రాత్రంతా మేలుకునే ఉండాలని డాక్టర్లు చెబుతున్నారెందుకు

  • 10 నవంబర్ 2019
నిద్ర Image copyright iStock

ఇటలీలోని కొందరు వైద్యులు వివిధ మానసిక రోగాలతో బాధపడుతున్నవారికి రాత్రంతా మేలుకుని ఉండాలని సలహా ఇస్తున్నారు. బైపోలార్ డిజార్డర్‌లో భాగంగా కలిగే డిప్రెషన్‌కు చికిత్స చేయడానికి వైద్యులు ఈ విప్లవాత్మక చికిత్స చేస్తున్నారు.

మిలన్‌లోని శాన్ రాఫెల్ హాస్పిటల్‌‌ను నోర్మా సంప్రదించేటప్పటికి ఆమె తీవ్ర నిరాశలో ఉన్నారు. అంతకుముందు వైద్యులు ఆమెకు సూచించిన మందులేవీ ఉపశమనం కలిగించలేకపోయాయి.

''కొందరు దీన్ని ఏకంగా ఆత్మకు పట్టిన క్యాన్సర్‌గా అభివర్ణించారు. నేనూ ఆ మాటతో ఏకీభవిస్తాను. ఇది రాకాసి రోగం'' అన్నారు నోర్మా.

అన్ని ప్రయత్నాలూ చేసిన తరువాత ఆమె శాన్ రాఫెల్ హాస్పిటల్‌లో కొత్త చికిత్స అందిస్తున్నారని తెలిసి అక్కడికొచ్చారు.

డిప్రెషన్‌లో ఉన్నవారికి అందించే అతి సాధారణ చికిత్స అందిస్తూనే ఈ హాస్పిటల్‌లో భిన్నమైన విధానం ఒకటి పాటిస్తారు. రాత్రంతా పడుకోకుండా మెలకువగా ఉంచి చికిత్స చేస్తారు. అలా చేయడం వల్ల డిప్రెషన్ తగ్గుతుందన్నది అక్కడి వైద్యుల మాట.

ఇప్పటివరకు ఈ హాస్పిటల్‌లో వెయ్యి మందికిపైగా రోగులకు ఇలా నిద్ర పోనివ్వకుండా చికిత్స అందించారు.

చిత్రం శీర్షిక శాన్ రాఫెల్ హాస్పిటల్

''నేనీ హాస్పిటల్‌కు వచ్చినప్పటికి నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చచ్చిపోవాలనిపించేది'' అని చెప్పారు నోర్మా.

తొలిసారి ఆ క్లినిక్‌కు వచ్చినప్పుడు ఆమె చాలా భయపడ్డారు.

'నిరాశ, నిస్పృహతో ఉన్నప్పుడు నేను నిద్ర కోరుకుంటాను. కానీ, ఇక్కడ నిద్రపోవద్దని చెబుతారు. నిద్రపోతున్నట్లు చూస్తే వెంటనే వచ్చి లేపేస్తారు. ఇదంతా చికిత్సలో భాగమే కాబట్టి అంగీకరించాను''

హాస్పిటల్‌లో చేరాక ఆమె మూడు రాత్రులు నిద్రపోలేదు. మొత్తం 17 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారామె.

''మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది. కానీ, చికిత్స పూర్తయ్యాక నరాల్లో ఏదైనా ఇంజెక్ట్ చేసి జబ్బు నయం చేశారా అనిపిస్తుంది. ఎంతో హాయిగా, రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. మనశ్శాంతిగా ఉంటుంది'' అన్నారామె.

వైద్యుల పర్యవేక్షణలో ఈ చికిత్స చేయించుకోవాలని.. తమ వద్దకు వచ్చిన రోగుల్లో 70 శాతం మందికి మంచి ఫలితాలు వచ్చాయని శాన్ రాఫెల్ వైద్యులు తెలిపారు.

''మా పేషెంట్లు ఈ చికిత్స తీసుకున్న తరువాత డిప్రెషన్ నుంచి బయటపడతార''ని శాన్ రాఫెల్ హాస్పిటల్‌లో పనిచేసే సైకియాట్రిస్ట్ ఫ్రాన్సిస్కో బెనెడెటి చెప్పారు.

''వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నవారు కూడా ఈ చికిత్స తరువాత కోలుకుని మళ్లీ మునుపటిలా తమ ఉద్యోగాలు చేసుకోగలిగారు'' అని శాన్ రాఫెల్ వైద్యులు చెబుతున్నారు.

అన్ని ప్రయత్నాలూ చేసి ఫలితం దొరకని రోగులు ఇక్కడికి వస్తుంటారని ఫ్రాన్సిస్కో చెప్పారు.

అయితే, డిప్రెషన్ కారణంగా ఆలోచనలతో రాత్రంతా నిద్రపట్టక బాధపడేవారికి ఇది నిరుపయోగమని చెప్పారాయన.

చిత్రం శీర్షిక జార్జియో

బైపోలార్ డిజార్డర్‌తో బాధపడేవారికి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నిద్రలేమి వల్ల హాయి కలుగుతుంది. సంతోషం, హాయికి సంబంధించిన హార్మోన్ సెరోటోనిన్‌పై ఇది సానుకూల ప్రభావం చూపిస్తుంది. అలాగే నిద్రపోవడం, మెలకువలోకి వచ్చే వేళల్లో అస్థిరతను సరిచేసేలా స్లీప్ సైకిల్‌ను రీసెట్ చేస్తుంది.

ఈ చికిత్స తీసుకుంటున్న కొందరు రోగులను బీబీసీ దగ్గరగా పరిశీలించింది. వారంతా 36 గంటల పాటు నిద్రపోకుండా ఉండాలి. వారంలో మూడుసార్లు అలా చేయాలి.

ఆసుపత్రిలో ఉంటూ 36 గంటల పాటు నిద్రపోకుండా ఉండడానికి వారు మిగతా రోగులతో మాట్లాడుతూ.. టీవీ చూస్తూ, తమకిష్టమైన ఇతర వ్యాపకాల్లో ఉంటూ నిద్రకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించారు. అయినా, నిద్రొస్తుంటే లేచి అటూఇటూ తిరుగుతున్నారు. ముఖంపై చల్లని నీరు చల్లుకుని నిద్రను ఆపుకొనేందుకు ప్రయత్నించడం కనిపించింది.

అక్కడున్న జార్జియో అనే 61 ఏళ్ల ఎలక్ట్రీషియన్‌తో మాట్లాడాం. ''ఇరవయ్యేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నాను. ఎంతోమంది డాక్టర్ల దగ్గరకు వెళ్లాను, ఎన్నో మందులు వాడాను. అయినా, తగ్గలేదు. జబ్బు తీవ్రమవడంతో ఏ పనీ చేయలేకపోయేవాడిని. చచ్చిపోవాలనిపిస్తుంది'' అంటూ తన బాధ చెప్పుకొన్నారాయన.

చిత్రం శీర్షిక డాక్టర్ ఫ్రాన్సిస్కో

''జార్జియో వంటివారు చివరి ప్రయత్నంగా ఇక్కడికొస్తారు. వారు చికిత్సకు సహకరిస్తారు. 36 గంటలు నిద్రలేకుండా ఉండేందుకు నిర్ణయించుకుంటారు. ఎలాగైనా ఈ చికిత్స పూర్తిచేసుకుని కోలుకోవాలని కోరుకుంటారు'' అన్నారు డాక్టర్ ఫ్రాన్సిస్కో.

రాత్రి 3 గంటల సమయంలో రోగులందరినీ ఒక గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ పెద్ద పెద్ద లైట్లున్నాయి. పూర్తిగా పగటిని తలపిస్తోంది అక్కడి వాతావరణం. అది రోగుల మూడ్ మార్చుతుందని.. లైట్ ట్రీట్‌మెంట్ తరువాత వారు కొంత ఉపశమనం పొందుతారని డాక్టర్ చెప్పారు.

పగటి పూట కూడా మరోసారి ఈ లైట్ ట్రీట్‌మెంట్ ఇస్తారు వారికి. ''ఎక్కువ వెలుతురులో ఉన్నప్పుడు కంట్లో ఆ వెలుగుపడడం వల్ల నిద్ర రాదు. డిప్రెషన్‌ను తొలగించే సాధనంగా ఇది పనిచేస్తుంద''ని ఫ్రాన్సిస్కో చెప్పారు.

మూడ్‌ను స్థిరంగా ఉంచడానికి ఉపయోగపడే లిథియంను ఈ చికిత్సలో రోగికి అందిస్తారు. అయితే, ఇది అందరికీ పనిచేస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు.

జార్జియోకు తొలుత కొన్ని సెషన్లలో ఎలాంటి ఫలితం కనిపించలేదు. రెండో రాత్రి కొంత నయం అనిపించింది. నిద్రలేకుండా గడిపిన తరువాత మళ్లీ ఒక రాత్రంతా నిద్రపోయాక మాత్రం చాలా బాధగా అనిపించిందని చెప్పారాయన.

'మేల్కొన్నాక ఎక్కడున్నానో తెలియలేదు. చాలా నిరాశగా అనిపించింది'' అన్నారాయన.

ఈ స్థితిని డిప్రెసివ్ రిలాప్స్ అంటారని డాక్టర్ ఫ్రాన్సిస్కో చెప్పారు. అందుకే రోగులను తమ పర్యవేక్షణలో ఉంచుతూ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తామని చెప్పారాయన. రోగుల మూడ్ మారుతున్నప్పుడు వారితో ఉంటూ పరిశీలిస్తామని చెప్పారు.

మందులతో నయం కానివారికి ఇలాంటి పద్ధతులు మేలు చేస్తాయని చెప్పారాయన.

చిత్రం శీర్షిక నోర్మా

ఇక్కడ చికిత్స తీసుకున్నాకే తన ఆరోగ్యం మెరుగైందని నోర్మా కూడా చెప్పారు.

మానసిక వ్యాధులకు చికిత్స చేసే వర్గాల్లో దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. డాక్టర్ ఫ్రాన్సిస్కో ప్రయోగాలు చేస్తున్నారని కొందరంటారు.

చికిత్స తీసుకున్న రోగుల్లో 70 శాతం మందికి నయమైందనడానికి బీబీసీకి ఆధారాలు లభించలేదు. అక్కడ మూడు నెలల్లో బీబీసీ గమనించిన నలుగురు రోగులలో ఎవరిలోనూ పెద్దగా మార్పు రాలేదు.

అయితే, ఈ కొత్త చికిత్స విధానానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు దొరుకుతోంది. వైద్యులు పర్యవేక్షణ లేకుండా ఎవరికి వారు నిద్ర పోకుండా ప్రయోగాలు చేయరాదని డాక్టర్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

‘‘గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతుండగా అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి వచ్చేశాం’’ - పాక్ పోలీసులతో ప్రశాంత్

ట్రంప్ అభిశంసన విచారణ: రిపబ్లికన్ల ఆరోపణలు ఏమిటి.. వాటిలో నిజమెంత

మొబైల్ డేటా రేట్లు పెంచనున్న రిలయన్స్ జియో.. ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాల బాటలోనే..

"ఇస్లామోఫోబియా, కులతత్వం, వర్గపోరుతో మా క్యాంపస్ కంపు కొడుతోంది"

జెరూసలేం యాత్రలకు ఆర్థికసాయం పెంచిన ఏపీ ప్రభుత్వం

ఫీజుల పెంపుపై జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళనల్లో న్యాయం ఉందా

ఈ దేశంలో ఒక్క ఏడాదిలో 30 వేల హత్యలు... ఈ బీభత్సానికి కారణం ఎవరు

మీకు కొన్ని కూరగాయలు, ఆకు కూరలు అంటే అయిష్టమా? దానికి కారణమేంటో తెలుసా...