పాకిస్తాన్ థార్ ఎడారి ప్రాంతంలో తోడికోడళ్ల ఆత్మహత్యలకు కారణాలేంటి?

  • 6 నవంబర్ 2019
థార్ ఎడారి ప్రాంతం

పాకిస్తాన్ దక్షిణ భాగంలో దుర్భర దారిద్ర్యం తాండవించే థార్ ఎడారి ప్రాంతంలో ఇద్దరు తోడికోడళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరూ ఒకేసారి బలవన్మరణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు.

ఈ ప్రాంతంలో హిందువుల్లో నిమ్నకులాలుగా పిలిచే కులాల వారు ఎక్కువగా ఉంటారు. వీరిని స్థానిక భూయజమానులు చులకనగా చూస్తుంటారు. హిందువుల్లో అగ్రకులాలుగా పిలిచే కొన్ని కులాలవారు, ముస్లింలు వీరిలో ఉంటారు.

తోడికోడళ్లు నాథూ బాయ్, వీరూ బాయ్ కేహ్రీ గ్రామంలో వాళ్లు నివసించే వ్యవసాయ క్షేత్రంలోనే ఆదివారం ఉదయం విగతజీవులై కనిపించారు. వీరి భర్తలు చమన్ కోహ్లి, పెహ్లాజ్ కోహ్లి ఇస్లామ్‌కోట్‌ పట్టణ సమీపాన ఒక రైతు వద్ద వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు.

వీరూ బాయ్‌ దంపతులకు ఏడాది వయసున్న కొడుకున్నాడని స్థానికుడు ఒకరు బీబీసీతో చెప్పారు.

మొక్కజొన్న కోతల పనుల్లో సాయపడేందుకు ఆరు నెలలుగా నాథూ బాయ్, వీరూ బాయ్‌ కుటుంబాలు గ్రామానికి కొద్ది దూరంలోని వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటున్నాయని మరో స్థానికుడు తెలిపారు.

వీరి ఆత్మహత్యకు కారణాలేమిటనేది స్పష్టం కాలేదు. ఈ కేసుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

థార్ ఎడారి ప్రాంతంలో ఆత్మహత్యలు పెద్దయెత్తున జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 59 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని, వీరిలో 38 మంది మహిళలని, ఇద్దరు చిన్నారులని సివిల్ సొసైటీ గ్రూప్ అవేర్.ఓఆర్‌జీ ఆందోళన వ్యక్తంచేసింది. నిరుడు ఇక్కడ దాదాపు 198 ఆత్మహత్యలు జరిగాయని విచారం వ్యక్తంచేసింది.

థార్ ఎడారి ప్రాంతంలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. అయినప్పటికీ ఇది పాకిస్తాన్లోని అత్యంత పేద ప్రాంతాల్లో ఒకటిగా ఉంది.

నాథూ బాయ్, వీరూ బాయ్‌లది ఆత్మహత్యగా కనిపిస్తోందని, వీరు ఎందుకు ఈ పని చేశారనేది తెలియడం లేదని స్థానిక పోలీసు అధికారి కబీర్ ఖాన్ బీబీసీతో చెప్పారు.

"ఇది పంటలు చేతికొచ్చే కాలం. కాబట్టి ఆకలి బాధతో వీళ్లు ఈ పని చేసుండొచ్చని అనుకోలేం. విపరీతమైన పని లేదా ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల ఎదురయ్యే కుటుంబ సమస్యలు దీనికి కారణమై ఉండొచ్చు. దీనిని కొట్టిపారేయలేం" అని ఆయన అభిప్రాయపడ్డారు.

నాథూ బాయ్, వీరూ బాయ్‌ల గురించి వివరాలు పెద్దగా తెలియడం లేదు.

వీరిద్దరి మృతదేహాలపై ఎలాంటి గాయాలూ లేవని వీటిని పరిశీలించిన డాక్టర్ పుష్పా రమేశ్ చెప్పారు. ఈ ఘటనతో వీరి తల్లులు, సోదరులు, అత్తింటివారు కన్నీటి పర్యంతమవుతున్నారని తెలిపారు.

చిత్రం శీర్షిక థార్ ఎడారి ప్రాంతంలో పేదరికం పెరుగుతోంది.

నాథూ బాయ్, వీరూ బాయ్ కుటుంబాలు నివసించే ప్రాంతానికి సమీపంలోనే ఉండే అల్లా జోడియో మాట్లాడుతూ- వీరు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని వీరి భర్తలను, మామను అడగ్గా, కారణం తెలియదన్నారని చెప్పారు. ఆత్మహత్యకు పురికొల్పగల ఘటనలేవీ ఇంట్లో జరగలేదన్నారని వివరించారు.

కుటుంబ సమస్యలు ఈ విషాదానికి కారణమై ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

"వీళ్లు నిరుపేదలు. చాలాసార్లు మూడు పూటలా తిండికి కూడా కష్టమవుతుంటుంది. వీళ్లు పలు మాసాలుగా పొలంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆగ్రహంతో కూడిన వాగ్వివాదాలు జరిగి ఉండొచ్చు. ఇవి చిన్న వయసులోనే వీరి ఆత్మహత్యకు దారి తీసి ఉండొచ్చు" అని జోడియో అభిప్రాయపడ్డారు.

పేదరికం పెరుగుతుండటం, బొగ్గుగనుల తవ్వకం వల్ల నిర్వాసితులు కావడం, ఇతర అంశాలతో కుటుంబాల్లో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయని ఆత్మహత్యల నివారణకు ఉద్యమించేవారు చెబుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని ఆదుకొనేందుకు ప్రభుత్వ పరంగా ఎలాంటి ఏర్పాట్లూ లేకపోవడంతో సమస్య మరింత తీవ్రరూపం దాలుస్తోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్: 'సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా తిరగబడ్డారు' - సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్

సజ్జనార్: అప్పుడు, ఇప్పుడు ఈయనే...

దిశ అత్యాచారం, హత్య: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు... నలుగురు అరెస్ట్

'దిశ' తల్లి: 'నా బిడ్డ కూడా ఒక చెల్లిలాంటిదేనని వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే...'

ప్రెస్‌రివ్యూ: అత్త,మామల సంరక్షణ బాధ్యత విస్మరిస్తే అల్లుళ్లు, కోడళ్లకూ జైలు, జరిమానా

గద్దర్: ‘తెలంగాణ ప్రభుత్వంలో టెంపరరీ పోస్టుకు అప్లికేషన్ పెట్టుకున్నాను’

అత్యాచార కేసు విచారణకు వెళ్తున్న బాధితురాలికి నిప్పు పెట్టిన దుండగులు... మృత్యువుతో పోరాడుతున్న యూపీ మహిళ

టైఫాయిడ్ వాక్సిన్: 'అద్భుతంగా పనిచేస్తోంది'