ఇరాన్‌లో 5,300 కోట్ల బ్యారెళ్ల నిల్వలున్న కొత్త చమురు క్షేత్రం కనుగొన్నాం - అధ్యక్షుడు రౌహానీ

  • 11 నవంబర్ 2019
ఇరాన్ Image copyright Reuters

దేశంలో ఓ భారీ చమురు క్షేత్రాన్ని కనుగొన్నట్లు ఇరాన్ ప్రకటించింది.

ఈ కొత్త క్షేత్రంతో ఇరాన్ చమురు నిక్షేపాలు దాదాపు మూడో వంతు మేర పెరుగుతాయని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ చెప్పారు.

నైరుతి ప్రాంత రాష్ట్రం ఖుజెస్తాన్లో ఈ చమురు క్షేత్రం ఉందని ఆయన తెలిపారు. ఇది సుమారు 2,400 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని, ఇందులో 5,300 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు ఉందని చెప్పారు.

బోస్తన్ నుంచి ఒమిడియేహ్ వరకు ఈ క్షేత్రం విస్తరించి ఉందని రౌహానీ యాజ్ద్ నగరంలో తెలిపారు. అక్కడ చమురు పొర 80 మీటర్ల లోతు మేర ఉందని వివరించారు.

ఈ చమురు క్షేత్రం నుంచి వెలికితీత రేటు ఒక్క శాతం పెరిగినా, చమురుపై ఇరాన్ రాబడి 3200 కోట్ల డాలర్లు పెరుగుతుందని తెలిపారు.

Image copyright EPA

అమెరికా విధించిన కఠినమైన ఆంక్షల వల్ల విదేశాల్లో చమురు విక్రయించుకోవడం ఇరాన్‌కు కష్టంగా మారింది.

వివిధ శక్తిమంతమైన దేశాలతో కలసి ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి గత ఏడాది వైదొలగిన తర్వాత అమెరికా ఈ ఆంక్షలు విధించింది. తమ ఆర్థిక వ్యవస్థ, ట్రేడింగ్, బ్యాంకింగ్, చమురు తదితర రంగాలపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తేస్తే తమ అణు కార్యకలాపాలను తగ్గించేందుకు అంగీకరిస్తూ, ఇరాన్ 2015లో ఈ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఆంక్షలను ఐక్యరాజ్య సమితి, అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) విధించాయి.

ఈ ఒప్పందం కుదరడంలో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక పాత్ర పోషించారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, చైనాలతో ఇరాన్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిని 'జాయింట్ కాంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జేసీపీవోఏ)'గా వ్యవహరిస్తారు.

Image copyright Empics
చిత్రం శీర్షిక ట్రంప్, రౌహానీ

ఒప్పందం నుంచి తప్పుకొన్న తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఇరాన్‌పై తిరిగి ఆంక్షలు విధించారు.

వీటి వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమైంది. కరెన్సీ విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. వార్షిక ద్రవ్యోల్బణ రేటు నాలుగు రెట్లు పెరిగింది. విదేశీ పెట్టుబడుదారులు దూరమయ్యారు. దేశంలో ఆందోళనలు చెలరేగాయి.

"వైట్‌హౌస్ (అమెరికా అధ్యక్ష భవనం)కు నేనో విషయం చెప్పాలనుకుంటున్నా. ఇరాన్ చమురు అమ్మకంపై ఒకవైపు మీరు ఆంక్షలు విధించగా, మరోవైపు మా కార్మికులు, ఇంజినీర్లు 5,300 కోట్ల బ్యారెళ్ల చమురు నిక్షేపాలను కనుగొన్నారు" అని రౌహానీని ఉటంకిస్తూ 'ఫార్స్' అనే వార్తాసంస్థ తెలిపింది.

ఈ కొత్త చమురు క్షేత్రం ఇరాన్లో రెండో అతిపెద్ద చమురు క్షేత్రం కాగలదని వార్తాసంస్థ ఏపీ తెలిపింది. అహ్వాజ్‌లోని 6,500 కోట్ల బ్యారెళ్ల చమురున్న క్షేత్రం దేశంలోనే అతిపెద్ద చమురు క్షేత్రమని చెప్పింది.

చిత్రం శీర్షిక నైరుతి ప్రాంత రాష్ట్రం ఖుజెస్తాన్లో ఈ చమురు క్షేత్రాన్ని గుర్తించారు.

చమురును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి. ఏటా బిలియన్ల డాలర్ల విలువైన చమురును ఇది ఎగుమతి చేస్తోంది.

ఇప్పటివరకూ దేశంలో గుర్తించిన చమురు నిక్షేపాల పరిమాణం దాదాపు 15 వేల కోట్ల బ్యారెళ్ల వరకూ ఉన్నట్లు రౌహానీ చెప్పారు.

అత్యధిక చమురు నిక్షేపాలున్న దేశాల్లో ఇరాన్ నాలుగో స్థానంలో ఉంది. గ్యాస్ నిక్షేపాల పరంగా ఇరాన్‌ది రెండో స్థానం.

పర్షియన్ గల్ఫ్‌లోని ఓ భారీ సహజ వాయువు క్షేత్రాన్ని ఖతార్‌తో కలిసి ఇరాన్ పంచుకుంటోంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు