చక్కెర వినియోగంపై జరిమానా విధిస్తే ఆరోగ్యం చక్కబడుతుందా... ప్రపంచంలో చక్కెర ఎక్కువగా తినే ప్రజలు ఎవరు?

  • 3 డిసెంబర్ 2019
చక్కెర వినియోగంపై జరిమానా విధిస్తే ఆరోగ్యం చక్కబడుతుందా Image copyright Getty Images

ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజ్-2019 ఒక అధ్యయనం ప్రచురించింది. ఈ రిపోర్టులో ప్రచురించిన అంశాలను ఇజ్రాయెల్ మీడియా చాలా సెలబ్రేట్ చేసుకుంది.

నిజానికి, ఈ అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలకు సంబంధించిన ఆరోగ్య గణాంకాల విశ్లేషణలు ఉన్నాయి. వాటిలో ప్రపంచంలో ఆహారపు అలవాట్ల వల్ల సంభవించే మరణాలు అతి తక్కువగా ఉండేది ఇజ్రాయెల్‌లోనే అని ఈ స్టడీ వల్ల తెలిసింది.

ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలామంది దీనిపై వ్యాసాలు రాశారు. ఇజ్రాయెల్ పౌరులు పాటించే ఆహారపు అలవాట్లను అందరూ పాటించాలని ప్రోత్సహించారు.

కానీ, మనం అలా చేయాలంటే ప్రపంచంలోని మిగతా దేశాల పౌరులందరి కంటే ఎక్కువ చక్కెరను ఉపయోగించాల్సి వస్తుంది.

Image copyright Getty Images

ప్రమాదం కంటే తక్కువేం కాదు

2018లో ఇజ్రాయెల్‌లో ఒక వ్యక్తి చక్కెర వినియోగం 60 కిలోలకు పైనే అని తేలింది. అంటే ఆ దేశంలో సగటున ఒక వ్యక్తి నెలకు 5 కిలోలు, రోజూ 165 గ్రాములకు పైగా చక్కెర తీసుకుంటున్నారు.

ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) నుంచి బీబీసీ సంపాదించిన గణాంకాల ప్రకారం ఇది ప్రపంచంలోనే అత్యధిక చక్కెర వినియోగం.

ఇజ్రాయెల్‌లో సగటున ఒక వయోజనుడు ప్రతి రోజూ 30 చెంచాలకుపైగా చక్కెర తీసుకుంటున్నాడు. ఇది చాలా ప్రమాదం అని ఇజ్రాయెల్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ డయాబెటిస్ చీఫ్, ప్రపంచ డయాబెటిస్ నిపుణుల్లో ఒకరు ప్రొఫెసర్ ఇటామార్ రాజ్ అన్నారు.

అత్యధికంగా చక్కెర తినే ఐదు దేశాల్లో ఇజ్రాయెల్ తర్వాత మలేసియా, బార్బడోస్, ఫిజీ, బ్రెజిల్ ఉన్నాయి.

మరోవైపు ఉత్తర కొరియాలో ప్రపంచంలో అతి తక్కువ చక్కెర వినియోగం ఉంది. ఇక్కడ 2018లో ఒక వ్యక్తి సగటు చక్కెర వినియోగం 3.5 కిలోలు. దాని, పొరుగు దేశం దక్షిణ కొరియాలో సగటున ఒక వ్యక్తి ఏడాదికి 30.6 కిలోల చక్కెర తీసుకుంటున్నాడు.

Image copyright Getty Images

అమెరికాలో ఆహారపు అలవాట్ల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అక్కడ దీనిపై చాలా అధ్యయనాలు జరిగాయి. అమెరికాలో సంవత్సరానికి ఒక వ్యక్తి చక్కెర వినియోగం 31.1 కిలోలు. కానీ, ఆ దేశం చక్కెర ఎక్కువగా వినియోగించే టాప్ 20 దేశాల్లో లేదు.

మొత్తం గణాంకాల ప్రకారం చూస్తే, ప్రపంచంలో చక్కెర వినియోగం ఎక్కువగా భారత్‌లోనే ఉంది. 2018లో భారత్‌లో 25.39 మిలియన్ మెట్రిక్ టన్నుల చక్కెర వినియోగించారు. ఇది యూరప్‌లోని అన్ని దేశాల చక్కెర వినియోగం కంటే చాలా ఎక్కువ.

Image copyright AFP

గణాంకాలకు విలువ ఎందుకు

జనం ఆహార పదార్థాల్లో ఎంత చక్కెర ఉపయోగిస్తున్నారనేది, దాని వినియోగం గణాంకాల్లో తెలీడం లేదు. అంతే కాదు, ఆరోగ్య నిపుణులు షుగర్ ఫ్రీ అని చెబుతున్నవాటిలో, తయారీ సమయంలోనే చక్కెర కలుపుతారు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పళ్ల రసాలు లాంటి కొన్ని ఆహార పదార్థాలలో చక్కెర స్థాయి సహజంగా ఎక్కువగా ఉంటుంది.

ఇవన్నీ కలిపి చూస్తే ప్రపంచవ్యాప్తంగా చక్కెర వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం 2001లో చక్కెర వినియోగం 123.4 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉంటే అది 2018లో పెరిగి 172.4 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంది.

దీనిని బట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తి సగటు చక్కెర వినియోగం ఏడాదికి 22.6 కిలోల దగ్గరగా ఉంది.

Image copyright Getty Images

చక్కెర వినియోగం ఎందుకు పెరుగుతోంది

మనం అసలు అంత ఎక్కువ చక్కెర ఎందుకు తింటున్నాం అనేదే ఇక్కడ ప్రశ్న.

దానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, సంప్రదాయం ప్రకారం మన శరీరానికి లభించే శక్తి వనరుల్లో చక్కెర చౌకగా, సులభంగా లభిస్తుంది.

అమెరికా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ప్రకారం "భారత్‌లో చక్కెర సామాన్యులు ఉపయోగించే ముఖ్యమైన పదార్థం. పేదలకు అత్యంత చౌకగా దొరికే ఒక శక్తి వనరు.

ఇటీవలి దశాబ్దాల్లో భారత్‌లో చక్కెర వినియోగం చాలా పెరిగింది. 60వ దశకంలో దేశంలో ఏడాదిలో 2.6 మిలియన్ మెట్రిక్ టన్నుల చక్కెర వినియోగించేవారు. అది 90వ దశకం మధ్యలో 13 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగింది.

గత ఐదు శతాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాలలో ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగం కూడా పెరిగింది.

అమెరికా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం 2012 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాల అమ్మకాల్లో 77 శాతం భాగం ప్రాసెస్ట్ ఫుడ్స్ ఉన్నాయి.

ప్రాసెస్డ్ ఫుడ్స్‌‌ తయారీలో అత్యంత ముఖ్యమైన వనరు చక్కెర. ఎక్కువగా రుచి కోసం, కొన్నిసార్లు వాటి కాల పరిమితి పెంచడానికి దీనిని ఉపయోగిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వైద్యులు "గ్లోబల్ ఒబెసిటీ ఎపిడమిక్ (అంతర్జాతీయ ఊబకాయ సమస్య)కు ముఖ్యమైన కారణం చక్కెర వినియోగమే" అని చెబుతున్నారు.

Image copyright Getty Images

చక్కెర తక్కువ తినండి

అందరూ తక్కువ చక్కెర తీసుకోవాలని 2015లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసింది.

వయోజనులు, పిల్లలు తమ టోటల్ ఎనర్జీ ఇన్‌టేక్‌లో చక్కెర కేవలం 10 శాతం కంటే తక్కువ ఉండాలని సూచించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఒక వ్యక్తి రోజువారీ చక్కెర వినియోగం 5 శాతం అంటే 25 గ్రాములు లేదా 6 చెంచాల కంటే తక్కువ ఉంటే, మనకు దానివల్ల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

"వైద్యులు చక్కెర తక్కువ తినమని చెబుతున్నారు. కానీ, వాస్తవం ఏంటంటే అన్ని వయసుల వారు, అన్ని ఆదాయ వర్గాల వారు చక్కెర ఎక్కువగా తీసుకుంటున్నారు" అని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ సీనియర్ డైటీషియన్ విక్టోరియా టేలర్ చెప్పారు.

Image copyright Getty Images

చక్కెర వినియోగంపై పన్నులు విధించే ఆలోచన

గత కొంత కాలంగా చాలా దేశాలు కేవలం వైద్య సలహాలు మాత్రమే ఇవ్వడం లేదు. 20 కి పైగా దేశాలు తమ చక్కెర ఉత్పత్తుల (ముఖ్యంగా సాఫ్ట్ డ్రింక్స్)పై పన్నులు పెంచాయి.

ఈ నెల మొదట్లో సింగపూర్ ఎక్కువ షుగర్ ఉన్న డ్రింక్స్‌ను ప్రమోట్ చేసే ప్రకటనలపై నిషేధం విధించి, ప్రపంచంలోనే అలా చేసిన మొట్టమొదటి దేశం అయ్యింది. ఈ పన్నులు వచ్చే ఏడాది నుంచి అమలవుతాయి.

"మన ప్రజల వయసు పెరుగుతోంది. దీర్ఘకాలిక వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. దాంతో, ఆరోగ్యం కోసం చేసే ఖర్చు కూడా పెరుగుతోంది. మనం వాటిని భరించలేకపోతున్నాం. మేం జోక్యం చేసుకోకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది" అని అక్టోబర్ 10న సింగపూర్ ఆరోగ్య శాఖ మంత్రి ఎడ్విన్ టాంగ్ అన్నారు.

ఎనర్జీ డ్రింక్స్‌పై ఎందుకు దృష్టి పెడుతున్నారో, కారణం తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. వాటిలో షుగర్ పరిమాణం ఎక్కువ ఉండడంతోపాటు, పోషకాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా వీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంది.

హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గణాంకాల ప్రకారం 355 మిల్లీలీటర్ల ఆరెంజ్ సోడాలో 11 చెంచాల చక్కెర ఉంటుంది.

ఎనర్జీ డ్రింక్స్ ఉపయోగించడం వల్ల బరువు పెరుగుతారని కూడా చాలా అధ్యయనాల్లో బయటపడింది. దానివల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె వ్యాధులు, అకాల మరణాల ముప్పు పెరుగుతుందని తేలింది.

Image copyright Getty Images

పెరుగుతున్న విమర్శలు

అయితే చక్కెర గురించి విమర్శలు ఎక్కువ అవుతున్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

"జనం ఆరోగ్యం పాడు చేసే చాలా పదార్థాలు తింటారు, తాగుతారు. కానీ అందరూ దానికి చక్కెరను టార్గెట్ చేస్తున్నారు" అని ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జోసె ఓరైవ్ బీబీసీతో అన్నారు.

"చక్కెరపై ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. చక్కెర అత్యంత ముఖ్యమైన శక్తి వనరు అనే విషయం కూడా మనం మర్చిపోకూడదు. అది తల్లిపాలలో కూడా ఉంటుంది".

"ఊబకాయం సమస్య పరిష్కరానికి కేవలం చక్కెరనే టార్గెట్ చేసుకోకూడదు. దానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. అంటే మన డైట్‌తో పోలిస్తే శారీరక కార్యకలాపాలు తగ్గిపోయాయి. మేం ఒకటే చెబుతాం. అతిగా తినడం ఎవరికీ మంచిది కాదు" అన్నారు.

Image copyright Getty Images

మారుతున్న ఆహారపు అలవాట్లు

"చక్కెర సమస్యలో ఒక భాగం మాత్రమే" అని చెప్పారు.

ఊబకాయం సమస్య పర్యావరణం, మన ఆహారపు అలవాట్లలో గందరగోళం వల్ల వస్తోంది. అందుకే మనం చాలారకాల నిబంధనలు ఏర్పాటు చేయాలి. వాటిలో జరిమానా విధించడం నుంచి తప్పనిసరి సవరణ కార్యక్రమాలు నడిపించడం కూడా ఉండాలి.

చక్కెర వినియోగంపై జరిమానా విధించడం లాంటి వాటిపై ప్రశ్నలు లేవనెత్తిన ఓరైవ్.. "అవి చాలాకాలం నుంచీ అమలులో ఉన్నాయి. ఫుడ్ అండ్ డ్రింక్ ఇండస్ట్రీ వారు ఆ పన్నులను పట్టించుకోవడం లేదు. చక్కెర వినియోగం తగ్గడం లేదు" అన్నారు.

అయితే, ఇటీవల చక్కెర వినియోగం తీయటి రుచి కోసమే కాదు, ఉత్పత్తులను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు.

"జరిమానాలు విధించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనేది స్పష్టం. కానీ ఈ చర్చలో ఫుడ్ ఇండస్ట్రీ చీఫ్‌లు కూడా భాగమయ్యేలా చేయాలి. వారికి కూడా తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వాలి" అని ఓరైవ్ చెప్పారు.

అయితే కొన్ని దేశాల్లో ఫుడ్, డ్రింక్ కంపెనీలు ఆ పని చేశాయి. గత డిసెంబర్‌లో ప్రధాన ఆహార ఉత్పత్తి సంస్థలు ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నాయి. 2025 నాటికి తమ ఉత్పత్తుల్లో చక్కెర, ఉప్పు పరిమాణం తగ్గిస్తామని, డ్రింక్స్‌లో చక్కెర మొత్తాన్ని 15 శాతం కంటే తక్కువ చేస్తాం అని కూడా చెప్పాయి.

Image copyright Getty Images

కీలక ప్రశ్నలు

చక్కెర వినియోగంపై జరిమానాలు విధించడం మంచిదేనా? అది ప్రభావం చూపిస్తుందా?

సాఫ్ట్ డ్రింక్స్ మీద 10 శాతం టాక్స్ పెంచడం వల్ల సగటున దాని వినియోగం 10 శాతం తగ్గుతుందని న్యూజీలాండ్‌లోని ఒటాగో యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు.

కొన్ని ప్రాంతాల్లో జరిమానాల నుంచి తప్పిచుకునేందుకు ఫుడ్, డ్రింక్ ఉత్పత్తుల కంపెనీలు తమ ఉత్పత్తుల్లో మార్పులు కూడా చేశాయి.

బ్రిటన్‌లో యాక్షన్ ఆన్ షుగర్ సంస్థ వివరాల ప్రకారం 2018 ఏప్రిల్ తర్వాత కంపెనీలు ఆహార పదార్థాల్లో చక్కెర మోతాదును 28.8 శాతం వరకూ తగ్గించినట్లు తేలింది.

చాలా దేశాల్లో చక్కెర టాక్స్ పేరుతో కొత్త పన్నుల నిబంధనలు అమలు చేశారు. కానీ దాని వల్ల సామాన్యుల ఆరోగ్యంపై ఏదైనా ప్రభావం కనిపించిందా అనేదానిపై ఇంకా అంచనా వేయలేదు.

బిస్కట్స్, కేక్ స్వీట్లపై బ్రిటన్‌ సైద్ధాంతిక పన్ను విధించడం ప్రారంభించింది. అది సామాన్యులు ఆరోగ్యంగా ఉండడానికి చాలా ప్రయోజనకరంగా మారింది" అని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ రీసెర్చర్లు గుర్తించారు.

ఈ ఉత్పత్తుల ధరలను 20 శాతం పెంచడం వల్ల ప్రజలపై ఎలాంటి ప్రభావం పడిందో వీరు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో కలిసి ఒక అంచనా వేశారు.

దాని ఫలితాలు విస్మయం కలిగించాయి. కేకులు, బిస్కెట్ల ధరలు పెరగడంతో అన్ని ఆదాయ వర్గాల వార్షిక సగటు చక్కెర వినియోగం 1.3 కిలోలకు తగ్గింది. అయితే సాఫ్ట్ డ్రింక్స్ ధరల్లో పెంపు వల్ల ఏటా సగటున 203 గ్రాముల చక్కెర వినియోగం మాత్రమే తగ్గింది.

Image copyright Getty Images

స్నాక్స్పై టాక్స్

"ఎలాంటి వాస్తవికతలను చూసి విధానాలు రూపొందించాలి అనేదానికి బ్రిటన్‌ ఒక ఉదాహరణగా నిలుస్తోంది. బ్రిటన్ ప్రజలు స్నాక్స్‌లో ఎక్కువ చక్కెర తింటున్నారు. సాఫ్ట్ డ్రింక్స్ తక్కువ ఉపయోగిస్తున్నారు" అని పరిశోధన చేసిన పావులిన్ స్కీల్బీక్ చెప్పారు.

"ఈ స్నాక్స్ టాక్స్ వేయడం వల్ల బ్రిటన్‌లో ఊబకాయం సమస్యను ఒక ఏడాదిలో 2.7 శాతం వరకూ తగ్గించవచ్చన్నారు".

"జరిమానా విధించడం వల్ల ఆ ప్రభావం ఉంటుందని మనకు స్పష్టమైంది. కానీ, అది ఊబకాయం తగ్గించడానికి, ఆరోగ్యం మరింత మెరుగుపరచడానికి ఒక అద్భుత మాత్ర అయితే కాదు. కానీ, చక్కెర వినియోగం తగ్గించడం అనేది మాత్రం మనం కొట్టిపారేయకూడదు" అని పరిశోధకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

"తెలంగాణలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి": ఆదివాసీ హక్కుల పోరాట సమితి

అత్యాచారం చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడేలా చట్టం చేస్తాం: వైఎస్ జగన్

ఒలింపిక్స్‌తో సహా ప్రధాన క్రీడల ఈవెంట్లలో పాల్గొనకుండా నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం

చిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్

‘వారం రోజుల్లో నిందితులకు శిక్ష పడాలి.. లేదంటే సీఎం ఇంటి ముందు కాల్చుకుంటా’

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: కొనసాగనున్న యడ్యూరప్ప ప్రభుత్వం.. బీజేపీకి 12 స్థానాల్లో గెలుపు

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు.. కాంగ్రెస్ మతం పేరుతో దేశాన్ని విభజించిందన్న అమిత్ షా

న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ఐదుగురు మృతి