ఆన్‌లైన్‌లో లక్షల మంది అభిమానులున్న పిల్లి మృతి

  • 3 డిసెంబర్ 2019
లిల్ బబ్ Image copyright LILBUB.COM

ఇంటర్నెట్‌లో అత్యంత ఫేమస్ పిల్లుల్లో ఒకటైన లిల్ బబ్ చనిపోయింది. దాని వయసు ఎనిమిది సంవత్సరాలు.

ఈ పిల్లి యజమాని మైక్ బ్రిడావ్‌స్కీ.. సోమవారం దీని మరణం గురించి దీనికి గల లక్షలాది మంది ఫాలోయర్లకు తెలియజేశారు.

లిల్ బబ్ అసాధారణ రూపం - ఉబికి వచ్చే పెద్ద కళ్లు, బయటకు వేలాడే నాలుక - దానికి అంత పేరు తెచ్చిపెట్టింది. ఈ పిల్లి పిల్లను సంరక్షణ లేని పరిస్థితుల నుంచి రక్షించారు. దీనికి పుట్టుకతోనే మరుగుజ్జుతనం సహా పలు లోపాలున్నాయి.

ఈ పిల్లి తన జీవిత కాలంలో జంతు సంరక్షక సంస్థల కోసం 7,00,000 డాలర్లకు పైగా విరాళాలు సేకరించటానికి సాయపడిందని బ్రిడావ్‌స్కీ చెప్పారు.

''జంతు సంక్షేమంలో బబ్ ఎంతో మార్పు తీసుకువచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది జీవితాల్లో మార్పు రావటానికి దోహదపడింది'' అని ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక పోస్ట్ నివాళులర్పించింది.

లిల్ బబ్ విశిష్టమైన రూపం కారణంగా ఆన్‌లైన్‌లో ఫేమస్ అయింది. పిల్లిజాతి మరుగుజ్జుతనం వల్ల అది జీవితాంతం ఒక చిన్న పిల్లి పిల్ల పరిమాణంలోనే ఉండిపోయింది.

ఈ పిల్లికి అధిక వేళ్లు (పాలీడాక్టిల్) కూడా ఉన్నాయి. దీనికి ప్రతి కాలికీ ఒక అదనపు వేలు ఉంటుంది. దీని దవడలు పూర్తిగా అభివృద్ధి చెందలేదు. పళ్లు కూడా లేవు. దానివల్ల ఈ పిల్లి నాలుక ఎప్పుడూ బయటకు వేలాడుతుండేది.

బ్రిడావ్‌స్కీ స్నేహితుడు ఒకరు ఇండియానాలోని ఒక పనిముట్ల షెడ్డులో కొన్ని పిల్లి పిల్లలను గుర్తించారు. వాటిలో అతి పొట్టిగా ఉన్న లిల్ బబ్‌ను బ్రిడావ్‌స్కీ పెంచుకోవటానికి తీసుకున్నారు.

''ప్రకృతిలో అత్యంత ఆనందకరమైన ప్రమాదాల్లో లిల్ బబ్ ఒకటి'' అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పలు ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఇది సంతోషంగా, ఆరోగ్యంగా జీవించిందని ఉద్ఘాటించారు.

ఈ పిల్లి కోసం 2011లో ఒక టంబ్లర్ బ్లాగ్ ప్రారంభించాడు బ్రిడావ్‌స్కీ. చర్చా వెబ్‌సైట్ రెడిట్‌ మొదటి పేజీలో ఈ పిల్లి ఫొటోలు ప్రచురితం కావటంతో లిల్ బబ్ వైరల్‌గా మారింది.

Image copyright Getty Images

అనేక మంది దీనిమీద దృష్టి కేంద్రీకరించటంతో.. లిల్ బబ్ గురించి వార్తా కథనాలు వెల్లువెత్తాయి. అమెరికా టెలివిజన్ కార్యక్రమాల్లో పాల్గొనటానికి దీనికి ఆహ్వానాలు అందాయి.

అనేక స్వచ్ఛంద సంస్థలతో, వ్యాపార సంస్థలతో ఒప్పందాలు వచ్చాయి. లిల్ బబ్‌కు సొంతగా యూట్యూబ్ షో మొదలైంది. డాక్యుమెంటరీ సిరీస్ కూడా చేశారు.

స్వచ్ఛంద కార్యక్రమాల కోసం.. ముఖ్యంగా ప్రత్యేక అవసరాలున్న ఇతర పిల్లుల కోసం అమెరికన్ సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెలిటీ టు యానిమల్స్ ద్వారా విరాళాలు సేకరించటానికి లిల్ బబ్ యజమాని ఈ పిల్లి పేరుప్రఖ్యాతులను ఉపయోగించుకున్నారు.

లిల్ బబ్ మరణించటానికి ముందు ఒక ఎముక ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతుండేది. దీని ఆరోగ్యం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి గల 24 లక్షల మంది ఫాలోయర్లకు ఎప్పటికప్పుడు సమాచారం అందించారు బ్రిడావ్‌స్కీ.

అనూహ్యంగా ఆదివారం ఉదయం లిల్ బబ్ నిద్రలోనే చనిపోయిందని ఆయన సోమవారం ప్రకటించారు.

తన పిల్లి తన జీవితంలో ''ప్రపంచ ప్రజలకు పట్టుదల, సానుకూల దృక్పథం, ధైర్యం అనే సందేశాన్ని పంచింది'' అని దీని యజమాని పేర్కొన్నారు.

ఈ పిల్లి మరణం ప్రకటన మీద లక్షలాది మంది కామెంట్లు చేసి ఆన్‌లైన్ పోస్టులు షేర్ చేశారు.

ఫేస్‌బుక్‌లో లిల్ బబ్‌కు 30 లక్షల మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు. లిల్ బబ్ యజమాని తన పిల్లి పేరుతో సేకరించిన విరాళాల ద్వారా లబ్ధి పొందిన జంతు సంరక్షణ స్వచ్ఛంద సంస్థల కోసం పనిచేసే వారు చాలా మంది ఫేస్‌బుక్‌లో స్పందిస్తున్నారు.

ఇంటర్నెట్‌లో మరో లెజెండ్‌ 'గ్రంపీ క్యాట్' మరణించిన ఏడు నెలలకు లిల్ బబ్ చనిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

మహిళలపై అత్యాచారాలకు రవాణా సౌకర్యాలు కొరత కూడా ఒక కారణమా?

ఆంధ్రప్రదేశ్: 'దిశ' బిల్లులకు శాసనసభ ఆమోదం

'పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించే వారితో చర్చలకు సిద్ధం' - అస్సాం సీఎం

బోరిస్ జాన్సన్: బ్రిటన్ ప్రధానిగా మళ్ళీ కన్సర్వేటివ్ నేత... ఎన్నికల్లో టోరీల ఘన విజయం

ఈరోజు మాకు హోలీ, దీపావళి కంటే పెద్ద పండుగ రోజు: పాకిస్తాన్ హిందూ శరణార్థులు

గొల్లపూడి మారుతీరావు (1939-2019): "ఒక్క జీవితంలోనే పది జీవితాలు చూసిన మనిషి"

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబును మార్షల్స్ తోసేశారు.. టీడీపీ; మార్షల్స్‌ను పీక పట్టుకుని బెదిరించారు.. వైసీపీ

పార్లమెంటుపై దాడికి 18ఏళ్లు: బులెట్లు దూసుకొస్తున్నా, ప్రాణాలకు తెగించి గేటు నంబర్ 1 మూసేశాడు