సీషెల్స్: వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు పెద్ద ప్రయత్నం చేస్తున్న చిన్న దేశం

  • కేథరీన్ బైరుహాంగా, లూయిస్ ఆడమౌ
  • బీబీసీ న్యూస్, సీషెల్స్
సీషెల్స్ దీవులు
ఫొటో క్యాప్షన్,

సీషెల్స్ దీవులు

డారిల్ గ్రీన్ తన చిన్న బోటు మీద సీషెల్స్‌లోని పర్సిలిన్ దీవి సమీపంలో సముద్రంపై వెళుతున్నారు. నీరు తేటగా ఉండటంతో సముద్రం అడుగు స్పష్టంగా కనిపిస్తోంది. బోటు చుట్టుపక్కల చేపలు ఈదుతున్నాయి.

''నేను వయసులో ఉన్నప్పుడు ఇక్కడ చేపలు తక్కువ పరిమాణంలో ఉండేవి'' అని ఆ మత్య్సకారుడు గుర్తు చేసుకున్నారు. తన మనవడిని వెంటపెట్టుకొని ఆయన బోట్‌ నడుపుతున్నారు.

''ఒక మత్స్యకారుడిగా చేపల సంతతిని పెంచే బాధ్యతను మేం తీసుకోలేదు. కానీ, ఎవరు తీసుకుంటారు? మేం తీసుకోవడం మొదలుపెట్టకపోతే మా ముందుతరాలకు చేపలు దొరకడం చాలా కష్టమవుతుంది'' అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో క్యాప్షన్,

తన మనవడితో మత్స్యకారుడు డారిల్ గ్రీన్

స్థానిక తీరంలో గ్రీన్ దశాబ్దాలుగా చేపల వేట కొనసాగిస్తున్నారు. కానీ, ఇప్పుడాపని చేయడం లేదు. తోటి మత్స్యకారులతో కలసి ఏడాదిలో ఆరు నెలలు ఇక్కడ చేపలు పట్టడాన్ని స్వచ్ఛందంగా నిలిపేయడానికి ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేశారు, ఇది చేపల నిల్వలను తిరిగి పెంచడానికి వీలు కల్పిస్తుందని ఆయన ఆశిస్తున్నారు.

''ఇదే మా కార్యాలయం, మీరు పని చేయడానికి కార్యాలయానికి వెళతారు. మేము ఇక్కడే పని చేయడానికి వస్తాం. ఇక్కడే మేము మా జీవనోపాధిని సంపాదిస్తాం. అందువల్ల దీన్ని కాపాడుకోవాల్సి వచ్చింది'' అని తెలిపారు.

చేపల వేటపై స్వచ్ఛందంగా నిషేధం ఉన్న ఆరు నెలల్లో కొందరు వడ్రంగి వంటి ఇతర పనులను కూడా చేస్తారు.

ఫొటో క్యాప్షన్,

సీషెల్స్‌లోని బీచ్

సముద్ర పరిరక్షణ ప్రణాళిక

గ్రీన్ రూపొందించిన ప్రాజెక్ట్‌కు సముద్ర పరిరక్షణ ప్రణాళిక ద్వారా నిధులు సమకూరాయి.

ఇలాంటి ఒప్పందంలో మొదటిది, సముద్రంలో వాతావరణ మార్పుల ప్రభావాలపై పోరాడటానికి తూర్పు ఆఫ్రికా దేశం తన జాతీయ ఆదాయంలో 5 శాతం రుణంగా ప్రకటించడం. దీనికి ప్రతిగా 30 శాతం తమ జాతీయ జలాలను పరిరక్షిస్తామని వాగ్దానం చేసింది.

ఈ 30 శాతం సముద్ర తీరం ఇంగ్లాండ్ భూ పరిమాణం కంటే రెట్టింపు ఉంటుంది.

ఒప్పందం ఏమిటి?

సీషెల్స్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం అమెరికా స్వచ్ఛంద సంస్థ ''ది నేచర్ కన్జర్వెన్సీ''తో అలాగే అనేక మంది పెట్టుబడిదారులతో 'డెబిట్ స్వాప్‌' (ఒక దేశం తాను చెల్లించాల్సిన విదేశీ రుణాన్ని ఒక నిర్దిష్ట సంస్థకు బదిలీ చేసే ఏర్పాటు)కు అంగీకరించింది.

ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.150 కోట్లు. నిబంధనల ప్రకారం, లియోనార్డో డికాప్రియో ఫౌండేషన్‌తో సహా స్వచ్ఛంద సంస్థలు, పెట్టుబడిదారులు - సీషెల్స్ జాతీయ రుణంలో కొంత భాగాన్ని యూరోపియన్ దేశాలైన ఇంగ్లాండ్, ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేశాయి.

ఈ రుణం సీషెల్స్ కన్జర్వేషన్ అండ్ క్లైమేట్ అడాప్టేషన్ ట్రస్ట్ (సీసీకాట్) వద్ద ఉంది. ఇది తన దేశానికి తిరిగి చెల్లించేటప్పుడు తక్కువ వడ్డీ రేట్లను చెల్లిస్తుంది.

సముద్ర జీవులను రక్షించడానికి, వాతావరణ మార్పుల ప్రభావాలను అరికట్టడానికి రూపొందించిన ప్రాజెక్టులకు, సముద్రంలో పహారాకు ఇప్పటికే దాదాపు రూ.57 కోట్లు ఈ ట్రస్ట్ ఖర్చు చేసింది.

చిన్న ద్వీపదేశాల్లో సముద్ర మట్టాలు ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నాయి. పగడపు దిబ్బలు ధ్వంసమవుతున్నాయని, తీవ్ర వాతావరణ మార్పులు, నేల కోత సీషెల్స్ దీవులకు ప్రమాదకరంగా మారుతోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

దీంతో ఈ దేశం తన అతిగొప్ప సహజ వనరైన సముద్రతీరాన్ని పరిరక్షించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, ఇది అంత సులువైన పని కాదు. పరిరక్షిత ప్రాంతంలో అన్ని రకాల మానవ కార్యకలాపాలపై నిషేధం విధించాల్సి ఉంటుంది. కేవలం చేపల వేట మాత్రమే కాదు, పర్యటకులను కూడా అక్కడికి అనుమతించకూడదు. హిందూ మహాసముద్రాన్ని పహారాకాయడం ఈ తీర దేశానికి చాలా కష్టమైన పని.

"తాము రక్షణ కల్పించాల్సిన జలాలను పూర్తిగా చుట్టేయడానికి తమకు రెండు రోజులు పడుతుంది" అని లెఫ్టినెంట్ కల్నల్ కోనీ ఆంథోనీ చెప్పారు.

''మాకు పెద్దగా తీర రక్షక దళం లేదు'' అని ఆమె తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

బోట్‌తో పహారా కాస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ కోనీ ఆంథోనీ

ఆకాశం నుంచి నిఘానేత్రం

సీషెల్స్ వాయుసేన కూడా ఈ ప్రాజెక్టుకు సహాయపడుతోంది. కింద పహారా కాస్తున్న తమ సహచరులకు అండగా నిలుస్తోంది.

కెప్టెన్ డొన్న్ డ్యూ ప్రీజ్ తాము ఎలా పహారా కాస్తున్నామో తెలిపారు.

''మేము విమానం నుంచి పహారాకాస్తాం. సముద్రంలో ప్రయాణించే షిప్‌లకు అనుమతి ఉందా లేదా అనేదానిపై మాకు కొన్ని ఆధారాలుంటాయి. ఉదాహరణకు షిప్‌లపై జెండా ఉందా లేదా అనేది చూస్తాం. అలాగే, వారు ఎలాంటి వస్తువులను తీసుకెళ్తున్నారనేది కూడా చూస్తాం'' అని వివరించారు.

సవాళ్లను ఎదుర్కొనేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పారు.

''మా విమానాలకు ఎంతో సామర్థ్యం ఉంది. సుదూరంలో ఉన్న వాటిని కూడా గుర్తించే సామర్థ్యం మాకు ఉంది. మేం ఎగిరినప్పుడు సముద్రతలంపై వేలాది కిలోమీటర్లను కవర్ చేస్తాం'' అని తెలిపారు.

'ప్రపంచానికి ఉదాహరణగా నిలుస్తాం'

సముద్రంలో వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఇతర దేశాలు కూడా ''ది నేచర్ కన్జర్వెన్సీ సంస్థ''తో సంప్రదింపులు జరుపుతున్నాయి.

సీషెల్స్ పర్యావరణ మంత్రి వాలెస్ కాస్గ్రో మాట్లాడుతూ, ''సముద్రాల పరిరక్షణ సాధ్యమేనని చెప్పడానికి ప్రపంచానికి మేం ఉదాహరణగా నిలవాలనుకుంటున్నాం. చిన్న ద్వీప దేశాలలో వనరులు తగినంతగా ఉండవు. అందుకే పర్యావరణానికి తోడ్పడటానికి ఆర్థిక వనరులను పెంచడానికి వినూత్న మార్గాలను చూస్తున్నాం'' అని చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

తన బోట్ మీద ఉన్న మత్స్యకారుడు బీట్టీ హోరాయు

భవిష్యత్తు కోసం..

తిరిగి పర్సిలిన్ ద్వీపానికి వస్తే మత్య్సకారుడు గ్రీన్ తాను ఎదుర్కొంటున్న మరో సవాల్ గురించి చెబుతున్నారు. ఇది ఆయన మనవడికి సంబంధించినది.

''నేను పెద్దవాడ్ని అయ్యాక మత్య్సకారుడిని అవుతా. స్కూల్‌కు వెళ్లను అని నా మనవడు నాతో అంటున్నాడు'' అని గ్రీన్ అన్నారు.

నేను మాత్రం అలా చేయోద్దు, నేర్చుకోవటానికి మొదట స్కూల్‌కు వెళ్లాలి, తర్వాత చేపలు పట్టుకోడానికి వెళ్లాలి అని సూచించానని తెలిపారు.

''చేపల వేట మీద వాడికి చాలా మక్కువ ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, అతనికి ముందు మంచి టీచర్ కావాలి'' అని గ్రీన్ నవ్వుతూ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)