చైనాకు యూజర్ల డేటాను రహస్యంగా సేకరించి పంపుతోందంటూ టిక్‌టాక్‌పై అమెరికా కోర్టులో దావా

  • 4 డిసెంబర్ 2019
టిక్‌‌టాక్ యాప్

అమెరికా నుంచి యూజర్ల వ్యక్తిగత డేటాను పెద్దయెత్తున చైనాకు పంపించిందనే ఆరోపణలతో ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ 'టిక్‌టాక్‌'‌పై కాలిఫోర్నియాలోని ఓ న్యాయస్థానంలో దావా దాఖలైంది. యూజర్ అనుమతి లేకుండా టిక్‌టాక్‌ రహస్యంగా ఈ డేటాను సేకరించిందని ఈ దావాలో ఆరోపించారు.

చైనాలోని బీజింగ్ కేంద్రంగా పనిచేసే 'బైట్‌డాన్స్'‌ సంస్థకు చెందిన టిక్‌టాక్‌కు అమెరికాలో ఆదరణ బాగా ఉంది. ఈ యాప్‌ భారత్‌లోనూ బాగా ప్రాచుర్యం పొందింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్‌ను దాదాపు 50 కోట్ల మంది వాడుతున్నట్లు అంచనా.

అమెరికా యూజర్ల డేటాను తాము చైనా సర్వర్లలో నిక్షిప్తం చేయట్లేదని టిక్‌టాక్‌ గతంలో చెప్పింది.

డేటా సేకరణ, సెన్సార్‌షిప్ అంశాల్లో ఉత్తర అమెరికా ఖండంలో ఈ యాప్‌పై ఒత్తిడి పెరుగుతోంది.

అమెరికాలోని యూజర్లను ఇప్పుడు, భవిష్యత్తులో గుర్తించేందుకు, ట్రాక్ చేసేందుకు టిక్‌టాక్‌ ఈ డేటాను వాడొచ్చని దావా పేర్కొంటోంది.

Image copyright Getty Images

'డ్రాఫ్ట్ వీడియోలను టిక్‌‌‌టాక్ తీసేసుకుంది'

కాలిఫోర్నియాలోని ఒక విశ్వవిద్యాలయ విద్యార్థిని మిస్టీ హాంగ్ పేరుతో గత వారం ఈ దావా దాఖలైంది.

టిక్‌టాక్‌ యాప్‌ను తాను ఈ ఏడాది డౌన్‌లోడ్ చేసుకున్నానని, కానీ ఖాతా ఏర్పాటు చేసుకోలేదని ఆమె చెప్పారు. అయితే కొన్ని నెలల తర్వాత టిక్‌టాక్‌ తనకు ఒక ఖాతాను సృష్టించిందని, పబ్లిష్ చేయాలని తాను ఎన్నడూ అనుకోని తన డ్రాఫ్ట్ వీడియోలను యాప్ రహస్యంగా తీసేసుకుందని ఆరోపించారు.

టెన్సెంట్, అలీబాబా సంస్థల ఆధ్వర్యంలోని రెండు సర్వర్లకు టిక్‌టాక్ ఈ డేటాను పంపించిందని మిస్టీ హాంగ్ పేర్కొన్నారు.

వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా సేకరించి టిక్‌టాక్ అనుచిత మార్గంలో లాభాలు పొందుతోందని దావా ఆరోపిస్తోంది. ఈ డేటాను వ్యాపార ప్రకటనల ఆదాయం కోసం వాడుతోందని పేర్కొంటోంది.

దావాపై స్పందన కోసం టిక్‌టాక్‌ను సంప్రదించగా, ఎలాంటి స్పందనా రాలేదు.

Image copyright Getty Images

20 ఏళ్లలోపు వారిలో ఆదరణ అధికం

ఇటీవలి కాలంలో టిక్‌టాక్ ప్రాచుర్యం అంతకంతకూ పెరిగిపోయింది. ఇది అత్యధికంగా 20 ఏళ్లలోపు వారిలో ఎక్కువ ఆదరణ పొందుతోంది.

పాటలు, హాస్యసన్నివేశాలకు అనుగుణంగా పెదవులను ఆడిస్తూ పెట్టే 15 సెకన్ల వీడియోలు, అసాధారణమైన ఎడిటింగ్ ట్రిక్కులతో కూడిన వీడియోలను వీరు ఎక్కువగా షేర్ చేస్తుంటారు.

ఒకవైపు యాప్ విపరీతంగా విస్తరిస్తుండగా, మరోవైపు యూజర్ల వ్యక్తిగత గోప్యత భద్రతపై ఆందోళనలూ పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఆందోళనలు ప్రధానంగా అమెరికాలో ఎక్కువవుతున్నాయి.

చైనా ప్రభుత్వం పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటూ, ప్రభుత్వానికి అనుగుణంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు టిక్‌టాక్‌పై ఉన్నాయి.

ఈ ఆరోపణల విషయంలో అమెరికా శాసనకర్తల నుంచి కంపెనీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

Image copyright Getty Images

తమ కార్యకలాపాల్లో చైనా ప్రభుత్వ జోక్యముందనే ఆరోపణలను టిక్‌టాక్ ఇంతకుముందు కొట్టిపారేసింది. తాము కంటెంట్‌ను చైనా ఆలోచనలను ప్రాతిపదికగా తీసుకొని తొలగించబోమని చెప్పింది. ఏదైనా కంటెంట్ తొలగించాలని చైనా ప్రభుత్వం తమను ఎన్నడూ కోరలేదని, ఒకవేళ కోరినా తొలగించబోమని టిక్‌టాక్ అక్టోబరులో స్పష్టం చేసింది.

ఈ సంస్థ టిక్‌టాక్‌ లాంటి యాప్‌నే ప్రత్యేకమైన వర్షన్‌తో చైనాలో నిర్వహిస్తోంది. దీనిని అక్కడ 'డౌయిన్' అంటారు.

అమెరికా యూజర్ల డేటా అమెరికాలోనే నిక్షిప్తమై ఉందని, 'బ్యాకప్' సింగపూర్లో ఉందని టిక్‌టాక్ చెబుతోంది.

వీగర్ ముస్లింల పట్ల చైనా తీరును విమర్శిస్తూ ఓ వైరల్ వీడియో పెట్టిన అమెరికా టీనేజర్‌ను నిషేధించినందుకు ఆమెకు టిక్‌టాక్ గత వారం క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. తర్వాత ఈ నిషేధాన్ని ఎత్తివేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు