జీసస్ మాంజర్: క్రిస్టమస్ కోసం వెయ్యేళ్ల తర్వాత బెత్లెహాం చేరిన ‘జీసస్ ఉయ్యాల తొట్టి చెక్క ముక్క’

  • 4 డిసెంబర్ 2019
జీసస్ మాంజర్ Image copyright Reuters

జీసస్ పుట్టినపుడు ఆయనను పడుకోబెట్టటానికి ఉపయోగించిన పశువుల తొట్టికి సంబంధించిన చెక్క ముక్కగా విశ్వసించే స్మారక అవశేషం 'జీసస్ మాంజర్'.. యూరప్ నుంచి దాదాపు వెయ్యేళ్ల తర్వాత బెత్లెహాం తిరిగిచేరింది.

బొటన వేలు పరిమాణంలో ఉండే ఈ అవశేషాన్ని.. రోమ్‌లోని బసిలికా ఆఫ్ సాంటా మారియా మాగియోర్ నుంచి నుంచి తిరిగి బహుమతిగా అందించాలని పోప్ ఫ్రాన్సిస్ ఆదేశించారు.

ఈ అవశేషం ఏడో శతాబ్దం నుంచీ రోమ్‌లోనే ఉంది.

బెత్లెహాంలో క్రిస్టమస్ సంబరాలు ఆరంభమయ్యే సమయానికి ఈ జీసస్ మాంజర్‌ను పంపించారు. మధ్యలో జెరూసలేంలో కొంత సేపు దీనిని ప్రదర్శించారు.

ఒక అలంకృత వేదికలో పొదిగిన ఈ అవశేషానికి.. నవంబర్ 30వ తేదీ శనివారం నాడు మేళతాళాలతో ప్రదర్శనగా స్వాగతం పలికి చర్చ్ ఆఫ్ సెయింట్ కాథరీన్‌కు తీసుకువెళ్లారు. ఇది జీసస్ జన్మించినట్లు భావించే చర్చ్ ఆఫ్ ద నేటివిటీ పక్కనే ఉంది.

Image copyright AFP

ఈ అవశేషానికి ఎంత ప్రాముఖ్యత ఉంది?

జీసస్ జన్మించినపుడు ఆయనను పడుకోబెట్టటానికి ఉయ్యాల తొట్టిగా ఉపయోగించిన పశువుల దాణా తొట్టిలో ఈ అవశేషం ఒక భాగమని క్రైస్తవులు విశ్వసిస్తారు.

జెరూసలేం ప్రధాన గురువు సెయింట్ సోఫ్రోనియస్ ఏడో శతాబ్దంలో ఈ అవశేషాన్ని పోప్ ఒకటో థియోడోర్‌కు విరాళంగా ఇచ్చారని హోలీ ల్యాండ్‌లో క్యాథలిక్ మత ప్రాంతాల సంరక్షక సంస్థ కస్టోడియా టెర్రా సాంక్టే పేర్కొంది.

అప్పటి నుంచీ ఈ అవశేషాన్ని రోమ్‌లోని బసిలికా ఆఫ్ సాంటా మారియా మాగియోర్‌లో ప్రదర్శించారని.. అక్కడ ప్రతి రోజూ ''ప్రపంచం నలుమూలల నుంచీ భారీ సంఖ్యలో తీర్థయాత్రికులు దీనిని పూజించటానికి'' వచ్చేవారని చెప్పింది.

అయితే.. ఆ అవశేషంలో అధిక భాగం రోమ్‌లోనే ఉండిపోయినప్పటికీ.. అందులో చిన్న ముక్కను తిరిగి వచ్చిన సందర్భాన్ని ఈ ప్రాంత క్రైస్తవులు సంబరంగా జరుపుకున్నారు.

''నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. దీనిని చూసి నాకు సంతోషంతో కన్నీళ్లు వస్తున్నాయి. దీనిని బెత్లెహాంకు పంపించిన పోప్‌ దయకు కృతజ్ఞతలు'' అని హోలీ ల్యాండ్‌ను సందర్శించే తీర్థయాత్రికులకు గైడ్‌గా పనిచేసే లూసా ఫ్లెకిన్‌స్టీన్ ఏపీ వార్తా సంస్థతో చెప్పారు.

కానీ కొంతమంది అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

''జీసస్ తొట్టి వెనక్కి వస్తోందని మేం విన్నప్పుడు.. తొట్టి మొత్తం పూర్తిగా వస్తుందని అనుకున్నాం. కానీ మేం చూసింది దీనిని'' అని శాండీ షాహిన్ హిజాజీన్ రాయిటర్స్ వార్తా సంస్థతో వ్యాఖ్యానించారు.

Image copyright AFP

ఇప్పుడు ఎందుకు?

ఈ అవశేషాన్ని తిరిగి పంపించటాన్ని పోప్ ఫ్రాన్సిస్ నుంచి బహుమానంగా వాటికన్ అభివర్ణించింది.

పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ ఇటీవల వాటికన్‌ను సందర్శించినపుడు చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో ఈ అవశేషాన్ని తిరిగి పంపించారని బెత్లెహాం మేయర్ ఆంటన్ సాల్మన్ పాలస్తీనా వార్తా సంస్థ వఫాతో పేర్కొన్నారు.

వెస్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరూసలేంలలోని పాలస్తీనా జనాభాలో క్రైస్తవులు సుమారు ఒక శాతం ఉంటారని అంచనా. అయితే.. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ తీర్థయాత్రికులకు బెత్లెహాం చాలా ముఖ్యమైన తీర్థస్థలం. ప్రత్యేకించి క్రిస్టమస్ సమయంలో ఇక్కడికి వచ్చే యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

క్రిస్టమస్ సంబరాలు జరిగే ఈ నెలలో లక్షలాది మంది క్రైస్తవ తీర్థయాత్రికులు బెత్లెహాం సందర్శిస్తారని అంచనాగా వఫా వార్తా సంస్థ తెలిపింది.

''జీసస్ క్రైస్ట్ జన్మించిన పశువుల తొట్టిలోని ఒక భాగం సమక్షంలో క్రిస్టమస్ పండుగ జరుపుకోవటం అద్భుతమైన భారీ ఉత్సవంగా ఉంటుంది'' అని అబ్బాస్ ప్రభుత్వంలో చర్చి వ్యవహారాల మీద ఉన్నత స్థాయి కమిటీ సభ్యురాలు అమీరా హనానియా పేర్కొన్నారు.

ఇది అసాధారణమా?

ఈ అవశేషాన్ని తిరిగి పంపించటం.. 'చరిత్ర వెనుదిరగటం' వంటిదని క్రైస్తవమతం మీద ఇజ్రాయెల్ నిపుణురాలు డాక్టర్ యిస్కా హరానీ అభివర్ణించారు.

''ఓ వెయ్యేళ్ల కిందట.. రోమ్ తనను తాను ప్రత్యామ్నాయ జెరూసలేంగా తయారు చేసుకోవటానికి తూర్పు నుంచి అవశేషాలను సేకరించటంలో తలమునకలైంది. ఇప్పుడు రోమ్ ఆ అవశేషాలను జెరూసలేం, బెత్లెహాంలకు తిరిగి ఇవ్వగలిగేంత బలంగా ఉంది'' అని ఆమె ఇజ్రాయెల్ వార్తా పత్రిక హారెట్జ్‌తో పేర్కొన్నారు.

పోప్ తిరిగి పంపించిన మతపరమైన కళాకృతుల్లో జీసస్ మాంజర్ అవశేషమే మొదటిది కాదు.

ఈ ఏడాది ఆరంభంలో.. ఈస్ట్రన్ ఆర్థొడాక్స్ చర్చి నాయకుడు సెయింట్ పీటర్‌కు చెందిన ఎముకలుగా విశ్వసించే అవశేషాల్లో కొన్నిటిని తిరిగి పంపించారు. ఆర్థొడాక్స్ చర్చి, క్యాథలిక్ చర్చిలను ఏకం చేసే ఉద్దేశంతో ఆ పని చేసినట్లు ఆయన ఆ తర్వాత చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)