డోనల్డ్ ట్రంప్: మహిళల గురించి ఎలా మాట్లాడతారు... ఆయన మాటల ప్రభావం ఏమిటి?

  • 30 నవంబర్ 2019
కెల్లీయాన్ కాన్వే (ఎడమ), డోనల్డ్ ట్రంప్; మేరీ యొవానోవిచ్ (కుడి) Image copyright Getty Images
చిత్రం శీర్షిక ట్రంప్ సలహాదారు కెల్లీయాన్ కాన్వే (ఎడమ), దౌత్యాధికారి మేరీ యొవానోవిచ్ (కుడి) ఇద్దరి మీదా ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

అమెరికా అధ్యక్ష పదవికి 2020లో జరగబోయే ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో తలపడటానికి అనేక మంది మహిళలు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రత్యర్థుల గురించి ట్రంప్ ఉపయోగించే భాష పునరావృతమయ్యే అంశమనే దాంట్లో సందేహం లేదు. కానీ.. ఆయన దాడుల్లో నిజంగా లింగ భేదం ఉందా?

ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో దౌత్యాధికారి, ఉక్రెయిన్ మాజీ రాయబారి మేరీ యొవనావిచ్‌ను ఆమె పేరుతో కాకుండా ''ఆ మహిళ'' అని ప్రస్తావించారు.

మేరీ యొవనావిచ్‌ను ఈ ఏడాది మేలో ఉక్రెయిన్ రాయబార పదవి నుంచి ట్రంప్ తొలగించారు. ట్రంప్ మీద జరుగుతున్న అభిశంసన విచారణ బహిరంగ కార్యక్రమంలో నవంబర్ 15వ తేదీన ఆమె వాంగ్మూలం ఇచ్చారు. తనను ''ప్రశ్నార్థకమైన ఉద్దేశాలు'' ఉన్నవారు ఒక విద్వేష పూరిత ప్రచారంలో భాగంగా తొలగించారని ఆమె ప్రజాప్రతినిధులకు చెప్పారు.

ఆమెను తొలగించాలన్న తన నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకుంటూ.. ''ఆ రాయబారి.. ఆ మహిళ'' గురించి తాను ''చెడ్డ విషయాలు'' విన్నానని గత శుక్రవారం 'ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్' టీవీ చానల్‌తో పేర్కొన్నారు.

''అది ఒక దేవత కాదు.. ఆ మహిళ. ఒకే? ఆమె చేసిన పనులు చాలా ఉన్నాయి.. అవి నాకు నచ్చలేదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

''ఆమె మహిళ కాబట్టి.. మనం మంచిగా ఉండాలి'' అంటూ తన సిబ్బంది కొందరు దయార్ద్రంగా వ్యవహరించాలని భావించారని కూడా ట్రంప్ చెప్పారు.

ఈ వ్యాఖ్య.. లింగ వివక్ష భాషకు ఉత్తమ ఉదాహరణ అని యేల్ యూనివర్సీటీలో సైకాలజిస్ట్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ మారియాన్ లాఫ్రాన్స్ అంటారు.

''ఇలా ప్రస్తావించటం.. ఆమె ఒక వ్యక్తి కాదని.. ఆమె ఒక వృత్తి నిపుణురాలు కాదని.. అన్నిటికన్నా ముందు ఆమె ఒక మహిళ అని చెప్తోంది'' అని ఆమె విశ్లేషించారు.

''మహిళలు, భాషకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మహిళలను ప్రత్యేకంగా చెప్తారు. సాధారణంగా పురుషులను ప్రత్యేకంగా 'పురుష వ్యక్తి' అని ప్రస్తావించరు'' అంటారు ప్రొఫెసర్ లాఫ్రాన్స్.

''ఒక వ్యక్తిని అన్నిటికన్నా ముందుగా ఒక మహిళ అని వర్ణించటం సులభంగా, ఉపయుక్తంగా మనకు అనిపిస్తుంది. ఒక రాజకీయవేత్త కాదు - ఆమె ఒక మహిళా రాజకీయవేత్త. ఆయన ఒక పురుష రాజకీయవేత్త అని మనం మామూలుగా అనం'' అని వివరించారు.

ఎవరినైనా ''గుర్తించటా''నికి ఒకసారి భాషను ఉపయోగించిన తర్వాత అది ''ఒక మూసపోత ప్రపంచాన్ని తెరుస్తుంది''. సాధారణంగా అదంతా అచేతనంలో జరుగుతుంది.

''కాబట్టి.. ఆమె విధానాలు, ఆమె విజయాలు, ఆమె రాజకీయ వైఖరి గురించి ఏదైనా చెప్పటానికి ముందుగా - ఒక మహిళా రాజకీయవేత్త అని చెప్పటంలో - చాలా చెప్పేస్తారు'' అని

Image copyright Reuters
చిత్రం శీర్షిక టెక్సస్‌లో డోనల్డ్ ట్రంప్, ఆయన కూతురు ఇవాంకా ట్రంప్

వివాదాస్పద గత చరిత్ర

ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావటానికి ముందే.. మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గత చరిత్ర ఉంది. 2005 నాటి యాక్సెస్ హాలీవుడ్ టేపులో.. మహిళలను వారి మర్మాంగంతో ఆక్రమించుకోవాలనే అర్థంలో బూతు పదం ఉపయోగిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్య 2016లో పతాక శీర్షకలకు ఎక్కింది. మహిళల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యల్లో చాలా అపకీర్తి పొందిన వ్యాఖ్య బహుశా అదే కావచ్చు.

తాజా వ్యాఖ్యలు ఒక వ్యూహంలో భాగమని రట్జర్స్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ అమెరికన్ ఉమన్ అండ్ పాలిటిక్స్ డైరెక్టర్ డెబ్బీ వాల్ష్ అంటున్నారు.

''హిల్లరీ క్లింటన్, కార్లీ ఫియోరినా, ఎలిజబెత్ వారెన్, హైదీ క్రజ్ - ఈ జాబితా చాలా పెద్దది - వంటి వాళ్ల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు - ఆయన మహిళల గురించి - ప్రముఖ, శక్తివంతురాలైన ఏ మహిళ గురించి అయినా - అత్యంత అవమానకరంగా, వారిని అత్యంత అల్పంగాచేసి మాట్లాడతారు'' అని డెబ్బీ పేర్కొన్నారు.

ట్రంప్‌కు మద్దతు ఇచ్చే మహిళలకు సైతం నిగూఢమైన లింగ వివక్ష విమర్శల నుంచి రక్షణ లేదు.

తన సలహాదారు కెల్లీయాన్ కాన్వే గొప్ప వ్యక్తి అని.. అయితే ట్రంప్ విమర్శకుడైన ఆమె భర్త జార్జిని ఆమె ''ఏదో గాయపరచి ఉండి తీరాలి'' అని ట్రంప్ శుక్రవారం నాడు ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్‌తో వ్యాఖ్యానించారు.

''ఆ వ్యక్తికి పిచ్చిపట్టింది.. అతడి పట్ల ఆమె కచ్చితంగా ఏదో చెడ్డ పనులు చేసి ఉంటుంది'' అని ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే మహిళలు ''అత్యధిక స్థాయిలో స్త్రీత్వం గల మహిళలుగా కనిపిస్తారు'' అని కూడా డెబ్బీ వాల్ష్ చెప్పారు.

ఉదాహరణకు ఇవాంకా ట్రంప్ ఒక విజయవంతమైన వాణిజ్యవేత్త. అయినా కూడా ''ఒక శక్తివంతమైన పురుషుడి చేతి మీద'' ఒక సగటు మహిళ చిత్రంలో ఒదిగిపోతారు.


మహిళల గురించి ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యల్లో కొన్ని:

  • మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్: ''ఆమెకు ఆకర్షణీయ రూపం లేదు. ఆమెకు దమ్ము లేదు. ఆమెకు దమ్ము లేదని నేను అన్నాను. ఆమెకు దమ్ము ఉందని నేను నమ్మటం లేదు.''
  • రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వానికి పోటీ పడిన నాయకురాలు కార్లీ ఫియోరినా: ''ఆ ముఖం చూడండి! దానికి ఎవరైనా ఓటు వేస్తారా? మీరు దానిని ఊహించగలరా.. మన తర్వాతి అధ్యక్ష ముఖాన్ని?''
  • సెనెటర్ ఎలిజబెత్ వారెన్: ''వెర్రిముఖం ఎలిజబెత్ వారెన్‌, అమెరికా సెనెటర్లలో అత్యంత పనికిమాలిన వాళ్లలో ఒకరు - ఆమెకి అసహ్యకరమైన నోరు ఉంది.''
  • జర్నలిస్ట్ మేగన్ కెల్లీ: ''ఆమె కళ్ల నుంచి రక్తం కారటం మీరు చూడొచ్చు. ఆమెకు ఎక్కడెక్కడినుంచో రక్తం కారుతోంది.''
  • తనపై దాడి చేశారని ఆరోపించిన ఇ జీన్ కారల్: ''నంబర్ 1, ఆమె నా టైప్ కాదు. నంబర్ 2, అదెప్పుడూ జరగలేదు. అదెప్పుడూ జరగలేదు. ఒకే?''
  • రోసీ ఓ డానెల్: ''ఆమె బద్ధకస్తురాలు. అసలు ఆమె టెలివిజన్ మీదకు ఎలా వచ్చింది? 'ద వ్యూ'ని నేను గనుక నడుపుతున్నట్లైతే.. రోసీని నేను తీసిపారేస్తా. అసహ్యకరమైన, కొవ్వుపట్టిన ఆమె ముఖంలోకి చూసి.. 'రోజీ నిన్ను తీసిపారేశా' అని చెప్తా.''
  • ఇవాంకా ట్రంప్: ''ఆమెకు నిజంగానే చాలా మంచి సౌష్ఠవం ఉంది. ఇవాంకా నా కూతురు కాకపోయినట్లయితే బహుశా ఆమెతో నేను డేటింగ్ చేస్తుండే వాడినని చెప్పాను.''
  • వైట్ హౌస్ మాజీ సహాయకురాలు ఒమారోసా న్యూమన్: ''పిచ్చిపట్టిన, ఏడుస్తున్న ఓ నీచురాలిని అందలం ఎక్కించి, వైట్ హస్‌లో ఉద్యోగం ఇస్తే.. అది పనిచేయలేదని నేను అనుకుంటున్నా.''

మనస్తత్వశాస్త్ర దృక్కోణంలో.. వ్యాఖ్యలు అనేవి దూషణల పరిధిలోకి వెళ్లినపుడు అవి కనిపించకుండా చాలా హాని చేయగలవని ప్రొఫెసర్ లాఫ్రాన్స్ పేర్కొన్నారు.

మహిళలు లింగ వివక్ష వ్యాఖ్యలను విన్నప్పుడు.. ఆ వ్యాఖ్యలు వినేవారిని ఉద్దేశించి చేసినవి కాకపోయినా కూడా.. ఆ మహిళ ఈత్మగౌరవం మీద ప్రతికూల ప్రభావం చూపుతాయని ఈ అంశం పై ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో గుర్తించిందని ఆమె చెప్పారు. ఆ సంఘటన అనంతరం ఆమె తన సొంత పనితీరును, సామర్థ్యాలను ఎంత బాగా అంచనా వేయగలుగుతున్నారనేదానిని పరిశీలించటం ద్వారా ఈ నిర్ధారణకు వచ్చినట్లు వివరించారు.

''అది.. (ఆ లింగ వివక్ష వ్యాఖ్య) లక్ష్యంగా చేసుకున్న ఏదో ఒక్క మహిళను కాదు - అందరు మహిళలనూ లక్ష్యంగా చేసుకునే ఒక వాతావరణాన్ని నెలకొల్పుతుంది. ముఖ్యంగా ఇది చాలా చెరుపు చేస్తుంది'' అంటారు ప్రొఫెసర్ లాఫ్రాన్స్.

ప్రత్యేకించి ట్రంప్ తన మహిళా ప్రత్యర్థులని విమర్శించినపుడు.. వారిని ఆయన తరచుగా ఒక లైంగిక వస్తువుగానో, గౌరవించాల్సిన, పట్టించుకోవాల్సినంత విలువలేని వారిగానో దిగజార్చి మాట్లాడుతుంటారు.

''ఒక మహిళ గురించి ఆమె శక్తివంతురాలు కాదంటూ చేసే వ్యాఖ్యలు - ఆమె బలహీనురాలని, నాజూకుగా ఉంటారనే ఒక అభిప్రాయం - మర్మాంగాల గురించి చేసే వ్యాఖ్యలతో పోలిస్తే అంత తీవ్రమైనవిగా కనిపించవు. కానీ.. అవి కూడా మహిళల మీద అంతే దుష్ప్రభావం కలిగిస్తాయి. ఎందుకంటే పురుషులకన్నా మహిళలు తక్కువ స్థాయి గల వారని ఇప్పటికే నెలకొనివున్న భావనలను అది వాడుకుంటుంది'' అంటారు ప్రొఫెసర్లాఫ్రాన్స్.

Image copyright Getty Images

ట్రంప్ - మహిళల చాంపియనా?

మహిళలను ఆయన వివాదాస్పద రీతుల్లో అభివర్ణిస్తున్నప్పటికీ, ఆయన మంత్రివర్గంలో పురుషులే అత్యధికంగా ఉన్నప్పటికీ - శక్తివంతమైన మహిళలకు ట్రంప్ తన ఆంతరంగిక వర్గంలో చోటు ఇవ్వరని చెప్పటం సరికాదు.

వైట్ హౌస్ సలహాదారైన ఇవాంకాతో పాటు.. అధ్యక్షుడిని అనునిత్యం సమర్థిస్తున్న అత్యున్నతస్థాయి పాలక వర్గం సభ్యుల్లో కాన్వే, ప్రెస్ సెక్రటరీ స్టెఫనీ గ్రీషమ్‌ ఉన్నారు. గ్రీషమ్ కన్నా ముందు ఆ పదవిలో నిర్వర్తించిన సారా హకాబీ సాండర్స్ కూడా ఒక మహిళే.

మహిళల పట్ల ఆయన వైఖరిని ప్రశ్నించినపుడు.. తన కంపెనీల్లో మహిళలను చేర్చుకుని, ప్రోత్సహించిన తన చరిత్ర గురించి ట్రంప్ ఉటంకిస్తారు. ''మహిళలను నేను ప్రేమిస్తున్నా'' అని ఆయన ప్రకటిస్తారు.

రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రచారానికి బ్రాడ్ పార్స్కేల్ సారథ్యం వహిస్తున్నారు. అయితే పొలిటికో కథనం ప్రకారం.. ఈ ప్రచార బృందంలోని అత్యున్నత స్థాయి పదవుల్లో సీనియర్ సలహాదారులు, డైరెక్టర్లుగా డజను మందికి పైగా మహిళలు ఉన్నారు.

మహిళల విషయంలో ట్రంప్ వ్యాఖ్యల గురించి అభిప్రాయం చెప్పాలంటూ.. ట్రంప్‌కు అనుకూలంగా ఉండే అతి పెద్ద మహిళా రాజకీయ బృందాల్లో ఒకటైన 'ఉమన్ ఫర్ ట్రంప్'ను బీబీసీ సంప్రదించింది. కానీ ఎటువంటి సమాధానం రాలేదు.


ట్రంప్‌ను ప్రేమించే మహిళలు

తారా మెక్‌కెల్వీ విశ్లేషణ

''ఆయన చేసిన పలు వ్యాఖ్యలు ప్రజలకు అంతగా రుచించలేదని నాకు అర్థమైంది'' వర్జీనియాలోని ఆరెంజ్ కౌంటీలో నివసించే ఒక న్యాయవాది వర్జీనియా డెర్బీ జోర్డాన్ పేర్కొన్నారు.

కానీ.. వాటిని తాను పట్టించుకోనని అంటారు ఆమె. అధ్యక్షుడి వ్యాఖ్యల కన్నా మరింత ముఖ్యమైన అంశాలు ఉన్నాయని.. ఆమెతో పాటు వర్జీనియా, పెన్సిల్వేనియా, ఇతర రాష్ట్రాల్లోని సంప్రదాయవాద మహిళలు చెప్తారు.

మహిళల్లో నిరుద్యోగితను తగ్గించటానికి ట్రంప్ సాయం చేసిన తీరును వీరు ప్రశంసిస్తారు. సంప్రదాయవాద న్యాయమూర్తులను నియమించటం ద్వారా అబార్షన్లకు వ్యతిరేకంగా ఆయన పోరాడిన తీరును అభినందిస్తారు.

అలాగే.. అధ్యక్షుడి సలహాదారైన కెల్లియాన్ కాన్వే వంటి మహిళలను ఉన్నతస్థాయి పదవుల్లో నియమించిన తీరును కూడా జోర్డాన్, ఇతర రిపబ్లికన్ మహిళలు ఇష్టపడతారు: ''మహిళలను ఆయన చాలా ముఖ్యమైన పదవుల్లో నియమించారు'' అంటారు జోర్డాన్.

మహిళల గురించి అధ్యక్షుడు వివాదాస్పద రీతిలో మాట్లాడటం నిజమే అయినా కూడా.. వారిలో చాలా మంది ఆయనను ఇంకా ఆరాధిస్తున్నారని, 2020లో మళ్లీ ఆయనకు ఓటు వేస్తారని జోర్డాన్ ఉద్ఘాటిస్తున్నారు.


ఆయన పురుషులను కూడా గేలిచేయరా?

మహిళలను నాస్టీ (మురికి), క్రేజీ (వెర్రి), లో-ఐక్యూ (తెలివి తక్కువ) వంటి పేర్లతో గేలిచేసే ట్రంప్.. పురుషులను కూడా అదే రీతిలో పరిహసిస్తారు.

''పురుషులను అనేక విధాలుగా తక్కువ బలవంతులుగా, తక్కువ మగతనం ఉన్నవాళ్లుగా చూపటానికి వారిని అవమానించటానికి ప్రయత్నిస్తారు'' అంటారు డెబ్బీ వాల్ష్.

''ఆయన తనను ఏ రకంగానైనా సవాల్ చేసే పురుషులను తక్కువ చేసి చూపటం ద్వారా.. తనను తాను సర్వోత్కృష్టమైన మగాడిగా కూడా చూపుకుంటారు'' అని ఆమె పేర్కొన్నారు.

పురుష ప్రత్యర్థుల మీద ట్రంప్ విసిరే దూషణల్లో ఆయనకు ఇష్టమైన పదం 'లిటిల్'. అంటే పిల్లవాడు, పసివాడు అని. - లిటిల్ మార్కో రూబియో, లిటిల్ మైఖేల్ బ్లూమ్‌బర్గ్, లిటిల్ ఆడమ్ షిఫ్, లిటిల్ రాకెట్ మాన్ - ఇలా ఉంటుందీ జాబితా.

''ఒక వ్యక్తి కొలతను, వైఖరిని చిన్నది, పొట్టిది అని అభివర్ణించినపుడు.. లింగ సంబంధిత పదజాలాన్ని ఉపయోగిస్తున్నట్టే'' అంటారు ప్రొఫెసర్ లాఫ్రాన్స్.

ట్రంప్ తనను వ్యతిరేకించే పరుషులు, మహిళలను విమర్శించటంలో వివక్ష చూపనప్పటికీ.. మహిళల మీద దాడులు మరింత ప్రమాదకరమైనవని డెబ్బీ వాల్ష్ అభిప్రాయం.

కొత్తగా ఎన్నికైన శ్వేతజాతీయులు కాని డెమొక్రటిక్ పార్టీ మహిళా పార్లమెంటు సభ్యులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని.. ''ఇంటికి వెళ్లండి'' అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చాలా ''భయోత్పాతమైనవ''ని ఆమె అంటారు.

''మహిళలను తరచుగా రాజకీయంగా లక్ష్యం చేసుకుంటారని, ఆన్‌లైన్‌లో బెదిరిస్తారని మనకు తెలుసు.. కానీ ఆ నలుగురు మహిళలనూ నిర్దిష్టంగా లక్ష్యం చేసుకుని, భారీ పదజాలం ఉపయోగించటం ఒక భయంకరమైన విషయం'' అని ఆమె వ్యాఖ్యానించారు.

దీని ప్రభావం 2020లో ఎలా ఉండొచ్చు?

ప్యూ రీసెర్చ్ సెంటర్ ఏప్రిల్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో.. ట్రంప్‌ మద్దతు రేటింగ్‌లో లింగపరమైన చీలిక బలంగా ఉందని గుర్తించారు.

అధ్యక్ష పదవిని ట్రంప్ నిర్వహించిన తీరును తాము ఆమోదిస్తున్నామని చెప్పిన పురుషుల సంఖ్య సగానికి కొంచెం తక్కువగా ఉంటే.. అటువంటి మహిళల సంఖ్య 32 శాతంగా ఉంది.

ట్రంప్ అధికారం చేపట్టిన తొలి రెండేళ్ల మీద ప్యూ నిర్వహించిన విశ్లేషణలో.. ఆయనను ఆమోదించే రేటింగ్.. సగటున పురుషుల్లో 44 శాతంగా, మహిళల్లో 31 శాతంగా ఉందని తేలింది. పురుషులు, మహిళల రేటింగ్‌లో ఇంత తేడా ఉండటం.. జార్జ్ హెచ్. డబ్ల్యు. బుష్ అధ్యక్ష పదవీ కాలం తర్వాత ఇదే అత్యధికం.

ఇక 2016లో శ్వేతజాతి మహిళల్లో విజయం సాధించిన ట్రంప్.. ఈసారి ఆ స్థాయిలో వారి మద్దతు పొందటం కష్టం కావచ్చునని ఇటీవలి ఒక సర్వే చెప్తోంది.

శ్వేతజాతికి చెందిన, కాలేజీ విద్యాభ్యాసం గల, పట్టణ ప్రాంత మహిళలు సాధారణంగా రిపబ్లికన్లని.. కానీ ట్రంప్ వారి మద్దతు పొందటం నిజంగా సవాలే అవుతుందని.. అందుకు ఒక కారణం ట్రంప్ ఉపయోగించే భాష, ప్రవర్తన, మహిళలతో వ్యవహరించే తీరు అని డెబ్బీ వాల్ష్ అంటారు.

''లింగ వివక్షాపూరిత భాష ఇప్పటికే ఉంది'' అని ఆమె పేర్కొన్నారు.

''డెమొక్రటిక్ వైపు ఏదో ఒక రకంగా (అధ్యక్ష అభ్యర్థి కానీ ఉపాధ్యక్ష అభ్యర్థి కానీ) ఒక మహిళ ఉండే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. ఆ మహిళ మీద ఖచ్చితంగా దాడి ఉంటుంది... ఇదే భాష ఇంకా ఎక్కువ చూడబోతున్నామని నా అభిప్రాయం'' అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: భారత్ లో కోవిడ్-19 ను జయించిన 93 ఏళ్ల వృద్ధుడు

కరోనావైరస్: కోవిడ్ రోగుల కోసం రూ. 50 వేలకే వెంటిలేటర్ చేయడం సాధ్యమేనా... భారత యువ ఇంజనీర్ల కృషి ఫలిస్తుందా?

కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 42,000 దాటిన మరణాలు, వైరస్ సోకిన వారి సంఖ్య 8.6 లక్షలు

కరోనావైరస్: 'ఆంధ్రప్రదేశ్‌లోని 87 కేసుల్లో 70 మంది దిల్లీకి వెళ్ళి వచ్చిన వారే' - వైఎస్ జగన్

కరోనావైరస్: ఇటలీలో విజృంభించిన వైరస్, 12 వేలు దాటిన మృతులు... తప్పు ఎక్కడ జరిగింది?

నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్ మర్కజ్: కరోనావైరస్ వ్యాప్తి చర్చలో కేంద్ర బిందువుగా మారిన తబ్లీగీ జమాత్ ఏం చేస్తుంది?

కరోనావైరస్ వల్ల చిన్నపిల్లలకు, టీనేజర్లకు కూడా ముప్పు ఉందా?

కరోనావైరస్: దిల్లీ నిజాముద్దీన్‌ తబ్లీగీ జమాత్ సదస్సుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంత మంది వెళ్ళారు?

కరోనావైరస్: రుణాల చెల్లింపులపై ఆర్‌బీఐ మారటోరియం - ఈఎంఐ కట్ అవుతుందా? వాయిదా వేయటం ఎలా?