మయన్మార్: 'దెయ్యాలను 12 ట్రక్కుల్లో మూడు రోజుల పాటు మరో చోటుకు తరలించాం'

  • 15 నవంబర్ 2019
మయన్మార్ Image copyright Keith Levit/Alamy

''దెయ్యాలకు సన్నిహితంగా ఉండే వూపీ గోల్డ్‌బర్గ్ లాంటి వాళ్లు కొంత మంది ఉన్నారు. వీళ్లు మామూలు మనుషులే. కానీ, వీళ్లకో ప్రత్యేక శక్తి ఉంటుంది. ఆత్మలు ఇక కదిలి వెళ్లాల్సిన సమయం వచ్చిందని ఆ ఆత్మలకు వీళ్లు చెప్పగలరు'' అని చెప్పాడు కెప్టెన్ ఆంగ్ ఖాంట్.

ఆయన బర్మా ఆర్మీలో పనిచేస్తుంటాడు. వయసు నాలుగు పదులు దాటింది. సైనిక దుస్తుల్లో ఉన్నాడు. గులాబీ రంగు ప్లాస్టిక్ చైర్‌లో విశ్రాంతిగా కూర్చుని ఉన్నాడు. మేము అప్పుడే కలిశాం. ఆయనను చూడగానే చాలా ఆసక్తికరంగా కనిపించాడు.

సిగరెట్ బయటకు తీసి, తాను చెప్పిన విషయం మీద నా స్పందనను అంచనా వేస్తూ నవ్వాడు. ఆయన ''వూపీ గోల్డ్‌బర్గ్'' అంటున్నాడంటే.. 'ఘోస్ట్' సినిమాకు అభిమాని అని అర్థమవటానికి నాకు ఒక క్షణం సమయం పట్టింది.

అది మయన్మార్ రాజధాని నగరం నే పీ టా. చనిపోయిన వారి ఆత్మలను వేరే చోటుకు తరలించే ఏర్పాట్ల గురించి కెప్టెన్ ఖాంట్‌తో మాట్లాడటానికి వచ్చాను నేను.

అవును... ఆత్మలను తరలించటం - ప్రాచీన బర్మా ఆధ్యాత్మిక విశ్వాసాలు ప్రాతిపదికగా ఆచరించే ఒక సంప్రదాయం.

నే పీ టా - అంటే అర్థం 'రాజుల నెలవు'. మయన్మార్‌లోని మిగతా నగరాలకు చాలా భిన్నమైనది. చాలా విస్తారమైన నగరం. కానీ నివసించే జనం చాలా తక్కువ. రోడ్ల మీద ట్రాఫిక్ కనిపించదు.

నే పీ టా అనేది ఓ 'దయ్యాల నగరం' అని తరచుగా అభివర్ణిస్తుంటారు. కానీ స్థానికుల విశ్వాసం ప్రకారం.. ఇది దెయ్యాల నగరమే. కానీ, ఇందులో దెయ్యాలు లేవు.

Image copyright Getty Images

మయన్మార్ రాజధానిని 2006లో యాంగాన్ నుంచి కొత్తగా నిర్మించిన నే పీ టాకు అధికారికంగా తరలించారు. దీనికి రాజకీయ ఆవశ్యకతతో పాటు జోస్యుల సలహా కూడా కారణం.

సముద్రానికి దగ్గరగా ఉన్న యాంగాన్‌ ఆక్రమణకు గరయ్యే ప్రమాదం ఉందన్న భయం ఒకటైతే.. రాజధానిని మార్చకపోతే 'మీ పాలన కూలిపోతుంద'ని మాజీ బర్మా రాజ్యాధినేత థాన్ ష్వేను జోస్యులు హెచ్చరించటం మరొక కారణం.

యాంగాన్‌ను ఇప్పటికీ వలసపాలన గతానికి చెందిన 'దెయ్యాలు' వెంటాడుతున్నాయి. అలా కాకుండా.. నే పీ టాను శుభ్రం చేయాలని తలచారు.

అందుకే నేను ఈ కెప్టెన్‌తో మాట్లాడటానికి వచ్చాను. ఇక్కడున్న చాలా పట్టణ ఆవాసాలను కలుపుతూ నే పీ టా నగరాన్ని నిర్మించారు. అలాంటి ఒక పట్టణ ఆవాసం టాట్కాన్‌. ఈ స్థలంలో ఒక బౌద్ధారామాన్ని, జిల్లా కోర్టుకు కొత్త భవనాన్ని నిర్మించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. అందుకోసం ముందుగా ఇక్కడున్న స్మశానాన్ని తరలించాల్సి ఉంది. ఆ పనిని 2010లో ఈ కెప్టెన్‌కు అప్పగించారు.

మయన్మార్‌లో శ్మశానాల తరలింపులు వివాదాస్పదంగా మారుతుంటాయి. మృతుల బంధువుల్లో... తమ వారి సమాధులను తొలగించటం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతుంటుంది. కానీ, అర్థ శతాబ్దం పాటు కొనసాగిన మయన్మార్ సైనిక పాలన ముగియటానికి ఒక ఏడాది ముందు ఈ పని చేపట్టారు. కాబట్టి, తమ వారి సమాధులను తరలించటం పట్ల టాట్కాన్ నివాసుల్లో అసంతృప్తి ఉన్నాకూడా ఎవరూ నిరసన తెలపలేదు.

''అప్పుడు మేం సైనిక పాలనలో ఉన్నాం. నిజంగా ప్రతిఘటించలేం కదా'' అని టాట్కాన్ నివాసి ఒకరు.

Image copyright Xinhua/Alamy

కానీ, ఈ శ్మశానాన్ని తొలగించటంలో వేరే ప్రమాదం కూడా పొంచివుంది. ఈ స్మశానంతో పాటు.. అక్కడ నివసించే దెయ్యాలను కూడా తరలించాలి మరి. టాట్కాన్ శ్మశాన నివాసులతో చాలా ఇబ్బందులున్నాయి.

రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ సైనికులను సమాధి చేయటానికి టాట్కాన్‌ను ఉపయోగించుకున్నారని మయన్మార్ మత పరిశోధకుడు బెనెడక్ట్ బ్రాక్ డి లా పెరీర్ నాకు చెప్పారు. బర్మీయుల విశ్వాసంలో ''హింసాత్మకంగా చనిపోయినవారి ఆత్మలు పూర్తిగా విడుదల కావు''.

కాబట్టి, టాట్కాన్‌లోన ఈ స్మశానాన్ని తొలగించటం రిస్కీ వ్యవహారం. ''ఈ దెయ్యాలంటే మాకు భయం. ఇక్కడి నుంచి కదలటం ఇష్టం లేకపోతే వాటికి కోపం వస్తుంది. పట్టణంలోని ప్రజలకు ప్రమాదకరంగా మారతాయి'' అని చెప్పారు కెప్టెన్.

ఈ శ్మశానంలోని మానవ అస్థిపంజరాలను నగర శివార్లకు వెలుపల గల కొత్త స్మశానానికి ఎలా తరలించామనేది ఆయన నాకు వివరించారు. ఆ తర్వాత నవ్వారు. ''సమాధులను తరలించిన తర్వాత.. ఈ దెయ్యాలను తరలించటానికి ప్రభుత్వం ట్రక్కులను అద్దెకు తీసుకుంది. దీనిని పర్యవేక్షించటానికి.. దెయ్యాలను ట్రక్కుల్లోకి ఎక్కించటానికి ఒక నాట్సాయా (ఆత్మల నిపుణుడు)ని నియమించింది. మొత్తం 12 ట్రక్కులు రోజుకు మూడు సార్లు చొప్పున మూడు రోజుల పాటు ఆత్మలను తరలించాయి'' అని తెలిపారు.

ఈ సంఖ్య యాధృచ్ఛికం కాదని నాకు అనుమానం వచ్చింది. ఆ ట్రక్కులు మొత్తం 108 పర్యాయాలు తిరిగాయి. ఇది బౌద్ధ సంఖ్యాజ్యోతిష్యంలో పవిత్రమైన సంఖ్య. ఉదాహరణకు.. బుద్ధుడి పాదముద్రలను సంప్రదాయంగా 108 పవిత్ర చిహ్నాలతో గుర్తిస్తారు.

''మొత్తం 1,000 పైగా సమాధులను తరలించాం. అంటే.. ఒక్కో ట్రక్కులో 10, అంతకన్నా ఎక్కువ దయ్యాలు ఉన్నాయన్నమాట'' అని కెప్టెన్ పేర్కొన్నారు.

ఒక ట్రక్కులో ఎన్ని దెయ్యాలు పడతాయనేది నాకు తెలియదు. అయితే, బర్మా దెయ్యాలు సన్నగా తేలిక రకం మాత్రం కాదు. వాటిని చూడగలిగేవాళ్లు చెప్తున్నదాని ప్రకారం... రెండు మీటర్ల కన్నా ఎక్కువ పొడవుంటాయి. భారీగా భీకరంగా ఉంటాయి. పెద్ద చెవులు, కోరలు ఉంటాయి. భీతిగొలిపే పొడవాటి నాలుకలు ఉంటాయి. ప్రయాణించేటపుడు వాటిని నియంత్రించటం కష్టం... గొడవ గొడవ చేస్తాయి.

Image copyright Nico Adriaan Kelder/Alamy

ఇటువంటి కథలు సాధారణమేనని బార్క్ డె లా పెరీర్ నాతో చెప్పారు. 1990ల్లో ఆమె పరిశోధన చేస్తున్నపుడు.. యాంగాన్‌లో శ్మశానాలను తొలగించటం గురించి ఈ తరహా కథలు తానూ విన్నానని తెలిపారు. దెయ్యాలు ఇంజన్లలో సమస్యలు సృష్టించాయని, ట్రక్కులు వాటికవే ఆగిపోవటం, కదలటం జరిగిందని, డ్రైవర్లను భయపెట్టాయని... చనిపోయినవారు తమను తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ఇలా చేశారనే కథనాలు వినిపించాయని వివరించారు.

నే పీ టాలో దెయ్యాలు ముందు సీటులో కూర్చుని ప్రయాణించే ప్రత్యేక అవకాశం కోసం దయ్యాలు ఎలా పోట్లాడుకున్నాయనేది ఈ కెప్టెన్ చెప్పాడు. వాటి గొడవ మరీ ఎక్కువైనపుడు నాట్సాయా జోక్యం చేసుకుని.. వాటిని ట్రక్కు వెనుక వైపు ఎక్కాలని ఆదేశించేవాడని తెలిపాడు. ''ట్రక్కులు నిండిపోయినపుడు... వాటిని కదిలించటం కష్టమయ్యేది. మెత్తటి నేలలో దిగబడిపోయేవి. దెయ్యాలు చాలా బరువుగా ఉంటాయి'' అని చెప్పాడు.

మూడు రోజుల తర్వాత తరలింపు పూర్తయింది. కానీ, అంతా సాఫీగా సాగలేదు. తరలింపు ముగిసిన రోజు రాత్రి.. ఈ కెప్టెన్ సహాయకుడికి ఒక కల వచ్చింది. అందులో మూడు దెయ్యాలు కనిపించాయి. తమను ఇక్కడే వదిలివేశారని, తరలించలేదని అతడితో చెప్పాయి.

మరుసటి ఉదయం... శ్మశానానికి వెళ్లి చూసిన కెప్టెన్‌కు మూడు సమాధులు కనిపించాయి. అయితే, ఒక దెయ్యం అక్కడి నుంచి కదలటానికి ఒప్పుకోలేదు. అది వెళ్లి కెప్టెన్ అసిస్టెంట్ కారులో తిష్ఠవేసింది. చిన్న చిన్న సమస్యలు సృష్టించింది. నిర్మాణ పనుల్లో ఉన్న బుల్‌డోజర్లు పాడైపోయాయి. నే పీ టా అభివృద్ధి కమిటీ గృహ సముదాయంలో నివసించే ఒక పిల్లి అకస్మాత్తుగా చనిపోయింది. కెప్టెన్ అసిస్టెంట్‌ తనను రాత్రి పూట దయ్యాల చేతులు మంచం మీద నుంచి తోసేసేవని చెప్పాడు. చివరికి ఒక బౌద్ధ భిక్షువును పిలిపించి బౌద్ధ మంత్రాలను పఠింపచేసినతర్వాత కానీ ఆ దెయ్యం శాంతించలేదు.

దెయ్యాల తరలింపులో పాలుపంచుకున్న నాట్సాయా ఇప్పుడు ఎక్కడున్నారో ఈ కెప్టెన్‌కు తెలీదు. కానీ.. ఆ సామూహిక దెయ్యాల తరలింపును వీక్షించిన మరో నాట్సాయా తనకు తెలుసునని నా ట్రాన్స్‌లేటర్ చెప్పాడు. నేను ఈ కెప్టెన్‌కు కృతజ్ఞతలు చెప్పి కరచాలనం చేశాను. ఆయనలో తన విధిని బాగా పూర్తిచేశానన్న సంతృప్తి నాకు కనిపించింది.

Image copyright Paula Bronstein/Getty Images

మరుసటి రోజు.. ఉ నేన్ లా ష్వే మా హోటల్‌కి వచ్చాడు. వయసు ఆరు పదుల చివర్లో ఉంటుంది. జుట్టు నెరిసిపోయింది. తెల్లటి చొక్కా తొడుక్కున్నాడు. నీటుటా లుంగీ కట్టుకున్నాడు. ఆయన కూడా ఒక నాట్సాయా. జ్యోతిష్యుడిగా, ఆత్మల మధ్యవర్తిగా పనిచేశాడు. ''చూడడమే నమ్మడం'' అనేది అతడి వ్యాపార నినాదం. అది తనకు ఒక కలలో వచ్చిందని చెప్పాడు.

నే పీ టా స్మశానాలు ఆయనకు బాగా తెలుసు. వీటిలో మధ్యవర్తిత్వం చేయటం తనకు అలవాటైన పని అని చెప్పాడు. శవపేటికను తీసుకెళ్లే ఆత్మ మా ఫే వాకు తాను భక్తుడినన్నాడు. ఆమె తరచుగా తన దగ్గరికి వచ్చి తనకు ఏం కావాలని అడుగుతుందని చెప్పాడు. తమ ఇద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయన్నాడు.

''ఆమె మొత్తం అందరికీ అధిపతి. మయన్మార్‌లో శ్మశాన ఆత్మలన్నిటికీ ఇన్‌చార్జ్ ఆమే. ఆమె చాలా శుభ్రంగా అందంగా ఉంటుంది'' అని చెప్పాడు.

టాట్కాన్‌లో దెయ్యాల తరలింపును లా ష్వే వీక్షించాడు. ఆత్మలు ట్రక్కుల మీద గుంపులుగా ఎక్కటం చూశాడు. వాటి బరువుకు ట్రక్కు చక్రాలు ఇసుకలో దిగబడిపోవటం చూశాడు. కొన్ని దయ్యాలను దిగిపోవాలని ఆ తతంగాన్ని పర్యవేక్షిస్తున్న నాట్సాయా ఆదేశించిన తర్వాత ఆ ట్రక్కులు మళ్లీ ఎలా కదిలాయో కూడా చూశాడు.

''శ్మశానంలో ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. దానిని అర్థం చేసుకోవటానికి నాట్సాయా సేవలు అవసరం. ఇటు బతికివున్న వారి ప్రపంచం - అటు చనిపోయిన వారి ప్రపంచం మధ్య తిరగగలిగేది ఆత్మల మధ్యవర్తి మాత్రమే'' అని చెప్పాడు. తద్వారా - బార్క్ డి లా పెరీర్ చెప్పినట్లు - హింసాత్మకంగా చనిపోయిన వారికి 'కొంత పరిహారం' అందించగలిగేదీ వీరే.

నే పీ టా లో నా చివరి రోజున నేను ఒక మోటార్‌బైక్ అద్దెకు తీసుకుని నగర పర్యటనకు బయలుదేరాను. నిర్మానుష్యంగా ఉన్న ఎనిమిది లేన్ల హైవే మీద దూసుకుపోయాను. ఎప్పుడో కానీ ఒక కారు నా వెనుక నుంచి వచ్చి ముందుకు వెళ్లిపోయేది. ఎక్కువగా ఆ భారీ రహదారి మీద నేను ఒంటరిగానే ఉన్నాను. కొన్ని గంటల పాటు ప్రయాణించాను. మధ్యలో పగోడాలు, ఆలయాల దగ్గర ఆగాను. చీకటిపడ్డ తర్వాత వెనుదిరిగాను.

హోటల్‌ ఇంకా పది కిలోమీటర్ల దూరంలో ఉందనగా... నా బైక్‌లో పెట్రోల్ తక్కువగా ఉన్నట్లు గుర్తించాను. సూర్యాస్తమయం తర్వాత నే పీ టా ఖాళీ వీధుల్లో ఏదో తెలియని భయం ఆవరిస్తుంది. ఇప్పటివరకూ ఆత్మలు, దయ్యాల గురించి మాట్లాడిన నేపథ్యంలో - ఈ నిర్మానుష్య వీధిలో బైక్ ఆగిపోతే ఎలా అన్న భయం ఒక్క క్షణం పాటు నన్ను వణికించింది. ఈ ఖాళీ హైవే మీద చల్లటి గాలి తగులుతూ ఉంటే.. నేను ఒంటరిగా బైక్‌ను తోసుకుంటూ వెళుతున్న దృశ్యాన్ని ఊహించుకున్నాను. నా ఒళ్లు చల్లబడిపోయింది.

కానీ, వెంటనే నాకు నేను గుర్తు చేసుకున్నాను. అంతా బాగుందని - అంతా బాగుండేలా కెప్టెన్ ఆంగ్ ఖాంట్ చేశారని. దెయ్యాలు లేని ఈ దెయ్యాల నగరంలో భయపడటానికి ఏమీ లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)