షావొమీ 108 ఎంపీ కెమెరా ఫోన్: పిక్సెల్ పెరిగితే ఫొటో క్వాలిటీ పెరుగుతుందా

  • 7 నవంబర్ 2019
షావొమీ ఫోన్ Image copyright XIAOMI

చైనా టెక్ దిగ్గజం షావొమీ ప్రపంచంలోనే మొట్టమొదటి 108 మెగాపిక్సెల్ కెమెరా ఆవిష్కరించింది.

ఇందులో వినియోగించిన ఎక్స్‌ట్రా హైరిజల్యూషన్ సెన్సర్‌ను శాంసంగ్ అభివృద్ధి చేసింది. అయితే, దీన్ని శాంసంగ్ తయారుచేసిన ఏ మొబైల్ ఫోన్లోనూ ఇంతవరకు వినియోగించలేదు.

తమ ఫోన్‌లోని 108 మెగాపిక్సెల్ కెమెరాతో ఫొటో తీస్తే చిత్రంలోని ప్రతి చిన్న అంశం స్పష్టంగా కనిపిస్తుందని షావొమీ చెబుతోంది.

అయితే.. ప్రయోగదశలో ఇంతకంటే తక్కువ రిజల్యూషన్ కెమెరాలతో తీసిన ఫొటోల కంటే దీంతో తీసిన ఫొటోలో స్పష్టత తక్కువగా ఉన్నట్లు ఒకసారి గుర్తించారు.

ప్రస్తుతం ఇది చైనాలో అందుబాటులో ఉన్న ఎంఐ సీసీ9 ప్రో ప్రీమియం మోడల్‌లో మాత్రమే ఉంది. ఈ మోడల్ ప్రాథమిక ధర సుమారు రూ.28 వేలు ఉంటుంది. (400 డాలర్లు).

ఎంఐ నోట్ 10లోనూ ఈ 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.

Image copyright copyrightXIAOMI

ఫొటో నాణ్యత ఎలా ఉంటుంది?

కెనాలిస్ అధ్యయనం ప్రకారం 9.1 శాతం వాటాతో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ విక్రయ సంస్థ షావొమీ అమ్మకాలు యూరప్‌లోనూ పెరుగుతున్నాయి. 2020 నాటికి జపాన్‌కూ విస్తరించాలనుకుంటున్నట్లు షావొమీ ప్రకటించింది.

ఖరీదైన డిజిటల్ కెమెరాల్లోనే ఇంతవరకు 100 మెగాపిక్సెల్ సెన్సర్లు ఉండేవి. స్మార్ట్ ఫోన్లోని చిన్నభాగంలో ఇంత పెద్దమొత్తంలో రిజల్యూషన్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తే అది చిత్రం నాణ్యతపై ప్రభావం చూపుతుంది.

ఒక పిక్సెల్ సాధారణంగా పట్టే స్థలం కంటే తక్కువ స్థలంలో కుదురుకోవాల్సిరావడంతో ప్రతి పిక్సెల్ తక్కువ కాంతిని పొందుతుంది. ఇది తక్కువ కాంతిలో చిత్రాలు తీసేటప్పుడు సమస్యగా మారుతుంది.

శాంసంగ్ ఐసోసెల్ ప్లస్ సెన్సర్ కొంతవరకు ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపింది. చాలా స్మార్ట్ ఫోన్ సెన్సర్ల కంటే ఇది కాస్త పెద్దదిగా ఉంటుంది.

ఇందులో నాలుగేసి పిక్సెల్స్ ఒక గ్రూప్‌గా అమర్చి ఉంటాయి. ఎరుపు, ఆకుపచ్చ, నీలంరంగు కాంతిని గ్రహించడానికి ప్రతి గ్రూప్ ఒకే విధమైన డిటెక్టర్లను కలిగి ఉంటాయి. అన్ని గ్రూపుల డాటా కలిసి ఒక పెద్ద పిక్సెల్‌లా కనిపిస్తుంది.

Image copyright XIAOMI

ఎంఐ సీసీ9 ప్రో ప్రీమియం ఎడిషన్‌ను పరీక్షించి చూసిన రివ్యూ సైట్ డీఎక్స్‌వో మార్క్.. ''ఇతర కొన్ని ఫోన్ల కంటే ఎక్కువ డీటెయిల్స్ ఇది చూపించింది'' అని పేర్కొంది.

108 మెగాపిక్సెల్ కెమెరాతో తీసిన చిత్రాలు ఎక్కువ స్టోరేజ్ స్పేస్ తీసుకుంటాయి. వీటిని ఎడిట్ చేయడానికి ప్రాసెసింగ్ పవర్ కూడా అధికంగా అవసరమవుతుంది.

అయితే, టెలిఫొటో పోర్ట్రయిట్, వైడ్ యాంగిల్ ల్యాండ్‌స్కేప్, మ్యాక్రో క్లోజ్ అప్ షాట్స్ కోసం ఇందులో తక్కువ రిజల్యూషన్ కెమెరా కూడా ఉంది.

Image copyright copyrightDXOMARK

షావొమి తొలుత ఎంఐ మిక్స్ ఆల్ఫాలోనే ఈ 108 మెగా పిక్సెల్ సెన్సర్ ఉపయోగిస్తానని చెప్పింది.

ఎంఐ సీసీ9 ప్రో, నోట్ 10లలో 108 మెగాపిక్సెల్ సెన్సర్లు వాడడమనేది వాటిని మిగతావాటికంటే ప్రత్యేకంగా నిలుపుతాయని నిపుణులు చెబుతున్నారు.

''ఎక్కువ మెగాపిక్సెళ్ల కెమేరా ఉంటే మంచి చిత్రాలు వస్తాయని చాలామంది వినియోగదారులు అనుకుంటూ ఉంటారు. కానీ అన్ని సందర్భాల్లోనూ మంచి చిత్రాలు వస్తాయనేమీ లేదు'' అన్నారు సీసీఎస్ ఇన్‌సైట్ కన్సల్టెన్సీకి చెందిన బెన్ ఉడ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)