జీపీఎస్: గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ పనిచేయటం ఆగిపోతే ప్రపంచం ఏమైపోతుంది?

  • 15 నవంబర్ 2019
Image copyright Getty Images

జీపీఎస్ - గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ పనిచేయటం ఆగిపోతే ప్రపంచం ఏమైపోతుంది?

ముందు మనమందరం.. ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లాలంటే మన మెదళ్లకు పని చెప్పాల్సి ఉంటుంది. మనచుట్టూ ఉన్న ప్రపంచం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

జీపీఎస్ వల్ల మన తెలివితేటలు ఎంత తెల్లారతాయనేందుకు ప్రతి ఒక్కరికీ ఒక అద్భుత ఉదాహరణలు దొరుకుతాయి. అటువంటిదే ఒక స్వీడన్ జంట అనుభవం. వాళ్లు ఇటలీ దీవి కాప్రి (Capri) వెళ్లాలనుకుని జీపీఎస్‌ను ఆశ్రయించారు. అది చూపిన దారిని పట్టుకుని వెళ్లారు. అక్కడికి వెళ్లాక సముద్రం ఎక్కడ అని అడుగుతున్నారు. కానీ.. అది కాప్రి కాదు. కార్పి (Carpi). కాప్రికి వేల మైళ్ల దూరంలో ఉంది. ఒక్క అక్షరం స్పెల్లింగ్ తప్పు వాళ్లను వేరే ప్రపంచానికి తీసుకెళ్లిందన్నమాట.

కానీ.. ఇటువంటి ఘటనలు అరుదైనవే. జీపీఎస్‌లు ఉపయోగించే పరికరాలు సాధారణంగా మనం తప్పిపోకుండా సాయం చేస్తాయి.

ఒకవేళ అది విఫలమైతే.. రోడ్ల మీద ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయే పరిస్థితి. దారిచూపే చిహ్నాలు వెదుక్కుంటూ, కాగితాల మీద మ్యాప్‌లు చూసుకుంటూ నెమ్మదిగా ప్రయాణించాల్సి వస్తుంది.

ఒకవేళ రైళ్లలో ప్రయాణిస్తున్నట్లయితే.. మీరు దిగాల్సిన స్టేషన్ ఎప్పుడు వస్తుందో చెప్పే బోర్డులూ ఉండవు.

ట్యాక్సీ కోసం ఫోన్ చేస్తే.. డ్రైవర్లకు దారులు చెప్పటానికి ఆపరేటర్ ముప్పుతిప్పలు పడాల్సివస్తుంది. ఊబర్ యాప్ ఓపెన్ చేస్తే - ఏమవుతుందో మీరే ఊహించుకోండి.

జీపీఎస్ లేకపోతే అత్యవసర సేవల్లో తీవ్ర ఇబ్బందులు మొదలవుతాయి. ఫోన్ చేస్తున్న వారు ఎక్కడి నుంచి చేస్తున్నారనేది వారి ఫోన్ సిగ్నల్ ద్వారా గుర్తించలేరు. అలా గుర్తిస్తే కానీ వారికి దగ్గర్లో ఉన్న అంబులెన్స్ లేదా పోలీస్ కార్‌ను గుర్తించి వేగంగా పంపించగలరు.

జీపీఎస్ Image copyright Getty Images

ఓడరేవుల్లో పనులు నత్తనడకన సాగుతాయి. ఓడల్లోని సరకులను దించాలంటే కంటైనర్ క్రేన్లకు కూడా జీపీఎస్ పనిచేయాల్సిందే.

సరకులు సూపర్ మార్కెట్లకు సమయానికి చేరవు. ఫ్యాక్టరీలకు అవసరమైన ముడిసరకులు కూడా గడువులోగా అందవు. వాటిలో పనులు నిలిచిపోతాయి.

జీపీఎస్ పనిచేయటం ఆగిపోతే మొదటి ఐదు రోజుల పాటు రోజుకు 100 కోట్ల డాలర్ల చొప్పున నష్టం వాటిల్లుతుందని బ్రిటన్ ప్రభుత్వ నివేదిక ఒకటి అంచనా వేసింది. అందులో వ్యవసాయం, నిర్మాణం, చేపల వేట, సర్వే రంగాలు కూడా ఉన్నాయి.

జీపీఎస్ నిలిచిపోయి ఐదు రోజులు మించి పోతే.. దాని మీద ఆధారపడి పనిచేసే అనేక వ్యవస్థలు, రంగాలు, పరిశ్రమలు కుప్పకూలే పరిస్థితులు తలెత్తుతాయి.

అంతేకాదు.. జీపీఎస్ అనేది ఒక సమయ పాలన సేవ కూడా.

జీపీఎస్‌లో 24 శాటిలైట్లు ఉంటాయి. వీటన్నిటిలో అత్యంత ఖచ్చితత్వంతో సమకాలికంగా ఉండే గడియారాలు ఉంటాయి.

ఒక మ్యాప్‌లో మనం ఎక్కడ ఉన్నామనేది గుర్తించటానికి మన స్మార్ట్‌ఫోన్ జీపీఎస్‌ను వాడినపుడు.. అది ఈ 24 శాటిలైట్లలో కొన్నిటి నుంచి సిగ్నల్స్‌ అందుకుంటూ - ఆ సిగ్నల్స్ పంపిన సమయం - ఆ శాటిలైట్ ఉన్న స్థలం ప్రాతిపదికగా లెక్కలు వేస్తుంది.

ఈ శాటిలైట్లలోని గడియారాలు ఒక సెకనులో వెయ్యో వంతు అటూ ఇటూ అయినా.. స్మార్ట్‌ఫోన్‌లో జీపీఎస్ మనం ఉన్న చోటును 200 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల దూరంగా తప్పుగా చూపుతుంది.

అంటే.. సమయం గురించి అత్యంత ఖచ్చితమైన సమాచారం కావాలంటే జీపీఎస్ అనేది సరైన మార్గమన్నమాట.

జీపీఎస్ ఆవిష్కర్తలు రిచర్డ్ ష్వార్జ్, బ్రాడ్ పార్కిన్సన్, జేమ్స్ స్పిల్కర్ జూనియర్, హ్యూగో ఫ్రూహాఫ్‌ Image copyright LAYTON THOMPSON
చిత్రం శీర్షిక జీపీఎస్ ఆవిష్కర్తలు రిచర్డ్ ష్వార్జ్, బ్రాడ్ పార్కిన్సన్, జేమ్స్ స్పిల్కర్ జూనియర్, హ్యూగో ఫ్రూహాఫ్‌లకు ఇంజనీరింగ్‌లో క్వీన్ ఎలిజబెత్ పురస్కారం లభించింది

మన ఫోన్ నెట్‌వర్క్‌లను చూడండి: మన ఫోన్ కాల్స్ - మల్టీ ప్లెక్సింగ్ అనే టెక్నిక్ ద్వారా ఇతర కాల్స్‌తో పాటు స్థలాన్ని పంచుకుంటాయి. మన కాల్స్ డాటా మీద ఒక సమయం ముద్ర పడుతుంది - డాటా విడిపోతుంది - అది చేరాల్సిన గమ్యంలో మళ్లీ ఏకమవుతుంది.

ఒక సెకనులో లక్షో వంతు తేడా వచ్చినా అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. బ్యాంక్ చెల్లింపులు, స్టాక్ మార్కెట్లు, విద్యుత్ గ్రిడ్లు, డిజిటల్ టెలివిజన్లు, క్లౌడ్ కంప్యూటింగ్ - అన్నీ ఈ సమయానికి అనుగుణంగా ఉండే వేర్వేరు లొకేషన్ల మీద ఆధారపడి ఉంటాయి.

ఒకవేళ జీపీఎస్ విఫలమైతే - వీటన్నిటికీ సంబంధించిన బ్యాకప్ వ్యవస్థలు ఎంత బాగా పనిచేస్తాయి? ఎంత విస్తృతంగా పనిచేస్తాయి? ఎంత కాలం పనిచేస్తాయి?

దీనికి జవాబు నిజంగా ఎవరికీ తెలిసినట్లు కనిపించదు.

జీపీఎస్ అనేదానిని కొన్నిసార్లు 'అదృశ్య ఉపయోగం' అని అభివర్ణించటంలో ఆశ్చర్యమేమీ లేదు.

దీని విలువను డబ్బుల్లో లెక్కకట్టటం దాదాపు అసాధ్యంగా మారింది. ఇది.. గ్రెగ్ మిల్నర్ అనే రచయిత 'పిన్‌పాయింట్: హౌ జీపీఎస్ ఈజ్ చేంజింగ్ అవర్ వరల్డ్' అనే పుస్తకంలో చెప్పినట్లు.. ''మానవ శ్వాస వ్యవస్థకు ఆక్సిజన్ విలువ ఎంత?'' అనే ప్రశ్న లాంటిది.

జీపీఎస్‌ ఆవిష్కరణ కథ అద్భుతమైనది. దీనిని మొదట ఆవిష్కరించినపుడు.. జనం మీద బాంబులు వేయటానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి తొలుత అమెరికా సైన్యం మద్దతు లభించింది. ఇది తనకు అవసరమవుతుందని ఖచ్చితంగా నిర్ధారించుకోకపోయినా కూడా అమెరికా సైన్యం దీనికి మద్దతు ఇచ్చింది. అప్పుడు.. ''నేను ఎక్కడున్నానో నాకు తెలుసు. నేను ఎక్కడున్నానో నాకు చెప్పటానికి శాటిలైట్ అవసరం ఏముంది?'' అన్న సమాధానం వచ్చేది.

మొట్టమొదటి జీపీఎస్ శాటిలైట్‌ను 1978లో నింగిలోకి పంపించారు. కానీ.. 1990లో మొదటి గల్ఫ్ యుద్ధం నాటికి గానీ తొలి సందేహాలు తీరలేదు.

అమెరికా సైన్యం Image copyright Getty Images
చిత్రం శీర్షిక గల్ఫ్ యుద్ధ సమయంలో మిత్రపక్షాల సైన్యానికి జీపీఎస్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడింది

'ఆపరేషన్ డెజర్ట్ స్టామ్' నిజంగా ఎడారి తుపానులో చిక్కుకున్నపుడు.. సుడులు తిరుగుతున్న ఇసుక వల్ల చూడగలిగే దూరం ఐదు మీటర్లు (16 అడుగులు)కు తగ్గిపోయినపుడు.. మందుపాతరలు ఎక్కడ ఉన్నాయో గుర్తించగలగటానికి, నీటి వనరులు ఎక్కడున్నాయో తెలుసుకోవటానికి, ఒకరికొకరు అడ్డుపడకుండా నిరోధించటానికి - సైనికులకు జీపీఎస్ సాయపడింది.

అది ప్రాణాలను నిజంగా కాపాడింది. అప్పుడు సైన్యం దగ్గర చాలా తక్కువ రిసీవర్లే ఉండటంతో అందరికీ సరఫరా చేసే పరిస్థితి లేదు. దీంతో సైనికులు అమెరికాలోని తమ కుటుంబ సభ్యులను సంప్రదించి.. మార్కెట్‌లో దాదాపు 1,000 డాలర్ల ధరతో అందుబాటులో ఉన్న జీపీఎస్ డివైజ్‌లను కొని తమకు పంపించాలని చెప్పేవారు.

జీపీఎస్ వల్ల సైన్యానికి పైచేయి లభిస్తున్నట్లయితే.. ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించటం పట్ల అమెరికా సాయుధ బలగాలు ఎందుకు సంతోషిస్తున్నాయనేది ఆశ్చర్యం కలిగించవచ్చు. నిజం ఏమిటంటే.. వాళ్లు సంతోషంగా లేరు. పైగా మిగతా వాళ్లు వాడకుండా వారు చేయగలిగిందీ పెద్దగా లేకపోయింది.

శాటిలైట్లు రెండు సిగ్నల్స్ పంపించేలా చేయటానికి వారు ప్రయత్నించారు. అంటే.. తమ సొంత ఉపయోగానికి ఖచ్చితమైన సిగ్నల్ ఒకటి - పౌరులకు గందరగోళపరిచే అస్పష్ట సిగ్నల్స్ ఒకటి పంపించేలా చేయాలని చూశారు.

కానీ.. ఈ అస్పష్ట సగ్నల్స్ నుంచే మరింత ఖచ్చితత్వం పొందటమెలా అనే దానికి కంపెనీలు తెలివైన మార్గాలు కనుగొన్నాయి. వీటితో లభించే ఆర్థికాభివృద్ధి అంతకంతకూ స్పష్టమవుతూ వచ్చింది.

ఇక జరిగి తీరాల్సిన దానికి 2000 సంవత్సరంలో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తలవంచారు. ఉన్నతస్థాయి జీపీఎస్ సిగ్నల్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చారు.

జీపీఎస్ కొనసాగేలా చూడటానికి అమెరికా ప్రజలు ఏటా దాదాపు 100 కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నారు. అది చాలా దాతృత్వమనే అనాలి. కానీ.. మిగతా ప్రపంచం దీని మీద ఆధారపడటం కొనసాగించటం తెలివైన పనే అవుతుందా?

చైనా ‘బీడో’ Image copyright Getty Images
చిత్రం శీర్షిక చైనా తన సొంత నావిగేషన్ సిస్టమ్ ‘బీడో’ను వేగంగా విస్తరిస్తోంది.. 2018లోనే 10 కన్నా ఎక్కువ శాటిలైట్లను పంపించింది

నిజానికి.. ప్రపంచంలో ఉన్న శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ జీపీఎస్ ఒక్కటే కాదు.

రష్యాకు చెందిన శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ఒకటి ఉంది. దానిని 'గ్లోనాస్' అంటారు. కాకపోతే అది జీపీఎస్ అంత నాణ్యమైనది కాదు. ఇక చైనాకు, యూరోపియన్ యూనియన్‌కు కూడా వాటికంటూ సొంత ఆధునిక ప్రాజెక్టులు ఉన్నాయి.

చైనా శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌ పేరు 'బీడో' అయితే.. ఈయూ నావిగేషన్ సిస్టమ్ పేరు 'గెలీలియో'. జపాన్, ఇండియాలు కూడా తమ సొంత శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌లను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి.

జీపీఎస్‌కు నిర్దిష్టమైన సమస్యల నుంచి గట్టెక్కటానికి ఈ ప్రాత్యామ్నాయ శాటిలైట్లు సాయపడొచ్చు. కానీ.. భవిష్యత్తులో తలెత్తగల యుద్ధాల్లో ఇవి సైనిక లక్ష్యాలుగా మారే అవకాశమూ ఉంది. అందరినీ ఆఫ్‌లైన్‌లో పడేసే అంతరిక్ష యుద్ధాన్ని ఊహించండి. ఓ పెద్ద సౌర తుపానుతో కూడా ఈ శాటిలైట్లన్నీ దెబ్బతినే అవకాశమూ ఉంది.

శాటిలైట్ నావిగేషన్‌కు ప్రత్యామ్నాయంగా భూమి మీద నుంచే సిగ్నల్స్ అందుకుని పంపించే నావిగేషన్లు కూడా ఉన్నాయి. అందులో ప్రధానమైనది 'ఈలోరాన్'. కానీ ఇది ప్రపంచం మొత్తాన్నీ కవర్ చేయటంలేదు. కొన్ని దేశాలు తమ సొంత వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవటం మీదే ఎక్కువ కృషి చేస్తున్నాయి.

'ఈలోరాన్'లో ఒక ముఖ్యమైన ఆకర్షణ ఏమిటంటే.. దాని సిగ్నల్స్ చాలా బలంగా ఉంటాయి. జీపీఎస్ సిగ్నల్స్ 20,000 కిలోమీటర్లు ప్రయాణించి భూమికి చేరేటప్పటికి అవి చాలా బలహీనంగా మారిపోతాయి. కాస్త సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన వారికి వాటిని అడ్డుకోవటం, గందరగోళ పరచటం చాలా సులభమవుతుంది.

బెన్ గురియాన్ విమానాశ్రయం Image copyright Getty Images
చిత్రం శీర్షిక బెన్ గురియాన్ విమానాశ్రయంలో జీపీఎస్ సిగ్నల్స్‌లో అవరోధాల వెనుక రష్యా హస్తం ఉందన్న ఇజ్రాయెల్ ఆరోపణలను రష్యా తిరస్కరించింది

ఈ విషయాల గురించి ఆలోచించటానికి జీతాలు తీసుకునే నిపుణులు మాత్రం.. ఈ అంత్యకాల దృశ్యాల గురించి - అన్నీ ఆఫ్‌లైన్‌లోకి వచ్చేసే రోజు గురించి - పెద్దగా ఆందోళన చెందరు. కానీ.. ఎవరైనా ఉగ్రవాదులు కానీ, ఏవైనా దేశాలు కానీ.. ఏదైనా ఒక ప్రాంతంలోని జీపీఎస్ రిసీవర్లకు తప్పుడు సిగ్నల్స్ పంపించటం ద్వారా పెను విధ్వంసం సృష్టించగలిగే అవకాశాల గురించే వీళ్లు ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు.

స్పూఫింగ్ (తప్పుడు సిగ్నల్స్‌ను పంపించటం) ద్వారా డ్రోన్లను కూల్చివేయవచ్చునని, సూపర్ యాచ్‌లను దారిమళ్లించవచ్చునని ఇంజనీరింగ్ ప్రొఫెసర్ టాడ్ హంఫ్రేస్ ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. దండగులు సాంకేతిక దాడులతో విద్యుత్ గ్రిడ్లను పేల్చివేయటానికి, మొబైల్ నెట్‌వర్క్‌లను దెబ్బతీయటానికి, స్టాక్ మార్కెట్లను కూల్చివేయటానికి వీలుందని ఆయన ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

నిజం ఏమిటంటే.. జీపీఎస్ సిగ్నల్స్‌ను తారుమారు చేయటం ద్వారా ఎంత నష్టం జరుగుతుందనేది అంచనా వేయటం కష్టం.

అయితే.. కాప్రి వెళ్లాలనుకుని కార్పిలో తేలిన ఆ స్వీడన్ జంటను అడగండి. మనం తప్పిపోయామని మనకు తెలిసి ఉండటం ఒక పరిస్థితి. కానీ.. మనం ఎక్కడున్నామో మనకు నిజంగా తెలుసునని నమ్ముతుండటం పూర్తిగా భిన్నమైన సమస్య.

రచయిత ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికలో 'అండర్‌కవర్ ఎకానమిస్ట్' శీర్షికన వ్యాసాలు రాస్తుంటారు. 'ఆధునిక ఆర్థికవ్యవస్థలో 50 మూలస్తంభాలు' కార్యక్రమం బీబీసీ వరల్డ్ సర్వీస్‌లో ప్రసారమైంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: జీపీఎస్‌ లేనప్పుడు దారి వెదికేందుకు ఏం వాడేవాళ్లో తెలుసా?

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

LIVE హైదరాబాద్ రేప్ ఎన్‌కౌంటర్: ఒకవైపు హర్షాతిరేకాలు.. మరోవైపు అనాగరికం అంటూ విమర్శలు

సజ్జనార్: అప్పుడు, ఇప్పుడు ఈయనే...

'దిశ' తల్లి: 'నా బిడ్డ కూడా ఒక చెల్లిలాంటిదేనని వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే...'

'దిశ' నిందితుల ఎన్‌కౌంటర్... కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది?

దిశ అత్యాచారం, హత్య: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు... నలుగురు అరెస్ట్

ప్రెస్‌రివ్యూ: అత్త,మామల సంరక్షణ బాధ్యత విస్మరిస్తే అల్లుళ్లు, కోడళ్లకూ జైలు, జరిమానా

గద్దర్: ‘తెలంగాణ ప్రభుత్వంలో టెంపరరీ పోస్టుకు అప్లికేషన్ పెట్టుకున్నాను’

అత్యాచార కేసు విచారణకు వెళ్తున్న బాధితురాలికి నిప్పు పెట్టిన దుండగులు... మృత్యువుతో పోరాడుతున్న యూపీ మహిళ