ఉల్లి మన ఆహారంలో ఎలా భాగమైంది? దాని చరిత్ర ఏంటి?

  • 17 డిసెంబర్ 2019
ఉల్లిగడ్డ ONION PRICE

కొంత కాలంగా రోజూ వార్తల్లో కనిపిస్తున్నది, రైతు బజార్లలో అత్యంత ఖరీదైనది, సామాన్యుడు కొనలేని స్థితిలో ఉన్న ఆహార వస్తువు ఉల్లిగడ్డ. ఉల్లి ధరలపై గల్లీ నుంచి దిల్లీ దాకా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఉల్లి గురించి చారిత్రక విశేషాలను ఒకసారి చూద్దాం.

ప్రపంచంలో అనేక దేశాలలో ఉల్లిని పండిస్తున్నారు, తింటున్నారు. అంత ఆదరణ మరే కూరగాయకూ లేదు.

ఉల్లిగడ్డలు పండించే ప్రయోగాలు దాదాపు 4,000 ఏళ్ల ముందు నుంచే జరిగాయి. యేల్ విశ్వవిద్యాలయం భద్రపరచిన మెసొపొటేమియా నాగరికత నాటి ఓ పత్రంలో ఆ విషయం స్పష్టమవుతోంది.

1985లో ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్త జీన్ బొట్టెరో ఆ పత్రాన్ని గుర్తించారు. అప్పటి వరకూ ఉల్లికి అంత చరిత్ర ఉందన్న విషయం ఆధునిక ప్రపంచానికి తెలియలేదు.

ఉల్లితో పాటు, ఉల్లి కాడలు, వెల్లుల్లి, అడవి ఉల్లిని కూడా మెసొపొటేమియన్లు వినియోగించినట్లు తెలుస్తోందని బొట్టెరో చెప్పారు.

Image copyright YALE BABYLONIAN COLLECTION
చిత్రం శీర్షిక ఉల్లి చరిత్రను తెలిపే రచన

"జన్యువుల విశ్లేషణ ఆధారంగా చూస్తే ఉల్లి మూలాలు మధ్య ఆసియాలో ఉన్నాయని అర్థమవుతోంది. ఐరోపాలో ఉల్లి వినియోగం కాంస్య యుగం కాలంలో మొదలైనట్లు ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయి" అని 'ద సిల్క్ రోడ్ గౌర్మే' పుస్తకం రచయిత లారా కెల్లీ చెప్పారు.

ప్రస్తుతం కూరగాయల్లో ప్రపంచంలో అత్యంత ఎక్కువగా విస్తరించింది ఉల్లిగడ్డే.

ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం, కనీసం 175 దేశాలలో ఉల్లి సాగుచేస్తున్నారు. గోదుమ పండిస్తున్న దేశాల సంఖ్యకు అది రెండింతలు. సాగు విస్తీర్ణం పరంగా చూసినా కూడా ఉల్లి ప్రపంచంలోనే అతిపెద్ద పంట.

ప్రపంచవ్యాప్తంగా ప్రధాన వంటకాలన్నింటిలోనూ ఉల్లిని వాడుతున్నారు. ఉల్లిలో మంచి రుచితోపాటు, పోషక పదార్థాలు కూడా ఉండటమే దీనికి కారణం.

ప్రపంచవ్యాప్తంగా ఉల్లి దిగుబడిలో, వినియోగంలో భారత్, చైనా దేశాలు అగ్ర స్థానాల్లో ఉన్నాయి. దిగుబడిలో 45 శాతం వాటా ఈ రెండు దేశాలదే.

వ్యవసాయ, శుద్ధి చేసిన ఉత్పత్తుల ఎగుమతుల సంస్థ (అపెడా) గణాంకాల ప్రకారం, విస్తీర్ణంలో చూస్తే చైనా కంటే భారత్‌లోనే ఉల్లి పంట అధికంగా సాగవుతోంది. కానీ, చైనాలో ఒక హెక్టారుకు సగటున 22 టన్నుల దిగుబడి వస్తుండగా, భారత్‌లో అది 14.2 టన్నులుగానే ఉంది.

ఉల్లి వినియోగంలో లిబియా అగ్రస్థానంలో ఉంది. ఈ దేశంలో ప్రతి వ్యక్తీ ఒక్క 2011 సంవత్సరంలోనే సగటున 33.6 కిలోల ఉల్లి తిన్నారని ఐక్యరాజ్య సమితి అధ్యయనంలో వెల్లడైంది.

అదే ఏడాది పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనెగల్‌లో ఒక్కో వ్యక్తి సగటున 21.7 కిలోలు వినియోగించారు. బ్రిటన్‌లో తలసరి ఉల్లి వినియోగం 9.3 కిలోలుగా ఉంది.

భారత్‌లో రోజూ సగటున 40,000 నుంచి 50,000 టన్నుల ఉల్లిగడ్డలు వినియోగిస్తున్నారని అంచనా.

ప్రస్తుతం పండుతున్న ఉల్లిలో 90 శాతం మేర ఆయా దేశాల్లోనే వినియోగానికే సరిపోతోంది. మిగిలిన 10 శాతం దిగుబడులు మాత్రమే విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

Image copyright iStock

ఉల్లిలో పోషకాలు?

ఉల్లిలో పలు రకాల పోషకాలు ఉన్నాయి.

సహజమైన చక్కెర, విటమిన్ ఎ, బీ6, సీ, ఈ, సోడియం, పొటాషియం, ఐరన్, పీచు పదార్థం, ఫోలిక్ ఆమ్లం ఉల్లిగడ్డలో దొరుకుతాయి.

"ఉల్లి తక్కువ కెలొరీలున్న ఆహార వస్తువు. ఇందులో కొవ్వు పదార్థాలు అస్సలు ఉండవు. విటమిన్ సి ఉల్లిలో పుష్కలంగా ఉంటుంది" అని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ అర్చనా గుప్తా చెప్పారు.

"100 గ్రాముల ఉల్లిలో ఉండే పోషక పదార్థాల గురించి మాట్లాడుకుంటే ఇందులో 4 మిల్లీగ్రాముల సోడియం, 1 మిల్లీగ్రాము ప్రోటీన్లు, 9-10 మిల్లీగ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 మిల్లీగ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి" అని ఆమె వివరించారు.

అందుకే ఆరోగ్య నిపుణులు కూడా ఉల్లిపాయలు తినాలని సలహా ఇస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉండటం వల్ల క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉల్లిపాయను తరచూ ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఉల్లి గడ్డలో 85 శాతం నీరు ఉంటుంది. ఉల్లిగడ్డను కోసినప్పుడు 'సిన్- ప్రొపేన్‌థయాల్- ఎస్- ఆక్సైడ్' అనే రసాయన పదార్థం వెలువడుతుంది. దానివల్లే మన కళ్లలో నీళ్లు వస్తాయి.

Image copyright RONNY SEN

ఉల్లిపాయపై రాజకీయాలు

భారత్‌లో ఉల్లి ధరల అంశం తరచూ పతాక శీర్షికల్లో నిలుస్తుంటుంది. ఒకసారి కిలో పది రూపాయలకే దొరుకుతే, ఆ తర్వాత కొన్ని వారాల్లోనే కిలో 50... 100... 150 రూపాయలు అంటూ వార్తలు వస్తుంటాయి.

ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా కూడా ఉల్లి మారుతోంది. 1998లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయానికి ఉల్లిధరలు పెరగడమే ప్రధాన కారణమని విశ్లేషకులు అంటుంటారు.

ఇప్పుడు కూడా ఉల్లి ధర కిలో 100 రూపాయలకు పైనే ఉంది. ఉల్లి ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ దేశంలో కొరతను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)