మిస్ యూనివర్స్ 2019 జోజిబిని తుంజీ: ఫైనల్ రౌండ్‌ ప్రశ్న, సమాధానం ఏంటి?

  • 10 డిసెంబర్ 2019
విశ్వ సుందరి Image copyright Getty Images
చిత్రం శీర్షిక మిస్ యూనివర్స్- 2019 విజేత జోజిబిని

"నాలాంటి ముఖ కవళికలు, నా లాంటి చర్మం, నా లాంటి జుట్టున్న మహిళలది అసలు అందమే కాదన్నట్లుగా భావించే ప్రపంచంలో నేను పెరిగాను. ఈ రోజుతో ఆ ఆలోచనా ధోరణికి ముగింపు పడుతుందని నేను అనుకుంటున్నాను."

'విశ్వ సుందరి-2019' కిరీటం దక్కించుకున్న దక్షిణాఫ్రికా మహిళ జోజిబిని తుంజీ ఇచ్చిన సందేశం అది.

అమెరికాలోని అట్లాంటాలో ఆదివారం జరిగిన మిస్ యూనివర్స్-2019 పోటీలో ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన 90 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు.

ప్యూర్టో రికోకు చెందిన మాడిసన్ ఆండర్సన్, మెక్సికోకు చెందిన సోఫియా అరగోన్‌లను వెనక్కి నెట్టి 26 ఏళ్ల జోజిబిని కిరీటం కైవం చేసుకున్నారు.

ఫైనల్‌ రౌండ్‌లో పోటీపడ్డ ముగ్గురిని పర్యావరణ మార్పులు, నిరసనలు, సోషల్ మీడియా సహా వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ప్రస్తత కాలంలో యువతులకు ఏం నేర్పించాలి? అన్న ప్రశ్నకు... నాయకత్వ లక్షణాలు నేర్పించాలని జోజిబిని సమాధానం చెప్పారు.

"చాలా కాలంగా యువతులు, మహిళల్లో నాయకత్వ లక్షణాల కొరత ఉంది. మహిళలు అలాగే ఉండాలి, ఎదగకూడదన్న ధోరణి సమాజంలో ఉండటమే ఆ కొరతకు కారణం" అని ఆమె వ్యాఖ్యానించారు.

"మనం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాళ్లం. మనకు కూడా అన్ని అవకాశాలు కల్పించాలి" అని ఆమె చెప్పారు.

Image copyright EPA

2011లో ఆంగోలియన్ నటి లెయిలా లోపేజ్ విశ్వసుందరిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత ఈ కిరీటం దక్కించుకున్న తొలి నల్లజాతి మహిళ జోజిబిని.

"మేము గర్వపడేలే చేశావు అమ్మాయి" అంటూ జోజిబినికి లెయిలా అభినందనలు తెలిపారు.

జోజిబిని తన గెలుపును గుర్తుచేస్తూ "ఈ అద్భుత క్షణాన్ని చూసిన ప్రతి అమ్మాయికీ తన శక్తి పట్ల విశ్వాసం కలుగుతుంది. వారిలో చాలామంది తమ ప్రతిబింబాలను నాలో చూసుకుంటారు. మిస్ యూనివర్స్- 2019 అని నా పేరు చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను" అని ఆమె అన్నారు.

జోజిబిని తన సహజమైన జుట్టు, అందంతో విశ్వసుందరి పోటీలో గెలిచిందంటూ పలువురు ప్రశంసించారు.

ఆగస్టులో ఆమె మిస్ సౌతాఫ్రికా కిరీటం కూడా గెలుచుకున్నారు.

ఆమె అందుకున్న బహుమతుల వివరాలను మిస్ యూనివర్స్ పోటీల నిర్వాహకులు వెల్లడించనప్పటికీ, న్యూయార్క్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఒక ఏడాది పాటు అద్దె చెల్లించకుండా బస చేసే ఆఫర్‌ను జోజిబిని గెలుచుకున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు లక్ష డాలర్ల విలువైన (రూ.71 లక్షలు) నగదు బహుమతి కూడా అందుకుంటారని అంటున్నారు.

ఇప్పుడు విశ్వసుందరిగా కిరీటం సాధించిన తర్వాత ఆమెకు ప్రపంచ నలుమూలల నుంచీ మీడియా, మోడలింగ్ రంగాల్లో అవకాశాలు రావచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)