పాకిస్తాన్‌ సోషల్ మీడియాలో మహిళల ఆందోళన... స్త్రీవాదంపై సదస్సులో అంతా మగవాళ్ళేనా అంటూ ఆగ్రహం...

  • 22 నవంబర్ 2019
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల హక్కుల కోసం కరాచీలో జరిగిన ఆందోళన (పాతచిత్రం) Image copyright Getty Images
చిత్రం శీర్షిక మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల హక్కుల కోసం కరాచీలో జరిగిన ఆందోళన (పాతచిత్రం)

పురుషాధిక్యం ఎక్కువగా ఉండే పాకిస్తాన్‌లో స్త్రీవాదంపై ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమానికి ఒక్క మహిళా అతిథినీ ఆహ్వానించకపోవడంపై సోషల్ మీడియాలో నిరసనలు హోరెత్తాయి. దీంతో నిర్వాహకులు వెనక్కి తగ్గి, కార్యక్రమానికి ఇద్దరు మహిళా అథితులను ఆహ్వానించారు. చర్చ పేరు కూడా మార్చారు.

పాకిస్తాన్ కళల మండలి (ఆర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ పాకిస్తాన్) శుక్రవారం కరాచీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి తొలుత పెట్టిన 'ఫెమినిజం: ది అదర్ పర్‌స్పెక్టివ్' అనే పేరు మీద కూడా విమర్శలు వచ్చాయి. దీనిని 'అండర్‌స్టాండింగ్ ఫెమినిజం' అని మార్చారు.

ప్రధాన మీడియా సంస్థల్లో నిర్ణయాలు తీసుకొనే హోదాల్లో ఉన్న వారు, ఫాలోయింగ్ ఉన్న మగవారు స్త్రీవాదంపై ఆలోచనలను పంచుకొనేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నామని నిర్వాహకులు చెప్పారు. అయితే, ఆ ఆలోచననే చాలా మంది విమర్శకులు ప్రశ్నించారు.

మొదట అనుకున్నదాని ప్రకారమైతే ఈ చర్చలో 'హోస్ట్' ఉజ్మా అల్-కరీమ్ ఒక్కరే మహిళ. కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పత్రాల్లో ఆమె పేరు చివర్లో ఉంది.

ఈ చర్యపై సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తాక స్త్రీవాది మెహ్తాబ్ అక్బర్ రష్దీ, జర్నలిస్ట్ ఖ్వత్రీనా హొసైన్‌లను మహిళా స్పీకర్లుగా నిర్వాహకులు కార్యక్రమానికి ఆహ్వానించారు. ప్రచార పత్రాల్లో మార్పు చేసి, హోస్ట్ ఉజ్మా అల్-కరీమ్ పేరు ప్రముఖంగా కనిపించేలా రాశారు.

ఈ మార్పులతో అందరూ శాంతించలేదు. మహిళా అతిథులెవరూ లేకుండా నిర్వహించే చర్చలో పాల్గొనడానికి ఆయా పురుషులు ఎలా అంగీకరించారనే ప్రశ్నలు వచ్చాయి. సొంత ప్రయోజనాల కోసం వారు స్త్రీవాదాన్ని ఉపయోగించుకోవాలనుకొన్నారనే ఆరోపణలూ వచ్చాయి.

స్త్రీవాదంపై మగవారు తమ ఆలోచనలు పంచుకోకూడదనేమీ లేదని, అయితే మహిళా అతిథులెవరూ లేని బృందంతో చర్చ నిర్వహించాలనుకోవడం తప్పని ఈ అంశంపై కథనం రాసిన ఓ మహిళ, ఇతరులు వ్యాఖ్యానించారు.

ఎరమ్ హైదర్ అనే మహిళ ట్విటర్లో స్పందిస్తూ- స్త్రీవాదులైన తనకు తెలిసిన మగవారు ఆడవారే లేని ఇలాంటి చర్చలో పాల్గొనడానికి ఇష్టపడరని చెప్పారు.

కార్యక్రమ హోస్ట్ ఉజ్మా అల్-కరీమ్ బీబీసీతో మాట్లాడుతూ- మొదట అనుకున్నదాని ప్రకారం మీడియా సంస్థల్లో నిర్ణయాలు తీసుకొనే హోదాల్లో ఉన్న, జనంలో ఫాలోయింగ్ ఉన్న మగవారు స్త్రీవాదాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో చర్చించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని చెప్పారు.

ప్రజల అభిప్రాయాలను, ఆలోచనలను ప్రభావితం చేయగల స్థాయుల్లో ఉన్నారు కాబట్టి వారి ఆలోచనలు తెలుసుకొనేందుకు ఈ ఆలోచన చేశామని, అందుకే చర్చకు కూడా 'ఫెమినిజం: ది అదర్‌ పర్‌స్పెక్టివ్' అని పేరు పెట్టామని ఆమె ప్రస్తావించారు.పురుష అతిథుల్లో ఒకరైన మానవ హక్కుల కార్యకర్త జీబ్రాన్ నజీర్ స్పందిస్తూ- చర్చకు మొదట పెట్టిన పేరు తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు.

'పురుషత్వం' అనే భావన గురించి పునరాలోచన చేయడం, పురుషులకు స్త్రీవాదం ఆవశ్యకత లాంటి అంశాలపై ఈ బృందంలోని మగవారు చర్చిస్తారని తనకు చెప్పారని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ఇది స్త్రీవాదం గురించి మగవారు వివరించేందుకు, మహిళల అంశాలను చర్చించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం కాదని చెప్పారని తెలిపారు.

పాకిస్తాన్ కళల మండలి కార్యక్రమంపై చర్చలో హాస్యం కూడా వచ్చి చేరింది.

కమెడియన్ షాజాద్ గియాస్ షేక్ స్పందిస్తూ, మహిళల జీవితం గురించి ప్రపంచానికి పాఠాలు చెప్పేందుకు అందరూ తనతో కలసి రావాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

కార్యక్రమంలో ఏం చర్చిస్తారనేది, ప్యానెల్‌లో మహిళా అతిథులే ఉండరనేది నిర్వాహకులు మీకు స్పష్టంగా చెప్పారా, లేదా అని జీబ్రాన్ నజీర్‌ను బీబీసీ అడగ్గా- ఆయన కామెంట్ చేయడానికి నిరాకరించారు. అది అంత పెద్ద విషయం కాదని, కొన్ని అభ్యంతరాలు రావడంతో నిర్వాహకులు కొన్ని మార్పులు చేశారని, తాను కేవలం అతిథిని మాత్రమేనని జీబ్రాన్ స్పందించారు.

'లాహోర్ యూనివర్శిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్' ప్రొఫెసర్ నిదా కిర్మానీ మాట్లాడుతూ- స్త్రీవాదంపై మగవారు చర్చ జరపడం సబబేనని, అయితే ఈ కాన్సెప్ట్‌ గురించి పాకిస్తాన్ కళల మండలి స్పష్టంగా చెప్పలేకపోయిందని, దీనివల్లే సోషల్ మీడియాలో అంత పెద్దయెత్తున నిరసనలు వచ్చాయని అభిప్రాయపడ్డారు.

ఎలక్ట్రానిక్ మీడియాలో అప్రాధాన్య అంశాలపై మగవారు గంటల కొద్దీ చర్చించడం చూసీ చూసీ జనానికి విసుగొచ్చేసిందని, తాజా నిరసనలకు ఇదీ ఓ కారణమని ఆమె వ్యాఖ్యానించారు. సినిమాల్లో మహిళలు ప్రధాన పాత్రల్లో అరుదుగా కనిపిస్తుంటారని, ఇది చాలా మందికి సాధారణ విషయంగానే కనిపిస్తోందని ప్రస్తావించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు