బగ్దాదీ మరణాన్ని ధ్రువీకరించిన ఐసిస్, కొత్త చీఫ్ అబు ఇబ్రహీం అల్-హషేమీ

అబూ బకర్ అల్ బగ్దాదీ ఆపరేషన్

ఫొటో సోర్స్, AFP

జిహాదీ గ్రూపు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) చీఫ్ అబు బకర్ అల్ బగ్దాదీ మృతి చెందినట్లు మొదటిసారిగా ఆ సంస్థ ధ్రువీకరించింది. దీంతోపాటు, కొత్త నేత పేరును కూడా ప్రకటించింది.

అబు ఇబ్రహీం అల్ హషేమీ అల్ ఖురేషీ ఇక నుంచి ఐసిస్‌కు నేతృత్వం వహిస్తారని టెలిగ్రామ్ ద్వారా ఐసిస్ వెల్లడించింది.

అమెరికా దళాలు బగ్దాదీని వాయవ్య సిరియాలోని ఓ స్థావరంలో గుర్తించి దాడి చేశారు. దీంతో ఆయన ఓ సొరంగంలోకి ప్రవేశించి తనను తానే ఆత్మాహుతి కోటు ద్వారా పేల్చుకుని మరణించారు.

బగ్దాదీని పట్టిచ్చినా, చంపినా, ఆయన ఎక్కడున్నారో సమాచారం అందించినా 25 మిలియన్ డాలర్ల బహుమతిని అమెరికా ప్రభుత్వం గతంలో ప్రకటించింది.

తమ ప్రతినిధి అబు అల్ హసన్ అల్ ముజాహిర్ కూడా సిరియాలో అమెరికా, సిరియన్ కుర్దు దళాలు బగ్దాదీ లక్ష్యంగా చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో చనిపోయినట్లు ఐసిస్ గురువారం తెలిపింది. ముజాహిర్ ఐసిస్‌లో బగ్దాదీ వారసుడిగా గుర్తింపు పొందారు.

అబు ఇబ్రహీం అల్ హషేమీకి విధేయులుగా ఉండాలని ముస్లింలందరికీ ఐసిస్ కొత్త ప్రతినిధి అబు హమ్జా అల్ ఖురేషీ పిలుపునిచ్చారు.

అబు ఇబ్రహీం అల్ హషేమీ ఎవరు?

హషేమీ పేరు భద్రతా దళాలకు పెద్దగా తెలియదు. ఇది ఆయన అసలు పేరు కూడా కాకపోవచ్చు.

కొత్త నేత హషేమీ గురించి ఐసిస్ ఎలాంటి వివరాలూ బయటపెట్టలేదు. ఫొటో కూడా విడుదల చెయ్యలేదు. కానీ జిహాదీ గ్రూపులో ఆయన కీలక వ్యక్తిగా అభివర్ణించింది.

హషేమీ గతంలో అమెరికాకు వ్యతిరేకంగా పోరాడిన ఓ జిహాదీ ఫైటర్ అని ఓ ప్రకటనలో తెలిపింది.

అల్ ఖురేషీ (మహ్మద్ ప్రవక్తకు చెందిన ఖురేష్ తెగకు చెందినవారు) పేరే ఆయన ఖలీఫా కావడానికి ఉన్న ఓ ప్రత్యేక అర్హత అని ఐసిస్ స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, US DEPARTMENT OF DEFENSE/REUTERS

ఫొటో క్యాప్షన్,

అబూ బకర్ అల్ బగ్దాదీ

2014లో ఇరాక్, సిరియాల్లోని భూభాగాలను తమ అధీనంలోకి తెచ్చుకున్న ఐసిస్... షరియా లేదా ఇస్లామిక్ చట్టాల ప్రకారం పరిపాలన సాగించే ఖలీఫా రాజ్యం (కాలిఫేట్) ఏర్పాటు చేసి, లక్షలాది పౌరులపై తీవ్ర ఆంక్షలు విధించింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా ఖలీఫా ఇబ్రహీం అయిన బగ్దాదీకు విధేయులుగా ఉండాలని పిలుపునిచ్చింది.

మార్చిలో కాలిఫేట్ విధ్వంసమైనప్పటికీ ఐసిస్ మాత్రం తన పోరాటాన్ని కొనసాగించింది.

ఇప్పటికీ ఈ గ్రూపులో ఉన్న 14000 నుంచి 18000 మంది సభ్యులు ఇరాక్, సిరియాల్లో ఉన్నారు. వీరిలో 3000 మంది విదేశీయులని ఇటీవలే అమెరికా విడుదల చేసిన ఓ నివేదిక పేర్కొంది.

బగ్దాదీ మరణవార్త ధ్రువీకరణ అయిన వెంటనే ఐసిస్‌కు చెందిన షురా కౌన్సిల్ సమావేశమై తమ కొత్త నేతగా హషేమీని ఎన్నుకుందని ఐసిస్ కొత్త ప్రతినిధి తన ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)