ప్లాస్టిక్ కాలుష్యం.. గడ్డిపరకలతో అంతం.. రైతులకు అదనపు ఆదాయం - ఎండుగడ్డి, మొక్కజొన్న కాడలతో ట్రేల తయారీపై పరిశోధనలు

  • 14 నవంబర్ 2019
గడ్డితో ట్రేలు Image copyright BANGOR UNIVERSITY
చిత్రం శీర్షిక ఎండుగడ్డి, మొక్కజొన్న కాడలతో ఈ ట్రేలను తయారు చేశారు

గడ్డి, ఎండుగడ్డి, మొక్కజొన్న కాడలను.. ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా ప్యాకేజీలకు వాడవచ్చునని శాస్త్రవేత్తలు చెప్పారు.

పంట కోతల తర్వాత మిగిలిపోయే గడ్డీగాదంతో.. పండ్లు, కూరగాయలు, గుడ్లను ప్యాక్ చేయటానికి ట్రేలు తయారు చేయటానికి యూకేలోని బాంగోర్ యూనివర్సిటీ పరిశోధకులు కృషి చేస్తున్నారు.

ఈ పరిశోధన వల్ల ఉగాండా వంటి ఆఫ్రికా దేశాల రైతులకు అదనపు ఆదాయం కూడా అందించగలదని వీరు చెప్తున్నారు.

గడ్డిపరకలతో ట్రేలు తయారు చేసే పని ఆంగ్లిసీలోని మోనాలో జరుగుతోంది.

మొక్కల కాడలను పిండిచేసి.. ఇప్పటికే సూపర్‌మార్కెట్లలో ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ ట్రేల వంటి చిన్నపాటి ట్రేలను తయారు చేస్తున్నారు.

''వ్యవసాయ పంటల్లో మిగిలిపోయిన వాటిని ఉపయోగించుకునే మార్గాల మీద మేం ఇప్పటికే చాలా కాలంగా పనిచేస్తున్నాం'' అని డాక్టర్ ఆడమ్ చార్లటన్ చెప్పారు.

బ్రిటన్‌లో గోధుమ గడ్డి లేదా ఎండుగడ్డి కానీ, ఉగాండా నుంచి మొక్కజొన్న గడ్డి కానీ.. దేనినైనా ఇందుకోసం ఉపయోగించవచ్చునని తెలిపారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఆహారాన్ని ప్యాకేజీ చేయటానికి ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని సూపర్‌మార్కెట్లు ప్రయత్నిస్తున్నాయి

ఈ గడ్డి పదార్థాలు భూమిలో జీర్ణమవుతాయని.. వీటిని ఇప్పటికే రైతులు భారీగా ఉత్పత్తి చేస్తున్నారని పేర్కొన్నారు.

''వీటిని (గడ్డిని) జంతువులకు ఆహారంగా వినియోగిస్తున్నప్పటికీ.. ఇటువంటి ప్రత్యామ్నాయాలకు కొంత మేర మళ్లించటానికి సరిపోయేంత ఉత్పత్తి ఉంది'' అంటారు డాక్టర్ చార్లటన్.

''రైతులు ప్రస్తుతం ఉపయోగించని పదార్థాలకు ఈ పరిశోధన విలువను చేకూర్చగలదు. సింగిల్ యూజ్ (ఒకసారి వాడి పారవేసే) ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాల కోసం బ్రిటన్ సూపర్‌మార్కెట్ రిటైలర్లు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు'' అని వివరించారు.

మొక్కజొన్న గడ్డి వ్యర్థాలను ఆహారాన్ని ప్యాకేజ్ చేయటానికి ఉపయోగించే మార్గాలపై ఉగాండాలోని మాకెరీర్ యూనివర్సిటీ విద్యావేత్తలు కూడా బాంగోర్ శాస్త్రవేత్తలతో కలిసి పనిచేస్తున్నారు.

దేశంలో ఉత్పత్తి అవుతున్న పండ్లు, కూరగాయలకు తగినంత రక్షణ లేకపోవటం వల్ల మార్కెట్‌ను చేరటానికి ముందే 30 నుంచి 40 శాతం వృథా అవుతున్నాయని వారి అంచనా.

బాంగోర్ యూనివర్సిటీ పరిశోధన ద్వారా ఇప్పటికే గుడ్లు నిల్వచేసే పెట్టెలను గడ్డితో తయారుచేశారు. వీటిని వెయిట్‌రోజ్ సూపర్‌మార్కెట్ ఉపయోగిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)