మంట పుట్టించే ఘాటైన ఆహారాన్ని జనాలు ఎందుకు ఇష్టపడుతున్నారు?

  • ఫెర్నాండో డ్వార్టే
  • బీబీసీ ప్రతినిధి
మిరపకాయలు తింటూ ఇబ్బంది పడుతున్న వ్యక్తి

ఫొటో సోర్స్, Getty Images

తీవ్రమైన కడుపు నొప్పి, భరించలేని తలనొప్పి (థండర్‌క్లాప్), మెడ నొప్పులు, వాంతులతో బాధపడుతూ ఒక వ్యక్తి గత ఏడాది అమెరికాలోని ఓ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స విభాగంలో చేరారు. అతనికి ఏమైందో తెలుసుకునేందుకు వైద్యులు పరుగులు పెట్టారు.

హుటాహుటిన సిటీ స్కాన్, మూత్ర పరీక్ష చేశారు. బీపీ పరిశీలించారు, శరీరమంతా చూశారు. అతడేమీ విషం తీసుకోలేదు, జబ్బులేవీ లేవని తేలింది. కానీ, ప్రపంచంలోనే అత్యంత ఘాటైన ఒక మిరపకాయను తిన్నాడని వైద్యులు నిర్ధరించారు.

మిరపకాయలు తినే పోటీలో పాల్గొన్న 34 ఏళ్ల ఆ వ్యక్తి, 'కరోలినా రీపర్' అనే రకం మిరపకాయను పూర్తిగా కరకరా నమిలేశాడు. కానీ, ఆ ఘాటును తట్టుకోలేకపోయాడు.

మెదడులోని ధమనులు హఠాత్తుగా బిగుతుగా అయిపోవడంతో అతనికి తీవ్రమైన తలనొప్పి వచ్చిందని వైద్యులు చెప్పారు. అదృష్టం కొద్ది వైద్యుల బాగా శ్రమించడంతో ఆయన కోలుకున్నారు.

ఫొటో సోర్స్, PuckerButt Pepper Company

ఫొటో క్యాప్షన్,

అమెరికాలోని దక్షిణ కరోలినాలో పండే ఈ మిరపకాయలకు ప్రపంచంలోనే అత్యంత ఘాటైనవిగా పేరుంది

అదొక ఉదాహరణ మాత్రమే. అలా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది నాలుక మీద మంట పుట్టించే ఘాటైన ఆహార పదార్థాలను తింటున్నారు. మరి జనాలు అలాంటి ఘాటును ఎందుకు ఇష్టపడుతున్నారు?

మనిషి మిరపకాయలను వేల ఏళ్ల క్రితం నుంచి తింటున్నాడు. ఏటా ప్రపంచవ్యాప్తంగా మిరపకాయలు, మసాలాల వినియోగం అంతకంతకూ పెరిగిపోతోంది. ఆ డిమాండ్‌కు అనుగుణంగా మిరప పంట సాగు, దిగుబడి కూడా భారీగా పెరుగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా 2007లో పచ్చి మిరపకాయల దిగుబడి 2.7 కోట్ల టన్నులు ఉండగా, 2018 నాటికి అది 3.7 కోట్ల టన్నులకు పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images

కరోలినా రీపర్ మిరప ప్రత్యేకత

కారం ఘాటునుస్కొవిల్ స్కేల్ యూనిట్స్‌తో కొలుస్తారు.

ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరప వంగడంగా పేరొందిన కరోలినా రీపర్ నుంచి సగటున 15,69,300 స్కొవిల్ స్కేల్ యూనిట్స్ (ఎస్‌హెచ్‌యూ) ఉత్పత్తి అవుతాయి.

2013లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దీనిని ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపగా పేర్కొంది.

దక్షిణ కరోలినాలోని పకర్‌బట్ పెప్పర్ కంపెనీకి చెందిన ఎడ్ కర్రీ దీని సృష్టికర్త. దీనిని సృష్టించడానికి ఆయనకు పదేళ్లు పట్టింది.

మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్‌లో క్యాన్సర్‌ను నయం చేసే గుణాలు ఉన్నాయని గుర్తించడంతో ఆయన వీటిని సృష్టించారు. తన ఆదాయంలో సగాన్ని ఆయన క్యాన్సర్ పరిశోధనకు విరాళంగా ఇస్తున్నారు.

టర్కీలో అత్యధికంగా

ప్రపంచవ్యాప్తంగా ఒక్కో వ్యక్తి ఏటా సగటున 5 కిలోల మిరపకాయలు తింటున్నారని ఇండెక్స్‌బాక్స్ అనే మార్కెట్ విశ్లేషణ సంస్థ వెల్లడించింది.

కొన్ని దేశాల్లో కారం తక్కువగా తింటున్నారు. కొన్ని దేశాల్లో ఒక్కో వ్యక్తి 5 కిలోల కంటే ఎక్కువే తింటున్నారు.

ప్రపంచంలోనే కారాన్ని అత్యధికంగా టర్కీ ప్రజలు తింటున్నారు. ఈ దేశంలో ఒక్కొక్కరు రోజూ సగటున 86.5 గ్రాముల మిరపకాయలు (కారం) తింటున్నారు. ఆ తర్వాతి స్థానంలో మెక్సికో ఉంది. ఇక్కడ రోజూ సగటున 50.95 గ్రాముల మిరపకాయలు తింటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఇది చైనాలోని హ్యాంగ్‌జూ నగరంలో నిర్వహించిన 'మిరపకాయలు తినే' పోటీ. ఇలాంటి పోటీలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది

కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జెన్నీఫర్ బిల్లింగ్, పాల్ డబ్ల్యూ షెర్మాన్‌ 36 దేశాల్లో వేలాది సంప్రదాయ మాంసం వంటకాల మీద అధ్యయనం చేశారు.

వేడి వాతావరణం ఉన్న ప్రాంతాలలో ప్రజలు మసాలాలను అధికంగా వినియోగిస్తారని వారి పరిశీలనలో వెల్లడైంది.

ఫొటో సోర్స్, iStock

"వేడి వాతావరణం ఉండే దేశాల్లో దాదాపు ప్రతి మాంసం వంటకంలోనూ కనీసం ఒక్క మసాలా దినుసు అయినా వాడుతారు. చాలామంది ఒకే వంటకంలో కారం, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి, జిలకర, పసుపు లాంటి వివిధ రకాల ఘాటైన మసాలా దినుసులను వాడుతున్నారు. శీతల దేశాల్లో అయితే కొన్ని వంటకాలలో మసాలాలనే వాడరు. ఒకవేళ వాడినా... చాలా తక్కువ మోతాదులో వాడుతారు" అని వారు వివరించారు.

మసాలా వంటకాలను ఎక్కువగా ఆరగించే దేశాల జాబితాలో థాయిలాండ్, ఫిలిప్పీన్స్, భారత్, మలేషియా దేశాలు ముందున్నాయి. స్వీడన్, ఫిన్‌లాండ్, నార్వే దేశాలు చివరన ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మిరపకాయల దిగుబడిలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న టర్కీ, తలసరి వినియోగంలోనూ ముందుంది.

"ఒకప్పుడు చెరకు, బంగాళా దుంపల మాదిరిగానే మిరప కాయల గురించి కూడా ఐరోపా వాసులకు తెలియదు. కానీ, యూరోపియన్లు అమెరికాతో పాటు ఇతర ప్రాంతాలకు చేరుకుని వాణిజ్య మార్గాలను ప్రారంభించిన తర్వాత మిరపకాయలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి’’ అని ఆహార పదార్థాలపై పరిశోధనలు చేస్తున్న కావోరి ఓకొన్నోర్ చెప్పారు.

ఆ తర్వాత అనేక దేశాల్లో వంటకాలలో మిరపకాయల వినియోగం శరవేగంగా పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కీటకాలు, క్షీరదాలు దగ్గరికి రాకుండా చేసేందుకు మిరప చెట్లు 'ఘాటు'ను ఉత్పత్తి చేస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు

కారం అంటే ఎందుకు ఇష్టం?

కొందరు భయపెట్టే హారర్ సినిమాలను చూస్తూ ఎంత ఎంజాయ్ చేస్తారో, ఘాటైన మిరపకాయ తినడాన్ని కూడా అలాగే ఎంజాయ్ చేస్తారేమో అనిపిస్తోందని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ పాల్ రోజిన్ చెప్పారు.

మిరపకాయలతో ఆయన కొందరికి ప్రత్యేక పరీక్ష పెట్టారు. వారికి మొదట తక్కువ ఘాటున్న మిరప కాయలను ఇచ్చారు. తర్వాత ఇంకాస్త ఎక్కువ ఘాటున్న మిరపకాయలను ఇచ్చారు.

ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఘాటున్నవాటిని ఇచ్చారు. అలా... ఇక ఇంత ఘాటును తట్టుకోలేం అన్నంత వరకూ మిరపకాయలను ఆయన ఇస్తూ పోయారు.

చివరలో "మీరు తిన్న మిరపకాయల్లో దేని ఘాటు బాగా నచ్చిందో చెప్పండి" అని అడిగారు.

వాళ్లు తాము తినగలిగే ఘాటున్న (గరిష్ఠంగా) మిరపకాయ బాగుందని వాళ్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మిరపకాయలు తింటే పక్షులకు ఎలాంటి సమస్య రావడంలేదు

"ఈ ప్రపంచంలో చాలా క్షీరదాలు మిరపకాయలను తినవు. మనుషులు మాత్రం వాటిలోని సహజమైన ఘాటును ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే, కారం ఘాటు ఎక్కువగా ఉందని మన శరీరం చెబుతున్నా, అది ప్రమాదకరం కాదన్న విషయం మన మెదడులో ఉంటుంది" అని పాల్ రోజిన్ వివరించారు.

మెక్సికో లాంటి కొన్ని ప్రాంతాల్లో పురుషులు ఎదుటివారి ముందు తమ శక్తిని, తెగువను ప్రదర్శించేందుకు కూడా ఘాటైన మిరపకాయలను ఎంచుకుంటారని ఆహార పదార్థాలపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్త నదియా బిర్నెస్ చెప్పారు. కొందరు మహిళలు మిరపకాయల ఘాటుతో కొత్త ఉత్తేజాన్ని పొందుతారని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)