అతిపెద్ద 5జీ నెట్‌వర్క్‌ నిర్మాణంలో దూసుకెళ్తున్న చైనా.. ఇప్పుడు టెక్ ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందా?

  • 28 నవంబర్ 2019
వైఫై హెడ్ బ్యాండ్‌తో చైనా యువతి Image copyright Getty Images

బీజింగ్ యువకుడు జున్ యూకూ గ్యాడ్జెట్లంటే పిచ్చి. 20కి పైగా స్మార్ట్‌ఫోన్లు, పాత టాబ్లెట్లు, ఇతర డివైస్‌లు బీజింగ్లోని ఆయన ఇంట్లో ఓ మూలకు పడి ఉన్నాయి. వీటి సంఖ్య పెరుగుతూ పోతుంటుంది. ఆయన ఇంట్లో 'గూగుల్ హోమ్' ‌స్మార్ట్ అసిస్టెంట్, అమెజాన్ ఎకో కూడా ఉన్నాయి.

"రోజూ నా వెంట మూడు ఫోన్లు ఉంటాయి. ఒకటి చైనీస్ యాప్‌ల కోసం వాడతాను. ఐఫోన్ జీమెయిల్, పాశ్చాత్య మొబైల్ అప్లికేషన్ల కోసం వాడతాను. గూగుల్ పిక్సెల్ ఫన్ నా పని కోసం వాడతాను" అని 34 ఏళ్ల జున్ యూ చెప్పారు.

భౌతికశాస్త్రం చదువుకున్న ఆయన ఓ టెక్ ఎంట్రిప్రెన్యూయర్.

టెక్ సాధనాలపై జున్ యూకు ఉండే మక్కువ ఆయనకు అక్కరకొచ్చింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ వాడేందుకు 2009లో ఆయన తొలి ఫోన్ కొన్నారు. ఇప్పుడు 80 శాతానికి పైగా స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్‌పైనే ఆధారపడి పనిచేస్తున్నాయి.

చైనీస్ ఆండ్రాయిడ్ వాడంకదార్లకు కావాల్సిన కంటెంట్‌ను తయారుచేసేందుకు 2010లో ఆయన సొంతంగా కంపెనీ పెట్టారు. 2016 నాటికి చైనా ఈకామర్స్ దిగ్గజం అలీబాబాకు ఆయన తన కంపెనీని అమ్మేశారు. ఎంతకు అమ్మారనేది వెల్లడి కాలేదు.

తదుపరి తరం టెక్నాలజీ అయిన 5జీపై జున్ యూ ఉత్సుకతతో ఉన్నారు.

చిత్రం శీర్షిక జున్ యూ

5జీతో మొబైల్ ఫోన్లకు తిరుగులేని వేగంతో ఇంటర్నెట్ అందుతుందని, సినిమాలను క్షణాల వ్యవధిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, హైడెఫినిషన్ టీవీ స్ట్రీమింగ్ చేసుకోవచ్చని దీనిపై అంచనాలు ఉన్నాయి.

చైనా సంస్థ షియోమి తయారుచేస్తున్న 5జీ స్మార్ట్‌ఫోన్‌కు జున్ యూ అక్టోబర్లో ముందస్తు ఆర్డర్ ఇచ్చారు.

"మొబైల్ వీడియో, ఆటలు ఆడేవాళ్లు మరింతగా లీనమయ్యే గేమింగ్ లాంటి అనేక అధునాత సదుపాయాలు 4జీ టెక్నాలజీతో సాధ్యమయ్యాయి. 5జీతో కూడా ఇలాంటి మరెన్నో సౌకర్యాలు వస్తాయి. కానీ అవి ఎలా ఉంటాయనేది ఇప్పటికైతే నాకు స్పష్టంగా తెలియదు" అని ఆయన చెప్పారు.

అమెరికా, బ్రిటన్లలో 5జీ సేవల విస్తరణలో ఆటంకాలు ఏర్పడ్డాయి. 5జీ సామగ్రి ప్రధాన సరఫరాదారుల్లో ఒకటైన చైనా సంస్థ హువావేపై అంతర్జాతీయ వివాదం దీనికి కారణం.

భద్రతాపరమైన ఆందోళనలతో 5జీ నెట్‌వర్కుల్లో హువావే సామగ్రి వినియోగంపై అమెరికా నిషేధం విధించింది. తమ మిత్రదేశాలు కూడా హువావేపై ఇలాంటి చర్యలు తీసుకోవాలని కోరింది.

హువావేకు తమ కంపెనీల ఉత్పత్తుల అమ్మకాన్నీ అమెరికా గట్టిగా నియంత్రిస్తోంది. దీనివల్ల చైనా వెలుపల హువావే అమ్మకాలపై తీవ్రమైన ప్రభావం పడింది.

అంతర్జాతీయ 5జీ మార్కెట్లో చైనా ఆధిపత్యం ప్రదర్శించే అవకాశముందని, హువావేపై అమెరికా ఒత్తిడి ఈ ఆధిపత్యానికి గండికొట్టే ప్రయత్నమేనని ఆర్థిక సేవల గ్రూపు 'జెఫరీస్‌'కు చెందిన అనలిస్ట్ ఎడిసన్ లీ లాంటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు 5జీ మంచి అవకాశమని చైనా టెక్ సంస్థలు భావిస్తున్నాయి.

ఇతరుల నుంచి దొంగిలించిన మేధోహక్కులు, ప్రభుత్వం పెద్దయెత్తున కల్పిస్తున్న రాయితీల వల్లే సాంకేతిక పరిజ్ఞానంలో చైనా పురోగతి సాధిస్తోందని అమెరికా వాదిస్తోందని ఎడిసన్ లీ ప్రస్తావించారు.

చైనా టెలికాం సామగ్రి సురక్షితమైనది కాదని, అమెరికా, అమెరికా మిత్రదేశాల జాతీయ భద్రతకు ఇది ముప్పు కలిగిస్తుందని నమ్ముతోందని చెప్పారు. ఈ వాదనలు, నమ్మకాలే అమెరికా-చైనా సాంకేతిక రంగ యుద్ధానికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయ టెలికాం పరికరాల మార్కెట్లో హువావే, మరో చైనా సంస్థ జడ్‌టీఈ ఆధిపత్యం అంతకంతకూ పెరుగుతోందని, దీనివల్ల పాశ్చాత్య దేశాల్లో చైనా గూఢచర్యానికి ఆస్కారం పెరుగుతుందని ఎడిసన్ లీ వ్యాఖ్యానించారు.

హువావే సాంకేతిక పరిజ్ఞానాన్ని గూఢచర్యానికి వాడుతున్నారనే ఆరోపణలను హువావే నిర్దంద్వంగా ఖండిస్తోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక చైనా 5జీ నెట్‌వర్క్‌‌లో దాదాపు సగాన్ని హువావే ఏర్పాటు చేసింది.

ఒకవైపు హువావే 5జీ సామగ్రిపై పాశ్చాత్య దేశాలు ఆందోళన చెందుతుండగా, మరోవైపు చైనా 5జీ నెట్‌వర్క్‌ ఏర్పాటులో దూసుకెళ్తోంది.

అక్టోబరు 31న 50కి పైగా నగరాల్లో చైనా కంపెనీలు 5జీ సేవలను ప్రారంభించాయి. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద 5జీ నెట్‌వర్క్ ఉన్న దేశాల్లో ఒకటిగా చైనా నిలిచింది.

ఈ నెట్‌వర్క్‌లో 50 శాతాన్ని హువావేనే ఏర్పాటు చేసిందని అంచనా.

కేవలం 20 రోజుల్లోనే ఎనిమిది లక్షల మందికి పైగా వినియోగదారులు నమోదు చేయించుకున్నారని చైనా సమాచారశాఖ చెబుతోంది.

2020 నాటికి చైనాలో 5జీ వినియోగదారులు 11 కోట్ల మంది ఉంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Image copyright HK Applied Science Institute
చిత్రం శీర్షిక అటానమస్ కార్ల టెక్నాలజీలో 5జీ కీలక పాత్ర పోషించనుంది.

చైనాలో ఓవైపు 5జీ టెక్నాలజీ విస్తరిస్తుండగా, ఈ సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత ఉత్పత్తుల అభివృద్దిలో పరిశోధకులు నిమగ్నమయ్యారు.

ఉత్తర హాంకాంగ్‌లోని ఓ సువిశాల భూభాగంలో 5జీ ఆధారిత అటానమస్ వాహనాలను పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. 'హాంకాంగ్ అప్లైడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసర్చ్ ఇన్‌స్టిట్యూషన్‌' పరిశోధకులు చైనాలోని అతిపెద్ద టెలికాం కంపెనీ 'చైనా మొబైల్'తో కలసి పనిచేస్తున్నారు.

5జీ సాంకేతిక పరిజ్ఞానం స్వీయ చోదిత(సెల్ఫ్ డ్రైవింగ్) కార్లకు బాగా ఉపయోగపడుతుందని వీరు భావిస్తున్నారు. ఇతర వాహనాలు, ట్రాఫిక్ సంకేతాలు, రహదారిపై ఉన్న సెన్సర్ల నుంచి సమాచారాన్ని సేకరించి చుట్టూ ఏం జరుగుతోందో కచ్చితత్వంతో గుర్తించేందుకు ఈ కార్లకు 5జీ ఉపయోగపడుతుందని అనుకొంటున్నారు.

వ్యక్తులు 'ఇంటరాక్ట్' అయ్యే తీరును 5జీ మార్చివేయగలదని ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న పరిశోధకుడు అలెక్స్ మూయి చెప్పారు. రోడ్లు, రోడ్ల సదుపాయాలను 5జీ మార్చేస్తుందని, అసిస్టెడ్-డ్రైవింగ్, అటానమస్ డ్రైవింగ్‌ లాంటి అధునాతన అప్లికేషన్లను ఉపయోగించేందుకు తోడ్పడుతుందని వివరించారు.

Image copyright Getty Images

5జీ సేవలను ప్రారంభించిన మొదటి దేశం చైనా కాదు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద 5జీ మార్కెట్లలో ఒకటి చైనాలోనే శరవేగంగా రూపుదిద్దుకొంటోంది.

ఈ విస్తరణతో హువావే, జడ్‌టీఈ ప్రయోజనం పొందుతున్నాయి. అయినప్పటికీ ఎంతో లాభదాయకమైన అమెరికా లాంటి విదేశీ మార్కెట్లలో ప్రవేశించాలని అవి కోరుకొంటున్నాయి.

నవంబరులో బీజింగ్‌లో 5జీపై జరిగిన ఓ సదస్సులో చైనా పరిశ్రమలు, సమాచార శాఖ మంత్రి మియావో వీయ్ మాట్లాడుతూ- అమెరికా రక్షణాత్మక విధానాలను అనుసరిస్తోందని, ఇందుకు సైబర్ భద్రతను ఒక సాకుగా చూపిస్తోందని ఆరోపించారు.

సైబర్‌భద్రతకు ముప్పుందనే నిరాధార ఆరోపణలు మోపి 5జీ నెట్‌వర్క్ విస్తరణలో పాలుపంచుకోకుండా ఏ కంపెనీని ఏ దేశమూ నిషేధించరాదని ఆయన వ్యాఖ్యానించారు.

Image copyright Getty Images

'టెక్ జాతీయవాదం తీవ్రతరమవుతోంది'

చైనా, అమెరికా మధ్య వివాదం ఇప్పట్లో పరిష్కారం కాదనే అభిప్రాయాన్ని టెక్నాలజీ రంగ నిపుణులు వ్యక్తంచేస్తున్నారు.

'టెక్ జాతీయవాదం(టెక్ నేషనలిజం)' తీవ్రతరమవుతోందని, ఇప్పుడు చైనా-అమెరికా మధ్య ఆర్థిక ఉద్రిక్తతలను 'సాంకేతిక ప్రచ్ఛన్నయుద్ధం(టెక్నలాజికల్ కోల్డ్ వార్)'గా తాము చూస్తున్నామని సీసీఎస్ ఇన్‌సైట్ సంస్థ చీఫ్ ఆఫ్ రీసర్చ్ బెన్ వుడ్ వ్యాఖ్యానించారు.

5జీలో ప్రపంచ అగ్రగామిగా చైనా నిలవాలనే దృఢ సంకల్పంతో చైనా ప్రభుత్వం ఉందని, హువావేకు స్వదేశీ మార్కెట్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

5జీలో ఇతర దేశాలు కూడా ముందుకెళ్లాల్సి ఉందని, వెనకబడిపోతే వాటికే మంచిది కాదని అభిప్రాయపడ్డారు. హువావే 5జీ సామగ్రి అందకపోతే అమెరికా మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు ఇతర సరఫరాదారులను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. ఆయా సంస్థల పరికరాల ఖరీదు ఎక్కువగా ఉండొచ్చని, హువావేతో పోలిస్తే అవి 5జీలో తక్కువ అధునాతనమైనవి అయ్యుండొచ్చని వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)