గ్రెటా థన్‌బర్గ్: ''పిల్లల కోపాన్ని పెద్దలు తక్కువగా అంచనా వేస్తున్నారు''

  • 4 డిసెంబర్ 2019
గ్రెటా థన్‌బర్గ్ Image copyright AFP

భూతాపం విషయంలో పిల్లలకు ''కోపం'' తెప్పించటం మానాలని పెద్దలకు పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ హితవు పలికారు.

గ్రెటా అమెరికాలోని వర్జీనియా నుంచి ప్రారంభించి రెండు వారాలకు పైగా అట్లాంటిక్‌ వ్యాప్తంగా పర్యటించారు. అనంతరం పోర్చుగల్ రాజధాని లిస్బన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

''పిల్లల ఆగ్రహాన్ని జనం తక్కువగా అంచనావేస్తున్నారు'' అని ఆమె వ్యాఖ్యానించారు.

మాడ్రిడ్‌లో జరుగుతున్న సీఓపీ25 వాతావరణ సదస్సుకు గ్రెటా హాజరవుతున్నారు.

విమాన ప్రయాణం, కార్లలో ప్రయాణం వంటివి అధిక కాలుష్య రూపాలు కావటం వల్ల.. ఆ ప్రయాణాలకు బదులుగా తక్కువ కాలుష్య కారకమైన నౌకాయానం చేయటం ద్వారా తన వైఖరి ఏమిటనేది గ్రెటా చాటి చెబుతున్నారు.

కొంత మంది పెద్దలు ఆమెను 'కోపిష్టి'గా చూస్తున్నారని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ''మేం కోపంగా ఉన్నాం. మేం విసిగిపోయాం. అందుకు మంచి కారణాలున్నాయి'' అని ఆమె బదులిచ్చారు.

''మేం కోపంగా ఉండటం మానేయాలంటే.. బహుశా వాళ్లు మాకు కోపం తెప్పించటం మానేయాలి'' అని చెప్పారు.

Image copyright LUKAS SCHULZE/GETTY IMAGES

గ్రెటా తొలుత అమెరికా నుంచి చిలీలో జరిగే ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సుకు హాజరవ్వాలని భావించారు, కానీ.. ఆ దేశంలో అంతర్గత సంక్షోభం కారణంగా ఆ కార్యక్రమం రద్దయింది.

ఆ వేదిక స్పెయిన్‌కు మారింది. దీంతో గ్రెటా.. లా వాగాబాండ్ అనే 48 అడుగుల నౌకలో ప్రయాణించి పోర్చుగల్ చేరారు. ఆస్ట్రేలియాకు చెందిన యూట్యూబర్లు రైలీ విట్లమ్, ఎలేనా కరోసు, బ్రిటన్‌కు చెందిన నావికురాలు నిక్కీ హెండర్సన్‌లతో కలిసి ఆమె ప్రయాణించారు.

వీరి బోటు విద్యుత్ కోసం సోలార్ ప్యానళ్లు, హైడ్రో-జనరేటర్లను ఉపయోగిస్తుంది. అయితే.. ఈ నౌకా ప్రయాణం కోసం నిక్కీ హెండర్సన్ బ్రిటన్ నుంచి అమెరికాకు విమానంలో వచ్చారనే వార్తల నేపథ్యంలో.. వీరి ప్రయాణం వల్ల కాలుష్య ప్రభావం మీద కొందరు విమర్శకులు ప్రశ్నలు లేవనెత్తారు.

ఇదిలావుంటే.. సీఓపీ25 సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మంగళవారం విడుదల చేసిన ఒక నివేదికలో.. మానవ ఆరోగ్యం మీద వాతావరణ మార్పు ప్రభావాన్ని ఎదుర్కోవటానికి నిధులు కేటాయించటానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.

రాబోయే దశాబ్దాల్లో ప్రపంచ భూతాపం.. ప్రతి ఏటా అదనంగా వేలాది మరణాలకు, పోషకాహార లోపానికి, కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధులకు కారణమవుతుందని భావిస్తున్నారు.

ఇప్పటికే ఏయే దేశాలు ఆరోగ్య, వాతావరణ మార్పు వ్యూహాలను రూపొందించాయి, వీటికి తగినంత నిధుల మద్దతు ఉందా అనేది కనుక్కోవటానికి డబ్ల్యూహెచ్‌ఓ 101 దేశాలను సర్వే చేసింది.

సర్వే చేసిన దేశాల్లో దాదాపు సగం దేశాలు ఒక జాతీయ వ్యూహాన్ని రచించాయని గుర్తించింది. మరింత లోతుగా విశ్లేషించిన 45 దేశాల్లో.. 40 శాతం కన్నా తక్కువ దేశాలు మాత్రమే.. తమ జాతీయ ప్రణాళికలను అమలు చేయటానికి అంచనా వేసిన వ్యయాలకు ప్రస్తుతం ఆరోగ్యానికి కేటాయిస్తున్న నిధులు పూర్తిగా లేదా పాక్షికంగా సరిపోతాయని చెప్పాయి. కేవలం 9 శాతం దేశాలు మాత్రమే తమ వ్యూహాలను పూర్తిగా అమలు చేయానికి సరిపోయినన్ని నిధులు కేటాయించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

‘వారం రోజుల్లో నిందితులకు శిక్ష పడాలి.. లేదంటే సీఎం ఇంటి ముందు కాల్చుకుంటా’

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు.. కాంగ్రెస్ మతం పేరుతో దేశాన్ని విభజించిందన్న అమిత్ షా

ఒలింపిక్స్‌తో సహా ప్రధాన క్రీడల ఈవెంట్లలో పాల్గొనకుండా నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం

చిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్

హైదరాబాద్ 'ఎన్‌కౌంటర్‌' మృతదేహాలను శుక్రవారం వరకు భద్రపరచండి: తెలంగాణ హైకోర్టు

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: కొనసాగనున్న యడ్యూరప్ప ప్రభుత్వం.. బీజేపీకి 11 స్థానాల్లో గెలుపు, ఒక స్థానంలో ఆధిక్యం

న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ఐదుగురు మృతి

‘#StopTeluguImposition’: తెలుగు భాషను తమపై రుద్దవద్దని తమిళులు ఎందుకు అంటున్నారు