హైడ్రాలిక్ చేతిని అమర్చుకున్నాక అయిదేళ్ల బాలుడి ఆనందం.. ‘హమ్మయ్య.. తమ్ముడిని కౌగిలించుకోగలిగా’

జాకబ్, సోదరుడు

ఫొటో సోర్స్, BEN RYAN

నెలలు నిండడానికి 8 వారాల ముందే జన్మించిన జాకబ్‌కు పుట్టుకతోనే ఎడమ చేయి లేదు.

అతడికి కృత్రిమ చేయి అమర్చేందుకు గాను బ్రిటన్‌లోని వెస్ట్ యార్క్‌షైర్‌కి చెందిన అతడి తల్లిదండ్రులు గెమ్మా టర్నర్, క్రిస్ స్క్రిమ్‌షా 16 వేల పౌండ్ల నిధులు సేకరించారు.

కనీసం మోచేతి వరకైనా చేయి లేకపోవడంతో 'పనిచేయడానికి వీలయ్యే కృత్రిమ చేయి' అమర్చడం వల్ల ప్రయోజనం ఉండదని ఎన్‌హెచ్‌ఎస్, ఇతర సంస్థలు అభిప్రాయపడ్డాయి.

ఆ సమయంలో ఆంగ్లెసీలోని మెనాయ్ బ్రిడ్జికి చెందిన బెన్ రియాన్ జాకబ్ కోసం అన్ని పనులు చేయడానికి వీలు కల్పించే ఒక కృత్రిమ హస్తం రూపొందించేందుకు ముందుకొచ్చారు.

ఫొటో సోర్స్, Ben ryan

ఫొటో క్యాప్షన్,

తల్లి గెమ్మాతో జాకబ్

రియాన్ కుమారుడికి పది రోజుల వయసున్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో చేయి తీసేయాల్సి వచ్చినప్పుడు అతడు ఒక హైడ్రాలిక్ డిజైన్‌ను అభివృద్ధి చేశాడు.

ఆ తరువాత రియాన్ అప్పటి వరకు చేస్తున్న సైకాలజీ లెక్చరర్‌ ఉద్యోగాన్ని వదిలి ఆంబియానిక్స్ అనే సొంత సంస్థను స్థాపించారు.

ఆ సంస్థ ఇప్పుడు పోలాండ్‌కు చెందిన కృత్రిమ అవయవాల తయారీ సంస్థ గ్లేజ్‌లో విలీనమైంది. ఆ సంస్థ తరఫునే రియాన్ ఇప్పుడు జాకబ్‌‌కు కృత్రిమ హస్తం తయారీకి పనిచేశారు.

జాకబ్‌కు ఇప్పుడు అయిదేళ్లు. జాకబ్ కోసం అతడి కుటుంబం సరైన హైడ్రాలిక్ కృత్రిమ చేతిని తయారు చేయాలని రియాన్‌ను కోరింది.

ఫొటో సోర్స్, Ben ryan

స్లైడింగ్ లాక్ సహాయంతో మోచేతిని అమర్చవచ్చని.. భుజం వద్ద ఉండే నీటి బుగ్గను జాకబ్ చేత్తో పిండితే చేయి మూసుకునేలా, దాన్ని వదిలేస్తే మళ్లీ తెరుచుకునేలా తయారుచేస్తానని రియాన్ వారికి తెలిపారు.

జాకబ్ కోసం ఆయన సూపర్‌హీరో థీమ్‌తో ఆకుపచ్చ రంగులో అతడి ఇంకో చేతి పరిమాణంలో ఈ హైడ్రాలిక్ హస్తాన్ని రూపొందించారు రియాన్.

డిసెంబర్ 12వ తేదీన ఆయన హాంప్‌షైర్‌లోని రింగ్‌వుడ్‌లో నిర్వహించిన సమావేశంలో జాకబ్‌కు ఆ చేతిని అందజేశారు.

ఇది జాకబ్‌కు కరెక్టుగా సరిపోయిందని.. జాకబ్ దాన్ని అందరూ అనుకున్నదానికంటే ఇంకా బాగా ఉపయోగించుకుంటున్నాడని రియాన్ తెలిపారు.

'జాకబ్ ఇప్పుడు అతడి సోదరుడిని కౌగిలించుకోగలడు.. సోదరుడి చేతిని పట్టుకోగలడు' అన్నారు రియాన్.

ఫొటో సోర్స్, Ben ryan

ఈ హైడ్రాలిక్ చేతిని జాకబ్‌కు అమర్చడం పూర్తయిన తరువాత తల్లి గెమ్మా మాట్లాడుతూ.. కొడుకును అలా రెండు చేతులతో చూడడం ఎంతో బాగుందన్నారు.

జాకబ్ కృత్రిమ హస్తం కోసం ఒక అజ్ఞాత దాత వారికి 5,000 పౌండ్లు ఇచ్చారు.

ఇలా నిధులు సేకరించడం మాకు ఇబ్బందిగానే అనిపించినా చేయకతప్పలేదన్నారు బాలుడి తల్లిదండ్రులు.

జాకబ్‌ విషయంలో సహాయం పొందడంలో ఆ కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడిందని.. ఆ బాలుడికి పనిచేసే చేతిని ఎవరూ తయారు చేయలేకపోయమారని రియాన్ అన్నారు. ఈ హైడ్రాలిక్ చేయి ఎప్పటికీ ఇలానే ఉంటుందని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)