వరల్డ్ వీగన్ డే: ఏ ప్రాణినీ ఇబ్బంది పెట్టని ఆహారం

  • 1 నవంబర్ 2019
లెదర్ బూట్స్ Image copyright AFP/Getty

వీగన్ డైట్.. ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తున్న ఈ ఆహార అలవాటు లక్ష్యం తిండి కోసం ఏ జీవినీ బాధించకపోవడమే.

మీరు పళ్లెంలో మాంసం, గుడ్లు, చేపలే కాదు పాలు, పెరుగు, వెన్న, జున్ను, తేనె ఏవీ ఉండకూడదు.

వీగన్ విధానం ఇప్పుడు ఆహారాన్ని దాటి విస్తరిస్తోంది. తోలు, ఊలు, ముత్యాలు వంటివీ వాడకపోవడం పూర్తి వీగన్ విధానంగా నిలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా వీగన్ జీవనశైలిపై చేస్తున్న ఖర్చు స్థిరంగా పెరుగుతోంది.

అమెరికాలో వీగన్ శైలిలో జీవిస్తున్నవారి సంఖ్య 2014 - 17 మధ్య 600 శాతం పెరిగింది.

బ్రిటన్‌లో గత దశాబ్ద కాలంలో వీగన్ల సంఖ్య 400 శాతం పెరిగింది.

ఈ ఆహారవిధానం కొద్దిమంది నుంచి ఇప్పుడు ప్రధాన స్రవంతిలోకి వచ్చింది. ఫాస్ట్‌ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్ ఇప్పుడు 'మెక్ వీగన్ బర్గర్స్' తీసుకొచ్చింది.

నవంబరు 1 ప్రపంచ వీగన్ దినోత్సవం సందర్భంగా ఈ సంపూర్ణ హరిత ఆహారానికి సంబంధించి అయిదు విషయాలు మీకోసం.

Image copyright Getty Images

1) ఆరోగ్యపరంగా మేలేనా

ఇటీవల బ్రిటన్‌లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం మాంసాహారం తగ్గించాలనుకుటున్న వారిలో 50 శాతం మంది ఆరోగ్యపరమైన జాగ్రత్తలతోనే ఆ నిర్ణయం తీసుకుంటున్నారట.

జంతుమాంసం, ప్రాసెస్డ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల పేగు క్యాన్సర్లు వచ్చే ప్రమాదాలు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.

మరి, వీగన్ ఆహారం పూర్తిగా ఆరోగ్యకరమైనదా? అన్న విషయంలోనూ శాస్త్రపరమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీగన్ ఆహారం తీసుకోవడం వల్ల కలిగ దీర్ఘకాలిక ప్రయోజనాలపైనా సందేహాలున్నాయి.

అన్ని రకాల ఆహారం తినేవారు, శాకాహారులు, వీగన్లపై జరిపిన ఓ అధ్యయనం ప్రకారం పూర్తిగా శాకాహారమే తీసుకున్నవారికీ కొన్ని ఆరోగ్య సమస్యలు రావొచ్చని.. వారికి ఎక్కువ జీవితకాలం ఉంటుందన్న భరోసా లేదని తేలింది.

అయితే, వీగన్లు మిగతావారికంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉండే అవకాశాలున్నాయి. అందుకు కారణం వారిలో ఉండే ఆరోగ్య స్పృహ. ఆరోగ్య స్పృహ కారణంగా వీగన్లుగా మారిన వారు ఆరోగ్యం కోసం ఇంకా ఎన్నో అలవాట్లు మార్చుకోవడం, ఆరోగ్యకరమైన కొత్త అలవాట్లు చేసుకోవడం వల్ల జీవితకాలం పెరగొచ్చని ఆ అధ్యయనం చెప్పింది.

మరోవైపు సంపూర్ణ హరిత ఆహారం తీసుకునేవారికి కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు. ఎముకల పటిష్ఠానికి అవసరమైన విటమిన్-డి లోపం తలెత్తవచ్చని.. రక్త, నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చూసే విటమిన్ బీ12 లోపం ఏర్పడొచ్చని.. మెదడు, థైరాయిడ్ పనితీరును ప్రభావితం చేసే అయోడిన్ లోపానికీ ఆస్కారముందని వైద్యులు సూచిస్తున్నారు.

Image copyright Getty Images

2) ట్రెండ్ కాదు లైఫ్‌స్టైల్

ప్రపంచంలో ఓ వైపు వీగన్ ఆహారంపై ఆసక్తి పెరుగుతుంటే మరోవైపు మాంసాహార వినియోగమూ పెరుగుతోంది.

ముఖ్యంగా చైనా, భారత్ వంటి జనాభా ఎక్కువ ఉన్న దేశాల్లో మాంసాహారం పెరుగుతోంది.

ప్రస్తుతం మాంసం ఉత్పత్తికి అనుసరిస్తున్న విధానాలు పర్యావరణానికి చేటు చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.

ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ లెక్కల ప్రకారం మాంసాహారం కోసం జీవుల పెంపకం గ్రీన్‌హౌస్ ఉద్గారాలలో 14.5 శాతానికి కారణమవుతోంది.

మరోవైపు మాంసం ఉత్పత్తి వెనుక నీటి వినియోగమూ అధికంగా ఉంటోంది. 450 గ్రాముల ఆకుల ఉత్పత్తికి 104 లీటర్ల నీరు అవసరమవుతుంటే అంతే బరువున్న మాంసం తయారీ వెనుక 23,700 లీటర్ల నీరు వినియోగమవుతోందని 'ది ఫుడ్ రివల్యూషన్'లో జాన్ రాబిన్స్ వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీగన్ అసోసియేషన్ల లెక్కల ప్రకారం ప్రపంచంలో 55 కోట్ల నుంచి 95 కోట్ల మంది వీగన్లు ఉన్నారు.

కానీ, ఐరాస లెక్కల ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా 980 కోట్లకు చేరుతుంది. ప్రస్తుతం ఉత్పత్తవుతున్న ఆహారం కంటే 70 శాతం అధికంగా ఉత్పత్తి చేస్తే కానీ ఆ జనాభాకు ఆహార అవసరాలు తీరవు.

అయితే, వీగన్లు తమ ఆహార శైలి కేవలం ఒక ట్రెండ్ కాదని ఇదో జీవనశైలి అని చెబుతున్నారు.

Image copyright Getty Images

3) వీగన్ వ్యాపారమూ ఊపందుకుంటోంది

అయిదేళ్ల కిందట బ్రిటన్‌లో ఒక సంస్థ వీగనరి అనే కార్యక్రమం నిర్వహించింది. జనవరి నెలలో వీగన్లుగా ఉండాలని చెప్పింది. ఒక నెల పాటు అలా చేయడం వల్ల వారిలో కొందరు సంవత్సరమంతా అదే విధానం పాటించే అవకాశముంటుందన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమం నిర్వహింది. అప్పటి నుంచి ఏటా ఆ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఏటేటా అందులో పాలుపంచుకుంటున్నవారి శాతం పెరుగుతోంది.

ఈ ఏడాది 190 దేశాలకు చెందిన 2,50,000 మంది వీగనరీ పాటిస్తామని సంతకాలు చేశారు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా మాంస రహిత ఆహారాలకు(మీట్ ఫ్రీ ఫుడ్స్) డిమాండ్ పెరుగుతోంది. 2018లో అమెరికాలో ఇలాంటి ఆహారానికి గిరాకీ 10 రెట్లు పెరిగింది. 2019లో వీగన్ డైట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రధానమైన ఫుడ్ ట్రెండ్ అవుతుందని ఎకనమిస్ట్ మ్యాగజీన్ అంచనా వేసింది.

సోషల్ మీడియాలోనూ వీగన్ ఆహారాన్ని ప్రమోట్ చేస్తున్నవారు.. వాటి వల్ల కలిగే మేలును నెటిజన్లకు చెబుతున్నవారు ఎక్కువవుతున్నారు. ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే వీగన్ డైట్‌కు సంబంధించి 9.2 కోట్ల పోస్టులున్నాయి.

ఈ రకమైన ఆహారంపై బహుళజాతి ఆహారపదార్థాల సంస్థలు కూడా ఇప్పటికే దృష్టిపెట్టాయి. పెరుగుతున్న ఇలాంటి ఆహార అవసరాలను తీర్చడానికి తమ వంతు కృషి చేస్తున్నామని నెస్లే సంస్థ చెప్పింది.

చికెన్, బీఫ్, పోర్క్ ఉత్పత్తుల వ్యాపారంలోనే ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న టైసన్ ఫుడ్స్ 'బియాండ్ మీట్' అనే వీగన్ ఫుడ్ సంస్థలో 6.5 శాతం పెట్టుబడులు పెట్టడమూ ఈ మార్కెట్‌లోకి అందరూ వస్తున్నారనడానికి ఉదాహరణ.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక వీగన్ బర్గర్

4) నాణేనికి రెండో వైపు

వీగన్ విధానానికి ఆదరణ పెరుగుతున్నట్లే దానిపై విమర్శలూ వస్తున్నాయి. వీగనిజమ్ పేరుతో కొన్ని చోట్ల మాంసం వ్యాపారుల దుకాణాలపై దాడులు చేయడం వంటివి చోటుచేసుకుంటున్నాయి.

వీగన్ డైట్‌లో భాగంగా బాదం, బ్రకోలీ, అవకాడో వంటివి తినేవారిపైనా విమర్శలొస్తున్నాయి. ఈ జాతి మొక్కలు పరాగసంపర్కం కోసం తేనెటీగలపై ఆధారపడతాయి. తేనెటీగలు తక్కువగా ఉండే చోట ఈ పంటలు వేస్తే పరాగసంపర్కం ద్వారా కాపు రావడానికి గాను తేనెటీగలను, అవి పెట్టే తేనెతుట్టెలను ఇతర చోట్లను ఈ తోటలకు తెస్తుంటారు. కాబట్టి ఇది కూడా జీవదోపిడీ ఆహారమేనన్న వాదన ఉంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పైథాగరస్

5) ప్రాచీన భారతీయ సమాజం పాటించిందే..

బ్రిటన్‌లో 1940లో డోనల్డ్ వాట్సన్ వీగన్ సమాజాన్ని స్థాపించినప్పుడు తొలిసారి ఈ పదం వాడుకలోకి వచ్చింది.

కానీ, అంతకు 2,500 ఏళ్ల కిందటే ప్రాచీన భారతీయ సమాజంలో, తూర్పు మధ్యధరా ప్రాంత సమాజాల్లో ఇలాంటి ఆహారం తీసుకునే అలవాటు ఉన్నట్ల చరిత్ర చెబుతుంది.

వెజిటేరియన్ అనే పదం వ్యాప్తిలోకి రావడానికి ముందు మాంసాహారం కాని ఆహారాన్ని పైథాగరస్ డైట్ అనేవారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

‘అయోధ్య తీర్పులో స్పష్టంగా చెప్పారు, రామ జన్మస్థలం మసీదు కిందే ఉంది’ - సి.ఎస్.వైద్యనాథన్

అయోధ్య తీర్పు: ‘తప్పు చేసిన దోషికే బహుమతి ఇచ్చారు’ - జస్టిస్ లిబర్హాన్ కమిషన్ న్యాయవాది అనుపమ్ గుప్తా

ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు

ట్రంప్‌పై పోటీచేయాలనే ఒత్తిడి వస్తోంది: హిల్లరీ క్లింటన్

ఆర్టీఐ పరిధిలోకి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం

సాంబార్ సరస్సు తీరంలో వెయ్యికి పైగా పక్షుల మృతికి కారణాలేమిటి

తాలిబన్ల వద్ద బందీలైన ప్రొఫెసర్ల విడుదలకు మిలిటెంట్లను విడిచిపెట్టనున్న అఫ్గానిస్తాన్

అయోధ్య-రామ మందిర ఉద్యమంలో ముఖ్య పాత్రధారులు వీరే..