డెన్మాన్ గ్లేసియర్: భూమి మీద అత్యంత లోతైన ప్రదేశం... అంటార్కిటికాలోని ఈ లోయ లోతు 11,500 అడుగులు

  • 16 డిసెంబర్ 2019
డెన్మాన్ గ్లేసియర్ Image copyright BEDMACHINE/UCI/BAS
చిత్రం శీర్షిక డెన్మాన్ గ్లేసియర్ (ముదురు నీలం రంగులో ఉన్న ప్రాంతం) 20 కిలోమీటర్ల నిడివి, 100 కిలోమీటర్ల పొడవు ఉంది.. మొత్తం మంచుతో నిండిపోయి ఉంటుంది

భూమి మొత్తం మీద అత్యంత లోతైన ప్రదేశం తూర్పు అంటార్కిటికాలో డెన్మాన్ గ్లేసియర్ (హిమనీనదం) కింద ఉన్నట్లు గుర్తించారు.

మంచుతో నిండివున్న ఈ లోయ లోతు సముద్ర మట్టం కన్నా 3.5 కిలోమీటర్లు (11,500 అడుగులు) ఉంది. ఇంతకన్నా లోతైన లోయలు కేవలం సముద్రంలోనే ఉన్నాయి.

కొత్తగా గుర్తించిన ఈ అతి పెద్ద లోయను వైట్ కాంటినెంట్‌కు సంబంధించిన కొత్త మ్యాప్‌లో సవివరంగా చిత్రీకరించారు. మంచు దుప్పటి కింద ఉన్న పునాది రాయిని ఈ మ్యాప్‌లో మునుపెన్నడూ లేని రీతిలో క్షుణ్నంగా విశదీకరించారు.

దక్షిణ ధ్రువం భవిష్యత్తులో ఎలా మారగలదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి ఈ పునాది లక్షణాలు కీలకమవుతాయి.

ఈ లోయతో పోలిస్తే.. భూమి మీద అత్యంత లోతైన ప్రదేశమైన మృత సముద్రం తీరంలోని లోయ లోతు కేవలం సముద్రమట్టం కన్నా 413 మీటర్లు (1,355 అడుగులు) మాత్రమే.

వేడెక్కుతున్న ప్రపంచంలో కరిగిపోతున్న హిమనీనదాల తిరోగమనాన్ని నిరోధిస్తున్న ఇంతకుముందు గుర్తించని గట్లను ఈ అధ్యయనంలో కొత్తగా తెలిశాయి. అలాగే.. హిమనీనదాల తిరోగమనం వేగాన్ని పెంచగల అనేక సాఫీ ఏటవాలుల గురించీ తెలిసింది.

''అంటార్కిటికా మంచు దుప్పటి కింద ఏముంది అనేది అత్యంత కచ్చితమైన చిత్రీకరణ ఇది అనటంలో సందేహం లేదు'' అని డాక్టర్ మాథ్యూ మోర్లిఘమ్ పేర్కొన్నారు. ఆయన ఆరేళ్ల పాటు ఈ ప్రాజెక్టు కోసం పనిచేశారు.

Image copyright POLARGAP
చిత్రం శీర్షిక అంటార్కిటికా భూభౌతిక స్వరూపాన్ని చిత్రీకరించటానికి వాయు మార్గంలో రాడార్లను ఉపయోగించారు.. కానీ ఆ సమాచారంలో చాలా ఖాళీలున్నాయి

అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ శిశిరకాల సమావేశంలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకుడు ఇర్విన్, 'బెడ్‌మెషీన్ అంటార్కిటికా' అనే తన నూతన ప్రాజెక్టును ప్రదర్శిస్తున్నారు. దీనిని నేచర్ జియోసైన్స్ జర్నల్‌లో సైతం ప్రచురిస్తున్నారు.

అంటార్కిటికా ఖండాన్ని గగనతలం నుంచి చేసిన సర్వేల్లో గల ఖాళీలను ఈ మ్యాప్ భర్తీ చేస్తోంది.

అంటార్కిటికాను దశాబ్దాల పాటు రాడార్ పరికరాలు కలియదిరిగాయి. మంచును చీల్చుకుంటూ సూక్ష్మతరంగాలను లోపలికి పంపి అడగున ఉన్న పునాది రాయి భౌతికస్వరూప స్వభావాలను చూడటానికి ప్రయత్నించాయి. కానీ.. ఇంకా చాలా ప్రాంతాలకు సంబంధించిన సమాచారం లభించలేదు.

ఈ లోపాలను భర్తీచేయటానికి డాక్టర్ మోర్లింఘామ్ భౌతికశాస్త్రంలో 'మాస్ కన్జర్వేషన్' సూత్రాన్ని ఉపయోగించుకున్నారు.

ఉదాహరణకు.. ఒక ఇరుకైన లోయలోకి ఎంత మొత్తం మంచు ప్రవేశిస్తోంది, అది ఎంత వేగంగా కదులుతోంది అనేది తెలిస్తే.. ఆ మంచు పరిమాణాన్ని లెక్కించవచ్చు. దానిద్వారా కనిపించకుండా ఉన్న ఆ లోయ లోతు గురించి, దాని ఎత్తు పల్లాల గురించి ఒక అవగాహన లభిస్తుంది.

డెన్మాన్ గ్లేసియర్ 20 కిలోమీటర్ల వెడల్పు ఉంది. అది క్వీన్ మేరీ ల్యాండ్‌లోని సముద్రం దిశగా ప్రవహిస్తుంది. ఈ హిహనీనదానికి పై సూత్రాన్ని వర్తింపచేయటం ద్వారా.. ఆ మంచు సముద్ర మట్టం కన్నా 3,500 మిటర్ల కన్నా లోతుకు జారుతోందని వెల్లడైంది.

''సముద్రాల్లో అగడ్తలు ఇంకా లోతుగా ఉంటాయి. కానీ భూమి మీద అత్యంత లోతైన లోయ ఇది'' అని డాక్టర్ మోర్లింఘమ్ వివరించారు.

Image copyright NASA/USGS/LANDSAT
చిత్రం శీర్షిక ట్రాన్సంటార్కిటిక్ పర్వతాలను చీల్చుకుంటూ ప్రవహించే భారీ హిమనీనదం బిర్డ్ గ్లేసియర్

''డెన్మాన్ అడుగు భాగాన్ని సూక్ష్మ తరంగాల ద్వారా కొలిచే ప్రయత్నాలు జరిగాయి. కానీ రాడార్లు దీని మీదుగా ఎప్పుడు ప్రయాణించినా కూడా అవి అందించే సమాచారంలో ఆ పునాదిని చూడలేకపోయారు'' అని చెప్పారు.

''లోయ పక్క భాగాలు ఎంత బలంగా ఉన్నాయంటే.. ఆ గోడల నుంచి ప్రతిధ్వనులు వస్తాయి. దానివల్ల హిమనీనదం వాస్తవ పునాది ప్రతిఫలనాన్ని కనుగొనటం అసాధ్యమవుతుంది'' అని ఆయన బీబీసీ న్యూస్‌కు తెలిపారు.

సముద్రరంలోని అత్యంత లోతైన ప్రాంతమైన పశ్చిమ పసిఫిక్‌లోని మారియానా ట్రెంచ్‌.. సముద్ర మట్టం కన్నా దాదాపు 11 కిలోమీటర్ల లోతు ఉంటుంది. చైనా లోని యార్లుంగ్ త్సాంగ్పో గ్రాండ్ కానియన్ వంటి.. చాలా పొడవైన పక్క గోడలు ఉన్నట్లు అభివర్ణించే భూమి లోయలు కొన్ని ఉన్నాయి. కానీ వాటి పునాదులు సముద్ర మట్టం కన్నా పైకే ఉన్నాయి.

బెడ్‌మెషీన్ అంటార్కిటికాను మొదట చూసినపుడు ఇంతకుముందు చూసిన బెడ్‌మ్యాప్‌లకన్నా భిన్నంగా ఏమీ కనిపించదు. కానీ.. నిశితంగా పరిశీలిస్తే కొన్ని అద్భుతమైన వివరాలు కనిపిస్తాయి. ధృవపు నిపుణుల్లో ఆసక్తిని, చర్చను రేకెత్తిస్తాయి.

రానున్న శతాబ్దాల్లో భూమి మీద ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఈ మంచు ఖండం ఎలా పరిణామం చెందవచ్చుననేది అంచనా వేయటానికి ప్రయత్నించే వాతావరణ నమూనాలకు ఈ బెడ్‌మెషీన్ అంటార్కిటికా సాయపడుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

నిర్భయ దోషులకు మార్చి 3న ఉరిశిక్ష: దిల్లీ కోర్టు

ఒక 'బలవంతపు పెళ్లి' వేల మందిని కాపాడింది

శ్రీనివాస్ గౌడ: ‘ట్రయల్ రన్‌లో పాల్గొనను.. పరుగు పందేలపై ఆసక్తి లేదు’

మహిళలు కూడా ఆర్మీలో కమాండింగ్ రోల్స్‌, శాశ్వత కమిషన్‌కు అర్హులే: సుప్రీంకోర్టు

హాంకాంగ్‌లో టాయిలెట్‌ రోల్స్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. సూపర్ మార్కెట్ల వద్ద భారీగా క్యూలు కడుతున్న జనం

ఉమెన్స్ లీగ్: భారత మహిళల ఫుట్‌బాల్‌లో ఎలాంటి మార్పులొస్తున్నాయి

జపాన్‌ తీరంలో ఆగిన డైమండ్ ప్రిన్సెస్ నౌక నుంచి ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి బయల్దేరిన అమెరికన్లు

"ఏడు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు.. పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా" - ఓ పోలీసు అధికారి