ఇజ్రాయెల్-గాజా యుద్ధం: ఇటు రాకెట్ లాంచర్లు, అటు వైమానిక దాడులు

  • 14 నవంబర్ 2019
ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన ఓ ఇల్లు Image copyright AFP
చిత్రం శీర్షిక ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన ఓ ఇల్లు

గాజాలోని మిలిటెంట్లు, ఇజ్రాయెల్ మధ్య సరిహద్దుల్లో యుద్ధం భీకరంగా సాగుతోంది. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ కమాండర్ మరణం తరువాత రెండో రోజూ యుద్ధం కొనసాగుతోంది.

గాజాలోని మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై రాకెట్ లాంచర్లతో దాడులు చేస్తుండగా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది.

ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు చిన్నారులు సహా 23 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజాలోని హమాస్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మరోవైపు హమాస్ మిలిటెంట్ల దాడుల్లో ఇజ్రాయెల్‌లో 63 మంది గాయపడి చికిత్స తీసుకుంటున్నారు.

బుధవారం సాయంత్రం పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్(పీఐజే) కాల్పుల విరమణకు ప్రతిపాదించింది. కానీ, ఈ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ వైపు నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు.

Image copyright AFP
చిత్రం శీర్షిక రాకెట్ దాడులు

తాజా పరిస్థితులేమిటి?

ఆరు గంటల కాల్పుల విరామం తరువాత గురువారం(14.11.2019) ఉదయం 6.30 నుంచి(స్థానిక కాలమానం) పీఐజే కాల్పులు ప్రారంభించింది. మంగళవారం నుంచి కనీసం 360 రాకెట్లను ఇజ్రాయెల్‌పైకి కాల్చారు. వాటిలో 90 శాతం రాకెట్లను తాము ధ్వంసం చేశామంటూ ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది.

దక్షిణ ఇజ్రాయెల్2లోని అష్కెలాన్ నగరంలోని ఓ ఇంటిపై రాకెట్ లాంఛర్ పడడడంతో వృద్ధురాలు ఒకరు గాయపడ్డారు. మరో కర్మాగారం కూడా పాక్షికంగా ధ్వంసమైనట్లు చెబుతున్నారు.

పీఐజే దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఉన్న మిలటరీ హెడ్ క్వార్టర్స్, వార్ హెడ్స్ తయారు చేసే భారీ కర్మాగారం సహా అనేక లక్ష్యాలపై ఐడీఎఫ్ దాడులు చేసింది.

''మా దాడుల్లో 20 మంది ఉగ్రవాదులు మరణించార''ని ఐడీఎఫ్ వర్గాలు ప్రకటించాయి.

మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు చిన్నారులు సహా 23 మంది మరణించారని హమాస్ ప్రభుత్వంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరణించినవారిలో హమాస్ సైనిక విభాగం అల్ ఖుద్స్ బ్రిగడ్స్‌కు చెందిన ఫీల్డ్ కమాండర్ ఖలీద్ ఫరాజ్ సహా మరికొందరు మరణించినట్లు ధ్రువీకరించింది.

ఈ ఉద్రిక్తతలు ప్రమాదకరమంటూ ఐరాస మధ్యప్రాచ్య శాంతి దూత నికోలాయ్ మ్లెదనోవ్ అన్నారు.

''రెండు రోజు యుద్ధం వల్ల లక్షలాది మంది చిన్నారులు నష్టపోయారు. దక్షిణ ఇజ్రాయెల్, గాజాల్లో స్కూళ్లు మూతపడ్డాయి'' అన్నారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ ట్యాంకర్లు

మంగళవారం ఎక్కడ మొదలైంది

గాజా తూర్పు ప్రాంతంలోని ఓ భవనంపై మంగళవారం వేకువన ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో పీఐజే మిలటరీ కమాండర్ బహా అబుల్ అల్ అటా, ఆయన భార్య మరణించారు.

అదేసమయంలో సిరియాలోని డమాస్కస్‌లో ఇరాన్ మద్దతు ఉన్న ఓ మిలిటెండ్ గ్రూప్‌కు చెందిన నేత ఇంటిపైనా ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసింది. ఆ దాడిలో ఇద్దరు మరణించారు.

బహా అబుల్ అల్ అటా తమ దేశానికి ముప్పని, ఆయనో కరడుగట్టిన ఉగ్రవాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.

ఇటీవల గాజా నుంచి ఇజ్రాయెల్‌పై ప్రయోగిస్తున్న రాకెట్ దాడుల వెనుక ఉన్నది అబుల్ అల్ అటాయేనని అనుమానిస్తున్నారు.

అయితే, గాజాలోని మిలిటెంట్లు మాత్రం ఇజ్రాయెల్ హద్దులు దాటిందని.. 200కిపైగా రాకెట్ దాడులు చేసిందని ఆరోపిస్తున్నారు.

Image copyright Reuters

ఎవరేమంటున్నారు?

హమాస్‌తో సంబంధాలున్న వార్తా సంస్థ షెహాబ్‌తో పీఐజే అధికార ప్రతినిధి ముసాబ్ అల్ బురాయిమ్ మాట్లాడుతూ.. అబుల్ అల్ అటా హత్యకు ప్రతీకారంగా మేం దాడులు చేయడం పూర్తయ్యాక శాంతి గురించి మాట్లాడుకోవచ్చన్నారు.

మరోవైపు బుధవారం ప్రత్యేక కేబినెట్ మీటింగ్‌లో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు పీఐజేకు వార్నింగ్ ఇచ్చారు. రాకెట్ దాడులు ఆపకపోతే గాజాపై తమ దాడులు ఆగవని చెప్పారు.

అంతకుముందు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ జిల్బర్మన్ ఇజ్రాయెల్ మీడియాతో మాట్లాడుతూ రాకెట్ దాడులను ఎదుర్కొనేందుకు గాను మరిన్ని ఇరాన్ డోమ్‌లు వినియోగిస్తున్నట్లు చెప్పారు.

ఈ యుద్ధంలోకి ఇంకా హమాస్ వచ్చినట్లు లేదని.. హమాస్ కనుక ఎంటరైతే యుద్ధం మరింత తీవ్రమవుతందని బీబీసీకి చెందిన బార్బరా ప్లెట్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)