గోటాబయ రాజపక్ష: "ఆయన విజయంతో భారత్-శ్రీలంక సంబంధాలు మారవు.. పీవీ హయాం నుంచి ఉన్నట్లే ఉంటాయి"- ఎన్.‌రామ్

  • 18 నవంబర్ 2019
భారత్, శ్రీలంక పతాకాలు Image copyright OLEKSII LISKONIH / GETTY IMAGES

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష శ్రీలంక పొదుజన పెరమున(ఎస్‌ఎల్‌పీపీ) అభ్యర్థి గోటాబయా రాజపక్ష విజయం నేపథ్యంలో, శ్రీలంకలో మైనారిటీల పరిస్థితి, భారత్-శ్రీలంక సంబంధాల మీద ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం, ఇతర అంశాలపై ప్రముఖ జర్నలిస్టు, 'ద హిందూ' గ్రూప్ చైర్మన్ ఎన్‌.‌రామ్‌ను బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. ముఖ్యాంశాలు ఇవీ...

బీబీసీ: ఈ ఎన్నికల ఫలితాలు ఏం సూచిస్తున్నాయి?

రామ్: గోటాబయ రాజపక్ష ఎన్నికల్లో మెజారిటీ సాధించారు. శ్రీలంకలో విజయానికి 50 శాతం ఓట్లు చాలు. గోటాబయ అంతకంటే ఎక్కువ ఓట్లే సాధించారు. దీనిని అంగీకరించాల్సి ఉంది. శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో అత్యధిక ఓటర్లు గోటాబయ ప్రత్యర్థి సాజిత్ ప్రేమదాసకు ఓటు వేసినప్పటికీ, శ్రీలంక మొత్తమ్మీద చూస్తే ఓటర్లు గోటాబయా పక్షాన నిలిచారు. గోటాబయా విజయంలో ఆయన సోదరుడు, మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్ష కీలక భూమిక పోషించారు.

గోటాబయ మార్పును తీసుకురాగలరేమో చూడాలి. అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికార పరిధి, పార్లమెంటు అధికార పరిధి విషయంలో ఘర్షణ నెలకొని ఉంది. దీనిని ఆయన ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది.

Image copyright Twitter/@GotabayaR

బీబీసీ: ఉత్తర, తూర్పు ప్రాంతాల్లోని మైనారిటీలు అత్యధికంగా సాజిత్ ప్రేమదాసకు ఓటేశారు. ఫలితాలు వారి ఓటింగ్‌కు విరుద్ధంగా ఉన్నాయి. దీనిపై మీరేమంటారు?

రామ్: ఎన్నికల ఫలితాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. తమిళ నాయకులు ఇప్పటికే గోటాబయకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. అధికార పంపిణీకి కొత్త అధ్యక్షుడు ఒప్పుకొంటారా, లేదా అనేదే అతిపెద్ద ప్రశ్న. కేవలం అధికార పంపిణీ సరిపోదని తమిళులు చెబుతున్నారు. అధికార పంపిణీ కష్టమైన విషయం కావొచ్చని చరిత్ర చెబుతోంది. ఇప్పుడో కొత్త అవకాశం ఏర్పడింది. తమిళులు తమ అభ్యర్థనలను ముందుకు తీసుకురావాలి. అవసరమైతే తమ వ్యతిరేకతనూ వ్యక్తంచేయాలి.

ఎల్‌టీటీఈ టైగర్లు ఉన్నప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పట్లో హింస పెద్దయెత్తున చోటుచేసుకొనేది. ఇప్పుడు తమిళులు అహింసా విధానంలో వారి నిరసనను తెలియజేసి, అవకాశాలను దక్కించుకోవాలి.

చిత్రం శీర్షిక ఎన్‌.రామ్

బీబీసీ: తనకు ఓటేయని మైనారిటీల విషయంలో కొత్త అధ్యక్షుడు ఎలా వ్యవహరించే అవకాశముంది?

ఎన్నికల్లో గెలుపోటములు సాధారణం. తాము మద్దతు ఇచ్చిన పార్టీ విజయం సాధించలేదని తమిళలు నిరాశ చెంది ఉండొచ్చు. కానీ వారు ఫలితాన్ని అంగీకరించి, తమ విజ్ఞప్తులను కొత్త అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లాలి.

దేశంలో అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికార పరిధి అనేది మరో ముఖ్యమైన అంశం. అధ్యక్షుడికి ఎక్కువ అధికారాలు ఉంటే ప్రజాస్వామ్య విధానాలను ఆయన పాటించరు. అమెరికాలో ఇదే జరుగుతోంది. నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం వల్ల శ్రీలంకలో పార్లమెంటుకూ అధికారాలు ఉన్నాయి. ఈ అధికారాన్ని, పార్లమెంటు చేసే చట్టాలను గోటాబయ గౌరవిస్తారని ఆశిస్తున్నా.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక గోటాబయ రాజపక్ష

బీబీసీ: ఈ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో యునైటెడ్ నేషనల్ పార్టీకి చెందిన ప్రధాని రణిల్ విక్రమ సింఘే, శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందిన చంద్రికా కుమారతుంగల భవిష్యత్తు ఏమిటి?

రామ్: శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. మహింద రాజపక్ష నాయకత్వంలోని శ్రీలంక పొదుజన పెరుమున(ఎస్‌ఎల్‌పీపీ)నే శ్రీలంకలో నిజమైన ఫ్రీడమ్ పార్టీ. ఈ రెండు పార్టీలు కలిస్తే రెండు పార్టీలూ బలపడతాయి.

శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ నిబంధనల ప్రకారం- అధ్యక్షుడే విపక్ష నాయకుడు అవుతారు. ఫ్రీడమ్ పార్టీ సారథిగా ఉన్న మైత్రిపాల సిరిసేన రాజకీయాల నుంచి రిటైర్ కావాల్సి ఉంది.

రణిల్ విక్రమసింఘేకు తనదైన రాజకీయ స్థాయి ఉంది. ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యతిరేకత దేశమంతా ఉన్నప్పటికీ దక్షిణాదిలో ఎక్కువగా కనిపిస్తోంది.

పార్లమెంటరీ ఎన్నికల తర్వాత మహింద పక్షం గెలిస్తే, రణిల్ విక్రమసింఘే ప్రతిపక్ష నాయకుడు అవుతారు. ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక ఉత్తర, తూర్పు ప్రాంతాల్లోని మైనారిటీలు అత్యధికంగా సాజిత్ ప్రేమదాసకు ఓటేశారు.

బీబీసీ: గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ రచన ప్రక్రియ మొదలైంది. అది మధ్యలో ఆగిపోయింది. ఈ విషయంలో ఇప్పుడేం జరుగుతుంది?

రామ్: గత ప్రభుత్వంలోనూ దానిని మధ్యలోనే వదిలేశారు. ఇప్పుడు కూడా దానిని అలాగే వదిలేస్తారని అనుకొంటున్నా.

బీబీసీ: మహింద రాజపక్ష ప్రభుత్వం చైనాతో చాలా సన్నిహితంగా మెలిగిందనే భావన ఉంది. ఇప్పుడు గోటబయ రాజపక్ష విజయం నేపథ్యంలో, భారత్-శ్రీలంక సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

రామ్: శ్రీలంక పూర్తిగా చైనా పక్షాన ఉందనే భావన అతిశయోక్తితో కూడినది. అందులో వాస్తవం లేదు. గోటబయ ఎప్పుడూ భారత్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. అందువల్ల ఆయన అధ్యక్ష పీఠమెక్కాక భారత్-శ్రీలంక సంబంధాల్లో మార్పు రాదు. ఎప్పుడూ ఉండే సంబంధాలే కొనసాగుతాయి.

రాజీవ్ గాంధీ హత్య తర్వాతి నుంచి శ్రీలంక ప్రభుత్వంతో భారత్ ఎప్పుడూ సన్నిహిత సంబంధాలను నెరపుతోంది. పీవీ నరసింహారావు హయాం నుంచి ప్రధానిగా ఎవరున్నా ఈ విధానం ఎలాంటి మార్పులూ లేకుండా కొనసాగుతోంది. అందువల్ల గోటబయ అధ్యక్షుడైన తర్వాత కూడా పరిస్థితులు మారవు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)