చైనా: అతిపెద్ద డంప్ యార్డ్ పాతికేళ్ల ముందే నిండిపోయింది

  • 17 నవంబర్ 2019
చెత్త Image copyright Getty Images
చిత్రం శీర్షిక హాంగ్జూలోని ఓ డంప్ యార్డ్

చైనాలోనే అతిపెద్ద డంప్ యార్డ్ అనుకున్న దాని కన్నా 25 ఏళ్ల ముందే నిండిపోయింది.

షాంగ్జీ ప్రావిన్స్‌ జియాన్ నగరంలోని జియాంగ్సున్‌గౌ డంప్ యార్డ్ దాదాపు వంద ఫుట్‌బాల్ మైదానాలకు సమానమైన విస్తీర్ణంలో ఉంటుంది.

రోజుకు 2,500 టన్నుల చెత్తను వేసేందుకు అనువుగా దీనిని డిజైన్ చేశారు. కానీ సగటున రోజుకు పది వేల టన్నుల చెత్త వచ్చి చేరింది. చైనాలో మరే డంప్ యార్డ్‌లోనూ ఇంత పెద్దయెత్తున చెత్త పడలేదు.

140 కోట్లకు పైగా జనాభా ఉన్న చైనా, ప్రపంచంలోనే అత్యధికంగా చెత్త పోగుపడే దేశాల్లో ఒకటి.

జియాంగ్సున్‌గౌ డంప్ యార్డ్ 1994లో ఏర్పాటైంది. దీనిని 2044 వరకు వినియోగించాలని చైనా అప్పట్లో ప్రణాళికలు చేసుకొంది.

దాదాపు ఏడు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 150 మీటర్ల లోతున నిర్మించిన ఈ డంప్ యార్డ్ నిల్వ సామర్థ్యం 34 మిలియన్ క్యూబిక్ మీటర్లు. 80 లక్షల మందికి పైగా ప్రజల 'చెత్త' అవసరాలకు దీనిని ఉద్దేశించారు.

ఇటీవలి వరకు- ఇళ్లల్లో ఉత్పత్తయ్యే చెత్తను వదిలించుకొనేందుకు దానిని భూమిలో పడేసే ఒకే ఒక్క విధానాన్ని అనుసరిస్తూ వచ్చిన కొన్ని చైనా నగరాల్లో జియాన్ ఒకటి. ఈ డంప్ యార్డ్ త్వరగా నిండటానికి ఇదో కారణం.

చైనా ఈ నెల్లోనే చెత్తను శుద్ధి చేసే ఒక ప్లాంటును ప్రారంభించింది. 2020 నాటికి ఇలాంటి ప్లాంట్లు మరో నాలుగు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ ప్లాంట్లు అన్నీ కలిసి రోజుకు 12,750 టన్నుల చెత్తను శుద్ధిచేయగలవని భావిస్తున్నారు.

భూమిని తవ్వి ఏర్పాటు చేసే డంప్ యార్డుల సంఖ్యను తగ్గించుకోవాలనే జాతీయస్థాయి ప్రణాళికలో భాగంగా చైనా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది.

జియాన్ నగరంలోని డంప్ యార్డ్ ఇక ‘ఎకలాజికల్ పార్క్’గా మారనుంది.

చైనాలో చెత్త సమస్య

2017లో సేకరించిన చెత్త

ఆధారం: నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్

ఎంత చెత్త ఉత్పత్తి అవుతోంది?

అధికారిక గణాంకాల ప్రకారం, ఒక్క 2017లోనే చైనాలోని పట్టణ ప్రాంతాల్లో 21.5 కోట్ల టన్నుల చెత్త (ఇళ్లల్లో ఉత్పత్తయ్యేది) సేకరించారు. అది అంతకు పదేళ్ల కిందటితో పోలిస్తే 15.2 కోట్ల టన్నులు ఎక్కువ.

దేశవ్యాప్తంగా 654 డంప్ యార్డులు, 286 చెత్త శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి.

అయితే, అంత భారీగా పోగవుతున్న చెత్తలో ఎంతమేరకు రీసైక్లింగ్ చేస్తున్నారన్న వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. ఒక అధికారిక నివేదిక ప్రకారం, 2020 నాటికి దేశంలోని ప్రధాన నగరాలలో ఉత్పత్తి అయ్యే చెత్తలో 35 శాతం రీసైక్లింగ్ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరం షాంఘై

తడి, పొడి చెత్తను వేరు చేయడాన్ని... రీసైక్లింగ్ చేయడాన్ని షాంఘైలో ఈ ఏడాది జులై నుంచి తప్పనిసరి చేశారు.

ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యధిక జనాభా కలిగిన నగరం షాంఘై. ఈ నగర జనాభా 2.4 కోట్లకు పైనే ఉంటుంది.

షాంఘైలో ఉత్పత్తయ్యే చెత్తలో 10 శాతం మాత్రమే రీసైక్లింగ్ అవుతోంది. రోజూ దాదాపు 24,000 టన్నులకు పైగా చెత్తను సేకరిస్తుండగా, అందులో 3,300 టన్నుల చెత్త మాత్రమే రీసైక్లింగ్ చేయగలిగింది ఉంటోందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

2015లో దక్షిణాది నగరం షెంజెన్‌లో భారీ చెత్త కుప్ప నుంచి పెళ్లలు విరిగిపడిన ప్రమాదంలో 73 మంది ప్రాణాలు కోల్పోయారు.

గరిష్ఠంగా 95 మీటర్ల ఎత్తుతో 40 లక్షల క్యూబిక్ మీటర్ల పరిధిలో చెత్తను డంప్ చేసేందుకు ఆ యార్డును రూపొందించారు. కానీ, అది కూలిపోయినప్పుడు, 58 లక్షల క్యూబిక్ మీటర్ల చెత్తతో 160 మీటర్ల ఎత్తు ఉంది.

Image copyright Getty Images

దిగుమతిపై నిషేధం

గతంలో చైనాకు ఇతర దేశాల నుంచి చెత్త దిగుమతి అవుతుండేది. కానీ, 2017 చివర్లో 24 రకాల చెత్త దిగుమతిపై చైనా నిషేధం విధించింది. దాంతో, ఇప్పుడు ఇతర దేశాల నుంచి చెత్త దిగుమతి ఆగిపోయింది.

ఆ నిషేధం అమలులోకి వచ్చే నాటికి ఒక్క 2017లోనే యూరప్, జపాన్, అమెరికాల నుంచి 70 లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్తను, 2.7 కోట్ల టన్నుల పాత కాగితాన్ని చైనా దిగుమతి చేసుకుంది.

వీటిలో కొన్నింటిని మలేసియా, టర్కీ, ఫిలిప్పీన్స్, ఇండోనేసియా వంటివి కూడా వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. కానీ, నిర్వహణ లోపాలు, సమస్యల కారణంగా ఇప్పుడు వీటిలో కొన్ని దేశాలు కొన్ని రకాల చెత్త దిగుమతులను నిలిపివేశాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE: హైదరాబాద్ ‘ఎన్‌కౌంటర్‌’పై హైకోర్టులో కేసు: ‘సోమవారం దాకా నిందితులకు అంత్యక్రియలు చేయొద్దు.. మృతదేహాలను భద్రపరచండి’

INDvsWI: మొదటి టీ20లో భారత్ విజయం.. కోహ్లీ 94 నాటౌట్

పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు

నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్

స్మృతి ఇరానీపై లోక్‌సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీల ‘దౌర్జన్యం’ చేశారన్న బీజేపీ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి.. ఎందుకు చేస్తారు

సజ్జనార్ ప్రెస్ మీట్: 'చట్టం తన పని తాను చేసింది'

'దిశ' నిందితుల ‘ఎన్‌కౌంటర్’... కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది?