RCEP అంటే ఏమిటి? మోదీ ఈ ఆర్థిక బృందంలో చేరితే భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

మోదీ RCEPలోకి వెళ్తే భారత్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది?

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సింగపూర్‌లో జరిగిన ఆర్‌సీఈపీ సమావేశంలో కంబోడియా ప్రధాని హూన్ సేన్, న్యూజీలాండ్ ప్రధాని జెసిండా అడర్న్‌లతో భారత ప్రధాని నరేంద్ర మోదీ

అంతర్జాతీయ వాణిజ్యంలో గత కొన్నేళ్లుగా ఏ భాగస్వామ్యాల గురించి ఎక్కువ చర్చ జరుగుతోందో వాటిలో ప్రతిపాదిత 'రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్' (RCEP) అంటే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం కూడా ఉంది. అయితే, ఇది ఇప్పటికీ క్షేత్రస్థాయిలో జరగకపోయినా, చాలా విషయాల వల్ల పతాక శీర్షికల్లో నిలుస్తోంది.

దీనిలో 'అసోసియేషన్ ఆఫ్ సౌత్-ఈస్ట్ ఏషియన్ నేషన్స్' అంటే ఆసియాన్ 10 సభ్య దేశాలు, వాటితోపాటు భారత్, జపాన్, చైనా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ కూడా ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి సలహా బృందం దీని గురించి తన అభిప్రాయం తెలియజేసింది. ఈ ప్రతిపాదిత ఆర్‌సీఈపీ భారత్ కూడా చేరాలని వారు భావిస్తున్నారు. భారత్ ఆర్‌సీఈపీకి దూరంగా ఉండాలనే ప్రశ్నే తలెత్తదని, దానివల్ల భారతదేశం పెద్ద ప్రాంతీయ మార్కెట్‌కు బయటే ఉండిపోతుందని ఆ బృందం భావిస్తోంది.

ఈ బృందానికి సుర్జీత్ భల్లా అధ్యక్షుడుగా ఉన్నారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీలో ఆయన సభ్యుడు. దీనివల్ల రూపాయి స్థిరంగా ఉంటుందని, దానితోపాటు కస్టమ్స్ సుంకం, కార్పొరేట్ టాక్స్ కూడా తగ్గుతుందని ఆయన చెబుతున్నారు.

ఈ 16 ఏసియా పసిఫిక్ దేశాల దగ్గర గ్లోబల్ జీడీపీలో మూడో వంతు భాగం ఉంది. ఇది విజయవంతం అయితే ఆర్సీఈపీ 340 కోట్ల ప్రజల మార్కెట్ అవుతుంది.

ఫొటో సోర్స్, www.weforum.org/ASEAN

ఫొటో క్యాప్షన్,

ఆసియాన్ సభ్యదేశాలు బ్రూనై, కంబోడియా, ఇండొనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం

కానీ, ఈ 16 దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని అసమానతలు అవరోధంగా మారాయి. ఆస్ట్రేలియా సంపన్న దేశం. అక్కడ తలసరి కనిష్ట జీడీపీ 55 వేల డాలర్లకు పైనే ఉంటుంది. ఇటు, కంబోడియా 1300 డాలర్లతో తలసరి ఆదాయం చివరి స్థానంలో ఉంది.

మరో వైపు భారత్ విషయానికి వస్తే, దానికి ఆర్‌సీఈపీ ఒక సవాలు కంటే తక్కువేం కాదని చెబుతున్నారు. భారత్‌కు దీనివల్ల ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఎలక్ట్రానిక్ డేటా షేరింగ్, లోకల్ డేటా స్టోరేజ్ డిమాండ్లే.

భద్రతా కారణాలు, జాతీయ ప్రయోజనాలు, గోప్యత దృష్ట్యా వీటిని షేర్ చేసుకోవడం అంత సులభం కాదు. ఈ అవసరాల వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో భారత్ ఒకవేళ దీనిలో చేరితే దేశీయ ఉత్పత్తులు తీవ్రంగా ప్రభావితమవుతాయని చెప్పింది. థాయ్‌లాండ్‌లో ఆర్‌సీఈపీ కీలక సమావేశం జరుగుతున్న సమయంలో ఎస్బీఐ నివేదిక వచ్చింది. ఏడేళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత నవంబర్‌లో దీనిపై భారత్ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఎస్బీఐ తన 2018-19 నివేదికలో ఆర్‌సీఈపీ 15 సభ్య దేశాల్లో 11 దేశాలతో భారత్‌కు వాణిజ్య లోటు ఉందని చెప్పింది. 2018-19లో భారత్ వాణిజ్య లోటు 184 బిలియన్ డాలర్లు. ఆర్సీఈపీ దేశాలతో భారత్ దిగుమతులు 34 శాతం ఉంటే, ఎగుమతులు కేవలం 21 శాతం ఉన్నాయని ఈ నివేదికలో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

భారత్ ఎదుట అసలు సవాలు

భారత్‌కు ఇందులో ఇంకా ఎన్నో రకాల సవాళ్లు ఉన్నాయి. ట్రేడ్ యూనియన్, సివిల్ సొసైటీ, స్వదేశీ గ్రూపులకు వాటి వైపు నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ నుంచి డెయిరీ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడం అతిపెద్ద అభ్యంతరంగా ఉంది.

వాటితోపాటు జనరిక్ మందుల లభ్యత, మైనింగ్ లాభాలు, నీళ్లు, శక్తి, రవాణా, టెలీకాం ప్రైవేటీకరణ కూడా పెద్ద అడ్డంకులే. వీటితోపాటు ఆర్థిక అసమానత కూడా ఒక సమస్యగా ఉంది.

ఆర్సీఈపీ దేశాలు పరస్పర అభిప్రాయ బేధాలను దూరం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఆ సవాళ్లు ముగిసిపోలేదు. ఈ నెల బ్యాంకాక్‌లో చాలా సమావేశాలు జరిగాయి. కానీ, డెయిరీ ఉత్పత్తులు, ఈ-కామర్స్, ప్రత్యక్ష పెట్టుబడులు లాంటి అంశాలపై ఇప్పటివరకూ ఏకాభిప్రాయం కుదరలేదు.

ఆర్సీఈపీ 16 దేశాల మధ్య ఒక వ్యాపార ఒప్పందం ఉంది. దాని ప్రకారం సభ్య దేశాలు ఎగుమతి, దిగుమతుల టారిఫ్ తగ్గిస్తాయి లేదా పూర్తిగా రద్దు చేస్తాయి. ఎలాంటి సుంకాలు లేకుండానే వ్యాపారానికి ప్రోత్సాహం అందిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images

దేశంలో భయం ఎందుకు

కానీ భారత్‌లో దీని గురించి తయారీదారులు, రైతులు కూడా భయపడుతున్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయానికి వస్తే భారత్ గత అనుభవాలు సరిగా లేవు. భారత్ ఈ దేశాలన్నింటితో వాణిజ్య లోటుతో ఉంది. అది ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది.

ఈ దేశాల్లో భారత్ మొత్తం ఎగుమతులు 20 శాతం ఉన్నాయి. అటు దిగుమతులు 35 శాతం ఉన్నాయి. అమెరికా ట్రేడ్ వార్‌కు దిగడంతో చైనా ఆర్సీఈపీకి మద్దతిస్తోంది. భారత్‌కు అతి పెద్ద ఎగుమతిదారు చైనానే. ఒక్క చైనాతోనే భారత వాణిజ్య లోటు చాలా భారీగా ఉంది.

చైనా నుంచి ప్రతి ఏటా దిగుమతి అయ్యే ఎలక్ట్రికల్ మెషినరీ, పరికరాలు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, స్టీల్, అల్యూమినియం, కృత్రిమ ఫైబర్, ఫర్నిచర్ భారత మార్కెట్లో భారీగా అమ్ముడవుతాయి. ఆర్సీఈపీ డీల్ జరిగితే భారత మార్కెట్లో చైనా ఉత్పత్తులు మరింత పెరుగుతాయనే భయం కూడా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

గత అనుభవాలు ఎలా ఉన్నాయి

2006 తర్వాత ద్వైపాక్షిక వాణజ్య ఒప్పందాలపై భారత్ దూకుడుగా సంతకాలు చేయడం ప్రారంభించింది. భారత్ మొదటిసారి శ్రీలంకతో 2000లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమంట్ చేసుకుంది. ఆ తర్వాత మలేసియా, సింగపూర్, దక్షిణ కొరియాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది.

గణాంకాలు గమనిస్తే, ఈ ఒప్పందాల వల్ల భారత వాణిజ్య లోటు తగ్గడానికి బదులు పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది. నీతి ఆయోగ్ రెండేళ్ల క్రితం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్న దేశాలతో వ్యాపారంపై ఒక నివేదిక ప్రచురించింది. ఈ నివేదికలో భారత్ దిగుమతులు పెరిగి, ఎగుమతులు తగ్గాయని చెప్పారు.

దేశీయ తయారీ పరిశ్రమల్లో ఒకటైన లోహ పరిశ్రమపై 'ఫారిన్ ట్రేడ్ అగ్రిమెంట్' అంటే ఎఫ్టీఏ వల్ల తీవ్ర ప్రభావం పడింది. ఒక నివేదిక ప్రకారం లోహాలపై ఎఫ్టీఏ టారిఫ్‌లో 10 శాతం తగ్గించడం వల్ల దాని దిగుమతులు 1.4 శాతం పెరిగాయి.

మార్కెట్ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం ఆర్సీఈపీ వల్ల వ్యవసాయ ఉత్పత్తులపై చాలా ప్రతికూల ప్రభావం పడింది. వీటిలో పాల ఉత్పత్తులు, మిరియాలు, ఏలకలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలంక నుంచి మిరియాలు, ఏలకలు అత్యంత చౌకగా దిగుమతి అవుతున్నాయి. ఇలా, ఆసియాన్ దేశాలు కేరళ రైతులకు నష్టాలు తెచ్చిపెడుతున్నాయి.

రబ్బర్ రైతులకు కూడా ఇదే సమస్య ఎదురవుతోంది. వియత్నాంలో రబ్బర్ చౌక ధరకు లభిస్తుంది. దాని వల్ల ఇండోనేసియా పరిశ్రమలు మూతపడ్డాయి. ఫిలిప్పీన్స్, ఇండోనేసియా నుంచి కొబ్బరి నూనె కేక్ వస్తుండండతో కొబ్బరిరైతులు కూడా ఆందోళనలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

డెయిరీ పరిశ్రమలపై ప్రభావం

ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ పాల ఉత్పత్తులు(డెయిరీ ప్రొడక్ట్స్) భారత మార్కెట్లోకి వస్తే ఇక్కడ దేశీయ డెయిరీ సెక్టార్‌పై ఆ ప్రభావం పడుతుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య అక్టోబర్ 11న మహాబలిపురంలో చర్చలు జరిగినపుడు రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు గురించి కూడా చర్చ జరుగుతుందని అనుకున్నారు.

2013-14, 2018-19 మధ్య చైనాతో భారత్ వాణిజ్య లోటు 36 బిలియన్ డాలర్ల నుంచి పెరిగి 53 బిలియన్ డాలర్లకు చేరింది. దాంతో, ఇప్పుడు భారత్ మొత్తం వాణిజ్య లోటులో చైనాదే సగం ఉంది.

మార్కెట్లో చైనా ప్రవేశించడం వల్ల వ్యాపారుల పరిస్థితి ఎలా మారుతుంది అనేదానిపై నీతి ఆయోగ్ 2017 నివేదిక ఒక ఆసక్తికరమైన విషయం చెప్పింది. ఆసియాన్ దేశాలు-చైనా మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగాక 2016లో ఆసియాన్ ఆరు దేశాల( ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్, సింగపూర్)తో చైనా వ్యాపారం 54 బిలియన్ డాలర్ల లోటుకు బదులు, 53 బిలియన్ డాలర్ల మిగులు అయ్యింది.

ప్రధానమంత్రి మోదీ, షీ జిన్‌పింగ్ మధ్య సమావేశానికి ముందు రెండు దేశాల మధ్య 120 ఎంఓయూలపై సంతకాలు జరిగాయి. వాటి గురించి చాలా చర్చ జరిగింది. ఈ ఒప్పందాల్లో భారత్ నుంచి చక్కెర, రసాయనాలు, ప్లాస్టిక్, మందులు, ఎరువుల ఎగుమతులు కూడా ఉన్నాయి.

ఇప్పుడు అసలు ఇది ఎంత ముఖ్యం, దీనివల్ల ఎంత వాణిజ్య లోటు తగ్గడానికి సహకారం లభిస్తుంది అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)