బెర్లిన్ వాల్ కూలిపోయి 30 ఏళ్లయ్యాక.. యూరప్ దేశాలు ఇప్పుడు అడ్డుగోడలు ఎందుకు నెలకొల్పుతున్నాయి?

  • 8 నవంబర్ 2019
బెర్లిన్ వాల్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక బెర్లిన్ వాల్ 1989 నవంబర్ 9న కూలిపోయింది

బెర్లిన్ గోడ కూల్చివేత ముప్పయ్యో వార్షికోత్సవం జరుపుకుంటోంది యూరప్.

ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో కమ్యూనిస్టు ప్రాంతమైన తూర్పు యూరప్ నుంచి పశ్చిమ యూరప్‌లోకి ప్రజలు ప్రవేశించకుండా నిరోధిస్తూ నిర్మించిన బెర్లిన్ గోడ చరిత్రలో ప్రసిద్ధి చెందింది.

మూడు దశాబ్దాల కిందట ఆ అడ్డుగోడను కూల్చివేశారు. ఆ చారిత్రక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా సంబరాలు జరుపుకుంటుంటారు.

కానీ బెర్లిన్ గోడను కూల్చివేసిన ముప్పై ఏళ్ల తర్వాత.. ఇప్పుడు యూరప్ ఖండమంతటా ప్రజలు స్వేచ్ఛగా సంచరించటాన్ని అడ్డుకుంటూ వందలాది కిలోమీటర్ల మేర కొత్తగా గోడలు నిర్మిస్తున్నారు.

యూరప్ ఖండానికి వలసలతో ఉన్న క్లిష్టమైన సంబంధాలు దీనికి కేంద్ర బిందువు. ఈ అంశం.. ''విద్వేషపూరిత విధానాలు సాధారణంగా మారటానికి కారణమైంది.. ఆ విధానాల వల్ల సముద్రంలో ఎంతో మంది చనిపోయారు.. ఇంకెంతో మంది తీవ్ర కష్టాలపాలవుతున్నారు'' అని స్వచ్ఛంద వైద్య సేవా సంస్థ ఎంఎస్ఎఫ్ చెప్తోంది.

కొన్ని యూరప్ దేశాలు వలసల విషయంలో మానవీయ కోణం కన్నా.. వాటి వల్ల తలెత్తే ఆర్థిక, రాజకీయ పర్యవసానాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది.

అసలు వలసల పట్ల యూరప్ వైఖరులు ఎలా మారాయి? ఎందుకు మారాయి?

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బెర్లిన్ వాల్ చుట్టూ మందుపాతరలు, సాయుధ పహరా కూడా ఉండేది

విభజిత ఖండం

రెండో ప్రపంచ యుద్ధం అనంతరం యూరప్ ఖండం.. కమ్యూనిస్టు (సామ్యవాద) తూర్పు ప్రాంతం - కాపిటలిస్ట్ (పెట్టుబడిదారీ) పశ్చిమ ప్రాంతంగా విడిపోయింది.

తుర్పు ప్రాంతం (ఈస్ట్రన్ బ్లాక్)లో ప్రభుత్వాలు మరింత నిరంకుశంగా మారుతుంటే.. భారీ సంఖ్యలో ప్రజలు దానిని వ్యతిరేకిస్తూ పశ్చిమ ప్రాంతానికి వలస వచ్చారు. 1949 - 1961 మధ్య 27 లక్షల మంది తూర్పు జర్మనీ నుంచి పశ్చిమ జర్మనీకి వచ్చారు.

సోవియట్ సారథ్యంలోని దేశాలు సరిహద్దు నియంత్రణను అత్యంత కఠినంగా మార్చాయి. విద్యుత్ కంచెలు వేయటం, మందుపాతరలు పాతటం, సాయుధ బలగాలను మోహరించటం వంటి చర్యలు చేపట్టాయి. ప్రజలు పశ్చిమ ప్రాంతానికి వెళ్లకుండా నిరోధించటానికి భీకరమైన బలప్రయోగం చేసేవి.

ప్రచ్ఛన్న యుద్ధం ముగిసే సమయంలో బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్న మార్గరెట్ థాచర్.. ఈస్ట్రన్ బ్లాక్ దేశాలు ''స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను నిరోధించటానికి క్రూరత్వాన్ని, ఆటవికత్వాన్ని ప్రదర్శించాయి'' అని వ్యాఖ్యానించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionబెర్లిన్ గోడ నిర్మాణానికి కారణాలు ఏమిటి?

ఆ చర్యల్లో అంత్యంత ప్రఖ్యాతి - లేదా అపఖ్యాతి - చెందినది బెర్లిన్ గోడ. జర్మనీ చరిత్రాత్మక రాజధానిని మధ్యకంటూ విభజిస్తూ 1961లో ఈ గోడను నిర్మించారు.

ఈ గోడను దాటి వెళ్లటానికి ప్రయత్నిస్తూ 262 మంది చనిపోయారని బెర్లిన్ లోని ఫ్రీ యూనివర్సిటీ 2017లో నిర్వహించిన ఒక అధ్యయనం చెప్తోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బెర్లిన్ వాల్‌‌లో కొంత భాగం.. ఈ గోడను దాటే ప్రయత్నంలో చనిపోయిన వారికి స్మారక చిహ్నంగా మారింది

సాదర స్వాగతం

తూర్పు ప్రాంతం నుంచి వలస వచ్చే వారిని పశ్చిమ ప్రాంత దేశాలు సాదరంగా ఆహ్వానించేవి. ప్రజల సంచారం మీద విధించిన ఆంక్షలను, వాటిని క్రూరంగా అమలు చేసే తీరును తీవ్రంగా ఖండించేవి.

భారీ వలసలను నిరోధించే అడ్డుగోడలను, ఆంక్షలను వ్యతిరేకిస్తూ పశ్చిమ దేశాలు చేసిన వాదనలు, అనుసరించిన వైఖరులు.. చిరకాలం కొనసాగలేదు.

ప్రచ్ఛన్న యుద్ధ దృక్కోణం నుంచి చూసినపుడు.. కమ్యూనిస్టు పాలనలో ఉన్న దేశాల ప్రజలు భారీ సంఖ్యలో తమ దేశాలను విడిచిపెట్టి.. తమకు సైద్ధాంతిక ప్రత్యర్థులైన ప్రభుత్వాల పాలనలోని దేశాలకు పారిపోవాలని భావించటం.. కమ్యూనిస్టు దేశాలకు రాజకీయంగా అవమానకరంగా ఉండింది.

అదేసమయంలో పశ్చిమ యూరప్ ఆర్థిక వ్యవస్థలు వేగంగా అభివృద్ధి చెందుతుండేవి. నిరుద్యోగిత స్థాయిలు అతి తక్కువగా ఉండేవి. ఆ దేశాల్లో కార్మికుల కొరతను.. ఈ వలసలు తీర్చేవి.

బ్రిటన్‌లో యుద్ధానంతర కార్మిక శక్తి లోటును తీర్చుకోవటానికి.. తూర్పు యూరప్ నుంచి ప్రజలు తమ దేశానికి వలస రావటానికి సాయం చేయటం కోసం యూకే ప్రభుత్వం ప్రత్యేక పథకాలను రూపొందించి అమలుచేసింది.

బెర్లిన్ గోడ నిర్మాణంతో.. తూర్పు యూరప్ నుంచి వచ్చే దారులు మూసుకుపోయాయి. దీంతో తూర్పు జర్మనీకి వలసల వరద హఠాత్తుగా పడిపోతే తలెత్తే లోటును భర్తీ చేసుకోవటానికి ఆ దేశం హుటాహుటిన టర్కీ, మొరాకో వంటి దేశాలతో ఒప్పందాలు చేసుకుంది.

ఈ నియంత్రిత కార్మికుల సరఫరా.. పశ్చిమ రాజకీయవేత్తలకు ఒక రకమైన సంతోషం కల్పించింది.

ఒకవైపు.. సామూహిక వలసలను అడ్డుకుంటుందంటూ తూర్పు భాగం మీద వీళ్లు విమర్శలు చేయవచ్చు. మరోవైపు.. తూర్పు నుంచి సరిహద్దులు దాటి వచ్చే వలసల వరదను పరిష్కరించాల్సిన అవసరమూ లేదు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బెర్లిన్ వాల్ - నాటి కమ్యూనిస్టు తూర్పు బ్లాక్‌ మీద విమర్శలకు ఉపయోగపడింది

సరికొత్త యూరప్

కానీ.. ఈ సౌకర్యవంతమైన పరిస్థితి ఎంతో కాలం కొనసాగలేదు.

తూర్పు భాగం చాలా కాలం కిందటే కుప్పకూలింది. మాజీ కమ్యూనిస్టు దేశాల్లో చాలా దేశాలు ఇప్పుడు.. పశ్చిమ యూరప్ దేశాల సరసనే యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలుగా ఉన్నాయి.

కానీ.. ప్రజల మూకుమ్మడి వలసల పట్ల ఈ దేశాల వైఖరుల్లో చాలా తేడాలున్నాయి.

అంతకుముందు తమ సొంత ప్రజలను అడ్డుగోడల మధ్య బంధించిన దేశాల్లో కొన్ని.. ఇప్పుడు ఇతర దేశాల నుంచి తమ దేశాలకు వలస రాకుండా నిరోధించటానికి కంచెలు నిర్మిస్తున్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక తూర్పు బ్లాక్ నియంతృత్వ పాలనకు బెర్లిన్ వాల్ ఒక చిహ్నంగా నిలిచింది

యూరోపియన్ యూనియన్‌లో అంతర్గతంగా ప్రయాణం చేయటం సులభమే అయినా.. బాహ్య సరిహద్దులను బలోపేతం చేయటం మీద ఈయూ ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. ఈ విధానాన్ని ''కంచుకోట యూరప్'' అని కూడా వ్యవహరిస్తుంటారు.

ముఖ్యంగా.. ఆఫ్రికా, మధ్య ఆసియా, ఆసియాల నుంచి యూరప్‌లోకి ప్రవేశించే ప్రధాన మార్గాలు ఉన్న దక్షిణ సరిహద్దును పటిష్టంగా రక్షించటం మీద ఈయూ దృష్టి కేంద్రీకరిస్తోంది.

హంగరీ.. తన సెర్బియా సరిహద్దులో 155 కిలోమీటర్ల పొడవున రెండంచెల కంచెను నిర్మించి.. దాని పొడవునా అలారంలు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు నెలకొల్పింది.

బల్గేరియా.. తన టర్కీ సరిహద్దులో 260 కిలోమీటర్ల కంచె ఏర్పాటు చేసింది.

Image copyright JASON FLORIO/MOAS/Reuters/handout
చిత్రం శీర్షిక మధ్యధరా సముద్రం గుండా యూరప్ చేరుకోవటానికి ప్రయత్నిస్తూ వేలాది మంది శరణార్థులు ప్రాణాలు కోల్పోయారు

మధ్యధరా సముద్ర తీరమంతటా.. ఉత్తర ఆఫ్రికా నుంచి బోటు ద్వారా ఈయూ చేరటానికి ప్రయత్నిస్తున్నారు. వారిని మధ్యలోనే ఆపి వారు ఏ దేశం నుంచి బయలుదేరి వచ్చారో ఆ దేశానికి తిప్పి పంపుతున్నారు. దీనిని 'సముద్ర గోడలు' అని ట్రాన్స్‌నేషనల్ ఇన్‌స్టిట్యూట్ వంటి కొన్ని స్వచ్ఛంద ఉద్యమ సంస్థలు అభివర్ణిస్తున్నాయి.

ఈ మార్గంలో వస్తున్న వలసల ప్రధాన లక్ష్యం.. ఇటలీ, గ్రీస్, స్పెయిన్ దేశాలకు చేరుకోవటం.

కానీ.. ఈ అడ్డుగోడలు యూరోపియన్ యూనియన్ సరిహద్దుల దగ్గరే ఆగిపోలేదు. వలసలు యూరప్‌లో మరింత లోపలికి రాకుండా నిరోధించటానికి అనేక నియంత్రణలను ఏర్పాటు చేశారు.

హంగరీ.. తన క్రొయేషియా సరిహద్దు వెంట 300 కిలోమీటర్ల పొడవునా కంచె నిర్మించింది. ఆస్ట్రియా తన స్లొవేనియా సరిహద్దు వెంట కంచెను నిర్మిస్తే.. స్లొవేనియా తన క్రొయేషియా సరిహద్దు మొత్తం కంచె వేసింది.

ఈయూ తను అవలంబిస్తున్న వలస నిర్వహణ, సరిహద్దు రక్షణ విధానాలతో అంతులేని మానవ విషాదానికి కారణమయిందని స్వచ్ఛంద వైద్య సంస్థ ఎంఎస్ఎఫ్ విమర్శిస్తోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఈయూ దేశాలు వేలాది కిలోమీటర్ల మేర కొత్త కంచెలు, గోడలు నిర్మించాయి

ఇప్పుడంతా తిరస్కరణే

వలసల విషయంలో వైఖరులు మారటంతో ఈయూ ఈ కఠిన వైఖరి అవలంబిస్తోంది.

ఇంతకుముందు.. కమ్యూనిస్ట్ తూర్పు యూరప్ అవలంభించిన ఆంక్షల విధానాల నేపథ్యంలో.. స్వేచ్ఛా సంచారాన్ని ప్రోత్సహించటం రాజకీయంగా ఉపయోగపడేది.

కానీ.. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన చాలా కాలానికి - 2015లో వలస అనేది అంతకంతకూ ప్రమాదకరమైన అంశంగా మారింది. లక్షలాది మంది వలసలు ఈయూకు పోటెత్తటం మొదలైంది. ఆ ఒక్క ఏడాదిలోనే ఒక్క అక్టోబర్ నెలలోనే 2,20,000 మందికి పైగా యూరప్‌కు వలస వచ్చారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionబెర్లిన్ గోడను ఎందుకు కూల్చేశారు?

ఈ వలసకు, వలసలకు వ్యతిరేకంగా ప్రచారం చేయటం ద్వారా యూరప్ అంతటా మితవాద పార్టీలు బలపడ్డాయి. చాలా ప్రధాన స్రవంతి పార్టీలు సైతం తమ విధానాలను మార్చుకున్నాయి.

ఇంకోవైపు 2008లో మొదలైన ఆర్థిక సంక్షోభం తర్వాత యూరప్ ఆర్థిక వ్యవస్థ కూడా ఇంకా కుంటుతూ నడుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధానంతరం కనిపించిన అధిక వృద్ధి - అల్ప నిరుద్యోగిత శకం ఇప్పుడు ఒక పాత జ్ఞాపకంగా మిగిలింది.

వలసలను విభజించటానికి, ఈయూ అంతటా వారు స్థిరపడేలా చేయటానికి గట్టిగా కృషి జరిగినా అది విఫలమైంది. ఆయా దేశాలు ఎంత మంది వలసలను అంగీకరించాలనే అంశంపై వాదవివాదాలు దీనికి కారణం.

Image copyright Getty Images/HUNGARIAN INTERIOR MINISTRY PRESS OFF
చిత్రం శీర్షిక ఈయూ సరిహద్దు విధానాన్ని ‘‘కంచుకోట యూరప్’’ అని వ్యవహరిస్తున్నారు

ముళ్ల కంచెలు

దీంతో.. ఈయూలోకి వచ్చే వలసలను నిరోధించటానికి అడ్డుగోడలు పుట్టుకొచ్చాయి. ఫలితంగా 2017 జనవరిలో కేవలం 7,000 మంది వలసదారులు మాత్రమే ఈయూలో అడుగు పెట్టగలిగారు.

ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కమ్యూనిస్టు తూర్పు యూరప్ నుంచి వలసలకు మద్దతు ఇచ్చిన మానవతా వాదనలు.. ఈ శతాబ్దపు వలసల విషయంలో మూగబోయాయి. ఈ వలసల పరిస్థితులు మరింత దారుణంగా, ప్రమాదకరంగా ఉన్నా కానీ వీరి వలసలకు పెద్దగా మద్దతు లభించటం లేదు.

2015లో యూరప్‌కు వచ్చిన వారిలో 33 శాతం మంది సిరియా నుంచి, 15 శాతం మంది అఫ్ఘానిస్తాన్ నుంచి, 6 శాతం మంది ఇరాక్ నుంచి వచ్చారు. ఈ దేశాలన్నీ.. రక్తసిక్త అంతర్యుద్ధాల్లో చిక్కుకుని ఉన్నాయి. ఆ సంక్షోభాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

కానీ.. కొన్ని దశాబ్దాల కిందట కమ్యూనిస్టు తూర్పు యూరప్ వలసలకు లభించిన తరహా ఆదరణ.. ఇప్పుడు ఈ వలసల విషయంలో కనిపించటం లేదు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక వలసలకు వ్యతిరేకంగా ఈయూ వ్యాప్తంగా హింసాత్మక ప్రదర్శనలు జరిగాయి

ఇందుకు.. ఇలా వలస వస్తున్నది ఎవరు అనేది కూడా ఒక కారణం కావచ్చు.

''ప్రచ్ఛన్న యుద్ధ నేపథ్యం.. వలసల సమస్యను చాలా ముఖ్యమైన ప్రచారానికి ఒక అంశంగా మార్చింది. సోవియట్ బృందాన్ని వీడి వచ్చిన ప్రతి వలసదారుడూ.. పశ్చిమ ప్రాంత ఆధిపత్యాన్ని చాటాడు'' అంటారు హంగేరియన్ చరిత్రకారుడు గుస్తావ్ కెస్కెస్.

అదీగాక.. నాటి వలసదారులు ప్రధానంగా క్రిస్టియన్ యూరోపియన్లు.. యువత, విద్యావంతులు - ముఖ్యంగా ఆ కాలంలో కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా. అంటే.. వారు వలస వెళుతున్న దేశాలకు సైద్ధాంతిక మిత్రులు.

కానీ ప్రస్తుత వలసదారులు అనేక వర్గాల మిశ్రమం - నైపుణ్యం లేని వారు - వృత్తి నిపుణులు, పట్టణవాసులు - గ్రామీణ వాసులు, వయోజనులు - పిల్లలు, సిరియన్లు, ఇరాకీలు, అఫ్గాన్లు.. అంతూదరీ లేని యుద్ధాల నుంచి పారిపోయి వస్తున్న వారు - చాలా భిన్నమైన ప్రపంచంలోకి అడుగుపెడుతున్న వారు.

ఈ వలస ప్రజలు తాము వెళ్లదలచుకున్న యూరప్ దేశాల ప్రజానీకాల కన్నా.. జాతిపరంగానూ, మతపరంగానా భిన్నమైన వారు. మితవాద పార్టీలకు, ఇతరులకు అవాంఛనీయమైన వారు.

వీరిని పెద్ద సంఖ్యలో ఆహ్వానించటానికి ఇప్పుడు యూరోపియన్ యూనియన్ సుముఖంగా లేదని - లేదంటే రాజకీయంగా అశక్తంగా ఉందని కనిపిస్తోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఈయూ వెలుపల శరణార్థులకు ఆశ్రయం ఇవ్వటం కోసం టర్కీకి 330 కోట్ల డాలర్లు ఇస్తానని ఈయూ అంగీకరించింది

ఇప్పుడు.. ప్రపంచంలో అతి పెద్ద సంఖ్యలో వలస ప్రజలకు ఈయూను ఆనుకుని ఉన్న టర్కీ ఆశ్రయమిస్తోంది. వారిలో ఒక్క సిరియా శరణార్థులే 36 లక్షల మంది ఉన్నారు.

యూరోపియన్ యూనియన్‌ దేశమైన జర్మనీ 11 లక్షల మంది శరణార్థులకు ఆశ్రయమిస్తోంది. జర్మనీ జనాభా టర్కీ కొన్నా కొంచెం ఎక్కువ. అయితే.. జర్మనీ ఆర్థిక వ్యవస్థ టర్కీ కన్నా నాలుగు రెట్లు పెద్దది. కానీ.. ఈ దేశం ఆశ్రయమిస్తున్న వలస సంఖ్య.. టర్కీ ఆశ్రయమిస్తున్న శరణార్థుల సంఖ్యలో మూడో వంతు కన్నా తక్కువే.

అయినాకానీ.. ఈయూ దేశాల్లో అత్యధిక సంఖ్యలో శరణార్థులను అంగీకరించిన దేశం జర్మనీయే. బ్రిటన్.. కేవలం 1,26,000 మంది శరణార్థులను మాత్రమే అంగీకరించింది.

రెండో ప్రపంచ యుద్ధానంతరం తలెత్తిన అత్యంత తీవ్రమైన శరణార్థి సంక్షోభం నేపథ్యంలో తాము 7,20,000 మంది శరణార్థులకు ఆశ్రయమిస్తున్నామని.. ఇది ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా మూడు దేశాలు ఆశ్రయమిస్తున్న వారి సంఖ్యను కలిపినా మూడు రెట్లు అధికమని ఈయూ వాదిస్తోంది.

అయితే.. యూరోపియన్ యూనియన్ విధానాల వల్ల - వలసలు, శరణార్థుల మానవ హక్కులు ప్రమాదంలో పడుతున్నాయని.. హింసకు, లైంగిక హింసకు, ఇతర ఉల్లంఘనలకు దారితీస్తున్నాయని ఐక్యరాజ్యసమితి తప్పుపడుతోంది.

మూడు దశాబ్దాల కిందట.. కమ్యూనిస్టు నియంతృత్వాన్ని ఎదుర్కొని ఓడించిన తాము స్వేచ్ఛకు, సహనానికి ఆశాకిరణం అని చాటుకున్న యూరప్‌లో 1989లో ఆవరించిన ఆశావహ స్వేచ్ఛా వాయువులకు ఇప్పటి పరిస్థితి పూర్తిగా భిన్నమైనది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం