చైనాలోని ఆకర్షణీయమైన గాజు వంతెనలను ఎందుకు మూసేస్తున్నారు?

గాజు వంతెన

ఫొటో సోర్స్, Getty Images

చైనాలోని ఓ రాష్ట్రంలో అక్కడి గాజు నిర్మాణాలన్నిటినీ మూసివేశారు. వంతెనలు, నడక మార్గాలు, వ్యూ పాయింట్లు కలిపి మొత్తం 32 నిర్మాణాలను మూసివేశారు.

హెబీ ప్రావిన్స్‌లోని 24 ప్రదేశాల్లోని ఇలాంటి గాజు నిర్మాణాలను 2018 మార్చి నుంచి మూసేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

చైనా వ్యాప్తంగా ఇలాంటి నిర్మాణాలు పెద్దసంఖ్యలో ఉన్నాయి. వీటి కారణంగా పలు చోట్ల ప్రమాదాలు జరిగాయి. ఇద్దరుముగ్గురు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి.

చైనాలో 2,300 గాజు వంతెనలున్నట్లు అంచనా. గాజుతో చేసిన నడక మార్గాలకైతే లెక్కే లేదని స్థానిక మీడియా సంస్థ ఈసీఎన్‌ఎస్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఝాంజియాజీ గాజు వంతెన

థ్రిల్ కోరుకునే పర్యటకులే లక్ష్యంగా ఇలాంటి నిర్మాణాలను చైనాలో పెద్ద ఎత్తున చేపట్టారు.

హునాన్ ప్రావిన్స్‌లోని ఝాంజియాజీ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తున ఉన్న గాజు వంతెన. 2016లో దీన్ని తెరిచారు. ఇక అప్పటి నుంచి ఇలాంటి వంతెనలు మరిన్ని పెరిగాయి.

అయితే, గుయాంగ్జీ ప్రావిన్స్‌లోని ఓ గ్లాస్ బ్రిడ్జి నుంచి పడి ఓ పర్యటకుడు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు.

వర్షం పడిన తరువాత దానిపై నడుస్తున్నప్పుడు జారి కిందకు పడడంతో తలకు తీవ్రగాయాలై అతడు మరణించాడు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

హెబీ ప్రావిన్స్‌లోని హోంగ్యాగూ వంతెన

హెబీ ప్రావిన్స్‌లోనే కాకుండా పలు ఇతర రాష్ట్రాలలోనూ ఇలాంటి వంతెనలను మూసివేస్తున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో అన్ని రాష్ట్రాల్లో పర్యటక శాఖ అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. గాజు నిర్మాణాల వద్ద భద్రత ప్రమాణాలు, ఏర్పాట్లు ఉండేలా చూడమని ఆదేశించింది.

ఆ క్రమంలో చాలాచోట్ల సరైన భద్రతా ప్రమాణాలు లేని కారణంగా మూసివేస్తున్నారు.

దేశమంతా పుట్టగొడుగుల్లా ఇలాంటి గాజు వంతెనలు పెరిగిపోవడంపై విమర్శలూ ఉన్నాయి. ఇది డబ్బు వృథా తప్ప ఎలాంటి ప్రయోజనమూ లేదని విమర్శించేవారున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)