‘మా తల్లిదండ్రులు ఓ రహస్య గే పోర్న్ రాజ్యాన్ని నడిపారు'

  • జాజా ముహమ్మద్
  • బీబీసీ స్టోరీస్
సర్కస్ ఆఫ్ బుక్స్

ఫొటో సోర్స్, RACHEL MASON

కారెన్, బారీ మాసన్‌లకు అదేమీ అత్యంత ఇష్టమైన కెరీర్ కాదు. దాని గురించి వాళ్లు బాహాటంగా మాట్లాడగలిగేదీ కాదు. కానీ.. లాస్ ఏంజెలెస్‌లో ప్రముఖ గే పోర్న్ దుకాణాన్ని వాళ్లు ఏళ్ల తరబడి నడిపించారు. అమెరికా వ్యాప్తంగా 'అడల్ట్ మెటీరియల్' పంపిణీ చేశారు.

బయటకు వాళ్లది గౌరవప్రదమైన కుటుంబం. చికాగో, సిన్సినాటీల్లో పేరున్న వార్తా పత్రికలకు జర్నలిస్టుగా పనిచేసేవారు కారెన్. సినీ రంగంలో స్పెషల్ ఎఫెక్ట్స్ ఇంజనీర్‌గా పనిచేసేవారు బారీ. స్టార్ ట్రెక్, 2001 స్పేస్ ఒడిస్సీ సినిమాలకు కూడా పనిచేశారు.

వాళ్లు ఒక రాత్రి ఓ యూదు అవివాహితుల సమావేశంలో కలిశారు. వారికి ముగ్గురు పిల్లలు. ముగ్గురూ షాబాత్ సేవలు, ప్రార్థనా సమావేశాలకు వెళ్లారు. స్కూలులో కష్టపడి చదువుకున్నారు.

బారీ.. ఓ ఆవిష్కర్తగా పనిచేస్తూ 1970వ దశకం మధ్యలో కిడ్నీ డయాలసిస్ యంత్రాలకు ఒక రక్షణ పరికరాన్ని అభివృద్ధి చేశారు. కానీ.. ఆ పరికరాన్ని కొనుగోలు చేస్తానన్న సంస్థ.. బీమా పాలసీలు కావాలని అడిగింది. అందుకు అవసరమైన డబ్బులు ఆయన దగ్గర లేవు. ఆ ప్రాజెక్టు అర్థంతరంగా కుప్పకూలింది. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది.

ఫొటో సోర్స్, RACHEL MASON

అప్పుడు ఎల్ఏ టైమ్స్ పత్రికలో ఒక ఉద్యోగ ప్రకటన చూశారు కారెన్. పోర్న్ వ్యాపారి లారీ ఫ్లింట్ ఉత్పత్తి చేసిన హస్లర్ మేగజీన్‌ను, ఇతర వస్తువులను పంపిణీ చేయటానికి ఒక వ్యక్తి కావాలన్నది ఆ ప్రకటన. అలా మాసన్లు పోర్న్ పరిశ్రమలో అడుగుపెట్టారు.

వాళ్లు మంచి వ్యాపారవేత్తలుగా మారారు. కారెన్, బారీలు వాటిని పంపిణీ చేయటానికి లాస్ ఏంజెలెస్ అంతటా కారులో తిరుగుతూ మొదటి కొన్ని వారాల్లోనే చాలా తక్కువ కృషితో 5,000 ఆర్డర్లు సంపాదించారు. హస్లర్ స్త్రీ-పురుషుల పోర్న్ మేగజీన్ అయినప్పటికీ.. కొన్ని విఫలమైన స్వలింగ సంపర్క (గే) పోర్న్ మేగజీన్లను ఫ్లింట్ చేపట్టారు. వాటిని కూడా మేసన్లు పంపిణీ చేశారు.

కొన్నేళ్ల తర్వాత.. లాస్ ఏంజెలెస్‌లో అత్యంత ప్రముఖ గే పోర్న్ బుక్‌షాప్ - వెస్ట్ హాలీవుడ్‌లోని 'బుక్ సర్కస్' యజమాని ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నపుడు ఆ దుకాణాన్ని మాసన్లు కొనుక్కున్నారు. అది 1982లో జరిగింది. ఆ షాపు పేరును బారీ, కారెన్‌లు 'సర్కస్ ఆఫ్ బుక్స్' అని మార్చారు. అది పచ్చి పోర్న్ దుకాణం మాత్రమే కాదు. లాస్ ఏంజెలెస్‌లోని స్వలింగ సంపర్కులకు ఆశ్రయంగా, వారు కలుసుకునే ప్రాంతంగా మారింది.

బారీ, కారెన్‌లు తమ పిల్లలు మీకా, రాచెల్, జోష్‌లకు.. ఈ షాపుకి వచ్చినపుడు అక్కడ ఉన్న ఉత్పత్తుల వైపు చూడటం కానీ, తాకటం కానీ చేయరాదని కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ షాపు పేరును వారి స్నేహితులకు ఎన్నడూ చెప్పరాదని కూడా పిల్లలకు నిర్దేశించారు.

ఫొటో సోర్స్, RACHEL MASON

''మేం ఏం చేశామనేది వాళ్లకి అసలు తెలియకూడదని మేం అనుకున్నాం. మేం కుటుంబ వ్యాపారం గురించి మాట్లాడం. మాకు ఒక పుస్తకాల షాపు ఉంది అని మాత్రమే జనానికి చెప్తాం'' అంటారు కారెన్.

కానీ ఈ చర్యలు పూర్తిగా సఫలం కాలేదు.

అందరికన్నా పెద్దవాడైన మీకాకు.. కారెన్ కారు డిక్కీలో ఒక పోర్న్ వీడియో కనిపించింది (ఆ బీటామ్యాక్స్ టేపు ఇంట్లోని వీహెచ్ఎస్ మెషీన్‌లో ప్లే కాకపోవటం అతడికి నిరాశ కలిగించింది కూడా).

రాచెల్‌కు 14 ఏళ్ల వయసులో.. తన కుటుంబ రహస్యాన్ని ఆమె స్నేహితులు చెప్పారు. అప్పటికి పోర్న్ అంటే ఏమిటనేది ఆమెకు తెలియదు. ఆమె దిగ్భ్రాంతికి లోనైంది. ఆమె తండ్రి బారీది.. నిదాన వైఖరి. విషయాలను తేలికగా తీసుకునే తత్వం. కానీ ఆమె తల్లి కారెన్ మతవిశ్వాసాలు గల నైతిక విలువలు పాటించే వ్యక్తి. వారిని ఓ సాధారణ చిన్న వ్యాపార యజమానులుగా - ఒక దుకాణం నడిపే కుటుంబంగా మాత్రమే రాచెల్ భావించింది.

''అందరిలోకీ.. సంస్కృతికి వ్యతిరేకమైన పని చేస్తున్నది నా తల్లిదండ్రేలనన్న ఆలోచన, నా దృష్టిలో నా తల్లిదండ్రులు ఏమిటి అనేదానికి.. పూర్తి విరుద్ధంగా ఉంది'' అంటారు రాచెల్.

ఫొటో సోర్స్, RACHEL MASON

''మా కుటుంబంలో ఒక స్థాయి సంప్రదాయవాదం ఉంది.. ఒక నిఖార్సైన కుటుంబంగా కనిపించటం కోసం మేం కష్టపడేవాళ్లం'' అని జోష్ చెప్పారు.

కారెన్, బారీల యాజమాన్యంలో 'సర్కస్ ఆఫ్ బుక్స్' వాణిజ్యపరంగా విజయం సాధించింది. అనతికాలంలోనే వాళ్లు నగరంలోని సిల్వర్‌లేక్ ప్రాంతంలో రెండో శాఖను ప్రారంభించారు. అంతేకాదు.. జెఫ్ స్ట్రైకర్ (ఆ తర్వాత 'ద కారీ గ్రాంట్ ఆఫ్ పోర్నో' అని పేరు గాంచాడు) నటించిన గే పోర్న్ వీడియోలను నిర్మించటం కూడా మొదలుపెట్టారు. దీనితో పాటు పోర్న్ పంపిణీ వ్యాపారాన్ని కూడా కొనసాగించారు. అది దాదాపు కుప్పకూలే పరిస్థితికి దారితీసింది.

దేశాధ్యక్షుడు రొనాల్డ్ రీగన్.. పోర్నోగ్రఫీ పట్ల తన వ్యతిరేకతను స్పష్టంచేశారు. అది ''ఒక రకం కాలుష్యం'' అని ఆయన అభివర్ణించారు. ఈ పరిశ్రమ మీద దర్యాప్తు చేయాలని తన అటార్నీ జనరల్ ఎడ్విన్ మీస్‌ను ఆదేశించారు. ఫలితంగా 2006లో 2,000 పేజీల 'మీస్ రిపోర్ట్' ప్రచురితమైంది. అదే సమయంలో సరికొత్త ప్రాసిక్యూషన్ ఎత్తుగడలను ప్రవేశపెట్టారు. దీంతో మాసన్‌ల వ్యాపారం ఒత్తిడికి గురైంది.

ఆ తర్వాత కొంత కాలం వరకూ.. పంపిణీదారులు తమకు తెలిసిన వారికి మాత్రమే ఆ ప్రచురణలు అమ్మటం క్షేమదాయకంగా ఉండేది. కానీ.. ఒక రోజు సిబ్బందిలో ఒకరు ఒక తప్పు చేశారు. ఒక కస్టమర్ ఫోన్ చేసి.. 'జోస్ వీడియో స్టోర్'కి పంపించాలంటూ మూడు సినిమాలు ఆర్డర్ చేశాడు. ఆ ఉద్యోగి షాపు వివరాల్లో ఆ సమాచారం నమోదు చేసి.. ఆ వీడియోలను పంపించారు.

నిజానికి.. ఆ కస్టమర్ ఎఫ్‌బీఐ అధికారి.

అసలైన హాలీవుడ్ సినిమా శైలిలో ఈ దుకాణం మీద ఎఫ్‌బీఐ దాడి చేసింది. ఏజెంట్లు తుపాకులు ఎక్కుపెట్టి దూసుకువచ్చారు. అశ్లీల ప్రచురణలను రాష్ట్ర సరిహద్దుల వెలుపలకు రవాణా చేస్తున్నారంటూ మాసన్‌ల మీద అభియోగాలు నమోదు చేశారు.

ఫొటో సోర్స్, RACHEL MASON

వారి పిల్లలకు ఈ విషయం తెలియదు. కానీ.. బారీకి ఐదేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా పడే అవకాశం ఉంది. ఆ దుకాణాన్ని మూసివేయక తప్పదన్నట్లు కనిపించింది.

అయితే.. మాసన్‌ల తరఫు న్యాయవాది పట్టు వదలలేదు. భావ ప్రకటనా స్వాతంత్ర్యం హామీ ఇస్తున్న మొదటి సవరణ ద్వారా వీరికి రక్షణ ఉందని ఆయన వాదించారు. ఇంతటి భారీ శిక్ష వారి కుటుంబం మీద చూపగల తీవ్ర ప్రభావం గురించి గట్టిగా చెప్పారు.

చివరికి.. బారీ నేరాంగీకార ఒప్పందానికి వచ్చారు. దానివల్ల జైలుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా విడుదలయ్యారు. వారి షాపు కొనసాగింది.

ఎయిడ్స్ వ్యాధి విజృంభించిన కాలంలో కారెన్, బారీలు ఆదర్శ యజమానులుగా నిలిచారు.

నాడు ప్రాణాంతక వ్యాధిగా ఉన్న హెచ్‌ఐవీ సోకి ఆశ్రయం పొందుతున్న ఉద్యోగులు, అనారోగ్యంపాలైన ఉద్యోగులను బారీ సందర్శించేవారు.

ఎయిడ్స్ ద్వారా అనారోగ్యం పాలైన సిబ్బంది ఉద్యోగం చేయటానికి వీలులేదు. ఒకవేళ అలా చేస్తే వారు తమ ఆరోగ్య బీమా కోల్పోతారు. కానీ.. వాళ్లు ఆరోగ్యంగా ఉన్నామని భావించిన రోజుల్లో పని చేయటానికి కారెన్ అనుమతించేవారు. ఆ విషయం బయటకు చెప్పేవారు కాదు.

''వాళ్లు పనిచేయటానికి వస్తానంటే రానిచ్చేదానిని. వారి వేతనాలను నగదు రూపంలో చెల్లించేదానిని. అది చట్ట వ్యతిరేకం. కానీ.. వాళ్లు తమను తాము కోల్పోవాల్సిన అవసరం లేదు. పని చేయటం ముఖ్యమని నేను ఎప్పుడూ భావించేదానిని'' అంటారామె.

ఫొటో సోర్స్, RACHEL MASON

చాలా మంది సిబ్బందికి అండగా నిలిచే కుటుంబం లేదు. కానీ.. వారు చనిపోయినపుడు వారి కుటుంబ సభ్యులు కారెన్, బారీలకు ఫోన్ చేసి తమ పిల్లల గురించిన సమాచారం అడిగేవారు.

మాసన్‌లకు లాస్ ఏంజెలెస్‌ గే సమాజంతో సుదీర్ఘ ప్రమేయం ఉన్నప్పటికీ.. వారి ఇంట్లో లైంగికత్వం గురించిన సంభాషణ ఎప్పుడూ జరగలేదు.

అయితే.. ముగ్గురు పిల్లల్లో రెండోదైన రాచెల్.. తన తల్లిదండ్రులకు తెలియకుండా క్వీర్ జీవనశైలిలో జీవించటం ప్రారంభించారు.

''నేను గే క్లబ్‌లకు వెళ్లాను. నాకు చిన్నవయసు ఐడీ ఉంది. కాబట్టి నేను డ్రాగ్ షోలకు వెళ్లగలిగేదాన్ని. అదంతా చాలా అద్భుతంగా అనిపించేది'' అని ఆమె చెప్పారు.

రాచెల్ ఎన్నడూ బయటపడకపోయినప్పటికీ.. ఆమె ఎప్పుడూ కళాత్మకంగా, ఎదిరించే తత్వంతో ఉండేవారు. కాబట్టి.. ఆమె హైస్కూల్ ప్రామ్‌కి తనతో పాటు ఒక బాలికను తీసుకెళ్లినపుడు పెద్దగా ఆశ్చర్యం కలగలేదు.

ఫొటో సోర్స్, RACHEL MASON

అందరిలోకీ చిన్నవాడైన జోష్.. తన తల్లి ఆకాంక్షలన్నిటినీ తన భుజాల మీద మోస్తూ మంచి విజయాలు సాధించేవాడు. కానీ అతడు వ్యక్తిగతంగా ఒక రహస్యంతో ఇబ్బంది పడుతుండేవాడు.

''సంపూర్ణత్వం కోసం మా అమ్మ ఆకాంక్షలు చాలా వరకూ నేను లీనం చేసుకున్నాను.. నేను కూడా పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకున్నాను'' అంటాడు జోష్.

ఒక రోజు రాత్రి ఆయన కాలేజీకి తిరిగి వెళ్లాల్సి ఉండగా.. అతడి ఓపిక నశించింది. ''ఒక కాగితం మీద రాయటం మొదలుపెట్టాను. 'నేను గే' అని రాశాను. ఆ పెన్ను, పేపరుని టేబుల్ మీద విసిరేశాను'' అని చెప్పాడు.

ఈ పని చేయటానికి ముందు ఇంటిని వీడి వెళ్లటానికి అతడు ఏర్పాట్లు చేసుకున్నాడు. కారణం.. తనను ఇంటి నుంచి గెంటివేస్తారని భయపడ్డాడు. ''నా విమానం టికెట్లు బుక్ చేసుకుని.. దానికి డబ్బులు చెల్లించేలా చూసుకున్నాను. అది అసాధ్యమైన ఆలోచనేమీ కాదు'' అంటాడతడు.

కారెన్ ప్రతిస్పందన.. వీరిద్దరికీ కలకాలం గుర్తిండిపోయింది.

ఫొటో సోర్స్, RACHEL MASON

''నిజంగా చెప్తున్నావా? ఇలా ఎందుకు చేస్తున్నావు? దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు...' అన్నాను నేను. నాకు సంబంధించినంత వరకూ స్వలింగ సంపర్కులు ఎవరితోనూ నాకు ఇబ్బంది లేదు. కానీ.. నా పిల్లల్లో ఒకరు గే అనే దానికి అప్పుడు నేను సంసిద్ధంగా లేను'' అని కారెన్ గుర్తుచేసుకున్నారు.

తన ప్రతిస్పందన జోష్‌ను గాయపరిచిందని కారెన్ ఆ తర్వాత అర్థంచేసుకున్నారు. కానీ.. అతడి లైంగికత గురించి అతడితో మాట్లాడటం కూడా ఆమెకు కష్టంగా మారింది. దీంతో తన ఆలోచలను నియంత్రించటానికి తనకు సాయం కావాలని ఆమె నిర్ణయించుకున్నారు.

''ఒక స్వలింగ సంపర్క చిన్నారికి తల్లిగా ఉండటం అంటే ఏమిటనేది నేను అర్థంచేసుకోవాల్సిన అవసరం వచ్చింది'' అని ఆమె చెప్తారు.

''పీఫ్లాగ్ (పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ ఆఫ్ లెస్బియన్స్ అండ్ గేస్) అనే సంస్థలో చేరాను. నేను దీనిని సాధారణంగా స్వీకరించగలగాలి. తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల ఉండే ఆకాంక్షలు.. ఎక్కువగా తమ పిల్లలకన్నా తల్లిదండ్రులనే ప్రతిబింబిస్తాయనే విషయాన్ని అంగీకరించాల్సి ఉంది'' అని పేర్కొన్నారు.

''నా సొంత కొడుకు విషయానికి వచ్చేసరికి.. స్వలింగ సంపర్కుల గురించి నేను మార్చుకోవాల్సిన అవసరమున్న కొన్ని ఆలోచనలు నాకు ఉన్నాయని నేను తెలుసుకున్నాను'' అని వివరించారు.

ఆ తర్వాత.. బారీ, కారెన్ ఇద్దరూ పీఫ్లాగ్‌కు రాయబారులుగా మారారు. ఇతరులు వారి వారి పిల్లల లైంగికత, లైంగిక తేడాల గురించి అర్థం చేసుకోవటానికి సాయపడేవారు.

కొత్త శతాబ్దం వచ్చేటప్పటికి ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. జనం కలుసుకుంటూ, ప్రత్యేకమైన ప్రచురణలు పొందే దుకాణం - 'సర్కస్ ఆఫ్ బుక్స్' పతనమవటం మొదలైంది.

సిల్వర్‌లేక్ శాఖను 2016లో మూసివేశారు. వెస్ట్ హాలీవుడ్ షాపును ఈ ఏడాది ఫిబ్రవరిలో మూసివేశారు.

ఫొటో సోర్స్, RACHEL MASON

''ఆ దుకాణాన్ని మూసివేసినపుడు వచ్చిన ప్రతిస్పందన నమ్మశక్యం కానిది. జనం అక్కడికి నడుచుకుంటూ వచ్చి కన్నీటిపర్యంతమయ్యారు. అంటే జనం ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చే వాళ్లు.. మేం కలిసి ఏడ్చేసేవాళ్లం'' అని చెప్తారు రాచెల్.

ఒకప్పుడు తమకు సురక్షిత ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న.. లాస్ ఏంజెలెస్‌ గే చరిత్రలో భాగమైన ఆ దుకాణాన్ని కోల్పోవటం పట్ల చాలా మంది సీనియర్ కస్టమర్లు, మాజీ సిబ్బంది శోకతప్తమయ్యారు.

కానీ.. చివరికి తను కోరుకున్న తరహా యజమానిగా తాను ఉండలేకపోయానని కారెన్ అంటారు. వ్యాపారం మందగించిపోవటంతో సిబ్బందికి గతంలో ఇచ్చిన తరహా ప్రయోజనాలు అందించలేకపోయామని చెప్పారు.

''వీరు విద్యా కార్యక్రమాల్లో చేరేందుకు వీలుగా, కనీసం మరేదైనా పార్ట్-టైం ఉద్యోగం చూసుకోవటానికి వీలుగా.. వీరితో నాకు సాధ్యమైనంత సుదీర్ఘ కాలం పనిచేశాను. ఇది మూసివేయటం వల్ల నాకు ఇబ్బంది లేదు'' అని ఆమె పేర్కొన్నారు.

రాచెల్ మాసన్ దర్శకత్వం వహించిన, రేయాన్ మర్ఫీ నిర్మించిన 'సర్కస్ ఆఫ్ బుక్స్' అనే డాక్యుమెంటరీ 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)