ఇసుక కొరత ప్రపంచమంతటా ఎందుకు ఏర్పడింది...

  • 20 నవంబర్ 2019
ఇసుక Image copyright Getty Images

రాజస్థాన్‌లో గత ఆగస్టులో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఆ మరుసటి నెలలో దక్షిణాఫ్రికాలో ఓ వ్యాపారవేత్తను కొందరు కాల్చి చంపారు. జూన్‌లో మెక్సికోలో ఓ పర్యావరణ ఉద్యమకారుడు హత్యకు గురయ్యారు.

ఈ ఘటనలు జరిగిన ప్రాంతాల మధ్య వేల మైళ్ల దూరం ఉన్నా, ఈ మరణాలన్నింటీ వెనుక ఓ కారణం బలంగా కనబడుతోంది. అదే ఇసుక.

ఇసుక ప్రాధాన్యాన్ని అందరూ పెద్దగా గుర్తించలేకపోవచ్చు. 21వ శతాబ్దంలో అత్యంత ముఖ్యమైన వస్తువు ఇది.

ఇసుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు పెరుగుతున్నాయి. ఇందుకు ఉదాహరణలే ఆ మూడు ఘటనలు.

అధునాత నగరాల నిర్మాణానికి అవసరమైన అత్యంత మౌలిక వస్తువు ఇసుక.

ఇళ్లు, ఆఫీసులు, అపార్ట్‌మెంట్లు, షాపింగ్ మాల్స్, ప్రాజెక్టులు... ఇలా అన్నింటినీ కట్టడానికి ఉపయోగించేది కాంక్రీటు. కంకర, సిమెంటు, ఇసుక కలిస్తే ఇది తయారవుతుంది.

కాంక్రీటే కాదు, ప్రతి కిటికీకి ఉండే గాజు, కార్ల అద్దాలు, ఫోన్ల స్క్రీన్లను కూడా ఇసుకను కరిగించే తయారుచేస్తారు. ఫోన్లు, కంప్యూటర్లలో ఉండే సిలికాన్ చిప్‌లు.. దాదాపు ఏ ఎలక్ట్రానిక్ పరికరానికైనా ఇసుకే ఆధారం.

భూమి మీద ఇసుక విస్తారంగా దొరుకుతుంది. సహారా నుంచి ఆరిజోనా వరకూ పెద్ద పెద్ద ఎడారుల్లో కుప్పలుతెప్పలుగా ఉంది. తీరాల పొడవునా అభిస్తోంది. ఏ దేశంలోనూ దానికి లోటు లేదు. అసలు అది తరిగిపోయే అవకాశం ఉందా అన్న సందేహమూ మనకు వస్తుంది.

కానీ, నమ్మశక్యంగా ఉన్నా, లేకున్నా... మనం ఇప్పుడు ఇసుక కొరత ఎదుర్కొంటున్నాం. భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉంది.

Image copyright Getty Images

ప్రపంచవ్యాప్తంగా నీటి తర్వాత అత్యధికంగా వినియోగం అవుతున్న సహజ వనరు ఇసుకే. ఏటా దాదాపు 5 వేల కోట్ల టన్నుల కంకర, ఇసుక విశ్రమాన్ని జనాలు వినియోగిస్తున్నారు. బ్రిటన్ లాంటి దేశాన్ని కప్పేసంత పరిమాణం ఇది.

ఇసుక ఇంత విస్తారంగా ఉన్నా, ప్రపంచం కొరత ఎందుకంటే.. ఎడారుల్లో లభించే ఇసుక పెద్దగా పనికిరాదు. ఎడారిలో లభించే ఇసుకలోని రేణువులు గుండ్రంగా, మృదువుగా ఉంటాయి. ఒకదానితో ఒకటి అతుక్కొని ఉండలేవు. అందుకే ఆ ఇసుకతో కాంక్రీటును తయారు చేయడం కుదరదు.

నిర్మాణాల కోసం వినియోగించే ఇసుక వాగుల్లో, నదీ తీరాల్లో, సముద్ర తీరాల్లో ఉండే సరస్సుల్లో దొరుకుతుంది. దీనిలోని ఇసుక రేణువులు కోణీయంగా ఉంటాయి. ఈ ఇసుకకు డిమాండ్ తీవ్రంగా పెరగింది. ప్రపంచవ్యాప్తంగా వాగులు, నది తీరాలు, సరస్సుల నుంచి ఇసుక మొత్తం ఖాళీ అవుతోంది. చాలా దేశాల్లో నేర ముఠాలు ఇసుకను వ్యాపారంగా మలుచున్నాయి.

ఏటా 5వేల కోట్ల టన్నుల మేర ఓ సహజ వనరును వెలికితీసి వాడుకుంటుంటే.. ప్రపంచంపై, మనుషులు జీవితాలపై భారీ దుష్ప్రభావాలు పడటం సహజమేనని ఐరాస ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ పరిశోధకుడు పాస్కల్ పెడుజ్జీ అన్నారు.

ఈ స్థాయిలో ఇసుక వినియోగం పెరగడానికి తీవ్ర పట్టణీకరణే కారణం. ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలను వదిలి పట్టణాలకు వలస వెళ్లిపోతున్నవారి సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది ఇంకా ఎక్కువగా ఉంది. మానవ చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంతో నగరాలు విస్తరిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రపంచంలో పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న జనాభా 420 కోట్లు. 1950తో పోలిస్తే ఇది నాలుగు రెట్లు పెరిగింది. వచ్చే 30 ఏళ్లలో మరో 250 కోట్ల మంది పట్టణాల బాట పడతారని ఐరాస అంచనా వేస్తుంది. అంటే ఏటా న్యూయార్క్ పట్టణ జనాభాకు ఎనిమిదింతల మంది నగర జీవనంలోకి వస్తున్నారు.

అంతటి జనాభాకు ఇళ్లు, విస్తరించిన నగరాలకు రోడ్లు, ఇతర మౌలిక వసతులు సమకూరాలంటే భారీ స్థాయిలో ఇసుక అవసరం.

Image copyright Alamy

2000 సంవత్సరం తర్వాత భారత్‌లో నిర్మాణాల కోసం ఇసుక వినియోగం మూడు రెట్లు పెరిగింది. ఇంకా పెరుగుతోంది కూడా. 20వ శతాబ్దం మొత్తంలో అమెరికా వినియోగించిన దానికన్నా ఎక్కువ ఇసుకను ఒక్క చైనా దేశమే గత పదేళ్లలో ఉపయోగించిందని ఓ అంచనా.

భారీ ఎడారి అంచున ఉండే దుబాయ్‌ కూడా ఆస్ట్రేలియా నుంచి ఇసుక దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఆ నగరంలో డిమాండ్ ఆ స్థాయిలో ఉంది.

నిర్మాణాలకే కాదు.. కృత్రిమంగా నేలను సృష్టించేందుకూ ఇసుకను వాడుతున్నారు. సముద్రంలో అడుగున ఉండే ఇసుకను పెద్ద పెద్ద ఓడల ద్వారా తవ్వి, తీర ప్రాంతాల్లో కొత్తగా నేలను సృష్టిస్తున్నారు. దుబాయ్‌లో పామ్ చెట్టు ఆకారంలో ద్వీపాల సముదాయాన్ని ఇలానే సృష్టించారు. నైజీరియాలోని లాగోస్ తీరంలో 9.7 చదరపు కి.మీ.ల నేలను ఇలాగే ఏర్పాటు చేశారు. చైనా కూడా తీరంలోని వందలాది మైళ్లను నేలగా మార్చేసింది. ద్వీపాలను, వాటిలో విలాసవంతమైన రిసార్ట్‌లను నిర్మించింది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఇసుకతో సింగపూర్ 40 ఏళ్లలో 130 చదరపు కి.మీ.ల నేలను పెంచుకుంది.

ఇలా సముద్రపు అడుగున ఉండే ఇసుకను తవ్వడం వల్ల కోరల్ రీవ్స్ దెబ్బ తింటున్నాయి. నీటి కాలుష్యం జరుగుతోంది. సముద్ర జీవాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. మలేసియా, కంబోడియా లాంటి దేశాల్లో మత్స్యకారులు జీవనోపాధి దెబ్బ తింది.

1985 నుంచి ప్రపంచవ్యాప్తంగా 13,563 చదరపు కి.మీ.ల కృత్రిమ నేల ఏర్పడినట్లు ఓ డచ్ పరిశోధక బృందం లెక్కగట్టింది.

సముద్ర అడుగు నుంచి ఇసుక తీసే ప్రక్రియలు పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. అడుగున జీవించే సముద్రజాలం ఆవాసాలు నాశనమైపోతున్నాయి. ఇసుకను తీసే ప్రక్రియలో వెలువడుతున్న బురద చేపలకు ఊపిరాడకుండా చేస్తోంది. సూర్మరశ్మిని అడ్డుకుని, అడుగున జీవించే మొక్కలు నాశనమవ్వడానికి కారణమవుతోంది.

Image copyright Getty Images

వియత్నాంలోని మీకాంగ్ డెల్టాలో క్రమంగా ఇసుక కనుమరుగు కావడానికి నదిలోంచి ఇసుకను తీయడం కూడా ఒక కారణం.

ఈ డెల్టా ప్రాంతంలో రెండు కోట్ల మంది నివసిస్తున్నారు. దేశ ఆహార అవసరాలలో సగం వరకూ ఈ ప్రాంతమే తీరుస్తోంది. ఇక్కడ పండే వరి మిగతా ఆగ్నేయ ఆసియా ఆకలిని తీరుస్తోంది. అయితే, పర్యావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టం పెరుగుతోంది. దాంతో, ప్రతి రోజూ ఈ డెల్టా ప్రాంతంలో కొన్ని ఎకరాల భూమి కనుమరుగవుతోంది. మరోవైపు, డెల్టా ప్రాంతంలో ఇసుకను కొందరు అక్రమంగా తవ్వేస్తున్నారని పరిశోధకులు అంటున్నారు.

అనేక శతాబ్దాలుగా మధ్య ఆసియాలోని పర్వతాల్లోంచి మీకాంగ్ నది ప్రవాహంలో ఇసుక కొట్టుకొస్తోంది. కానీ, కొన్నేళ్లుగా పలు దేశాలు మధ్యలోనే నది అడుగు నుంచి భారీ మొత్తంలో ఇసుకను తవ్వడం ప్రారంభించాయి. ఒక్క 2011 సంవత్సరంలోనే ఈ నది నుంచి 50 మిలియన్ టన్నుల ఇసుకను తవ్వేశారని 2013లో ముగ్గురు ఫ్రెంచ్ పరిశోధకులు జరిపిన పరిశీలనతో వెల్లడైంది.

ఇదే సమయంలో మీకాంగ్ నది మీద ఇటీవలి కాలంలో ఐదు భారీ ఆనకట్టలు నిర్మించారు. చైనా, లావోస్, కంబోడియాలో మరో 12 ఆనకట్టలు నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ డ్యాంల కారణంగా డెల్టా ప్రాంతానికి ఇసుక ప్రవాహం తగ్గిపోతుంది. ఫలితంగా అక్కడ ఇసుక కొరత పెరిగిపోతుంది.

ఒకపక్క డెల్టా ప్రాంతం కోతకు గురవుతోంది. కానీ, ఆ కోతను భర్తీ చేసే సహజ ప్రక్రియకు ఆటకం ఏర్పడుతోంది. ఫలితంగా ఈ శతాబ్దం ఆఖరి నాటికి ఈ డెల్టాలో దాదాపు సగభాగం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

పరిస్థితి మరింత దిగజారేలా కంబోడియా, లావోస్‌లోని మీకాంగ్‌ నదితో పాటు ఇతర జలవనరుల్లో పూడిక తీయడం వల్ల నది ఒడ్డు కూలిపోతోంది. దాంతో పంట పొలాలు కోతకు గురవుతున్నాయి. కొన్నిచోట్ల ఇళ్ళు కూడా కుంగిపోతున్నాయి. మయన్మార్‌లోని అయ్యర్‌వాడీ నది వెంబడి పరిస్థితి అలాగే ఉందని అక్కడి రైతులు అంటున్నారు.

Image copyright Getty Images

నదుల నుంచి ఇసుక వెలికితీత ప్రపంచవ్యాప్తంగా వివిధ నిర్మాణాలకూ నష్టం కలిగిస్తోంది. నది ఒడ్డు నుంచి ఇసుకను తవ్వడం వల్ల వంతెనల పునాదులు బలహీనపడుతున్నాయి. ఘనాలోని నదిలో ఇసుక భారీగా వెలికితీయడంతో కొండప్రాంత భవనాల పునాదులు దెబ్బతిని కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇసుక తవ్వకాల కారణంగా 2000లో తైవాన్‌లో ఒక వంతెన కూలిపోయింది. ఆ తర్వాత 2001లో పోర్చుగల్‌లోని ఒక వంతెన కూలడంతో బస్సు నదిలో మునిగిపోయి 70 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

గాజుతో పాటు సోలార్ ప్యానెల్లు, కంప్యూటర్ చిప్స్ వంటి హైటెక్ ఉత్పత్తులను తయారు చేసేందుకు ఉపయోగించే స్వచ్ఛమైన సిలికా ఇసుకకు డిమాండ్ కూడా పెరుగుతోంది.

ఇసుకకు డిమాండ్ భారీగా పెరగడంతో చాలా ప్రాంతాల్లో నేర ముఠాలు దీని వ్యాపారంలోకి దిగాయి. అక్రమంగా తవ్వకాలు జరుపుతూ బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాయి.

లాటిన్ అమెరికా, ఆఫ్రికాలోని ఇసుక రీచ్‌లలో చిన్నారులను బానిసలుగా చేసుకుని వారితో బలవంతంగా పనిచేయిస్తున్నారని మానవహక్కుల సంఘాలు చెబుతున్నాయి.

ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు లంచాలు ముట్టచెప్పి ఈ ముఠాలు అక్రమ దందా యథేచ్ఛగా సాగిస్తున్నాయి. ఎదిరించిన వారి ప్రాణాలు తీసేందుకు వెనకాడటం లేదు.

దక్షిణ మెక్సికన్ రాష్ట్రం చియాపాస్‌లోని ఓ నదిలో అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన పర్యావరణ కార్యకర్త జోస్ లూయిస్ అల్వారెజ్ ఫ్లోర్స్ ఈ ఏడాది జూన్‌లో దుండగులు కాల్చి చంపారు. ఆ తర్వాత రెండు నెలలకు భారత్‌లోని రాజస్థాన్‌లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దుండగులు కాల్పులు జరిపారు. పోలీసులు కూడా కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో ఇద్దరు మైనర్లు చనిపోయారు, ఇద్దరు పోలీసు అధికారులు ఆసుపత్రి పాలయ్యారు.

Image copyright Getty Images

ఈ ఏడాది ఆరంభంలో, దక్షిణాఫ్రికాలో ఇద్దరు ఇసుక వ్యాపారుల మధ్య వివాదంలో తుపాకీ కాల్పులకు ఒకరు చనిపోయారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

గత కొన్నేళ్లలో ఇలా కెన్యా, గాంబియా, ఇండోనేషియాలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో "ఇసుక మాఫియా" దాడుల్లో వందల మంది గాయపడ్డారు, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

ఇసుకకు ప్రత్యామ్నాయం ఉందన్న అవగాహన లేకపోవడం వల్లే పరిస్థితులు ఇలా మారుతున్నాయి. కాంక్రీటులో ఇసుకకు బదులుగా ఇతర పదార్థాలను వినియోగించే పద్ధతులను ఆచరణలోకి తెచ్చేందుకు అనేక మంది శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఫ్లై యాష్, బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలలో మిగిలిపోయిన వ్యర్థాల లాంటి వాటిని ఇసుకకు బదులుగా వాడొచ్చని చెబుతున్నారు. మరికొందరు తక్కువ ఇసుక అవసరమయ్యే కాంక్రీటును అభివృద్ధి చేస్తున్నారు. కాంక్రీటును రీసైకిల్ చేయడం మీద కూడా పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

చాలా పాశ్చాత్య దేశాల్లోని నదుల్లో ఇసుక తవ్వకాలు దశలవారీగా ఆగిపోయాయి. దీన్ని ఇతర దేశాలన్నీ అనుసరించాలనుకోవడం కొద్దిగా కష్టమే. "నదులకు కలగబోయే నష్టాన్ని అరికట్టడం లేదా తగ్గించాలంటే నిర్మాణ రంగం నదుల నుంచి ఇసుకను తీసుకోవడం ఆపేయాలి" అని ప్రపంచ ఇసుక రంగం పరిస్థితిపై డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇటీవలే ఓ నివేదికలో వెల్లడించింది. "పర్యావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఎలాంటి సామాజిక మార్పు కావాలో దీనికి కూడా అలాంటి మార్పే అవసరం. నదులు, ఇసుకను చూసే విధానం, నగరాల డిజైన్, నిర్మాణ తీరు మారాల్సిన అవసరం ఉంది" అని కూడా ఆ నివేదిక పేర్కొంది.

ఇసుక తవ్వకాల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్య సమితి, డబ్ల్యూటీవో లకు పిలుపునిస్తున్న విద్యావేత్తల్లో యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలో తీరప్రాంత భౌగోళికవేత్త మెట్ బెండిక్సేన్ ఒకరు. "దీనికోసం ఓ పర్యవేక్షక వ్యవస్థ ఉండాలి. మరింత మెరుగైన నిర్వహణ కావాలి, ప్రస్తుత విధానంలో చాలా లోపాలున్నాయి" అని ఆయన అన్నారు.

ప్రస్తుతం, భూమి నుంచి ఎంత మొత్తంలో, ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఇసుక తవ్వుతున్నారనేది ఎవరికీ తెలియదు. దీనిలో చాలా వరకూ లెక్కల్లోకి రాదు. "జనాభా పెరిగేకొద్దీ ఇసుక అవసరం కూడా పెరుగుతుంది" అని బెండిక్సేన్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)