'యాక్ట్ ఆఫ్ కిల్లింగ్': వెయ్యి మంది ప్రాణాలు తీసిన హంతకుడు.. కెమెరాల ముందు తన పాత్రలో తనే నటించాడు..

  • 4 నవంబర్ 2019
అన్వర్ కాంగో Image copyright Carlos Arango de Montis
చిత్రం శీర్షిక ‘యాక్ట్ ఆఫ్ కిల్లింగ్’లో అన్వర్ కాంగో

(ఈ కథనంలోని విషయాలు కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు)

అన్వర్ కాంగో 'చాచా' అనే క్యూబన్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఓ మిత్రుడు ఆయన్ను గమనిస్తున్నాడు.

అంతకు కాసేపటి ముందే, ఇండోనేషియాలో ఓ భవనం మీద అన్వర్ ఒక ప్రదర్శనలాంటిది ఇచ్చాడు. జనాలను ఎక్కువగా తాను ఏ పద్ధతిలో చంపుతాడో చూపించాడు.

గొంతుకు వైరు బిగించి, ఊపిరాడకుండా చేసి చంపడం అన్వర్ కాంగోకు ఇష్టమైన పద్ధతి. కొట్టి చంపితే అనవసర గందరగోళం, శ్రమ ఎక్కువ అని అతడి అభిప్రాయం.

బక్క పల్చగా, తెల్లటి జట్టుతో ఉండే అన్వర్ కాంగో కనీసం వెయ్యి మందిని చంపి ఉంటాడని భావిస్తారు. ఆ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చని అంచనాలున్నాయి.

''నేను అదంతా మర్చిపోయేందుకు ప్రయత్నిస్తున్నా'' అని ఆనందంగా డ్యాన్స్ చేస్తూ చెప్పాడు అన్వర్. అతడి చేతిలో మద్యం గ్లాసు ఉంది. గంజాయి కూడా తాగుతున్నాడు. అప్పుడే ఓ పాట కూడా మొదలుపెట్టాడు.

ఇవన్నీ 'ద యాక్ట్ ఆఫ్ కిల్లింగ్' అనే డాక్యుమెంటరీ చిత్రంలో కనిపించే దృశ్యాలు. 2012లో ఇది ఆస్కార్ పురస్కారాలకు నామినేట్ అయ్యింది. 20వ శతాబ్దంలో బయటకు పెద్దగా రాని ఊచకోతలను ఇందులో చూపించారు.

Image copyright Final Cut For Real
చిత్రం శీర్షిక ‘యాక్ట్ ఆఫ్ కిల్లింగ్’లో ఓ స్టిల్

1965 నుంచి 1966 వరకూ ఇండోనేషియాలో 'రాజకీయ ప్రక్షాళన' సమయంలో ఐదు లక్షలకు పైగా మంది హత్యకు గురయ్యారు.

అధికారాన్ని చేపట్టేందుకు కొందరు చేసిన తిరుగుబాటు విఫలమైన తర్వాత అక్కడి సైన్యం చెలరేగిపోయింది. కమ్యూనిస్టులన్న అనుమానం ఎవరిపై వచ్చినా ఊచకోత కోసింది.

ఈ ఊచకోతలో అన్వర్ కాంగో పోషించిన పాత్రను 'యాక్ట్ ఆఫ్ కిల్లింగ్' డాక్యుమెంటరీ చూపించింది. అనుమానిత కమ్యూనిస్టులను చంపిన హంతకుల దళంలో అతడు ఒకడు.

ఆ హత్యలు ఎలా చేసింది అన్వర్ కాంగో కెమెరాల ముందు నటించి చూపించాడు.

గత అక్టోబర్ 25న అతడు చనిపోయాడు.

మెడాన్ పట్టణంలోని ఓ చమురు క్షేత్రం సమీపంలో అన్వర్ పెరిగాడు. అతడి కుటుంబం ఆ క్షేత్రంలో పనిచేసేది. అక్కడున్న మిగతావారితో పోల్చుకుంటే వారిది బాగా స్థిరపడ్డ కుటుంబమే.

డచ్ పాలన నుంచి ఇండోనేషియా స్వాతంత్ర్యం పొందడాన్ని వారు వ్యతిరేకించారు.

Image copyright Final Cut For Real
చిత్రం శీర్షిక జాషువా ఓపెన్హీమర్ (తెల్ల టీషర్ట్ వేసుకున్న వ్యక్తి)

12 ఏళ్ల వయసులో అన్వర్ చదవును విడిచిపెట్టి నగరంలోని నేర ముఠాలతో కలిశాడు.

మొదట్లో అతడు నగరంలోని ఓ పాపులర్ సినిమా హాల్ దగ్గర ఉండేవాడు. స్నేహితులతో కలిసి బ్లాక్‌లో టికెట్లు అమ్మేవాడు.

కొన్ని రోజుల్లోనే పెద్ద పెద్ద నేరాల్లో వాళ్లు తలదూర్చడం మొదలుపెట్టారు. స్థానిక చైనీస్ వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు. స్మగ్లింగ్, జూదం వంటివాటిలో పాలుపంచుకునేవారు.

అన్వర్, అతడి స్నేహితుడు అది జుల్కడ్రీ కిరాయి హంతకులుగా మారారు.

వాళ్లిద్దరూ కలిసి చేసిన తొలి ప్రయత్నం విఫలమైందని 'యాక్ట్ ఆఫ్ కిల్లింగ్' దర్శకుడు జాషువా ఓపెన్హీమర్ చెప్పారు.

''వాళ్లిద్దరూ పనస కాయతో కొట్టి ఓ వ్యక్తిని చంపాలనుకున్నారు. విఫలమయ్యారని చెప్పడానికి ఇది చాలు'' అని జాషువా అన్నారు.

Image copyright Final Cut For Real
చిత్రం శీర్షిక చిత్రీకరణ సమయంలో అన్వర్ కాంగో

1965లో తిరుగుబాటు విఫలమయ్యాక, ఇండోనేషియాలో ఊచకోత మొదలైంది.

అన్వర్, అతడి మిత్రులు కరడుగట్టిన నేరగాళ్లుగా మారారు. వాళ్లు కమ్యూనిస్ట్ వ్యతిరేకులు కూడా.

సైన్యం ఊచకోతను మొదలుపెట్టింది. నేరగాళ్ల ముఠాలు, రైట్ వింగ్ పారామిలిటరీలను ఉసిగొల్పింది.

అన్వర్ ముఠాను కూడా సైన్యం నియమించుకుంది. వందల సంఖ్యలో అనుమానిత కమ్యూనిస్టులను వాళ్లు విచారించారు, హింసించారు, హత్య చేశారు.

అన్వర్ ముఠా కప్ప దళం (ఫ్రాగ్ స్క్వాడ్) అని పేరు పొందింది. ప్రాంతీయంగా ఇలాంటి హంతక ముఠాల్లో అత్యంత శక్తిమంతమైందిగా మారింది.

స్వయంగా హత్యలు చేసే అన్వర్.. ఆ ముఠాలో అత్యంత కిరాతకుడిగా మారాడు.

హత్యలు ఎలా చేయాలన్నదానిపై హాలీవుడ్ సినిమాల నుంచి ఈ ముఠా స్ఫూర్తి పొందింది. అల్ పాచినో, జాన్ వేన్ నటించిన మాఫియా సినిమాల్లోని సీన్లు వాళ్లకు ఇష్టం.

అన్వర్ తన చేజేతులా వందల మందిని చంపి ఉంటాడని భావిస్తుంటారు. 'యాక్ట్ ఆఫ్ కిల్లింగ్'లో అప్పటి ఉత్తర సుమత్రా గవర్నర్ శ్యామ్సుల్ ఆరిఫిన్ ఒకప్పుడు అన్వర్ అంటే జనాలు ఎలా భయపడేవారో వివరించారు.

''అన్వర్ కాంగో పేరు వినబడితేనే జనాలు వణికిపోయేవారు'' అని అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1965లో జైల్లో ఉన్న అనుమానిత కమ్యూనిస్టులు

ఇండోనేషియాలో ఆ హింసాత్మక 'రాజకీయ ప్రక్షాళన' ఇప్పటికీ చాలా సున్నితమైన అంశం. కమ్యూనిస్టు పార్టీతో ఏ మాత్రం సంబంధాలున్నా విచారణలే లేకుండా జనాలను అప్పుడు జైళ్లో పెట్టారు. అలా జైలుపాలైనవారు దాదాపు లక్ష మంది ఉంటారు.

ఈ ఊచకోతలో పాత్రదారులైన అన్వర్ లాంటివారిపై ఆ నేరాలకు సంబంధించి ఎప్పుడూ చర్యలూ తీసుకోలేదు.

ఇండోనేషియా ప్రభుత్వ అనుకూల పారామిలిటరీ పాన్‌కసిలాకు అన్వర్ ఓ ఆరాధ్య నాయకుడిగా మారాడు.

ఊచకోతకు పాల్పడిన హంతకు ముఠాల నుంచే పాన్‌కసిలా పుట్టుకువచ్చింది.

ఊచకోత తర్వాత కొన్నేళ్లకు అన్వర్ తిరిగి మెడాన్ వెళ్లాడు. అక్కడ తన పేరు, పలుకుబడి ఉపయోగించుకుని దొంగతనాలు, స్మగ్లింగ్ కార్యకలాపాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు.

మెడాన్‌లోని పెద్ద నైట్ క్లబ్‌లకు 1990ల్లో ముఖ్య భద్రతాధికారిగా పనిచేశాడు. పాన్‌కసిలా యూత్ కోసం మాదక ద్రవ్యాల ఒప్పందాలు కుదిర్చేందుకు చేసుకున్న ఓ ఏర్పాటు అది.

ఆ సంస్థలో అన్వర్‌ గౌరవ బిరుదులు పొందాడు. ఊచకోతలో అతడు పోషించిన పాత్రను గొప్పగా చెప్పుకొనేవారు. అతడిలాంటి వాళ్లందరూ పారామిలిటరీకి ఆదర్శమూర్తులుగా మారారు.

కమ్యూనిజం చాలా చెడ్డదని, కమ్యూనిస్టులు దేశానికి ద్రోహం చేసే నాస్తికులని తమకు స్కూళ్లలో పాఠాలు చెప్పేవారని ప్రోడిటా సబరినీ అనే మహిళ బీబీసీతో చెప్పారు.

''మేమెప్పుడూ దాన్ని ప్రశ్నించేవాళ్లం కాదు. హత్యల స్థాయి గురించి తర్వాత తెలుసుకున్నా, చనిపోయింది కమ్యూనిస్టులేగా.. ఫర్వాలేదు అని అనుకునేవాళ్లం'' అని ఆమె వివరించారు.

'యాక్ట్ ఆఫ్ కిల్లింగ్' డాక్యుమెంటరీ వచ్చే వరకూ అదే పరిస్థితి.

Image copyright Final Cut For Real
చిత్రం శీర్షిక ‘యాక్ట్ ఆఫ్ కిల్లింగ్’లో ఓ స్టిల్

ఆ డాక్యుమెంటరీ దర్శకుడు ఓపెన్హీమర్ 2005లో మొదటిసారిగా అన్వర్‌ను కలిశారు.

అప్పుడు తాను చేసిన హత్యల గురించి అన్వర్ గొప్పగా చెప్పుకున్నాడు.

''ఏదో గర్వపడే పని చేసినట్లుగా తన చర్యల గురించి అన్వర్ చెప్పుకునేవాడు. కానీ, తన భావనలు, అనుభవించిన బాధ గురించి అతడు నిజాయితీగా చెప్పేవాడు'' అని ఓపెన్హీమర్ అన్నారు.

'యాక్ట్ ఆఫ్ కిల్లింగ్' డాక్యుమెంటరీ చిత్రణ కోసం అన్వర్, అతడి మిత్రులనే ఓపెన్హీమర్ ఆహ్వానించారు. వారితోనే స్క్రిప్ట్ రాయించారు. వాళ్లతోనే నటింపజేశారు. పాత అనుభవాల్లో మళ్లీ వాళ్లను జీవింపజేశారు.

చైనీస్ ప్రజల హత్యల గురించి వాళ్లు జోక్‌లు వేసుకునేవారు. డాక్యుమెంటరీ ఆరంభంలో.. ''మేం యువకులుగా ఉన్నప్పుడే ఏం చేశామో చెబుతాం'' అంటూ అన్వర్ గర్వంగా అంటాడు. కానీ ఆ తర్వాత పోయినకొద్దీ అతడిలో బాధ పెరుగుతుంది. అతడి మనస్సాక్షి అతడిని ప్రశ్నించడం మొదలవుతుంది. అతడి బలహీనతలు బయటపడతాయి.

''గొంతుకు వైర్ బిగించి, వారి ప్రాణాలు పోతుంటే అలా చూస్తూ ఉండేవాడిని. అందుకే అనుకుంటా నాకు నిద్ర సరిగ్గా పట్టదు. పీడకలలు వస్తుంటాయి'' అని అన్వర్ డాక్యుమెంటరీలో చెబుతాడు.

డాక్యుమెంటరీ ఆఖర్లో ఒక సీన్‌లో అన్వర్ ఓ బాధితుడి పాత్రను పోషించాడు. వైరు తన మెడ చుట్టూ బిగిస్తుంటే, అతడు చిత్రీకరణ ఆపమన్నాడు. చలనం లేకుండా, మౌనంగా ఓ పక్కన కూర్చుండి పోయాడు.

''నేను పాపం చేశానా? ఎంతో మందికి నేనలా చేశా'' అని ఆ తర్వాత ఆ సీన్‌ను చూస్తూ అన్వర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

''డాక్యుమెంటరీ చిత్రీకరణ సమయంలో తన పాపాన్ని అత్యంత స్వచ్ఛంగా గుర్తించే స్థాయికి అతడు చేరుకున్నాడు. ఈ చిత్రం చేసే హెచ్చరిక కూడా అదే. మన చర్యలతో మనల్ని మనమే నాశనం చేసుకోగలం'' అని ఓపెన్హీమర్ అన్నారు.

Image copyright Carlos Arango de Montis

అయితే, హాలీవుడ్ కథల్లా అన్వర్‌కు విముక్తి లేదు. ఆలస్యంగా పెళ్లి చేసుకున్నాడు. సొంత పిల్లలు లేరు.

ఈ డాక్యుమెంటరీ విడుదలైన తర్వాత కూడా అన్వర్ నేరాల్లో పాలుపంచుకున్నాడు.

కానీ, ఈ డాక్యుమెంటరీ చాలా మంది ఇండోనేషియన్లపై గొప్ప ప్రభావం చూపించింది.

అధికారికంగా దీనిపై నిషేధం ఉన్నా, రహస్యంగా ప్రదర్శనలు సాగాయి. కొన్ని చోట్ల సైన్యానికి అనుకూల బృందాలు హింసకు పాల్పడి వాటిని అడ్డుకున్నాయి.

తాను కూడా ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనకు హాజరయ్యానని బీబీసీ ఇండోనేషియన్ మాజీ ఎడిటర్ రెబెకా హెన్ష్కీ గుర్తు చేసుకున్నారు.

''ఎదో రాక్ కాన్సర్ట్ జరుగుతుందన్నట్లుగా అప్పుడు హాలు మొత్తం నిండిపోయింది. ఒక పెద్ద మౌనపు గోడ బద్దలవుతన్న వాతావరణం కనిపించింది'' అని చెప్పారు.

ప్రభుత్వం స్కూల్‌లో బలవంతంగా చూపించే సినిమాలను వీక్షించిన ప్రోడిటా సబరానీ.. 'యాక్ట్ ఆఫ్ కిల్లింగ్' చూశాక తన దృక్కోణం మారిపోయందని అన్నారు.

''హంతకులు గొప్పలు చెప్పుకోవడం చూస్తుంటే నాకు సిగ్గుగా అనిపించింది. అంతకుముందు ఆ ఘటనలను వ్యతిరేకించనందుకు నేను సిగ్గుపడ్డా. ఇప్పటికైనా దేశం ప్రజలకు నిజం చెప్పాలి. ఎదో ఒక న్యాయం చేయాలి'' అని ఆమె చెప్పారు.

'యాక్ట్ ఆఫ్ కిల్లింగ్'లో అన్వర్ లాంటి హంతకులకే కథను చెప్పే బాధ్యతను ఇవ్వడంపై ఆ ఊచకోత నుంచి బతికిబయటపడ్డవారు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధితుల కోణంలో 'ద లుక్ ఆఫ్ సైలైన్స్' అనే మరో చిత్రం వచ్చింది.

సైన్యం మద్దతుతో అన్వర్ లాంటి వాళ్లు పాల్పడిన అమానవీయ నేరాలపై ప్రజలకు 'యాక్ట్ ఆఫ్ కిల్లింగ్' అవగాహన పెంచిందని మాజీ రాజకీయ ఖైదీ బెడ్జో ఉంటుంగ్ బీబీసీతో చెప్పారు.

తన చర్యల ఫలితం అనుభవించకుండానే అన్వర్ చనిపోయినందుకు తాను నిరాశ చెందానని ఆయన అన్నారు.

''ఉద్దేశపూర్వకంగా కాకపోయినా, చిత్రంలో కనిపించడం ద్వారా అన్వర్ జాతీయవ్యాప్త చర్చ మొదలయ్యేలా చేశాడు. ఈ ఊచకోత జరిగిందని ప్రపంచానికి తెలిసేలా చేశాడు'' అని ఓపెన్హీమర్ అన్నారు.

(రిపోర్టింగ్ సహకారం : రెబెకా హెన్ష్కీ)

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

మోదీ నీడ నుంచి బయటపడి అమిత్ షా తనదైన ఇమేజ్ సృష్టించుకున్నారా?

అత్యాచారాలు, హత్యలకు రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడం కూడా ఒక కారణమా...

ఓ గుహలో దొరికిన 44 వేల ఏళ్ళ నాటి అతి పురాతన పెయింటింగ్ ఏం చెబుతోంది...

బోరిస్ జాన్సన్: బ్రిటన్ ప్రధానిగా మళ్ళీ కన్సర్వేటివ్ నేత... ఎన్నికల్లో టోరీల ఘన విజయం

'పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించే వారితో చర్చలకు సిద్ధం' - అస్సాం సీఎం

ఆంధ్రప్రదేశ్: 'దిశ' బిల్లులకు శాసనసభ ఆమోదం

ఈరోజు మాకు హోలీ, దీపావళి కంటే పెద్ద పండుగ రోజు: పాకిస్తాన్ హిందూ శరణార్థులు

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబును మార్షల్స్ తోసేశారు.. టీడీపీ; మార్షల్స్‌ను పీక పట్టుకుని బెదిరించారు.. వైసీపీ