ట్రంప్ అభిశంసన విచారణ: డెమోక్రాట్లపై రిపబ్లికన్ల మూడు ఆరోపణలు ఏమిటి? వాటిలో నిజానిజాలేమిటి? #రియాలిటీ చెక్

  • 20 నవంబర్ 2019
ట్రంప్ Image copyright Reuters

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ అభిశంసన ప్రక్రియ చుట్టూ సాగుతున్న చర్చను ప్రభావితం చేసేందుకు ట్రంప్, రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆయన మద్దతుదారులు శతధా ప్రయత్నిస్తున్నారు. డెమొక్రటిక్ పార్టీ నాయకులపై, ఈ వ్యవహారానికి మూలమైన సమాచారం ఇచ్చిన ఓ అజ్ఞాత 'విజిల్‌బ్లోయర్(ప్రజావేగు)'పై ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు.

ఉక్రెయిన్ రాజకీయ నాయకుల చర్యలనూ రిపబ్లికన్లు ప్రశ్నిస్తున్నారు. ఉక్రెయిన్‌కు సంబంధించి అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న జో బైడెన్‌పై, ఆయన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను మరింత నిశితంగా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.

అభిశంసన విచారణలు జరుపుతున్న కమిటీలోని రిపబ్లికన్ పార్టీ ముఖ్య నేత డెవిన్ న్యూనెస్ మంగళవారం తన ప్రారంభ ఉపన్యాసంలో మూడు ఆరోపణలు చేశారు.

వారి ఆరోపణలు ఏమిటి, అందులో నిజమెంత?

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అభిశంసన విచారణ

ఆరోపణ: 'విజిల్‌బ్లోయర్‌కు డెమొక్రాట్లతో సంబంధాలు'

విజిల్‌బ్లోయర్‌కు డెమొక్రటిక్ పార్టీతో సంబంధాలు ఉన్నాయని, డెమొక్రాట్లు విజిల్‌బ్లోయర్‌తో సమావేశమయ్యారని, అధికారికంగా ఫిర్యాదు దాఖలు చేయడానికి ముందే వారికి వివరాలు తెలుసని ట్రంప్ మద్దతుదారులు ఆరోపించారు. అమెరికా ప్రతినిధుల సభ ఇంటెలిజెన్స్ కమిటీ సారథి అయిన డెమొక్రటిక్ పార్టీ నాయకుడు ఆడమ్ స్కిఫ్‌తో విజిల్ బ్లోయర్ చర్చించారని రిపబ్లికన్ సెనేటర్ లిండే గ్రాహం ఆరోపించారు.

కమిటీ సిబ్బందిలో ఒకరిని ఫిర్యాదు దాఖలుకు ముందు విజిల్‌బ్లోయర్ కలిశారు. ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసుకోవాలని, తగిన ప్రక్రియను అనుసరించి ఫిర్యాదు దాఖలు చేయాలని తనను కలిసిన విజిల్‌బ్లోయర్‌కు కమిటీ ఉద్యోగి సలహా ఇచ్చారు.

ఇంటెలిజెన్స్ కమిటీ ఛైర్మన్ ఆడమ్ స్కిఫ్ అధికార ప్రతినిధి స్పందిస్తూ- ఇలా సలహా ఇవ్వడం అసాధారణమేమీ కాదని, గతంలోనూ ఉన్నదేనని, విజిల్‌బ్లోయర్లు రిపబ్లికన్ పార్టీ, డెమొక్రటిక్ పార్టీ నియంత్రణలోని కమిటీలను సంప్రదించారని చెప్పారు.

విజిల్‌బ్లోయర్లు సంప్రదించినప్పుడు కాంగ్రెస్ ఎలా స్పందించాలనేది ఒక మార్గనిర్దేశక పత్రం వివరిస్తోంది. ఇలాంటి ఫిర్యాదులు స్వీకరించడం సాధారణ విషయమేనని ఇది చెబుతోంది.

విజిల్‌బ్లోయర్ తనను కలిశారనే ఆరోపణలను ఆడమ్ స్కిఫ్ ఖండిస్తున్నారు. విజిల్‌బ్లోయర్ ఎవరో కూడా తెలియదని ఆయన ఇటీవల తెలిపారు.

డెమొక్రటిక్ పార్టీతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై విజిల్‌బ్లోయర్‌ తరపు న్యాయవాది మాట్లాడుతూ- తాము ఎన్నడూ ఏ పార్టీ లేదా ఏ అభ్యర్థి కోసమూ పనిచేయలేదని, సలహాలు అందించలేదని చెప్పారు.

ఇంటెలిజెన్స్ కమ్యూనిటీలో ఫిర్యాదుల విభాగ ఇన్‌ఛార్జి అయిన అత్యున్నత అధికారి- విజిల్‌బ్లోయర్‌కు డెమొక్రటిక్ పార్టీతో సంబంధాలు ఉండే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. రాజకీయ పక్షపాతం ఉండొచ్చనే ఆరోపణలను పరిశీలించారు. అయినప్పటికీ, అధ్యక్షుడు ట్రంప్‌పై వచ్చిన ఫిర్యాదు విశ్వసనీయమైనదేనని తేల్చారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక విజిల్‌బ్లోయర్‌ ఎవరో తనకు తెలియదని, ఎప్పుడూ కలవలేదని ఆడమ్ స్కిఫ్ చెబుతున్నారు

ఆరోపణ: '2016 అమెరికా ఎన్నికల్లో ఉక్రెయిన్ జోక్యం'

ట్రంప్ విజయావకాశాలను ప్రభావితం చేసేందుకు ఉక్రెయిన్లోని వ్యక్తులు లేదా పరిచయస్తులు డెమొక్రాట్లకు సహాయం చేశారనే ఆరోపణలు ట్రంప్ మద్దతుదారుల ఆరోపణల్లో కీలకమైనవి.

ఇందులో అనేక ముఖ్యమైన అంశాలు ఇమిడి ఉన్నాయి.

వీటిలో మొదటిది- 'బ్లాక్ లెడ్జర్'గా పిలుస్తున్న ఒక పత్రానికి సంబంధించినది. ఇది ఉక్రెయిన్లో వెలుగులోకి వచ్చింది. ట్రంప్ ప్రచార విభాగ మాజీ మేనేజర్ పాల్ మానఫోర్ట్‌కు ఉక్రెయిన్లోని ఒక రష్యా అనుకూల పార్టీ నుంచి నిధులు అందాయని ఈ పత్రం సూచిస్తోంది. మోసం, కుట్ర కేసుల్లో దోషిగా తేలి పాల్ మానఫోర్ట్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక పాల్ మానఫోర్ట్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు

ఈ పత్రం నకిలీదని ట్రంప్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఉక్రెయిన్లో జర్నలిజం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సెర్గీ లీచెన్‌కో ఈ నకిలీ పత్రాన్ని కావాలనే లీక్ చేశారని, ఆయన ట్రంప్ వ్యతిరేకి అని విమర్శిస్తున్నారు.

ఇక్కడ ఇంకో ఆసక్తికర అంశం ఉంది. లీచెన్‌‌కో విడుదల చేసిన పత్రాల్లో పాల్ మానఫోర్ట్ ప్రస్తావనే లేదు. పాల్ మానఫోర్ట్‌కు సంబంధించిన వివరాలను ఉక్రెయిన్లోని అవినీతి నిరోధక విభాగం అధికారి ఒకరు వెల్లడించారు.

మూడేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన బ్లాక్ లెడ్జర్‌లోని అంశాలపై ఇంతవరకు తీవ్రమైన సందేహాలు ఏర్పడలేదు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అభిశంసన విచారణ గది

డెమొక్రటిక్ నేషనల్ కమిటీ(డీఎన్‌సీ) మాజీ పార్ట్‌టైమ్ కన్సల్టెంట్ అలెగ్జాండ్రా చలూపా పాత్ర మరో ముఖ్యమైన అంశం. ఆమెవి ఉక్రెయిన్ మూలాలు.

అమెరికా వెబ్‌సైట్ పొలిటికో వెలువరించిన వివాదాస్పద కథనంలో అలెగ్జాండ్రా గురించి ప్రముఖంగా ఉంది. వాషింగ్టన్లోని ఉక్రెయిన్ దౌత్యవేత్తలను అలెగ్జాండ్రా సంప్రదించారని, పాల్ మానఫోర్ట్‌పై బురదజల్లాలని కోరారని ఇందులో ఉంది.

అలెగ్జాండ్రా, వాషింగ్టన్లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం మధ్య సమాచార వినిమయం, ట్రంప్, పాల్‌ మానఫోర్ట్‌లకు రష్యాతో సంబంధాలున్నాయనే సమాచారం కోసం ఆమె చేసిన ప్రయత్నాల గురించి ఈ కథనంలో ఉంది.

ఉక్రెయిన్ రాయబార కార్యాలయాన్ని సొంత చొరవతో సంప్రదించానని అలెగ్జాండ్రా పదేపదే చెబుతున్నారు. ఎంబసీ తనకు సమాచారం ఇచ్చినట్లు ఆధారాల్లేవని ఆమె పేర్కొన్నారు. డీఎన్‌సీ కూడా అదే మాట చెబుతోంది.

ఈ అంశంలో తలదూర్చేందుకు తాము నిరాకరించామని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం చెప్పింది.

ఇది కొంత వరకు వాస్తవమే. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలవాలని ఉక్రెయిన్ ప్రముఖ రాజకీయ నాయకులు అనుకున్నారు. అప్పట్లో తూర్పు ఉక్రెయిన్లో రష్యాతో ఉక్రెయిన్‌ ఘర్షణ, రష్యా-అమెరికా సంబంధాలపై ట్రంప్ పునరాలోచన గురించి ఆందోళన నేపథ్యంలో వారు ఇలా కోరుకున్నారు.

ఉక్రెయిన్లోని క్రిమియాను రష్యా తన నియంత్రణలోకి తీసుకోవడాన్ని అధికారికంగా గుర్తించే అంశాన్ని పరిశీలిస్తాననే అర్థంలో ట్రంప్ 2016 జులైలో వ్యాఖ్యలు చేశారు. రష్యా చర్యను ఉక్రెయిన్లోని అత్యధికులతోపాటు ప్రపంచంలోని అత్యధిక దేశాలు అక్రమమైనదిగా పరిగణిస్తాయి.

అప్పట్లో అమెరికాలో ఉక్రెయిన్ రాయబారిగా ఉన్న వలేరియ్ చాలి, ట్రంప్‌ను విమర్శిస్తూ ఒక వ్యాసం రాశారు. ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఆర్సెన్ అవకోవ్, ట్రంప్ వ్యాఖ్యలను సిగ్గుచేటని విమర్శించారు.

ఉక్రెయిన్ వైపు నుంచి ప్రణాళికాబద్ధ జోక్యం ఉందనే ఆరోపణల్లో వాస్తవం దాదాపు లేదని వెల్లడైంది. ట్రంప్ అభిశంసన విచారణలో అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ ఉక్రెయిన్ వ్యవహారాల నిపుణుడు జార్జ్ కెంట్ మాట్లాడుతూ- ఈ ఆరోపణలకు ప్రాతిపదిక లేదన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జో బైడెన్

ఆరోపణ: 'ఉక్రెయిన్‌లో బైడెన్, హంటర్ తప్పు చేశారు'

బరాక్ ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన జో బైడెన్, నాటి ప్రభుత్వ ఉక్రెయిన్ వ్యవహారాల్లో ప్రధాన పాత్ర పోషించేవారు. బైడెన్ కొడుకు హంటర్ ఉక్రెయిన్లో అతిపెద్ద చమురు సంస్థల్లో ఒకటైన 'బురిస్మా'లో భారీ వేతనం వచ్చే డైరెక్టర్ పదవిలో ఉండేవారు.

హంటర్ పనిచేసే సంస్థ కార్యకలాపాలను విచారిస్తున్న ఉక్రెయిన్ ప్రముఖ ప్రాసిక్యూటర్ విక్టర్ షోకిన్‌ తొలగింపునకు బైడైన్ పిలుపునిచ్చారని ట్రంప్ మద్దతుదారులు భావిస్తున్నారు.

ప్రాసిక్యూటర్ షోకిన్‌ను తొలగించాలని బైడెన్ కోరుకున్నారనేది నిజమే. కానీ అప్పట్లో షోకిన్ తొలగింపును కోరుకున్నది ఆయన ఒక్కరే కాదు. అంతర్జాతీయ సంస్థలు, పాశ్చాత్య దేశాలు, ఉక్రెయిన్లో అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు దాదాపు అందరూ షోకిన్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.

షోకిన్ చూస్తున్న కేసుల్లో బురిస్మా కేసు ఒకటి. వాస్తవానికి ఉక్రెయిన్లో చాలా కేసుల మాదిరే ఈ కేసులోనూ సంబంధిత యంత్రాంగం అంత చురుగ్గా వ్యవహరించలేదు.

బురిస్మాలో బైడెన్ కుమారుడు హంటర్ నెలకు 50 వేల డాలర్ల పారితోషికం అందుకున్నారనే వార్తలు వచ్చాయి. 2014లో బురిస్మాలో చేరే సమయానికి ఆయనకు ఇంధన రంగంలోగాని, ఉక్రెయిన్లోగాని అనుభవం లేదు. తాను జో బైడెన్ కుమారుడిని అయినందువల్ల తనను బురిస్మా నియమించుకొని ఉండొచ్చని హంటర్ ఇటీవల చెప్పారు.

బురిస్మాలో హంటర్ డైరెక్టర్ హోదాలో చేరినప్పుడు ఇది సమస్యాత్మకం కావొచ్చని విదేశీ వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి జార్జ్ కెంట్ అప్పట్లో జో బైడెన్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. హంటర్ పదవి 'పరస్పర విరుద్ధ ప్రయోజనం(కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్)'గా కనిపించవచ్చని ఆందోళన వ్యక్తంచేశారు.

వివాదాస్పద కంపెనీలు వాటి ఇమేజ్‌ను మెరుగుపరచుకొనే ప్రయత్నాల్లో భాగంగా ప్రముఖులకు భారీ వేతనాలతో కూడిన పోస్టులు ఇవ్వడం తూర్పు ఐరోపాలో, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో అసాధారణమేమీ కాదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)