పాకిస్తాన్: అజ్ఞాతంలో ఇమ్రాన్ ఖాన్ మేనల్లుడు.. గాలిస్తున్న లాహోర్ పోలీసులు

  • 14 డిసెంబర్ 2019
పాకిస్తాన్ Image copyright POWERPLAY/ARY NEWS

పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మేనల్లుడు హస్సన్ నయాజీ కోసం లాహోర్ పోలీసులు గాలిస్తున్నారు.

లాహోర్‌లోని ఓ ఆసుపత్రిలో ముగ్గురు రోగుల మరణానికి దారితీసిన హింసాత్మక ఆందోళనల్లో పాల్గొన్నందుకు ఆయన్ను అరెస్టు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.

హస్సన్ తన నివాసంలో లేరని, అజ్ఞాతంలోకి వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.

నగరంలోని పంజాబ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీలోని వైద్యులతో న్యాయవాదులకు కొన్ని రోజుల క్రితం వివాదం ఏర్పడింది.

బుధవారం వందల మంది న్యాయవాదులు ఆసుపత్రికి వెళ్లి, విధ్వంసానికి దిగారు. అక్కడి సిబ్బందిపై దాడులు చేశారు. వారిలో హస్సన్ కూడా ఉన్నారు.

ఆసుపత్రిలో న్యాయవాదుల దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి.

ఈ ఘటనల అనంతరం హస్సన్ ట్విటర్‌లో స్పందించారు. ఆ ఆందోళనల్లో పాల్గొన్నందుకు సిగ్గుపడుతున్నానని ఆయన అన్నారు.

''ఈ వీడియో చూసిన తర్వాత నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇది హత్య. బాధ్యులైన వైద్యుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాత్రమే నేను నిరసన చేశా. అంతకుమించిన వాటికి నా మద్దతు లేదు. శాంతియుత ప్రదర్శనలకే నా మద్దతు ఉంటుంది. ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చినందుకు నా వైఖరిని నేనే ఖండిస్తున్నా. ఇదో దుర్దినం'' అని ఆయన ట్వీట్ చేశారు.

ట్విటర్‌లో చాలా చురుగ్గా ఉండే ఇమ్రాన్ ఖాన్, ఈ వ్యవహారంపై ఇంతవరకూ స్పందించలేదు.

ఆందోళనల వీడియోల్లో హస్సన్ ప్రధానంగా కనిపించారు. భౌతిక దాడుల్లో, పోలీసు వాహన దహనంలోనూ ఆయన పాలుపంచుకోవడం వాటిలో ఉంది.

హస్సన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆ ఆసుపత్రి నుంచి బయటకు పట్టుకువెళ్లడం కూడా ఆ వీడియోల్లో ఉంది.

అయితే, ఆ తర్వాత ఈ ఘటనలకు సంబంధించిన కేసులో హస్సన్ పేరును పోలీసులు తప్పించడం విమర్శలకు తావిచ్చింది.

Image copyright AFP

పోలీసుల తీరును చాలా మంది తప్పుబట్టారు. ప్రధాని బంధువైనందుకే హస్సన్‌ను వదిలేస్తున్నారా అని ప్రశ్నించారు. వెంటనే ఆయన్ను అరెస్టు చేయాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.

వీడియో ఫుటేజీ ద్వారా ఆందోళనల్లో హస్సన్ పాల్గొన్నట్లు గుర్తించామని, ఆయన కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి వసీమ్ భట్ బీబీసీతో చెప్పారు.

హస్సన్‌ను మొదటగా అదుపులోకి తీసుకున్న తర్వాత ఏం జరిగిందనేది లాహోర్ పోలీసులు వెల్లడించలేదు.

హింసకు కారణం ఏంటంటే..

ఆసుపత్రి సిబ్బంది తమ సహచరులతో గత నెలలో అనుచితంగా వ్యవహరించారంటూ న్యాయవాదులు ఆందోళనలు చేస్తూ వచ్చారు.

న్యాయవాదులను ఎద్దేవా చేస్తూ ఓ వైద్యుడు ప్రసంగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో మంగళవారం రాత్రి కనిపించింది.

ఆ మరుసటి రోజు న్యాయవాదులు హింసాత్మక దాడికి దిగారు.

ఆసుపత్రిలోని వార్డుల్లోకి చొరబడ్డారు. సామగ్రి, పరికరాలను ధ్వంసం చేశారు. సిబ్బందిపై దాడి చేశారు. భయాందోళనలతో వైద్యులు, ఇతర సిబ్బంది ఆసుపత్రి నుంచి పారిపోయారు. విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులకు సేవలందించేందుకు కూడా ఎవరూ అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది.

దీంతో ముగ్గురు రోగులు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Image copyright EPA

ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారని, పరిస్థితిని నియంత్రించేందుకు రెండు గంటలకుపైగా సమయం పట్టిందని అధికారులు తెలిపారు.

ఈ ఆందోళనలకు సంబంధించి 80 మందికిపైగా న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో 46 మందికి కోర్టు రిమాండ్ విధించింది.

లాహోర్ పోలీసులు తమ సహచరుల పట్ల ప్రవర్తిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం దేశవ్యాప్త సమ్మెకు దిగాలని న్యాయవాదులు పిలుపునిచ్చారు.

మీడియాలో, సోషల్ మీడియాలో న్యాయవాదుల తీరును తప్పుపడుతున్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు.

పాకిస్తాన్ దినపత్రిక డాన్ న్యాయవాదులు చేసిన ఈ దాడిని 'మానవత్వానికి మచ్చ'గా వర్ణించింది. మూక దాడులు రాజ్యమేలేలా పాకిస్తాన్ సమాజంలో అసహనం స్థాయులు పాతాళానికి పడిపోయాయనడానికి ఈ పరిస్థితి అద్దం పడుతోందని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు