ఈ భవనాలు హిరోషిమా అణు బాంబును తట్టుకున్నాయి..

హిరోషిమా భవనాలు

ఫొటో సోర్స్, Google

జపాన్‌లోని హిరోషిమా నగరంపై 1945లో జరిగిన అణుబాంబు దాడిని తట్టుకున్న భవనాలు ఇవి. ఇప్పుడు వీటిని కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఆనాటి విధ్వంసానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ నిర్మాణాలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ రెండు భవనాలను 1913లో నిర్మించారు. వీటిని మొదట్లో సైనికుల దుస్తుల తయారీ కర్మాగారంగా వాడారు. తర్వాత విశ్వవిద్యాలయం విద్యార్థులకు వసతి గృహంగా వినియోగించారు.

1945లో ఇక్కడ అణుబాంబు దాడి జరిగినప్పుడు ఇవే భవనాలు ఆస్పత్రిగానూ మారిపోయాయి.

హిరోషిమా నగరంపై 1945 ఆగస్టులో అణుబాంబు దాడి జరిగినప్పుడు కొన్ని కిలోమీటర్ల వరకూ మంటలు తుపానులా వ్యాపించాయి. క్షణాల్లో దాదాపు 80,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35,000 మంది క్షతగాత్రులయ్యారు.

ఆ బాంబు విధ్వంసానికి దాదాపు నగరమంతా నేలమట్టమైంది. 'గ్రౌండ్ జీరో' (బాంబు పడిన ప్రాంతం) నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో కేవలం 85 భవనాలు మాత్రమే మిగిలాయి.

గట్టి కాంక్రీటుతో నిర్మించడం వల్ల ఈ భవనాలు అణు బాంబు దాడిని తట్టుకోగలిగాయి. అయినా, బాంబు దాడితో వీటి కిటీకీలు, తలుపులు పగిలిన గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images

అయితే, భారీ భూకంపాలు వస్తే ఈ భవనాలు కూలిపోయే అవకాశం ఉందని 2017లో అధికారులు తేల్చారు. 2022లోగా వీటిని కూల్చివేయాలని స్థానిక ప్రభుత్వం నిర్ణయించింది.

మూడో భవనాన్ని మాత్రం కాంక్రీటుతో మరమ్మతులు చేయించి, భూకంపాలను తట్టుకునేలా చేస్తామని అధికారులు చెబుతున్నారు.

అణుబాంబు దాడి జరిగినప్పుడు ఈ భవనంలో తలదాచుకున్న వారిలో 89 ఏళ్ల ఇవావో నకానిషి ఒకరు. ఈ భవనాలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్న స్థానికుల సంఘానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

"హిరోషిమాలో జరిగిన విధ్వంసం గురించి భావితరాలకు వివరించాల్సిన అవసరం ఉంది. అంతటి విధ్వంసాన్ని తట్టుకుని నిలబడ్డ ఈ భవనాలను కూల్చివేయడాన్ని మేము ఒప్పుకోం. అణ్వాయుధాల నిర్మూలన చేసే ప్రచారానికి ఈ భవనాలను వాడుకోవచ్చు’’ అని ఇవావో అన్నారు.

కొన్నాళ్లుగా ఈ భవనాలను వినియోగించడంలేదు. అయితే, స్థానిక అధికారుల అనుమతితో సందర్శకులు వీటిని చూడొచ్చు.

"అణు బాంబు సృష్టించిన విధ్వంసానికి ఈ భవనాలు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. అలాంటి చారిత్రక భవనాలను పరిరక్షించాల్సిన అవసరం ఉంది’’ అని పర్యటకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

హిరోషిమాలో ఏం జరిగింది?

రెండో ప్రపంచ యుద్ధంలో సరెండర్ అవుతున్నట్లు 1945 మే నెలలో జర్మనీ ప్రకటించింది. జపాన్ మాత్రం యుద్ధాన్ని కొనసాగించింది.

యుద్ధాన్ని విరమించుకోవాలంటూ అమెరికా విధించిన అల్టిమేటంను జపాన్ తిరస్కరించింది. దాంతో, అణు బాంబును వదలడం ద్వారా జపాన్‌ను దారికి తెచ్చుకోవాలని అమెరికా భావించింది.

మొదట హిరోషిమా నగరంపై ఓ బాంబును వేసింది. దాని విధ్వంసానికి మొత్తం దాదాపు 1,40,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అంచనా. (అప్పటికప్పుడు చనిపోయిన వారితో పాటు, రేడియేషన్ ప్రభావం వల్ల తర్వాత సంభవించిన మరణాలు కలిపి).

ఒక యుద్ధంలో అణు బాంబును వాడటం అదే మొదటిసారి.

హిరోషిమాపై దాడి జరిగిన తర్వాత వెంటనే జపాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో, మరో మూడు రోజుల తర్వాత అమెరికా బలగాలు నాగసాకి నగరంపై రెండో బాంబును వేశాయి.

చివరికి ఆరు రోజుల తర్వాత జపాన్ సరెండర్ అవుతున్నట్లు ప్రకటించి, రెండో ప్రపంచ యుద్ధానికి ముగింపు పలికింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)