంగులో ఉన్నవారికి పాఠశాలలు, మైదానాలు, ఆఖరికి ఇళ్లలోనూ అవమానాలు తప్పడం లేదు.

నలుపు రంగులో ఉన్న చిన్నారులను తెల్లగా ఉన్నవారి తోబుట్టువులతో పోల్చుతూ కొందరు చులకన చేస్తుంటారు.

వివాహ భాగస్వామి కోసం ఇచ్చే ప్రకటనల్లోనూ 'తెలుపు' రంగే ప్రధాన అర్హత.

టీవీల్లో, సినిమాల్లో, ప్రకటనల్లోనూ తెల్లగా ఉన్న వాళ్లే ఎక్కువగా కనిపిస్తుంటారు.

నలుపు రంగులో ఉన్నవారిలో ఇవన్నీ న్యూనతాభావాన్ని పెంచుతున్నాయి. అందంగా లేమన్న భావనను వాళ్లకు కలిగిస్తున్నాయి.

వీడియో క్యాప్షన్,

వీడియో: నల్లగా వంకాయలా ఉన్నావని వెక్కిరించారు

నలుపు రంగు ఉన్నవారిని తక్కువగానో, బాధపడుతున్నవారిగానో ప్రకటనల్లో చిత్రించకూడదని నిబంధనలు ఉన్నాయి. అయితే, పరోక్షంగా తెలుపు రంగే అందమన్న అపోహను పెంచే ప్రకటనలు వస్తూనే ఉన్నాయి.

నలుపు రంగు ఎంత మాత్రమూ తక్కువ కాదని సందేశం పంచుతున్న కార్యక్రమాలు ఇటీవల పెరిగాయి. అయినా, ఈ విషయంలో చేయాల్సింది ఇంకెంతో ఉంది.

అందం అంటే రంగు కాదన్న సందేశం అందరికీ చేరాలి. అప్పుడే ఈ వివక్షపూరిత ధోరణులకు అమాయక ప్రాణాలు బలికావడం ఆగిపోతుంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)