చైనా కొత్త విధానం: మొబైల్ ఫోన్ కొని, వాడాలంటే అందులో ముఖాన్ని స్కాన్ చేసుకోవాల్సిందే

  • 1 డిసెంబర్ 2019
మొబైల్ వినియోగదారులు Image copyright AFP

చైనా ప్రభుత్వం తమ దేశంలోని కోట్ల మంది మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులను గుర్తించేందుకు గాను కొత్త విధానం అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇకపై కొత్త మొబైల్ ఫోన్ కొని దాన్ని వాడాలంటే అందులో ముఖాన్ని స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

సెప్టెంబరులోనే ప్రకటించిన ఈ కొత్త విధానాన్ని ఆదివారం నుంచి అమలు చేస్తున్నారు. ''సైబర్ స్పేస్‌లో ప్రజల చట్టబద్ధమైన హక్కులు, వారి ప్రయోజనాలు పరిరక్షించడమే మా ధ్యేయం'' అని అధికారులు చెప్పారు.

చైనాలో జనాభా సర్వే కోసం ఇప్పటికే ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను వాడుతున్నారు.

ఇలాంటి టెక్నాలజీల విషయంలో చైనా ప్రపంచంలోని మిగతా దేశాల కంటే ముందుంది. అయితే, ఇటీవల కాలంలో వీటి వాడకాన్ని పెంచుతుండడం అక్కడ చర్చకు దారితీస్తోంది.

Image copyright Getty Images

కొత్త నిబంధనలు ఏమిటి?

కొత్తగా మొబైల్ ఫోన్ కొనుగోలు చేసినా, డాటా సేవల కోసం రిజిస్టర్ చేసుకున్నా ఇంతవరకు వారి జాతీయతను తెలిపే గుర్తింపు కార్డులు, ఫొటోను స్కాన్ చేస్తే సరిపోయేది.. ఇప్పుడు దాంతో సరిపోలేందుకు ముఖాలనూ స్కాన్ చేయాల్సి ఉంటుంది.

దేశంలో ఇంటర్నెట్ వాడే ప్రతి ఒక్కరి గుర్తింపు పక్కాగా ఉండేలా.. వాడుతున్నదెవరో తెలుసుకునేలా నిబంధనలు అమలు చేయాలని చాలాకాలంగా చైనా ప్రయత్నిస్తోంది.

దీనివల్ల ఆన్‌లైన్‌లో వివిధ వేదికలపై కంటెంట్ పోస్ట్ చేసేవారిని అవసరమైనప్పుడు సులభంగా గుర్తించగలుగుతారు.

చైనా పారిశ్రామిక, ఐటీ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఈ నిబంధనలతో ఆ దేశంలోని ప్రతి మొబైల్ వినియోగదారుడి గుర్తింపు ప్రభుత్వం వద్ద ఉంటుంది. అక్కడ మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులే అధికంగా ఉండడంతో ఇంటర్నెట్ వినియోగదారుల గుర్తింపూ సులభతరమవుతుంది.

చైనా కృత్రిమ మేధపై అధ్యయనం చేస్తున్న ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి జెఫ్రె డింగ్ దీనిపై మాట్లాడుతూ.. ఇంటర్నెట్ మోసాలు అరికట్టడం, సైబర్ సెక్యూరిటీ పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చిందని చెప్పారు. గుర్తు తెలియని ఫోన్ నంబర్లు, గుర్తు తెలియని ఇంటర్నెట్ ఖాతాలు ఇక ఉండవని అన్నారు.

అదేసమయంలో ప్రజలపై పూర్తి నిఘాకు కూడా ఇది అవకాశం కల్పిస్తుందన్నారు.

Image copyright Getty Images

ప్రజలు ఏమంటున్నారు?

సెప్టెంబరులో ఈ కొత్త నిబంధనలను చైనా ప్రభుత్వం ప్రకటించినప్పుడు అక్కడి మీడియా దీనికేమీ పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు. కానీ, సోషల్ మీడియా వేదికగా మాత్రం చాలామంది ఆందోళన వ్యక్తంచేశారు.

''ఇది అమల్లోకి వస్తే ప్రజలను ప్రభుత్వం పూర్తిగా మానిటర్ చేస్తుంది. ప్రభుత్వం ఎందుకింతలా భయపడుతోంది'' అని మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్‌ సినా వీబో యూజర్ ఒకరు అన్నారు.

చైనాలో ఇప్పటికే ఎన్నో డాటా బ్రీచ్ ఉదంతాలున్నాయని చాలామంది నెటిజన్లు గుర్తు చేశారు.

మరికొందరు మాత్రం ఇదంతా టెక్నాలజీలో భాగంగా జరుగుతున్నదంటూ తేలిగ్గా తీసుకున్నారు.

కాగా చైనా ప్రభుత్వం తనకు నచ్చని, తన ప్రజలు చూడకూడదని భావించే కంటెంట్‌ను ఆ దేశంలో ఇంటర్నెట్‌లో రాకుండా నియంత్రణలు విధించింది.

Image copyright Getty Images

ఫేషియల్ రికగ్నిషన్ వాడకం ఎలా ఉంది?

ప్రజలపై నిఘా పెడుతుందన్న పేరు చైనాకు చాలాకాలంగా ఉంది. 2017లో అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా 17 కోట్ల సీసీ టీవీలు అమర్చింది. 2020 నాటికి వాటిని 40 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మరోవైపు సోషల్ క్రెడిట్ సిస్టం పేరుతో ప్రజల ప్రవర్తనకు కొలమానాలు పెడుతోంది. 2020 నాటికి దేశంలోని ప్రతి పౌరుడూ విస్తృతమైన డాటాబేస్‌లో ఉండేలా చేసి.. ప్రతి పౌరుడికీ ర్యాంకింగ్ ఇస్తారు.

ఫేషియల్ రికగ్నిషన్ విధానం నిఘా వ్యవస్థలో కీలకంగా మారనుంది. ఇది పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. పోలీసులు ఒక నిందితుడిని పట్టుకోవాలనుకుంటే ఆ వ్యక్తి 60 వేల మందిలో ఉన్నా కూడా ఈ టెక్నాలజీ సహాయంతో గుర్తించగలుగుతారు.

జిన్‌జియాంగ్ ప్రావిన్సులో వీగర్ ముస్లింలను ఉంచిన క్యాంపుల్లో వారిని ట్రాక్ చేయడానికి సర్వేలెన్స్ కెమేరాల్లో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడుతున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

చైనాలో రోజువారీ జీవితం, వాణిజ్య లావాదేవీల్లో ఈ టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు. దుకాణాలు, సూపర్‌మార్కెట్లలో పేమెంట్లూ ఈ విధానంలోనే చేస్తున్నారు.

అయితే, దీన్ని వ్యతిరేకిస్తున్నవారూ ఉన్నారు. ఈ ఏడాది ఒక వన్యప్రాణి అభయారణ్యం వద్ద సందర్శకులకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి చేయడంతో యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు కోర్టులో కేసు వేశారు.

ఓ యూనివర్సిటీలో విద్యార్థుల హాజరు, ప్రవర్తనను మానిటర్ చేయడానికి ఫేషియల్ రికగ్నిషన్‌ను వాడిన వ్యవహారం అక్కడ వివాదాస్పదం కావడంతో స్కూళ్లు, కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ వాడకాన్ని తగ్గించేలా చర్యలు చేపడతామని సెప్టెంబరులో చైనా ప్రభుత్వం ప్రకటించింది.

అదే ప్రభుత్వం ఇప్పుడు దీన్ని విస్తృతం చేయాలనుకోవడంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని జెఫ్రె డింగ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కశ్మీర్‌, దిల్లీలకు చెందిన ఇద్దరు కలం స్నేహితులు రాసుకున్న ఉత్తరాల్లో ఏముంది...

కరోనావైరస్: దక్షిణ కొరియాలో ఒకే రోజులో రెట్టింపైన రోగుల సంఖ్య

ట్రంప్‌కు 70 లక్షల మంది స్వాగతం పలకడం సాధ్యమేనా...

మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ

విశాఖ ఏజెన్సీ: తమ ఊరికి సొంతంగా రోడ్డు నిర్మించుకున్న ఈ గిరిజనులు ఏమంటున్నారో వింటారా...

ఛత్తీస్‌గఢ్ గిరిజనులపై బంగ్లాదేశ్ శరణార్థులు నిజంగానే ఆధిపత్యం చలాయిస్తున్నారా?

200 ఏళ్ల నాటి ఈస్టిండియా కంపెనీ పెయింటింగ్స్‌.. భారత్‌కు నచ్చలేదు, బ్రిటన్‌ ఇబ్బంది పడింది ఎందుకు

‘నగ్నంగా గుంపులుగా నిలబెట్టి, ‘ఫింగర్ టెస్ట్’లు చేశారు’: ఫిట్‌నెస్ పరీక్షల నిర్వహణ తీరుపై మహిళా ఉద్యోగుల అభ్యంతరం