శ్రీలంక ఎన్నికల ఫలితాలు భారత్‌తో సంబంధాల్లో మార్పు తెస్తాయా?

  • 12 నవంబర్ 2019
ఇండియా, శ్రీలంక Image copyright OLEKSII LISKONIH / GETTY

శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల బరిలో 30 మందికి పైగా అభ్యర్థులు పోటీపడుతున్నారు. కానీ ప్రధాన పోటీ మాత్రం యునైటెడ్ నేషనల్ పార్టీకి చెందిన సాజిత్ ప్రేమదాస, శ్రీలంక పోదుజన పెరామునాకు చెందిన గోటాబయా రాజపక్సల మధ్యనే నెలకొంది.

ప్రస్తుత అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పదవీకాలం మొత్తం వివాదాలతో కాంతిహీనంగా నడిచింది. ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. ఆయనకు చెందిన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ నుంచి కూడా ఎవరూ పోటీ చేయటం లేదు. ఆ పార్టీ సైద్ధాంతికంగా రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం గోటాబయా రాజపక్సకు మద్దతిస్తోంటే.. మరో వర్గం సాజిత్ ప్రేమదాసకు మద్దతు తెలుపుతోంది.

ఇంతకుముందు 2015 అధ్యక్ష ఎన్నికల సమయంలో.. అప్పటి అధ్యక్షుడు మహీంద రాజపక్స చైనాకు సన్నిహితుడని మైత్రిపాల సిరిసేన ఆరోపించారు. ఆ ఎన్నికల్లో మహీంద ఓడిపోతే చైనా విషయంలో శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మారిపోతాయా అనే చర్చ కూడా జరిగింది.

అయితే మహీంద ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. శ్రీలంకలో చైనా పెట్టుబడులు, రెండు దేశాల మధ్య సాన్నిహిత్యం కొనసాగాయి. మహీంద ఘోర ఓటమిలో భారతదేశం కీలక పాత్ర పోషించిందని ఆయన మద్దతుదారులు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో.. రాబోయే ఎన్నికలు భారత్, చైనాలతో శ్రీలంక సంబంధాల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి?

Image copyright Getty Images

''కొద్ది రోజుల కిందటి వరకూ.. రణిల్ వర్గాన్ని అమెరికా, పాశ్చాత్య శక్తుల మద్దతుదారులుగా చిత్రీకరించటానికి రాజపక్స వర్గం ప్రయత్నించింది. ఇప్పుడు అది తగ్గిపోయింది. మామూలుగా అయితే.. ఈ ఎన్నికల్లో విదేశీ వ్యవహారాల అంశం ప్రభావం పెద్దగా లేదు'' అంటున్నారు కొలంబో యూనివర్సిటీలో రాజనీతిశాస్త్రం, ప్రభుత్వ విధానం విభాగానికి చెందిన మాజీ ప్రొఫెసర్ కళానిధి ఉయాంగోడే.

శ్రీలంకకు చైనా పదేళ్ల నుంచీ ఆర్థికంగా సాయం చేస్తోంది. శ్రీలంకలో నైరుతి ప్రాంతంలోని అంబన్‌తొట్టాయ్‌ లోని మహాంపురా మహీంద రాజపక్స రేవును ఇప్పుడు పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకుంది. మహీంద రాజపక్స హయాంలో నిర్మించిన ఈ ఓడరేవుకు సైనిక పరంగా చాలా ప్రాధాన్యత ఉంది.

చైనా యుద్ధనౌకలు హిందూ మహాసముద్రంలో సంచరించటానికి ఇంధనం నింపుకోవటానికి అనువైన ప్రాంతంలో ఉందీ రేవు.

కొలంబో రేవులో ఈస్ట్రన్ కంటైనర్ టెర్మినల్ పేరుతో సరకుల రవాణా టెర్మినల్‌ను ఏర్పాటు చేయటానికి భారతదేశం శ్రీలంకతో ఒప్పందం చేసుకుంది. ఇటువంటి ప్రణాళికల విషయంలో శ్రీలంక చాలా తక్కువగానే ఆసక్తి కనబరిచింది. కొలంబో కంటైనర్ ఒప్పందం కూడా చాలా కాలం సాగదీత తర్వాతే కుదిరింది.

ఈ ఒప్పందంలో భారతదేశం పాలుపంచుకోవటం పట్ల మైత్రిపాల సిరిసేనకు పెద్దగా ఆసక్తి లేదు. ఈ విషయం మీద దేశ అధ్యక్షుడు - ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘేల మధ్య గత అక్టోబర్‌లో మంత్రివర్గ సమావేశంలోనే వాగ్వాదం జరిగింది.

జపాన్ జోక్యం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఒప్పందం మీద సంతకాలు చేశారు. కొలంబో రేవు ద్వారా అనేక సరుకులు భారతదేశానికి వస్తుండటంతో ఈ కంటైనర్ టెర్మినల్ పట్ల భారత్ ఆసక్తి చూపుతోంది.

అధికారంలోకి ఎవరు వచ్చినా వారితో జట్టుకట్టటానికి భారత్ సిద్ధంగా ఉండొచ్చు. అయితే.. తమిళుల విషయంలో రాజపక్స కుటుంబం వైఖరి, చైనాతో వారికి గల సాన్నిహిత్యం అంశాలను భారత్ గట్టిగా పట్టించుకుంటోంది.

Image copyright OLEKSII LISKONIH / GETTY

''తన పొరుగు దేశాలతో శ్రీలంక సంబంధాల్లో పెద్దగా మార్పు ఉండబోదు. ఇద్దరు అభ్యర్థులూ ఇండియా, చైనాలతో స్నేహం కావాలనే కోరుకుంటారు. ఈ రెండు దేశాలు సైతం శ్రీలంకతో జోడీ కట్టటానికి సంకోచించవు'' అని.. శ్రీలంక రాజకీయాలు, ఆర్థిక పరిస్థితుల మీద తరచుగా విశ్లేషించే ఆగిలాన్ కాతీర్కామార్ పేర్కొన్నారు. ఈ అంశానికి ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ప్రాధాన్యత ఉండదని ఆయన చెప్పారు.

అంతర్యుద్ధం తర్వాత.. శ్రీలంక విదేశీ వ్యవహారాల్లో భారతదేశానికి ప్రాధాన్యత తగ్గిందని చాలా మంది చెప్తున్నారు.

''ఆ యుద్ధం తర్వాత శ్రీలంక తమిళులు, భారతదేశం మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. భారతదేశం తమను దగా చేసిందని ఇక్కడి తమిళులు చాలా మంది భావించారు. సింహళీయులు సైతం భారతదేశాన్ని సన్నిహితంగా చూడరు.. తమకు ముప్పుగా భావిస్తారు'' అంటారు జయదేవ.

భారతదేశంతో పోలిస్తే.. శ్రీలంకలో చైనా గుట్టుచప్పుడు కాకుండా క్రమం తప్పకుండా పెట్టుబడులు పెడుతోంది. ఆ దేశానికి రుణాల వర్షం కురిపిస్తోంది. ఇందుకు శ్రీలంకలోని చాలా భవనాలు, రేవులు, హైవేలే సాక్ష్యం.

''శ్రీలంక మీద భారతదేశం తన పట్టు గత 30 ఏళ్లలో నెమ్మదిగా కోల్పోయింది. ఇండియాతో సంబంధాన్ని ఒక పెద్ద విషయంగా మాట్లాడగలమని నేను అనుకోను'' అని జయదేవ వ్యాఖ్యానించారు.

2015 ఎన్నికల్లో మహీంద ఓడిపోవటంలో భారత్ పాత్ర ఉందని ఆయన వర్గం ఆరోపించినప్పటికీ.. ఆ తర్వాత ఆయన చాలా తరచుగానే భారతదేశంలో పర్యటించారు.

Image copyright RAVEENDRAN / GETTY

''శ్రీలంకతో తన సంబంధాన్ని ఆర్థికవ్యవస్థ ప్రాతిపదికన మాత్రమే నిశ్చయిస్తుంది భారతదేశం. తమిళుల అంశం మీద ఒత్తిడి తీసుకురాదు'' అని శ్రీలంకకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ వీరకత్తి తానబాలసింగం పేర్కొన్నారు. చైనాను విస్మరించాలని ఒత్తిడి తెస్తూ తమతో సంబంధాలు కలుపుకోవాలని పట్టుపట్టే పరిస్థితిలో ఇండియా కానీ అమెరికా కానీ లేవని ఆయన అంటారు.

చైనా విషయంలో యునైటెడ్ నేషనల్ పార్టీ వైఖరి మారిందన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

''అంబన్‌తొట్టాయ్ పోర్టును చైనాకు ఇవ్వటాన్ని ఆ పార్టీ తొలుత వ్యతిరేకించింది. రణిల్ హయాంలో అదే పోర్టును చైనాకు 99 సంవత్సరాల లీజుకు ఇచ్చారు'' అని వివరించారు.

చైనా.. హిందూ మహాసముద్రంలో తన ఉనికిని పెంచుకోవటం కోసం శ్రీలంకతో తన సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. శ్రీలంకలో పెట్టుబడులు కూడా పెడుతోంది. భారతదేశం ఇటీవలి కాలం వరకూ శ్రీలంకతో తన సంబంధాలకు తమిళుల అంశాన్నే ప్రాతిపదికగా చేసుకుంది.

కొత్త అధ్యక్షుడిగా ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ.. భారత్, చైనాలతో శ్రీలంక సంబంధాలను నిర్వచించేది ఈ తేడానే.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)