మెక్సికో: ఒక్క ఏడాదిలో 30 వేల హత్యలు... ఈ బీభత్సానికి కారణం ఎవరు?

  • 19 నవంబర్ 2019
హత్య, ముఠా Image copyright Getty Images

ఉత్తర మెక్సికోలో డ్రగ్ మాఫియా ముఠా ఇటీవల జరిపిన ఆకస్మిక దాడిలో తొమ్మిది మంది అమెరికా పౌరులు (ముగ్గురు మహిళలు, ఆరుగురు పిల్లలు) ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు అక్టోబర్‌లో కులియాకన్ పట్టణాన్ని దిగ్బంధించి, పోలీసులపై దాడి చేసి డ్రగ్ ముఠా బీభత్సం సృష్టించింది.

మెక్సికోలో అనేక ఏళ్లుగా డ్రగ్ మాఫియా సాగిస్తున్న హింసకు ఈ ఘటనలు చిన్న ఉదాహరణలు మాత్రమే.

మరి, మెక్సికోలో హింస ఇంత విచ్చలవిడిగా ఎలా విస్తరించింది? ఇక్కడ రోడ్లపై సామాన్యులు తిరగడం ఎంత ప్రమాదకరం?

మెక్సికోలో నరహత్యలు

Source: National Institute of Statistics and Geography (Inegi)

హత్యల రేటు ఎలా ఉంది?

మెక్సికోలో కొన్ని నెలలుగా హత్యల రేటు భారీగా పెరుగుతోంది.

ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం, హత్యల రేటు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో 19వ స్థానంలో మెక్సికో ఉంది. ఈ దేశంలో హత్యల రేటు ప్రతి లక్ష మందికి 24.8గా ఉంది.

2014 నుంచి ఇక్కడ హత్యల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2007లో జరిగిన హత్యల సంఖ్యతో పోలిస్తే, 2018లో నాలుగు రెట్లకు పైగా వ్యక్తులు హత్యకు గురయ్యారు.

ఒక్క 2017లోనే దాదాపు 30 వేల హత్యలు జరిగాయి. 2019లో సెప్టెంబర్ వరకు నమోదైన హత్యల సంఖ్య, గత ఏడాది హత్యల సంఖ్యను మించిపోతుందని అంచనా.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionమెక్సికో: డ్రగ్స్, హత్యా నేరాలతో ముదురుతున్న సంక్షోభం

అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలేవి?

కొలిమా, బాజా కాలిఫోర్నియా, చిహ్వాహువా, గ్వెర్రెరో రాష్ట్రాలలో హింస అత్యధికంగా ఉందని మెక్సికో అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

ప్రత్యేకించి ముఠాల మధ్య ఆధిపత్య పోరు, పట్టు కోసం డ్రగ్ మాఫియా యత్నించే ప్రాంతాలలోనే హింసాత్మక దాడులు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.

అయితే, ముఠాల ప్రభావం లేని ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన యుకాటాన్‌లో హత్యల రేటు ప్రతి లక్ష మంది జనాభాకు మూడు మాత్రమే. అది థాయిలాండ్ కంటే తక్కువే.

క్యాంపెచె, కోవాహుయిలా, ఆగ్వాస్కేలియెంటెస్ ప్రాంతాలలోనూ నరహత్యల రేటు దేశ సగటు కంటే తక్కువగా ఉంది.

హత్యల రేటు ఏ దేశంలో ఎలా ఉంది?

2017 గణాంకాలు, వెనెజ్వేలా (2016)
Source: UN Global Study on Homicide

ఈ హింసకు మూలం ఏంటి?

అమెరికాకు దక్షిణాన మెక్సికో ఉంది. ఈ సరిహద్దు నుంచి డ్రగ్స్ ముఠాలు దశాబ్దాలుగా స్మగ్లింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మెక్సికో నుంచి కొకైన్, హెరాయిన్, గంజాయి, మెథాంఫెటమైన్ లాంటి మాదక ద్రవ్యాలను అక్రమ డ్రగ్స్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌‌గా ఉన్న అమెరికాకు తరలిస్తున్నాయి.

ఈ ముఠాలు మాదకద్రవ్యాల స్మగ్లింగ్ మాత్రమే కాదు, దోపిడీలు, అపహరణలు, మనీ లాండరింగ్, మనుషుల అక్రమ రవాణా, సుపారీ హత్యల లాంటి కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నాయి.

ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించే కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి.

ఈ ముఠాలు తమ అక్రమ దందాకు అడ్డంకులు లేకుండా చూసేందుకు భద్రతా బలగాలకు లంచాలు ముట్టజెప్పడం, రాజకీయ నాయకులతో చేతులు కలపడం, మాట వినకుంటే బెదిరింపులకు పాల్పడం లాంటివి చేస్తుంటాయి.

అక్రమ దందా సాగించే మార్గాలపై ఆధిపత్యం కోసం ముఠాల మధ్య పోరు నడుస్తుంటుంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. ప్రత్యర్థి ముఠాలకు చెందినవారిని చంపి వంతెనలకు వేలాడదీయడం, భయాందోళనలకు గురిచేసేందుకు తలలు నరికివేయడం లాంటి కిరాతకమైన చర్యలకు కూడా పాల్పడుతుంటారు.

గత కొన్నేళ్లలో కొన్ని శక్తిమంతమైన ముఠాల నాయకులను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. కొందరిని హతమార్చాయి. అయినా, నేరాల సంఖ్య తగ్గలేదు. పైగా, తమ ఆధిపత్యాన్ని చూపించి ఖాళీ అయిన నాయకత్వ స్థానాలను కైవసం చేసుకునేందుకు మాఠా సభ్యులు మరింత ఎక్కువ హింసాత్మక దాడులకు పాల్పడుతున్నారు.

Image copyright Reuters

ప్రభుత్వం ఏం చేస్తోంది?

2006 డిసెంబర్‌లో అప్పటి దేశ అధ్యక్షుడు ఫెలిప్ కాల్డెరాన్ 'డ్రగ్స్ మీద యుద్ధం' ప్రకటించారు. అందుకోసం 50,000 మంది సైనికులను, పోలీసు సిబ్బందిని మోహరించారు. ఆయన, అధికారంలో ఉన్న ఆరేళ్లలో డ్రగ్స్‌కు సంబంధించిన హింసలో 60,000 మంది చనిపోయారు. వాస్తవ సంఖ్య అంతకంటే ఎక్కువే ఉండొచ్చని చాలామంది అంచనా వేశారు.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్రిక్ పెనా నీటో ఈ హింస మూలాలను ధ్వంసం చేస్తామని ప్రకటించారు. డ్రగ్ ముఠా నాయకుడు, ప్రపంచంలోనే అత్యంత పేరుమోసిన నేరస్తుడిగా భావించే 61 ఏళ్ల ఎల్ చాపో గజ్మన్‌ను 2016లో భద్రతా బలగాలు పట్టుకున్నాయి. మెక్సికో అతడిని అమెరికాకు అప్పగించింది. అయినా, అతని ముఠా కార్యకలాపాలు ఆగలేదు.

భద్రతా బలగాల నిర్బంధంలో ఉన్న ఎల్ చాపో కొడుకు ఒవిడియో గజ్మన్‌ను విడుదల చేయాలంటూ అతని ముఠా సభ్యులు కులియాకాన్ పట్టణంలో భద్రతా బలగాలను చుట్టుముట్టి బీభత్సం సృష్టించారు. దాంతో, అతడిని మెక్సికో ప్రభుత్వం విడుదల చేసింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: మేకల్ని నరికినట్లు మనుషుల్ని నరికేస్తున్నారు

అతడి విడుదలను ప్రస్తుత దేశాధ్యక్షుడు అండ్రూ మాన్యుయెల్ లోపేజ్ సమర్థించుకున్నారు. అతడిని విడుదల చేయడం ద్వారా రక్తపాతాన్ని ఆపగలిగామని ఆయన అన్నారు.

కానీ, ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శకులు తప్పుబట్టారు. ముఠా బెదిరింపులకు తలొగ్గి ప్రభుత్వం ఒక పేరుమోసిన నేరగాడిని విడుదల చేయడం ద్వారా మున్ముందు ఇలాంటి ముఠాలు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంటుందని వారు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

"తెలంగాణలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి": ఆదివాసీ హక్కుల పోరాట సమితి

అత్యాచారం చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడేలా చట్టం చేస్తాం: వైఎస్ జగన్

ఒలింపిక్స్‌తో సహా ప్రధాన క్రీడల ఈవెంట్లలో పాల్గొనకుండా నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం

చిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్

‘వారం రోజుల్లో నిందితులకు శిక్ష పడాలి.. లేదంటే సీఎం ఇంటి ముందు కాల్చుకుంటా’

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: కొనసాగనున్న యడ్యూరప్ప ప్రభుత్వం.. బీజేపీకి 12 స్థానాల్లో గెలుపు

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు.. కాంగ్రెస్ మతం పేరుతో దేశాన్ని విభజించిందన్న అమిత్ షా

న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ఐదుగురు మృతి