సనా మారిన్: పదిహేనేళ్ల వయసులో బేకరీలో ఉద్యోగి... 34 ఏళ్లకు దేశ ప్రధాని

  • 11 డిసెంబర్ 2019
సనా మారిన్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రపంచంలోనే అత్యంత తక్కువ వయసులో ప్రధాన మంత్రయిన నేతగా రికార్డులకెక్కిన సనా మారిన్

సనా మారిన్.. గత కొన్నేళ్లుగా ఫిన్‌లాండ్ రాజకీయాల్లో ఎదుగుతున్న నాయకురాలు. 34 ఏళ్ల వయసులోనే ప్రధాని పదవి చేపట్టి ప్రపంచంలోనే అత్యంత తక్కువ వయసులో ప్రధాన మంత్రయిన నేతగా రికార్డులకెక్కారు.

సమ్మెలు, జాతీయవాదం పెరిగిన క్లిష్ట సమయంలో ఆమె పదవిలోకి వచ్చారు. ఆమె తన మంత్రివర్గాన్నీ యువరక్తంతో నింపారు. తనకంటే చిన్నవారైన 32 ఏళ్ల మహిళ కేథ్రీ కుల్మునీకి ఆర్థిక మంత్రి పదవి అప్పగించారామె. మంత్రివర్గంలో 35 ఏళ్లు దాటినవారు ఒకే ఒక్కరున్నారు.

''రాజకీయాలు చాలా కష్టమవుతున్నాయి'' ఫిన్‌లాండ్ జాతీయ ప్రసార మాధ్యమం వైఎల్‌ఈకి చెందిన పొలిటికల్ జర్నలిస్ట్ క్రిస్టినా టోల్కీ అన్నారు. ''24/7లా పనిచేసే యువతరం కావాలి.. కొత్త ముఖాలు రాజకీయాల్లోకి రావాలి. ప్రజల కోసం పనిచేసేందుకు ఎప్పుడైనా సిద్ధంగా ఉంటూ, చెత్త మాటలు చెప్పనివారు కావాలి'' అన్నారామె.

కొత్త ప్రభుత్వంలో 12 మంది మహిళా మంత్రులు, ఏడుగురు పురుష మంత్రులు ఉండబోతున్నారు.సనా మారిన్‌ది నిరాడంబర నేపథ్యం. ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారు. సనా చిన్నతనంలో తల్లి ఆమెను ఒంటరిగానే పెంచారు. అప్పట్లో వారి కుటుంబం తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంది.

సనా ఒక బ్లాగులో.. తనకు పదిహేనేళ్ల వయసున్నప్పుడు బేకరీలో ఉద్యోగం ఎలా సంపాదించారో.. హైస్కూలులో చదువుతున్నప్పుడు పాకెట్ మనీ కోసం పేపర్లు వేయడం వంటివన్నీ రాసుకొచ్చారు.

2015‌లో మెనైసెట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె.. తన తల్లి ఒక స్వలింగ సంబంధంలో ఉన్నప్పుడు తాను ఎదుర్కొన్న బాధనూ వివరించారు.

కానీ, తన తల్లి ఎప్పుడూ తనకు అండగా ఉండేవారని.. తాను(సనా) ఏమైనా సాధించగలనంటూ ప్రోత్సహించేవారని చెప్పారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక రినె, సనా

ఆ కుటుంబంలో హైస్కూలు విద్య పూర్తి చేసిన, యూనివర్సిటీలో చదివిన మొట్టమొదటి వ్యక్తి సనాయే.

సనా ఇరవయ్యేళ్ల వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించారు. అక్కడికి రెండేళ్ల తరువాత కౌన్సిల్ సీటుకోసం ప్రయత్నించారు. ఆ ఎన్నికల్లో ఆమె సఫలం కాలేకపోయినా అక్కడికి అయిదేళ్ల తరువాత కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు.

ఫిన్‌లాండ్‌లోని ప్రధాన వామపక్షమైన సోషల్ డెమొక్రాట్స్ పార్టీ(ఎస్‌డీపీ)లో ఆమె త్వరత్వరగా ఎదిగారు. 2015లో ఎంపీ అయ్యారు.

ఆ పార్టీలో ఆమె ఒక పెద్ద వామపక్షవాదిగా, ఫిన్‌లాండ్ సంక్షేమ రాజ్యానికి ప్రధాన గొంతుగా ఆమె గుర్తింపు పొందారు.

ఒక ఎంపీగా ఆమె ఆ పార్టీ నేత ఆటి రినే దృష్టిలో పడి.. అక్కడి నుంచి ఆయనకు డిప్యూటీగా, ఆ తరువాత ప్రీతిపాత్రురాలైన నాయకురాలిగా మారారు.

గత చలికాలంలో రినే అనారోగ్యం బారిన పడడం.. అప్పుడే ఎన్నికల వేడి మొదలవడంతో సనా ఆ అవకాశాన్ని అందుకున్నారు. అనంతరం ఎన్నికల్లో విజయం సాధించే నాటికి రినే కోలుకుని వచ్చి ప్రధాని పదవి చేపట్టారు. కానీ, పోస్టల్ సమ్మె నేపథ్యంలో ఆయన సంకీర్ణ పక్షాల విశ్వాసం కోల్పోయి కొద్ది నెలల్లోనే పదవి నుంచి వైదొలిగారు.

ఆదివారం జరిగిన విశ్వాస పరీక్షలో ఆయన స్థానంలో సనా బలం నిరూపించుకున్నారు.

ఆ పదవికి ఆమె సరిపోరన్న విమర్శలను ఆమె కొట్టిపారేస్తూ.. ''నేను నా వయసు, జెండర్ గురించి ఎఫ్పుడూ ఆలోచించలేద''ని ప్రధాని పదవికి ఎంపికైన తరువాత మీడియాతో అన్నారు.

సనా మారిన్ ఫిన్‌లాండ్‌కు మూడో మహిళా ప్రధాని. ఇంతకుముందు 2003లో అనెలీ జాటీన్‌మాకి, 2010లో మారి కివినిమి ఆ దేశంలో ప్రధాని పదవి చేపట్టారు.

ప్రధాని పదవి చేపట్టిన సనా మారిన్‌కు 22 నెలల కుమార్తె ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనా లాక్‌డౌన్: దిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న 200 మందిలో చాలా మందికి కోవిడ్ లక్షణాలు

కరోనావైరస్: టోక్యో ఒలింపిక్స్ 2021లోనే... తేదీలు ఖరారు

కరోనావైరస్:‌ వేలం వెర్రిగా సాగిన టాయిలెట్ రోల్స్ కొనుగోళ్ళ వెనుక అసలు కథేంటి?

కరోనావైరస్: దిల్లీలో వలస కార్మికులు ఇంత భారీ సంఖ్యలో పోగవ్వడానికి బాధ్యులు ఎవరు?

కరోనా లాక్‌డౌన్ కుటుంబ సంబంధాల ప్రాధాన్యాన్ని గుర్తు చేసిందా?

క‌రోనావైర‌స్: రొయ్యల సాగుదారుల చిక్కులేంటి.. లాక్ డౌన్‌తో న‌ష్టం ఎంత‌

కరోనావైరస్: సరకులు కొనుక్కోవడానికి ఏది సురక్షిత మార్గం? సూపర్‌ మార్కెట్‌కు వెళ్ళడమా... ఆన్‌లైన్లో ఆర్డర్ చేయడమా?

కరోనావైరస్: వెంటిలేటర్లు ఏంటి.. అవి ఎందుకు ముఖ్యం

దిల్లీ: కరోనావైరస్ నుంచి కోలుకున్న వ్యక్తి.. ‘మొదటి మూడు రోజులు మాటలు కూడా సరిగా రాలేదు’