పెరట్లో పెంచుకునే కూరగాయలు, పండ్ల మొక్కలతో వాతావరణ మార్పులపై పోరాటం

  • కెరోలిన్ పార్కిన్సన్
  • హెల్త్ ఎడిటర్, బీబీసీ న్యూస్, బెర్లిన్
పెరట్లో కూరగాయల పంటలు

ఫొటో సోర్స్, FAARM PROJECT

పెరట్లో పెంచుకునే కూరగాయలు, పండ్ల మొక్కలు పర్యావరణానికి మంచివేనన్న సంగతి తెలిసిందే, ఇప్పుడవి వాతావరణ మార్పులపై పోరాటంలో ఆయుధాలవుతున్నాయి.

బంగ్లాదేశ్‌లోని ఒక ప్రాంత ప్రజలకు ఆహారం, ఆదాయానికి ఆధారమైన వరి పంటను అకాల వర్షాలు నాశనం చేసినప్పుడు వారు ఎదుర్కొన్న అనుభవమిది.

2017 ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌లోని సిల్హెత్ ప్రాంతంలో వరదలొచ్చాయి. వాస్తవానికి జూన్ తరువాత అక్కడ వర్షాలు కురవాలి. కానీ.. ఏప్రిల్‌లోనే అకాలంగా వర్షాలు పడడంతో వరి పంట పూర్తిగా నాశనమైంది.

దీంతో రైతుల చేతికందాల్సిన పంట తుడిచిపెట్టుకుపోయింది. వారికి తిండానికి కూడా గింజలు లేని పరిస్థితి ఏర్పడింది.

రైతులు పండించే పంటలను, తిండి గింజల ద్వారా లభించే పోషకాలను వాతావరణ మార్పులు ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

'నష్టపోయిన ఈ రైతులు వాతావరణ మార్పులకు కారణం కానే కాదు.. కానీ, వారే దీనికి బలయ్యార'ని బెర్లిన్‌లోని చారైట్ యూనివర్సిటీ, ఇనిస్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ ప్రొఫెసర్ సబీన్ గాబ్రిష్ అన్నారు.

నోబెల్ ఫౌండేషన్ బెర్లిన్‌లో నిర్వహించిన ఆరోగ్య, వాతావరణ నిపుణుల సమావేశంలో సబీన్ బీబీసీతో మాట్లాడుతూ.. ''వాతావరణ మార్పుల ప్రభావానికి వారు నేరుగా లోనయ్యారు. జీవనోపాధిని, పోషకాలను కోల్పోయారు. పెరుగుతున్న దశలో వారి పిల్లలకు పంట నష్టం వల్ల పోషకాహారం అందలేదు'' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

తీవ్రమైన పోషకాహార లోపం

వర్షాలతో పంటలు నాశనం కావడానికి ముందే అక్కడి మహిళల్లో మూడొంతుల మంది ఉండాల్సిన కంటే 40 శాతం తక్కువ బరువున్నారు. వారి పిల్లలు కూడా తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.

అక్కడి ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, అక్కడెవరికీ బీమా వంటిదేమీ లేదని.. జీవనమే భారంగా ఉన్న స్థితిలో వారిని అకాలవర్షాలు మరిన్ని కష్టాల్లోకి నెట్టేశాయని ప్రొఫెసర్ సబీన్ చెప్పారు.

సిల్హెత్ ప్రాంతంలో వరదల ప్రభావంపై అధ్యయనం చేస్తున్న ఒక బృందానికి ప్రొఫెసర్ సబీన్ నేతృత్వం వహిస్తున్నారు. ఆ ప్రాంతంలోని గ్రామాలకు చెందిన సుమారు 2 వేల మంది మహిళలతో కలిసి పనిచేస్తూ వారి జీవనాన్ని, వాతావరణ పరిస్థితులు చూపుతున్న ప్రభావాన్ని ఆమె అధ్యయనం చేస్తున్నారు.

వరదల కారణంగా తమ కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని ఆ మహిళల్లో సగం కంటే ఎక్కువ మంది చెప్పారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి తమకున్న ఏకైక మార్గం అప్పు తెచ్చుకోవడమేనని చెప్పారు. అధిక వడ్డీలకు అప్పులిచ్చేవారి నుంచి రుణాలు తెచ్చుకోవడంతో ఆ కుటుంబాలన్నీ తీవ్రమైన రుణభారంలో కూరుకుపోతున్నాయి.

ఈ పరిస్థితుల నుంచి బయటపడడం కోసం అధ్యయన బృందం వారికి సహాయపడుతోంది. పెరట్లోనే పండ్లు, కూరగాయల మొక్కలు పెంచుకునేలా ప్రోత్సహిస్తోంది. వాటితో పాటు కోళ్ల పెంపకంపైనా అవగాహన కల్పిస్తోంది.

వరి పంటను కోల్పోవడంతో పోల్చితే ఇవన్నీ ఉపశమన చర్యలే కానీ, పూర్తిగా ఆ నష్టాన్ని భర్తీ చేయలేవని ప్రొఫెసర్ సబీన్ అన్నారు.

వర్థమాన దేశాల ప్రజలు బియ్యం, ఇతర పిండిపదార్థ పంటలను పండించి తింటారు. కానీ, వాతావరణ మార్పుల ప్రభావం వల్ల అవి ఒకప్పటిలా పోషక సమృద్ధ ఆహారాలు కావు.

కార్బన్ డై ఆక్సైడ్ మోతాదు పెరుగుతోంది

వాషింగ్టన్ యూనివర్సిటీలోని గ్లోబల్ హెల్త్ విభాగ ప్రొఫెసర్ క్రిస్టీ ఎబీ పోషకాలపై జరిపిన అధ్యయనంలో బియ్యం, గోధుమలు, బంగాళాదుంపలు, బార్లీ వంటి ఆహారపదార్థాల్లో ఇప్పుడు కార్బన్ డై ఆక్సైడ్ మోతాదు పెరిగినట్లు గుర్తించారు. ''ఒకప్పటితో పోల్చితే ఈ పంటలకు ఇప్పుడు తక్కువ నీరు అవసరమవుతోంది.. ఇది మంచి సంకేతం కాదు. తక్కువ నీటితో ఈ పంటలు పండడం వల్ల అవి నేలలోని సూక్ష్మపోషకాలను తగినంత గ్రహించవు'' అంటారామె.

క్రిస్టినా బృందం చేసిన అధ్యయనంలో ధాన్యంలో ఉండాల్సిన 'బి' విటమిన్ గతం కంటే సగటున 30 శాతం తగ్గిందని, గర్భిణులకు కీలకమైన ఫోలిక్ యాసిడ్ కూడా ఉండాల్సిన సాధారణ స్థాయి కంటే తక్కువ ఉంటోందని తేలింది.

''చాలాదేశాల్లో ప్రజలు పిండిపదార్థులుండే ఆహారాలే తింటున్నారు. ఆ కారణంగానే సూక్ష్మపోషకాలు వారికి లభ్యం కావు. దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి''

వ్యాధులు విస్తరిస్తున్నాయి

''దోమల వల్ల వచ్చే వ్యాధులతో ముప్పు ఎక్కువే. అంటువ్యాధులు, అతిసారతోనూ ప్రమాదమే. భూతాపం పెరుగుతుంటే వీటి విస్తరణ పరిధి పెరుగుతోంది. అంతేకాదు ఇవి సంక్రమించడమూ ఎక్కువవుతోంది'' అంటారామె.

సాధారణంగా ఉష్ణమండలంలో కనిపించే వ్యాధులు ఉత్తర దిశ దేశాలకు వ్యాపిస్తున్నాయి.

పశ్చిమ నైలు ప్రాంతంలో కనిపించే వైరస్‌లు ఈసారి మొట్టమొదటగా జర్మనీలోనూ కనిపించాయి. దోమలు వీటిని మోసుకెళ్తున్నాయి.

''అంటువ్యాధుల వ్యాప్తి అనేది వాతావరణ మార్పుల ప్రభావం మన వైపు వస్తోందనడానికి సూచన'' అని ప్రొఫెసర్ సబీన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)