టర్కీ - సిరియా సంఘర్షణ: కుర్దు ఫైటర్ల మీద క్రూరమైన యుద్ధ నేరాలు... వెలుగులోకి దారుణమైన వీడియోలు

  • 4 నవంబర్ 2019
కుర్దులు Image copyright AFP
చిత్రం శీర్షిక సిరియా ఈశాన్య సరిహద్దులోని కుర్దు బలగాల ఆధీనంలో ఉన్న ప్రాంతాల మీద టర్కీ సైన్యం, దాని మద్దతు గల తిరుగుబాటుదారులు గత నెలలో దాడులు చేశారు

టర్కీ మద్దతుతో సాయుధ బలగాలు సిరియాలోని ఈశాన్య ప్రాంతంలో కుర్దు మిలిటెంట్లపై దాడులు చేస్తున్న క్రమంలో యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తుండగా మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

టర్కీ మిత్ర పక్షాల చర్యలకు ఆ దేశం బాధ్యత వహించాల్సి ఉంటుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని టర్కీ హామీ ఇచ్చింది.

కొందరు గడ్డంతో ఉన్న వ్యక్తులు.. కుర్దు ఫైటర్ల మృతదేహాల ముందు నిలుచుని 'అల్లాహు అక్బర్' అని నినాదాలు చేస్తుండగా.. వారిలో ఒక వ్యక్తి ఆ దృశ్యాలను స్మార్ట్ ఫోన్‌లో చిత్రీకరిస్తూ ''మేం ఫేలాఖ్ అల్-మజద్ బెటాలియన్‌కు చెందిన ముజాహిదీన్లం'' అని చెప్పటం ఆ వీడియో దృశ్యాల్లో కనిపించింది.

కొంచెం దూరంలో కొంతమంది పురుషులు.. రక్తసిక్తంగా ఉన్న ఒక మహిళ శరీరాన్ని కాళ్లతో తొక్కుతూ ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు.

ఈ వీడియో దృశ్యాలు... ఇస్లామిక్ స్టేట్ చిత్రీకరించిన అత్యంత తీవ్రమైన హింసాత్మక దృశ్యాల తరహాలోనే ఉన్నాయి.

Image copyright YPG MEDIA CENTER
చిత్రం శీర్షిక అమెరికా బలగాలతో కలిసి ఐసిస్ మీద పోరాడి వారిని ఓడించిన కుర్దు మహిళా సాయుధ దళానికి చెందిన ఫైటర్ అమారా రెనాస్

కానీ, ఈ వీడియోలో ఉన్న వారు ఐఎస్ మిలిటెంట్లు కాదు. సిరియన్ నేషనల్ ఆర్మీ అని పిలిచే తిరుగుబాటు దారుల కూటమికి చెందిన సైనికులు వీరు. వీరికి నాటో సభ్య దేశమైన టర్కీ శిక్షణనిచ్చి, ఆయుధాలను అందించి, జీతాలు కూడా చెల్లిస్తోంది. టర్కీ సైన్యం సారథ్యంలో వీరు పనిచేస్తున్నారు.

ఉత్తర సిరియాలో అక్టోబర్ 21వ తేదీన ఈ వీడియోను చిత్రీకరించారు. ఆ సైనికుల కాళ్ల కింద ఉన్న మహిళ పేరు అమారా రెనాస్. కుర్దు ఫైటర్లలో పూర్తి మహిళా దళం వైపీజీ సభ్యురాలు. సిరియాలో ఐఎస్‌ను ఓడించటంలో ఈ మహిళా దళం చాలా కీలక పాత్ర పోషించింది.

సిరియాలో కుర్దు బలగాల మీద ఇటీవల టర్కీ చేసిన దాడుల్లో అమారా రెనాస్ చనిపోయారు.

సిరియా నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత టర్కీ సైన్యం, టర్కీ అనుకూల సిరియా తిరుగుబాటుదారులు.. అక్టోబర్ 9వ తేదీన సిరియా ప్రజాస్వామిక బలగాల (ఎస్‌డీఎఫ్) మీద దాడులు మొదలుపెట్టారు.

అమెరికా సారథ్యంలోని సంకీర్ణంలో ఎస్‌డీఎఫ్ ఫైటర్లు విశ్వసనీయమైన మిత్రపక్షంగా పాలుపంచుకుని.. క్షేత్రస్థాయిలో ఇస్లామిక్ స్టేట్‌ను ఓడించటంలో చాలా సమర్థవంతంగా కృషి చేశారు.

ఐఎస్ అధినేత అబు బకర్ అల్-బగ్దాదీని అమెరికా గత వారంలో హతమార్చటానికి వీలుకల్పించిన నిఘా సమాచారం అందించింది కూడా తామేనని ఎస్‌డీఎఫ్ చెప్తోంది.  • వీడియో హెచ్చరికలు

టర్కీ దాడులు మొదలైన కొన్ని రోజుల్లోనే, టర్కీ అనుకూల తిరుగుబాటుదారులు చిత్రీకరించినట్లు చెప్తున్న అనేక వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ''అవిశ్వాసులు, మతభ్రష్టులైన మీ తలలు నరకటానికి మేం వచ్చాం'' అంటూ గుర్తుతెలియని ఒక ఫైటర్ అరబిక్‌లో అరుస్తూ చెప్తున్నాడు.

మరొక వీడియలో నల్లటి దుస్తుల్లో ఉన్న ఒక ఫైటర్ తన ముఖానికి మాస్కు ధరించి.. భయంతో వణికిపోతున్న ఒక మహిళను ఈడ్చుకువస్తుంటే.. ఇతర ఫైటర్లు వారి చుట్టూ ఉన్నాడు. ఒక వ్యక్తి ''పంది'' అని ఆమెను దూషిస్తుండగా.. మరొక వ్యక్తి ''ఆమెను తీసుకెళ్లి తల నరికేయండి'' అని పురమాయిస్తున్నాడు.

వారు బందీగా పట్టుకున్న ఆ మహిళ పేరు సీసెక్ కొబాన్. ఆమె కూడా కుర్దు మహిళా దళమైన వైపీజీ సైనికురాలే. సోషల్ మీడియాలో విస్తృతంగా పంపిణీ అయిన ఆ వీడియో మీద తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది. అది ప్రచురితమైన కొన్ని రోజుల తర్వాత.. టర్కీ ప్రభుత్వ టీవీ చానల్.. టర్కీలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీసెక్ కొబాన్‌ను చూపించింది.

ఈ వీడియోల్లోని కొన్ని చర్యలు యుద్ధ నేరాల కిందకి రావచ్చునని అమెరికా అధికారులు పేర్కొన్నారు. ''టర్కీ మద్దతుగల ఈ సిరియా ప్రతిపక్ష బలగాలకు భయపడి చాలా మంది జనం పారిపోయారు'' అని సిరియాలో అమెరికా ప్రత్యేక రాయబారి జేమ్స్ జెఫ్రీ.. అమెరికా పార్లమెంటు కాంగ్రెస్‌కు తెలియజేశారు.

''టర్కీ ఆదేశాల కింద పనిచేస్తున్న, టర్కీ మద్దతు గల సిరియా ప్రతిపక్ష బలగాలు కనీసం ఒక ఉదంతంలో యుద్ధ నేరాలకు పాల్పడిందని మేం భావిస్తున్నాం'' అని ఆయన చెప్పారు.

Image copyright AFP

విదేశీ జిహాదీలు టర్కీ ద్వారానే వచ్చారు...

సిరియాలో జిహాదీలకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలూ చేపట్టటం లేదని టర్కీని చాలా కాలంగా తప్పుపడుతున్నారు.

''నేను ఐసిస్ మీద పోరాటం నడిపాను. ప్రపంచ వ్యాప్తంగా 110 దేశాల నుంచి 40,000 మంది విదేశీ ఫైటర్లు, జిహాదీలు అందరూ టర్కీ గుండానే సిరియాకు వచ్చారు'' అని ఐఎస్ వ్యతిరేక సంకీర్ణంలో అమెరికా అధ్యక్షుడి మాజీ ప్రత్యేక రాయబారి బ్రెట్ మెక్‌గుర్క్ గత నెలలో సీఎన్ఎన్ టీవీ చానల్‌తో పేర్కొన్నారు.

ఇస్లామిక్ స్టేట్‌కు వ్యతిరేకంగా టర్కీ సరిహద్దులను మూసివేయాలని ఆ దేశం మీద ఒత్తిడి తేవటానికి తాను ప్రయత్నించానని.. కానీ తాము ఆ పని చేయలేమని టర్కీ బదులిచ్చిందని ఆయన తెలిపారు. ''కానీ.. సరిహద్దులో కొంత భూభాగం కుర్దుల ఆధీనంలోకి వచ్చిన మరుక్షణమే.. టర్కీ ఆ సరిహద్దును గోడతో మూసివేసింది'' అని చెప్పారు.

తిరుగుబాటుదారులు యుద్ధ నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణల మీద వివరణ ఇవ్వాలని తాము టర్కీని డిమాండ్ చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. అనుమానిత యుద్ధ నేరాల మీద టర్కీ దర్యాప్తు చేస్తుందని టర్కీ అధ్యక్షుడి అధికార ప్రతినిధి ఇబ్రహీం కాలిన్ చెప్పారు.

కానీ.. టర్కీ ప్రభుత్వం మీద కానీ, ఆ దేశ సైన్యం మీద కానీ కుర్దు ఉద్యమకారులు చాలా మందికి నమ్మకం లేదు.

''గత నాలుగు దశాబ్దాలుగా టర్కీ సైన్యం, భద్రతా బలగాలు.. కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీతో ఘర్షణలో ఒక పద్ధతి ప్రకారం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటానికి సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నాయి'' అని ససెక్స్ యూనివర్సిటీలో అంతర్జాతీయ సంబంధాల విభాగానికి చెందిన సీనియర్ లెక్చరర్ కమ్రాన్ మాటిన్ పేర్కొన్నారు.

టర్కీలో కుర్దుల స్వయంప్రతిపత్తి కోసం కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే) దశాబ్దాల పాటు పోరాడింది.కళ్లు మూసుకుంటున్నారు...

టర్కీలో బందీలుగా పట్టుకున్న కుర్దు తిరుగుబాటుదారులను చంపుతున్న దృశ్యాలను టర్కీ సైన్యం, భద్రతా బలగాలు స్వయంగా రికార్డు చేసినట్లు ఆరోపణలున్న అనేక భయంకరమైన ఫొటోలు, వీడియోలు గత దశాబ్దంలో వెలుగు చూశాయి.

కొన్నేళ్ల కిందట ప్రచురితమైన ఒక వీడియోలో చనిపోయిన పీకేకే మిలిటెంట్ల తలలను అనుమానిత టర్కీ సైనికులు నరికివేస్తుండటం కనిపిస్తుంది. మరొక వీడియోలో పీకేకే ఫైటర్ల చేతులు వెనక్కు విరిచి కట్టి, ఒక కొండ శిఖరం మీద వారిని కూర్చోబెట్టి... వారిపై అతి సమీపం నుంచి ఆటోమేటిక్ రైఫిళ్లతో కాల్పులు జరిపి కొండ మీద నుంచి కిందికి తన్నిన దృశ్యాలు ఉన్నాయి. ఆ కాల్పులు జరిపిన సాయుధులు కూడా టర్కీ సైనికులుగానే కనిపిస్తున్నారు.

అక్టోబర్ 2015లో ఆగ్నేయ టర్కీలోని ఓ కుర్దు పట్టణమైన సిర్నాక్‌లో టర్కీ భద్రతా బలగాలు హాకీ లోక్మాన్ బిరిలిక్ అనే 24 ఏళ్ల నటుడి మృతదేహాన్ని, అతడి మెడకు తాడు కట్టి వీధుల్లో ఈడ్చుకు వెళుతున్న దృశ్యం విస్తృతంగా చలామణి అయింది. ఈ వీడియోలో కొంత భాగాన్ని ఒక పోలీసు వాహనం లోపలి నుంచి చిత్రీకరించినట్లు కనిపించింది.

టర్కీని ఖండించటంలో కానీ, ఆ దేశం మీద చర్యలు చేపట్టటంలో కానీ అమెరికా, యూరోపియన్ యూనియన్‌లు విఫలమయ్యాయని కుర్దు మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

''టర్కీ పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల విషయంలో ఈయూ కళ్లు మూసుకుంది. నాటోలో టర్కీకి సభ్యత్వం ఉండటం, ఆ దేశంతో ఈయూ ఆర్థిక సంబంధాలు, యూరప్ దేశాల్లో ప్రత్యేకించి జర్మనీలో నివసిస్తున్న లక్షలాది మంది టర్కీ ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్న భయం.. దీనికి కారణం'' అంటారు కామ్రాన్ మాటిన్.

సిరియా అంతర్యుద్ధం మొదలైన తర్వాత.. మానవ హక్కుల ఉల్లంఘనల విషయంలో టర్కీ యూరప్ దేశాల ప్రతిస్పందనను ఒక కొత్త అంశం నిరోధిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆ అంశం.. ''సిరియా శరణార్థులు - యూరప్‌ను వారితో ముంచెత్తుతానని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ పదే పదే హెచ్చరించారు'' అని తెలిపారు.

ఆ పరిస్థితిని ఎలాగైనా తప్పించుకోవాలని యూరోప దేశాలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్: 'సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా తిరగబడ్డారు' - సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్

ప్రెస్‌రివ్యూ: అత్త,మామల సంరక్షణలో అల్లుళ్లు, కోడళ్లకూ బాధ్యత.. విస్మరిస్తే జైలు, జరిమానా

దిశ అత్యాచారం, హత్య: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు... నలుగురు అరెస్ట్

గద్దర్: ‘తెలంగాణ ప్రభుత్వంలో టెంపరరీ పోస్టుకు అప్లికేషన్ పెట్టుకున్నాను’

అత్యాచార కేసు విచారణకు వెళ్తున్న బాధితురాలికి నిప్పు పెట్టిన దుండగులు... మృత్యువుతో పోరాడుతున్న యూపీ మహిళ

టైఫాయిడ్ వాక్సిన్: 'అద్భుతంగా పనిచేస్తోంది'

పౌరసత్వ సవరణ బిల్లులో ఏముంది... ఎవరు వ్యతిరేకిస్తున్నారు

వాతావరణ మార్పుతో పక్షులు కుంచించుకుపోతున్నాయి: అధ్యయనంలో వెల్లడి