అమెరికాలో తాజా నత్తల వ్యాపారం: గ్రీన్‌హౌస్‌ ఫామ్‌ల్లో నత్తల్ని సాగుచేసి రెస్టారెంట్లకు అమ్ముతున్న హెలీకల్చరలిస్ట్

  • 19 నవంబర్ 2019
నత్త Image copyright Naveen Kumar K/BBC

నత్తలు ఎంతో మనోహరంగా ఉంటాయంటారు టేలర్ నాప్. ఆయన 70,000 పైగా నత్తలను సాకుతున్నారు.

అమెరికాలో అతి పెద్ద నత్తల సాగు సంస్థ పెకానిక్ ఎస్కార్గోట్ (ఫ్రెంచ్‌ భాషలో ఎస్కార్గోట్ అంటే నత్త). న్యూయార్క్‌లోని లాంగ్ ఐలండ్‌లో ఉందీ ఫామ్. మనుషులు తినటం కోసం నత్తలను సాగు చేసేందుకు అమెరికా వ్యవసాయ శాఖ అనుమతి పొందిన నత్తల ఫామ్‌లు కేవలం రెండే ఉన్నాయి.

న్యూయార్క్ నగరంలోని రెస్టారెంట్లకు టేలర్ స్వయంగా తాజా నత్తలను సరఫరా చేస్తుంటారు. డిమాండ్‌ తగ్గట్లు సరఫరా చేయటానికి ఆయన తంటాలు పడుతున్నారు. 2017లో ఈ వ్యాపారం ప్రారంభించారు. ఏడాదిలోనే అమ్మకాలు రెట్టింపయ్యాయి.

టేలర్ వయసు 31 సంవత్సరాలు. ఆయన వంట మాస్టర్ కూడా. యూరప్‌లో పనిచేసేటపుడు మొదటిసారిగా తాజా నత్తలను రుచి చూశాడు. అమెరికాలో డబ్బాల్లో దొరికే నత్తలు, ముందే వండి నిల్వ చేసిన నత్తల కన్నా ఆ తాజా నత్తలు చాలా రుచికరంగా ఉన్నాయని అప్పుడే తనకు తెలిసందని ఆయన చెప్పారు.

Image copyright PECONIC ESCARGOT
చిత్రం శీర్షిక నత్తల వ్యాపారాన్ని న్యూయార్క్ నగరం బయటకు విస్తరించాలని టేలర్ లక్ష్యంగా పెట్టుకున్నారు

కానీ.. అమెరికాలోని రెస్టారెంట్లు, ఆహార సంస్థలు నత్తలను సజీవంగానైనా, నిర్జీవంగానైనా దిగుమతి చేసుకోవటం చట్టవిరుద్ధం. ఎందుకంటే.. వాటిని ఒక చీడగా, దురాక్రమణ చేసే జాతిగా పరిగణిస్తారు. తినటానికి ఉపయోగపడే మూడు ప్రధాన రకాల నత్తలు యూరప్‌లోనే దొరుకుతాయి.

మరోవైపు.. అమెరికాలో నత్తల వినియోగం 2018లో 42 శాతం పెరిగి 300 టన్నులకు పెరిగిందని వాణిజ్య గణాంకాలు చెప్తున్నాయి. దీంతో.. అమెరికాలోనే నత్తలను పెంచి అమ్మటం మంచి వ్యాపారం అవుతుందనే ఆలోచన టేలర్‌కు వచ్చింది. అమెరికాలోని రెస్టారెంట్లకు తాజా నత్తలను అందుబాటులోకి తేవటానికి పెకానిక్ ఎస్కార్గోట్ ‌సంస్థను స్థాపించాలని నిర్ణయించుకున్నారు.

అమెరికాలోని విదేశీ నత్తలను దిగుమతి చేసుకోవటానికి వీలు లేదు. మరి నత్త పిల్లలను ఎక్కడి నుంచి తీసుకురావాలి? అదృష్టవశాత్తూ.. కాలిఫోర్నియాలోని ఒక సరఫరాదారు నుంచి లిటిల్ గ్రే నత్తలు కొనగలిగారు. తినటానికి ఉపయోగపడే మేలురకం నత్తల జాతిలో ఇదొకటి.

ఈ నత్తల సంతతి 1850 నుంచీ కాలిఫోర్నియాలో నివాసముంటున్నాయి. వీటిని ఆనాడు ఒక యూరప్ వలసదారు.. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి అమెరికాకు తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది. అమెరికా కస్టమ్స్ విభాగం 1789 నుంచీ పనిచేస్తోంది.

పెకానిక్ సంస్థను ప్రారంభించటానికి ఆయన, ఆయన వ్యాపార భాగస్వామి.. క్రౌడ్ ఫండింగ్, ఇతర పెట్టుబడి సంస్థల నుంచి 30,000 డాలర్లు సమీకరించారు. నత్తలను సాగు చేయటానికి అమెరికా వ్యవసాయ శాఖ అనుమతి సంపాదించుకున్నారు.

Image copyright PECONIC ESCARGOT
చిత్రం శీర్షిక ఆహారంగా వినియోగించే మూడు ప్రధాన జాతుల నత్తలు ఉన్నాయి.. వాటిలో ఈ లిటిల్ గ్రే నత్తలు ఒకటి

అందులో భాగంగా.. ఈ నత్తలు సాగు చేసే ప్రాంతం నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. గాలి కూడా లోపలికీ బయటకు వెళ్లటానికి వీలులేని గ్రీన్‌హౌస్‌ను నిర్మించాలి. నీరు ప్రవహించే మార్గాలకు సైతం పటిష్టమైన వడపోత ఏర్పాట్లు ఉండాలి.

గ్రీన్‌హౌస్ చుట్టూ గ్రావెల్ పోసి.. దానిమీద నత్తల వికర్షకాన్ని తరచుగా చల్లుతుండాలి. అంటే.. ఒక రకంగా నత్తలు ఏ విధంగానూ బయటపడటానికి వీలులేకుండా ఒక సుదూర దీవిలోని పటిష్టమైన జైలు తరహాలో ఈ నిర్మాణం ఉండాలి.

''ఇది చాలా వ్యయప్రయాసలతో కూడిన పని'' అంటారు రిక్ బ్రూయర్. అమెరికా వ్యవసాయ శాఖ అనుమతి ఉన్న రెండో నత్తల ఫామ్ 'లిటిల్ గ్రే ఫార్మ్స్ ఎస్కర్గోటీర్' యజమాని ఆయన. ఇది వాషింగ్టన్‌లో రాష్ట్రంలో ఉంది.

రిక్ 2011లోనే నత్తల ఫామ్ ప్రారంభించారు. ఆయన దగ్గర ఇప్పుడు దాదాపు 50,000 నత్తలు ఉన్నాయి. ఆయన కూడా లిటిల్ గ్రే నత్తలనే పెంచుతున్నారు.

''ఈ నత్తలు దాదాపు 50 కోట్ల సంవత్సరాలుగా ఈ భూమి మీద జీవిస్తున్నాయి. ఇంత ప్రాచీన జీవి జీవిత చక్రం చాలా సంక్లిష్టంగా ఉంటుంది'' అని చెప్తారు ఈ హెలీకల్చరలిస్ట్ రిక్.

Image copyright KATELYN LUCE
చిత్రం శీర్షిక పెకానిక్ ఎస్కోర్గోట్‌లో నత్తలకు ఖరీదైన ఆహారం లభిస్తుంది

మానవ వినియోగం కోసం నత్తలను సాగుచేసే వారిని హెలీకల్చరలిస్ట్ అంటారు.

''వంటకాల వనరుగా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. పాడిపరిశ్రమగా పర్యావరణం మీద అతి తక్కువ ప్రభావం ఉంటుంది'' అని ఆయన పేర్కొన్నారు.

''ఆల్చిప్పలు, పీతలు, ఎండ్రకాయలను వండినట్లే నత్తలను కూడా వేడి నీళ్ల పాత్రలో వేసి వండుతారు. అయితే.. నేను వీటిని వండే ముందు రిఫ్రిజిరేటర్‌లో ఉంచి గాఢనిద్రపోయేలా చేస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతోందో వాటికి తెలియకపోవచ్చు'' అని వివరించారు.

రిక్, టేలర్.. ఇద్దరూ పచ్చి నత్తలనే అమ్ముతారు. అంటే వాటిని ఎల్లప్పుడూ ఫ్రీజ్ చేసి ఉంచాలి. వీటిని వినియోగించటానికి కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఉంటుంది. డబ్బాల్లో నిల్వ చేసే నత్తలు.. ఆ డబ్బాలను తెరవకుండా ఉంటే కొన్ని సంవత్సరాల పాటు అలాగే నిల్వ ఉంచొచ్చు.

ఆ డబ్బా నత్తల కన్నా వీరు రెండు రెట్లు అధిక ధరలు వసూలు చేస్తారు.

బ్రూక్లిన్‌లోని ఫ్రెంచ్ లూయీ రెస్టారెంట్‌లో పెకానిక్ నత్తలు అమ్ముతారు రేయాన్ ఆంగులో. ''డబ్బా నత్తలతో పోలిస్తే వీటికి చాలా భిన్నమైన రంగూ, రుచీ ఉంటాయి'' అని ఆయన పేర్కొన్నారు.

Image copyright RIC BREWER
చిత్రం శీర్షిక రిక్ బ్రూయర్ 50,000 నత్తలను సాగు చేస్తున్నారు

''ఒక తాజా నత్త స్థానికంగా దొరికే ఒక ఆల్చిప్ప ధర పలుకుతుంది. అలాగే ఆల్చిప్పను వండినట్లే నత్తలను కూడా వండాలి. వీటి రుచిని పెంచే మసాలా దినుసులను కలిపి మృదువుగా వండాలి'' అని వివరించారు.

న్యూయార్క్ బయటకు తన వ్యాపారాన్ని, విక్రయాలని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టేలర్ చెప్తున్నారు. అలాగే.. తన నత్తలను రవాణా చేసే సమయంలో తాజాగా, చల్లగా ఉండేలా చూడటానికి సముద్ర ఆహారాన్ని పంపిణీ చేసే సంస్థతో జట్టుకట్టాలనీ భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వారానికి 27 కిలోల నత్త మాంసాన్ని విక్రయిస్తున్నారు.

''న్యూయార్క్ మార్కెట్ మొత్తం మేం చుట్టేశాం. ఇప్పుడిక బోస్టన్, ఫిలడెల్ఫియా వంటి ఇతర తూర్పు తీర నగరాలకు వ్యాపారాన్ని విస్తరించాల్సిన అవసరముంది'' అంటారాయన.

అయితే.. అమెరికా వ్యవసాయ శాఖ అనుమతించదు కనుక ఎగుమతి చేయటమనే ప్రసక్తి ఇప్పుడు లేదు కాబట్టి.. ఏటా 11.7 కోట్ల డాలర్ల హోల్‌సేల్ వ్యాపారం గల అంతర్జాతీయ మార్కెట్‌లోకి తమ నత్తలను తీసుకెళ్లాలంటే ఈ రెండు నత్తల ఫామ్‌లూ ఇంకా వేచివుండాల్సిందే.

''నత్తలు మనోహరంగా ఉంటాయి కానీ వాటిని ప్రేమిస్తానని నేను చెప్పలేను. వీటిని తినటం నాకు ఇష్టం. కాబట్టి వాటిని ప్రేమిస్తానంటే కొంచెం అతిగా ఉంటుంది'' అంటారు టేలర్.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు