కిడ్నాపర్ల నుంచి ప్రయాణికులను కాపాడుతున్న రైలు కథ

  • 10 నవంబర్ 2019
నైజీరియా రైలు Image copyright Getty Images

నైజీరియాలోని కరుడగట్టిన కిడ్నాప్ ముఠాల నుంచి తప్పించుకోడానికి రాజధాని అబుజా, కడునా నగరాల మధ్య ప్రయాణించే వాళ్లు రోజూ రైళ్లనే ఆశ్రయిస్తున్నారు.

అబుజాలో వ్యాపారం చేసే మన్నీర్ అవాల్ అడో వారాంతంలో తన కుటుంబాన్ని కలవడానికి కడునాకు వెళ్లేవారు.

ఆయన ఈ ఏడాది మొదట్లో అబుజా-కడునా రహదారిపై కిడ్నాప్‌కు గురయ్యారు. ఐదురోజుల పాటు ఆయన కిడ్నాపర్ల చెరలోనే ఉన్నారు.

తనను విడుదల చేయడానికి కిడ్నాపర్లకు 1,000 పౌండ్లు(రూ.90,819) చెల్లించానని బీబీసీకి చెప్పారు. ఇది తనకు బాధాకరమైన అనుభవమని అన్నారు.

మన్నీర్ అవాల్ అడో చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డారు. అతను ప్రయాణిస్తున్న వాహనంపై కిడ్నాపర్లు దాడి చేసినప్పుడు పోలియో వల్ల పారిపోలేకపోయారు.

''నిజాయితీగా చెప్పాలంటే అప్పటి నుంచి నేను కారులో వెళ్లడం లేదు. ఎందుకంటే నాకు రోడ్డు మీద వెళ్లడమంటే భయం పట్టుకుంది. నా రక్షణ కోసం రైలులోనే వెళ్లడం మంచిదని అనుకున్నా'' అని అతను చెప్పారు.

రెండు నగరాల మధ్య రోడ్డు మార్గం 150 కిలోమీటర్లు ఉంటుంది. ప్రయాణానికి ఇదే దగ్గరి, చౌకైన మార్గం కూడా. కానీ, ఇలా వెళ్లడం చావుబతుకుల సమస్యగా మారింది.

ఎందుకంటే ఇలా వెళ్లిన చాలామంది ప్రయాణికులు హైవేపై కిడ్నాప్‌కు గురయ్యారు. కొందరు చనిపోయారు.

చైనా ప్రభుత్వ రుణసాయంతో 2016లో అబుజా నుంచి కడునా వరకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఇదే ఇప్పుడు కిడ్నాపర్ల నుంచి ప్రయాణికులను కాపాడుతోంది.

చిత్రం శీర్షిక గతంలో ఒకసారి రహదారిపై వెళ్తున్నప్పుడు మన్నీర్ అవాల్ అడో కిడ్నాప్ అయ్యారు. అప్పటి నుంచి అతను రైలులోనే ప్రయాణిస్తున్నారు

టికెట్ల కోసం కొట్లాట

ఈ రెండు నగరాల మధ్య రోజూ నాలుగు ట్రిప్స్ ఉంటాయి. దీనికి టికెట్ దొరకడం చాలా కష్టం. రోజూ ఐదువేల మంది ప్రయాణికులు ఈ రైలును ఉపయోగిస్తుంటారు.

భద్రత కోసం రైలులోని ఆరు బోగీలలో తొమ్మిది మంది సాయుధ పోలీసులు కాపలాగా ఉంటారు. దీంతో ఈ రైలు సురక్షితమని ప్రయాణికులు భావిస్తున్నారు.

ఈ రైలులో ఒకవైపు వెళ్లడానికి ఎకానమీ టికెట్‌కైతే రూ.283లు, బిజినెస్ టికెట్‌కు రూ.567లుగా నిర్ణయించారు.

ఇందులో టికెట్ కోసం ప్రయాణికులు బారులు తీరుతున్నారు. ఒక్కోసారి టికెట్ కోసం కొట్లాటలు కూడా జరుగుతున్నాయి.

టికెట్లను బ్లాక్ చేయడం, వాటిని ఎక్కువ రేటుకు అమ్మడంపై సంబంధిత అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రక్రియను ఆటోమేటిక్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

నేను అబుజా నుంచి ఉదయం 9.45కు బయలుదేరాను. అప్పుడు నాతో పాటు 600 మంది ప్రయాణికులుంటే అందులో 50 మందికిపైగా నా బోగీలోనే నిలబడ్డారు .

ఈ రైలులో బోగీల మధ్య, బాత్రూంలలో నిలబడి కూడా కొందరు ప్రయాణిస్తుంటారు.

చిత్రం శీర్షిక ఈ రైలులో నిలబడి వెళ్లడానికి కూడా ప్రయాణికులు సిద్ధమవుతున్నారు.

అత్యంత ప్రమాదకరమైన రహదారి గుండా వెళ్లడం కంటే ఇలా కష్టపడుతూ వెళ్లడమే తమకు సంతోషం కలిగిస్తుందని వారు అంటున్నారు.

రహదారికి ఇరువైపుల దట్టమైన వేప చెట్లు ఉంటాయి. ఇవి సాయుధ ముఠాలు కనిపించకుండా చేస్తాయి.

నైజీరియాలో కిడ్నాపర్లకు పేద, ధనిక అనే తేడా లేదు. 20 డాలర్ల కంటే తక్కువ మొత్తం చెల్లించినా కూడా ఒక్కోసారి బంధీలను వదిలేస్తుంటారు. అయితే, ఒక్కపైసా కూడా చెల్లించని వాళ్లను కొన్నిసార్లు చంపేస్తుంటారు.

''ఈ రహదారిలో రోజుకు 10 కిడ్నాప్‌లు జరుగుతాయి. ఈ మార్గంలో 20 ముఠాలు పనిచేస్తున్నాయి'' అని కిడ్నాపర్లతో పోరాడే ప్రత్యేక విభాగానికి చెందిన పోలీసు కమాండర్ అబ్బా కయారి తెలిపారు.

కిడ్నాప్ గురైన మన్నీర్ అవాల్‌ను విడిపించడానికి అతని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించకుండా కిడ్నాపర్లతో చర్చలు జరిపారు. వారి అడిగిన మొత్తం చెల్లించి ఆయనను విడిపించుకున్నారు. చాలా మంది ఇలానే చేస్తుండటంతో ఎంతమంది కిడ్నాప్ అవుతున్నారనే దానిపై స్పష్టమైన గణాంకాలు లేవు.

Image copyright Nigeria Police
చిత్రం శీర్షిక కరుడగట్టిన కిడ్నాపర్ల ముఠాలు ఉండే కడునా రోడ్డు మార్గం ఇదే..

అబుజాలో ఎందుకు నివసించరు?

రాజధాని అబుజాలో పనిచేసే చాలా మంది అక్కడ నివసించడం లేదు. ఇంటి అద్దెలు భారీగా ఉండటంతో వారంతా ఉత్తరాన ఉన్న కడునాలో ఉండటానికే మొగ్గుచూపుతున్నారు.

ఉత్తర నైజీరియా వాణిజ్య కేంద్రంగా పేరున్న కడునాలో ఇంటి అద్దెలు చాలా తక్కువ. అబుజాకు పూర్తి భిన్నంగా ఉండే పెద్ద నగరం. అయితే ఇక్కడ రాజకీయ, మత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జాతుల సమస్య ఉంది.

అబుజా దీనికి భిన్నంగా ఒక పరిపాలన కేంద్రంగా కనిపిస్తుంటుంది. 1991లో దీన్ని నైజీరియాకు రాజధానిగా చేశారు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు పెద్ద నగరంగా ఆవిర్భవించింది. దేశానికి మధ్యభాగంలో ఉండటంతో దీన్ని రాజధానిగా ఎంచుకున్నారు.

చిత్రం శీర్షిక కడునాలోని రిగసా ఈ రైలుకు చివరి గమ్యస్థానం.

ఇబ్బందుల్లో బస్‌స్టేషన్లు

రైలుకు ప్రజాదరణ పెరగడం బస్సులకు ఇబ్బందిగా మారింది.

బస్సు చార్జీలు రైలు టికెట్ కంటే ఆరు రెట్లు తక్కువగా ఉన్నప్పటికీ ప్రయాణికులు పెద్దగా రావడం లేదు. ఒకప్పుడు ప్రయాణికులతో కిటకిటలాడే పెద్ద పెద్ద బస్ స్టేషన్లు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి.

రైలులో ప్రయాణికులకు భద్రత కల్పించడం వల్లే బస్సుల వైపు ఎవరూ చూడటం లేదని రవాణా అధికారి ఒకరు చెప్పారు.

ఇక రహదారి గుండా ప్రైవేటు వాహనాలు, కార్లలో వెళ్లేవాళ్లు ఉదయం లేదా మధ్యాహ్నం బయలుదేరుతున్నారు. చీకటి పడేలోపు గమ్యం చేరాలనుకుంటున్నారు.

అయితే, ఈ రహదారిపై అనేక చోట్ల చెక్ పాయింట్లు పెట్టి భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు 2017లో కొంతమంది కిడ్నాపర్లను అరెస్టు చేశారు. అయినప్పటికీ భద్రత విషయంలో ప్రయాణికులు ఇంకా భయపడుతూనే ఉన్నారు.

ప్రస్తుతానికి ఈ మార్గంగుండా వెళ్లే వాళ్లకు రైలు ఓ స్వర్గధామం. నైజీరియాలోని పేదలు, ధనికులను కలిపే ఒక కేంద్రంగా ఈ రైలు మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)