మనుషులెవరూ లేని ప్రాంతాల్లో తప్పిపోతే ప్రాణాలతో బయటపడటం ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలను నిలుపుకోవచ్చు?

  • 5 డిసెంబర్ 2019
ఉత్తర ఆస్ట్రేలియా Image copyright Getty Images

ఉత్తర ఆస్ట్రేలియాలోని మారుమూల ప్రాంతాల్లో మనుషులు బతకడమే కష్టం. ఈ ప్రాంతమంతా దాదాపు ఎడారిలా ఎండిపోయి ఉంటుంది. ఎటు చూసినా చుక్క నీరు దొరకదు. అందుకే, ఈ ప్రాంతమంతా దాదాపు నిర్మానుష్యంగా కనిపిస్తుంటుంది.

కానీ, ఇటీవల ముగ్గురు వ్యక్తులు ఈ ప్రాంతంలో రెండు వారాల పాటు తప్పిపోవడం సంచలనంగా మారింది. వారిలో ఇద్దరు ప్రాణాలతో తిరిగి రాగా, మూడో వ్యక్తి శవమై కనిపించారు.

ఆ ముగ్గురు ఈ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా వారి కారు ఒక నదిలోని ఇసుకలో చిక్కుకుపోయింది. దానిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. అయినా, ఫలితం లేదు.

మూడు రోజుల తర్వాత దగ్గరలో ఎక్కడైనా నివాస ప్రాంతాలు ఉన్నాయేమో సాయం అడుగుదామని ఆ ముగ్గురూ తలో వైపు వెళ్లారు.

ఫోన్ సిగ్నల్ ఉండదు. ఎటు చూసినా ఎవరూ కనిపించలేదు. హెలికాప్టర్‌లో వెళ్లి వారికోసం వెతుకుతున్న పోలీసులకు ఇద్దరు దొరకగా, మూడో వ్యక్తిని ఓ రైతు గుర్తించారు.

వెంట తీసుకెళ్లిన నీళ్లు, వొడ్కా డ్రింకులు, బిస్కెట్లు, నూడుల్స్‌ తమను కొంత మేరకు బతికించాయని ప్రాణాలతో వచ్చినవారు చెప్పారు. ఆ ఇద్దరు కారుకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉండగా హెలికాప్టర్‌లో వెళ్లిన పోలీసులు గుర్తించి రక్షించారు.

వేసవి కాలంలో ఈ ప్రాంతం అత్యంత వేడిగా ఉంటుంది. ఇక్కడ తప్పిపోవడం అత్యంత ప్రమాదకరం. అయితే, కొందరు నిపుణులు మాత్రం ఇక్కడ కూడా మరణాలను చాలావరకు నివారించవచ్చు అని అంటున్నారు.

మరి, ఇలాంటి మారుమూల నిర్మానుష్య, ఎడారి ప్రాంతాలలో తప్పిపోతే ప్రాణాలతో బయటపడటం ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ సేపు ప్రాణాలను నిలుపుకోవచ్చు?

Image copyright Tom Garmeson

నీళ్లు లేకుండా మీరు ఎంతకాలం బతకగలరు?

వేడిని తట్టుకోవడంతో పాటు, శరీరంలో నీరు త్వరగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడగలిగితే చాలావరకు ప్రాణాలతో బయటపడొచ్చని ఆస్ట్రేలియాలోని క్రిటికల్ కేర్ అండ్ ట్రామా రెస్పాన్స్ సెంటర్‌కు చెందిన డాక్టర్ మ్యాట్ బ్రేర్లీ చెప్పారు.

సాధారణంగా పరిస్థితిలు అన్నీ అనుకూలంగా ఉంటే, ఒక వ్యక్తి నీళ్లు లేకుండా మూడు రోజుల దాకా ప్రాణాలతో ఉండగలడు. శారీరక ప్రయాస ఉండకూడదు, ఎండలో తిరగకుండా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది.

ఇక ఎండలు తీవ్రంగా ఉండే వేసవి కాలంలో ఈ ఎడారి ప్రాంతంలో నీళ్లు లేకుండా ఒక రోజు బతకడమే కష్టమని బ్రేర్లీ చెప్పారు.

చెట్ల నీడలో ఉండటం, శారీరక శ్రమ తక్కువగా ఉండేలా జాగ్రత్తపడితేనే ఇక్కడ మూడు రోజులు ప్రాణాలు నిలుపుకునే వీలుంటుందని ఆయన వివరించారు.

ఆహారం లేకుండా ఎన్ని రోజులు బతకలగరు?

ఇలాంటి పరిస్థితుల్లో ఆహారం అంత ముఖ్యమైనది కాదని బుష్‌క్రాఫ్ట్ సర్వైవల్ ఆస్ట్రేలియా అనే సంస్థకు చెందిన నిపుణులు గార్డన్ బెడ్‌మ్యాన్ చెబుతున్నారు. ఆహారం లేకుండా మనుషులు మూడు వారాల దాకా ప్రాణాలను నిలుపుకోవచ్చని ఆయన అంటున్నారు. అంటే, ఆహారం కంటే ముందు వేడిని తట్టుకోవడం, నీళ్లు లేకుండా ఉండటం చాలా ముఖ్యం.

"గాలి లేకుండా మూడు నిమిషాల దాకా బతకొచ్చు, నీళ్లు లేకుండా మూడు రోజులు, ఆహారం లేకుండా మూడు వారాలు ప్రాణాలు నిలుపుకోవచ్చు" అని గార్డన్ వివరించారు.

అయితే, ఆరోగ్యంగా ఉన్న వయోజనులతో పోల్చితే... శారీరకంగా బలహీనంగా ఉండే పిల్లలు, వృద్ధులకు శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, ఆకలి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

2015లో ఇదే ఆస్ట్రేలియాలోని నిర్మానుష్య ప్రాంతంలో తప్పిపోయిన 62 ఏళ్ల వ్యక్తి ఆరు రోజుల పాటు నీళ్లు లేకుండా, చీమలను తింటూ ప్రాణాన్ని నిలుపుకున్నారు.

Image copyright iStock

ఎండలో ఎంత సేపు ఉండొచ్చు?

వేసవి కాలంలో ఇలాంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ పైనే నమోదవుతుంటాయి. దాంతో, ఎండలో బహిరంగ ప్రదేశాలలో చాలా సేపు తిరగడం అత్యంత ప్రమాదకరం.

మనిషి శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 నుంచి 38 డిగ్రీలు ఉంటుంది. అది 40 డిగ్రీలు దాటితే చాలా ప్రమాదకరమని డాక్టర్ బ్రేర్లీ చెబుతున్నారు.

శ్రమ పెరిగితే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటిన తర్వాత, అవయవాలు ఒక్కొక్కటిగా విఫలమవ్వడం ప్రారంమవుతుంది. మూత్రపిండాలు, మెదడు కూడా సరిగా పనిచేయవు. అంటే, మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట.

శరీర ఉష్ణోగ్రత మరీ తగ్గినా ప్రమాదమే. అందుకే, చలికాలంలో శరీరం వెచ్చగా ఉండేందుకు దుప్పట్లు, స్వెటర్లు ధరించాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: న్యూయార్క్‌లో కొనసాగుతున్న సామూహిక ఖననాలు, అమెరికా తరువాత ఏ దేశంలో లేనన్ని కోవిడ్ కేసులు ఈ రాష్ట్రంలోనే

కరోనావైరస్: లాక్‌డౌన్ సమయంలో మద్యం ప్రియులు ఏం చేయాలి?

కరోనావైరస్‌పై పోరాటానికి సిద్ధమైన భారతీయ రైల్వే

ప్రెస్ రివ్యూ: తెలంగాణ లాక్‌డౌన్‌లో బ్లాక్ మార్కెట్... దడ పుట్టినస్తున్న ధరలు

భారతదేశం లాక్ డౌన్‌ని ఎందుకు పొడిగిస్తుంది.. తొలగిస్తే ఎదురయ్యే ప్రమాదాలేంటి

కరోనావైరస్ వ్యాక్సీన్ కనిపెట్టినా... అది పేద దేశాలకు అందుతుందా

కరోనావైరస్ లాక్‌డౌన్ ఎఫెక్ట్: భూమి కంపించటం తగ్గిపోయింది

కరోనా లాక్‌డౌన్: ఈ కార్మికుడు భార్యను ఎక్కించుకుని సైకిల్‌పై 750 కిలోమీటర్లు ప్రయాణించాడు

కరోనావైరస్ హాట్‌స్పాట్లు: ఈ ప్రాంతాల్లో ఏం జరగబోతుంది.. లాక్‌డౌన్‌కు, దీనికి తేడా ఏంటి