బెర్లిన్ గోడను ఎందుకు కూల్చేశారు?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

బెర్లిన్ గోడను ఎందుకు కూల్చేశారు? ఆ ప్రకటన వెలువడ్డాక ప్రజలు ఏంచేశారు?

  • 8 నవంబర్ 2019

తూర్పు, పశ్చిమ జర్మనీలను వేరుచేసిన బెర్లిన్ గోడ పతనం ఇరవయ్యో శతాబ్దపు కీలక ఘట్టాల్లో ఒకటి. బెర్లిన్ గోడ ఎలా పతనమైంది? నాటి పరిస్థితులేమిటి?

1980ల మధ్యలో సోవియట్ యూనియన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. కమ్యూనిస్టు ప్రభుత్వాల్లో అవినీతి, అసమర్థత పెరిగిపోయాయి. అమెరికాతో ఆయుధ పోటీ, అఫ్గానిస్థాన్లో యుద్ధం సోవియట్ యూనియన్‌కు ఆర్థికంగా నష్టం కలిగించాయి.

ఈ పరిణామాల వల్ల తూర్పు జర్మనీ, 'కమ్యూనిస్ట్ బ్లాక్'లోని ఇతర దేశాలకు దశాబ్దాలుగా అందిస్తూ వస్తున్న సాయాన్ని సోవియట్ యూనియన్ నిలిపివేయాల్సి వచ్చింది. మరోవైపు సమాజంలో అసంతృప్తి పెరుగుతూ పోయింది. దీనిని తగ్గించేందుకు సోవియట్ యూనియన్ నాయకుడు మిఖాయిల్ గోర్బచేవ్ ప్రయత్నాలు చేశారు. రాజకీయపరంగా, సామాజికంగా పారదర్శకతను పెంచేందుకు పెద్దయెత్తున చర్యలు చేపట్టారు. నాటి గోర్బచేవ్ విధానాన్నే గ్లాస్‌నోస్ట్ అంటారు.

కొత్తగా అందివచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకొని ప్రజలు ప్రభుత్వాలను విమర్శించడం పెరిగింది. ఇదే స్వేచ్ఛతో సమ్మెలు కూడా ముందెన్నడూ లేనంత తీవ్రస్థాయిలో జరిగాయి.

ఈ క్రమంలో దశాబ్దాల్లోనే తొలిసారిగా పోలండ్‌లో పాక్షికంగా స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు జరిగాయి. వేల మంది తూర్పు జర్మన్లు ఆస్ట్రియా గుండా పశ్చిమ జర్మనీలోకి ప్రవేశించేందుకు వీలుగా హంగేరీ తన సరిహద్దులు తెరిచింది.

1989 అక్టోబరులో తూర్పు జర్మనీ అధ్యక్షుడు ఎరిక్ హోనెకర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రయాణ ఆంక్షలను తొలగిస్తామని ప్రభుత్వం నవంబరు 9న హామీ ఇచ్చింది. ఎప్పుడు తొలగిస్తారని మీడియా సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధిని ఒక జర్నలిస్టు ప్రశ్నించగా, తనకు తెలిసినంతవరకు తక్షణమేనని ఆయన బదులిచ్చారు. ఈ ప్రకటన తర్వాత బెర్లిన్ వాసులు గోడను పడగొట్టడం మొదలుపెట్టారు.

ఉత్సాహంతో ఉన్న ప్రజలు సరిహద్దును దాటి పశ్చిమ జర్మనీలోకి వెళ్లడం మొదలైంది. అప్పుడు వీరి కోసం అవతల వందల మంది పశ్చిమ జర్మన్లు ఎదురుచూస్తున్నారు. బెర్లిన్ గోడతో దూరమైన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎట్టకేలకు కలుసుకున్నారు. ఆ రోజు రాత్రి అక్కడ కనిపించిన దృశ్యాల ఫొటోలు ప్రపంచం నలుమూలలకు చేరాయి.

తర్వాత ఓ నెలకు తూర్పు జర్మనీ పతనమైంది. 'కమ్యూనిస్ట్ బ్లాక్'లోని కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఒకదాని తర్వాత మరొకటి కూలిపోయాయి. 1991లో యూఎస్‌ఎస్ఆర్ పతనమైంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. తూర్పు, పశ్చిమ జర్మనీలు ఏకమయ్యాయి.

నాటి బెర్లిన్ గోడ ఆనవాళ్లు నేటికీ కనిపిస్తాయి. జర్మనీ విభజన చరిత్రను ఇవి గుర్తుకుతెస్తాయి.

బెర్లిన్ గోడ ఎందుకు నిర్మించారు?

ఈ కాంక్రీటు నిర్మాణం బెర్లిన్‌ను మాత్రమే విడదీయలేదు. పరస్పర విరుద్ధమైన రెండు సిద్ధాంతాలను దాదాపు 30 ఏళ్లు ఇది వేరుచేసింది.

రెండో ప్రపంచయుద్ధంలో విజేతలుగా నిలిచిన తర్వాత అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, సోవియట్ యూనియన్.. ఓడిపోయిన జర్మనీని విభజించాలని నిర్ణయించాయి. బెర్లిన్.. సోవియట్ యూనియన్ నియంత్రణలో ఉండిపోయింది.

రాజధాని కావడంతో బెర్లిన్‌ను కూడా విభజించారు. పశ్చిమ భాగాన్ని పెట్టుబడిదారీ దేశాలు, తూర్పు భాగాన్ని కమ్యూనిస్టులు తమ నియంత్రణలో పెట్టుకున్నారు. అప్పట్లో బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ ఒక సందర్భంలో- ఐరోపా పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, ఐరోపా ఖండం వ్యాప్తంగా ఒక ఇనుప తెర ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది.

పశ్చిమ జర్మనీలో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, తూర్పు జర్మనీలో జర్మన్ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఏర్పడ్డాయి. తూర్పు జర్మనీ పరిధిలోని బెర్లిన్ పెట్టుబడిదారీ వ్యవస్థకు నిలయంగా మారింది. కమ్యూనిస్టు పాలకులకు ఇది సమస్యగా పరిణమించింది. అమెరికా, బ్రిటన్ సీక్రెట్ సర్వీసెస్ బెర్లిన్‌ను నిఘా కేంద్రంగా చేసుకున్నాయి.

1949-1961 మధ్య 25 లక్షల మందికి పైగా ప్రజలు మెరుగైన అవకాశాల కోసం తూర్పు జర్మనీని వీడి పశ్చిమ జర్మనీకి చేరుకున్నారు. తూర్పు జర్మనీ నుంచి ఈ వలసలను అడ్డుకొనేందుకు బెర్లిన్ గోడ నిర్మించాలని కమ్యూనిస్టు పాలకులు ఆదేశించారు. 1961 ఆగస్టు 13 రాత్రి కొన్ని గంటల వ్యవధిలోనే బెర్లిన్ గోడను నిలబెట్టారు.

మూడున్నర మీటర్లకు పైగా ఎత్తైన బెర్లిన్ గోడను స్టీలు కేబుళ్లు వాడి దృఢంగా నిర్మించారు. ఐదు వేల మందికి పైగా తూర్పు బెర్లిన్ వాసులు తప్పించుకొని పశ్చిమ బెర్లిన్ చేరుకున్నారు. సరిహద్దులో చాలా మంది చనిపోయారు, లేదా అరెస్టయ్యారు. బెర్లిన్‌ను ఈ గోడ దాదాపు మూడు దశాబ్దాలు విడగొట్టింది. బెర్లిన్ గోడ పతనం ఇరవయ్యో శతాబ్దపు కీలక ఘట్టాల్లో ఒకటి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)