టిక్ టాక్ యాప్‌తో దేశ భద్రతకు ప్రమాదమా?

  • 8 నవంబర్ 2019
టిక్ టాక్

ఈ పొట్టి వీడియోల యాప్ ఆకర్షణీయమైన సంగీతంతో మేళవించిన మీమ్స్‌ పుట్టుకకు సారవంతమైన క్షేత్రంగా మారింది. టిక్ టాక్‌ను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు యాభై కోట్ల మంది వినియోగిస్తున్నారని అంచనా. వారిలో అత్యధిక శాతం టీనేజర్లు, ఇరవైల తొలినాళ్ళలో ఉన్నవారే.

ర్యాపర్ లిల్ నాస్ ఎక్స్ తాజా పాట 'ఓల్డ్ టౌన్ రోడ్'లో మనుషులు, వారి పెంపుడు శునకాలు కౌబాయ్, కౌగర్ల్ దుస్తుల్లోకి మారిన సన్నివేశం కనిపిస్తుంది. ఆ పాట సూపర్ హిట్ కావడానికి ఈ టిక్ టాక్ దృశ్యానిదే కీలక పాత్ర అని చెబుతున్నారు.

అయితే, ఈ యాప్ చైనా యజమాని బైట్‌డాన్స్ వల్ల జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కొందరు రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నియంత్రణ అధికారులు కూడా దీనివల్ల తమ భద్రత సందేహాదాస్పందా మారిందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో టిక్‌ టాక్ యాప్ సురక్షితమేనా? దీని మీద వినిపిస్తున్న ఆందోళన టీ కప్పులో తుపాను వంటిదేనా?

ఇది ఎలా పని చేస్తుంది?

టిక్ టాక్‌లో చాలా వరకు 20 ఏళ్ళ లోపు వారు 15 సెకండ్ల వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటారు. వీటిలో ఎక్కువ శాతం పాటలకు పెదాలు సింక్ చేస్తూ కనిపించే వీడియోలే. అలాగే, కామెడీ సన్నివేశాలు, ఎడిటింగ్ ట్రిక్స్‌తో కూడిన వీడియోలు కూడా ఎక్కువగా పోస్ట్ చేస్తుంటారు.

ఈ వీడియోలు యూజర్ల ఫాలోవర్లకే కాకుండా అపరిచితులకు కూడా అందుబాటులోకి వస్తాయి. ఇందులో అన్ని అకౌంట్లు మామూలుగా పబ్లిక్‌కు అందుబాటులో ఉంటాయి. యూజర్లు తమ పోస్టులను తాము కోరుకున్న వారికే అందుబాటులో ఉండేలా చేసే అవకాశం ఉన్నప్పటికీ అలా జరగడం చాలా అరుదు.

Image copyright Reuters

ఏ యూజర్‌కు ఎలాంటి వీడియోలు ఇష్టమో అలాంటివాటిని ఎంపిక చేసి అందించే ఆల్గొరిథం ఇందులో ఉంటుంది. అవన్నీ ఒకటి తరువాత ఒకటి ఆటోమేటిగ్గా ప్లే అవుతూ ఉంటే టైమ్ ఇట్టే గడిచిపోతుంది. అసలు ఎంత సమయం ఈ యాప్‌తో గడిపామో కూడా తెలియనంతగా అందులో లీనమైపోతుంటారు. అంతేకాకుండా, మెంబర్లు తమకు కావలసిన అంశాలను కూడా ఇందులో వెతుక్కోవచ్చు. హాష్‌ట్యాగ్స్ క్లిక్ చేస్తూ కూడా బ్రౌజింగ్ చేయొచ్చు.

టిక్ టాక్ ప్రైవేట్ సందేశాలను కూడా పంపే అవకాశం కల్పిస్తోంది. కానీ, ఇది కేవలం 'ఫ్రెండ్స్'కు మాత్రమే పరిమితం.

ఈ యాప్‌ను 13 ఏళ్ళకు పైబడిన వారెవరైనా ఉపయోగించవచ్చు. ఇందులో పేరెంటల్ కంట్రోల్స్ కూడా ఉంటాయి.

టిక్ టాక్ దీర్ఘకాలిక యూజర్లు చాలా మంది మొదట Musical.ly యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. చైనాలోని ఓ స్టార్టప్ కంపెనీ ఈ లఘు-వీడియోల యాప్‌ను అభివృద్ధి చేసింది. దాన్ని బైట్‌డాన్స్ సంస్థ 2017లో కొనుగోలు చేసి రెండింటిని కలిపేసింది.

బీజింగ్‌లోని బైట్‌డాన్స్ సంస్థకు మరో యాప్ కూడా ఉంది. దానిపేరు డోయిన్ (Douyin). చైనా సెన్సార్షిప్ నిబంధనలకు లోబడి ఇది వేరే నెట్‌వర్క్‌లో నడుస్తోంది.

అయితే, ఈ కంపెనీకి వివాదాలు కొత్తేమీ కాదు. గత ఏడాది ఇది భారతదేశంలో తాత్కాలిక నిషేధాన్ని ఎదుర్కొంది. అమెరికాలోని తీవ్రవాద వ్యతిరేక దర్యాప్తు సంస్థ కూడా దీన్ని నిషేధించింది. వయోపరిమితి లేని యూజర్లు పబ్లిష్ చేసిన కంటెంట్‌ను హోస్ట్ చేసినందుకు సదరు దర్యాప్తు సంస్థ Musical.ly మీద 43 లక్షల పౌండ్ల జరిమానా విధించింది.

టిక్ టాక్ డేటాపై ఆందోళన దేనికి?

ఈ యాప్ వినియోగదారుల వ్యక్తిగత గోప్యత విషయంలో రాజీపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికాలోని విమర్శకులు అంటున్నారు.

ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న ఫేస్‌బుక్ మాజీ చీఫ్ సెక్యూరిటీ అధికారి అలెక్స్ స్టామోస్, అమెరికా-చైనాలలోని బైట్‌డాన్స్ యూజర్ల మధ్య ఘర్షణలు తలెత్తినట్లు నివేదికలు వచ్చినప్పుడు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు.

అమెరికా సెన్సార్‌షిప్ బృందంలోని మాజీ సభ్యులు కూడా చైనాలోని తమ సహోద్యోగులు కొన్ని వీడియోలను తొలగించాలని తమకు సూచించారని, అవి అమెరికా ప్రమాణాల రీత్యా అభ్యంతరకరం కానప్పటికీ తీసేయాలని చెప్పారని అన్నారు. వాషింగ్టటన్ పోస్ట్ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం వారు డిలీట్ చేసిన వీడియోలలో విపరీతమైన ముద్దులు, లైంగిక భంగిమలను గుర్తు చేసే డాన్సులు, రాజకీయ చర్చలు ఉన్నాయి.

ఆందోళన కలిగించే మరో విషయం ఏమిటంటే, దేశంలోని సోషల్ మీడియా యాప్స్ అన్నింటికీ తమకు యాక్సెస్ ఇవ్వాలని చైనా ప్రభుత్వం నిర్దేశిస్తోంది.

అయితే, ఇతర దేశాల కంటెంట్‌ను ప్రత్యేకంగా స్టోర్ చేస్తున్నామని, దాన్ని చైనా అధికారులతో షేర్ చేసుకోవడం లేదని బైట్‌డాన్స్ అంటోంది.

అమెరికా చట్ట ప్రతినిధుల అభ్యంతరాలేమిటి?

ఈ వారం మొదట్లో అమెరికా రాజకీయవేత్తలు టిక్ టాక్‌ను కాంగ్రెస్ ఎదుట విచారణకు రావాలని అన్నారు. చైనాలో ఎదుర్కొంటున్న ఆరోపణల గురించి అది వివరణ ఇవ్వాలని వారు కోరుతున్నారు.

దీనిపై ప్రభుత్వ విచారణ జరపాలనే డిమాండ్‌కు కూడా చాలా మంది సెనెటర్లు మద్దతు పలికారు.

ఆర్కాన్సాస్ సెనెటర్ టామ్ కాటన్ అయితే టిక్ టాక్ కంపెనీ కూడా 2016లో ఫేస్ బుక్, ట్విటర్‌ల లాగా విదేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేసే టార్గెట్‌తో పని చేసే అవకాశం లేకపోలేదని ఆరోపించారు.

అయితే, టిక్ టాక్ ఎలాంటి రాజకీయ ప్రకటనలు స్వీకరించదని బైట్ డాన్స్ చెబుతోంది. అయినప్పటికీ, 'సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని' ఉపయోగించుకునే మార్గాలను చైనా వెతుకుతూనే ఉంటుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

అంతేకాదు, చైనా కమ్యూనిస్టు పార్టీ ఇంటెలిజెన్స్ కార్యకలాపాలకు సహకారం అందించాలని టిక్ టాక్‌మీద ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని కూడా టామ్ కాటన్ అన్నారు.

ఈ ఆందోళనలపై టిక్ టాక్ స్పందన ఏంటి?

టిక్ టాక్‌లో 2019లో చాలా మార్పులు చేశామని బైట్‌డాన్స్ చెబుతోంది.

'అందరికీ ఒకే విధానం' అనే మార్గాన్ని అనుసరించిన టిక్ టాక్ ఇప్పుడు అమెరికాలో స్థానికంగా మార్పులు చేస్తోంది.

"మేం అత్యంత వేగంగా ఎదుగుతున్నప్పటికీ, అదే సమయంలో మా సామర్థ్యాలను మరింత పెంచుకునే ప్రయత్నాన్నీ కొనసాగిస్తున్నాం. అమెరికాలోని మా టీమ్‌ వీలైనంత స్వతంత్రంగా వ్యవహరించేలా చూస్తున్నాం" అని టిక్ టాక్ అమెరికా జనరల్ మేనేజర్ వెనెసా పాపస్ బీబీసీ న్యూస్‌తో చెప్పారు.

అంతేకాకుండా, యూజర్స్ డేటా ధర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చైనాకు వెళ్ళకుండా చూసేందుకు ఈ సంస్థ ధర్డ్ పార్టీ ఆడిటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది.

టిక్ టాక్ భవిష్యత్తేంటి?

చైనాకు చెందిన కులున్ కంపెనీ అభివృద్ధి చేసిన గే డేటింగ్ యాప్ Grindr ఎదుర్కొన్న సమస్యలు టిక్ టాక్‌కు ఒక హెచ్చరికలా కనిపిస్తున్నాయి.

అమెరికాలోని విదేశీ పెట్టుబడుల కమిటీ, Grindrను అమ్మేయాలని కులున్‌ను ఒత్తిడి చేసింది. ఫలితంగా దాన్ని 2020లో విక్రయించేందుకు కులున్ అంగీకరించింది.

జాతీయ భద్రతకు ముప్పు ఉందని భావించినప్పుడు విదేశీ కంపెనీల టేకోవర్లను ఉపసంహరించుకునేలా చేసే అధికారం అమెరికా విదేశీ పెట్టుబుల కమిటీకి ఉంది. అమెరికా సైనికుల వ్యక్తిగత సమాచారం Grindrలో చాలా ఉందని ఆ కమిటీ ప్రకటించింది.

అదే కమిటీ ఇప్పుడు Musical.ly కొనుగోలును కూడా సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. Musical.ly ప్రధాన కార్యాలయం షాంఘైలో ఉన్నప్పటికీ, దాని మరో కార్యాలయం కాలిఫోర్నియాలో ఉందనే ప్రాతిపదికన ఈ సమీక్ష జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ విషయంలో బైట్‌డాన్స్ కనుక చట్ట సభల ప్రతినిధులకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేకపోతే దానికీ Grindrకు పట్టిన గతే పట్టవచ్చు. పైగా అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైందన్న సంగతి గుర్తుంచుకోవాలి.

ఇలా జరగవచ్చు...

ఈ యాప్‌ను అమెరికా భూభాగంలో నిషేదించవచ్చు. ఈ ప్రాంతంలో టిక్ టాక్‌కు 2.65 కోట్ల నెలవారీ చురుకైన వినియోగదారులున్నారు.

టిక్ టాక్ చైనా వెలుపల ఉన్న వేరొక కంపెనీగా రూపం మార్చుకోవచ్చు.

బైట్‌డాన్స్ ఈ యాప్‌ను మరో టెక్నాలజీ సంస్థకు అమ్మేయవచ్చు.

అమెరికాలోనే కాకుండా బ్రిటన్‌లో కూడా టిక్ టాక్ భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొంటోంది.

ఈ సంస్థ చిన్న పిల్లల డేటాను ఎలా ఉపయోగిస్తోందో తెలుసుకునేందుకు పరిశోధన ప్రారంభించామని యూకే సమాచార కమిషనర్ ఎలిజబెత్ డెన్హామ్ ధ్రువీకరించారు.

అంటే, ముందు ముందు టిక్ టాక్ మీద జరుగుతున్న విచారణలపై మరిన్ని వార్తలు వెలుగు చూసే అవకాశం ఉందన్నమాట.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

డోనల్డ్ ట్రంప్: ముగిసిన రెండు రోజుల భారత పర్యటన

ఇరాన్ ఆరోగ్య శాఖ డిప్యూటీ మంత్రికి కరోనావైరస్.. స్పెయిన్‌లో వందల మందిని లోపలే ఉంచి హోటల్‌ను మూసేసిన ప్రభుత్వం

దిల్లీ హింస: ముస్లింలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో హింసకు కారకులెవరు.. ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు

BBC Indian Sportswoman of the Year 2019: విజేత ఎవరో మార్చి 8న ప్రకటిస్తాం

దిల్లీ: హింసాత్మక ఘర్షణల్లో 10కి చేరిన మృతుల సంఖ్య

కరోనా వైరస్ రోగులకు సేవలు అందిస్తున్న గర్భిణీ - ప్రభుత్వ మీడియాపై తీవ్ర విమర్శలు

మోదీ ప్రభుత్వ విజయాలపై అహ్మదాబాద్‌లో ట్రంప్ చెప్పినవన్నీ నిజాలేనా? - బీబీసీ రియాల్టీ చెక్

వీడియో: ఇళ్ల మధ్యకు వచ్చిన ఎలుగుబంటి