థాయ్‌లాండ్: నుదుటిపై గాటు సీరియల్ కిల్లర్‌ను పట్టిచ్చింది

సోమ్‌కిద్ పుంపువాంగ్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

సోమ్‌కిద్ పుంపువాంగ్

నుదుటిపై గాటు ఓ సీరియల్ కిల్లర్‌ను పట్టిచ్చింది.

థాయ్‌లాండ్‌లో ఐదుగురు మహిళల హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 53 ఏళ్ల సోమ్‌కిద్ పుంపువాంగ్, ఈ ఏడాది మేలో సత్ప్రవర్తన ప్రాతిపదికగా పెరోల్‌పై ముందస్తుగా విడుదలయ్యాడు.

ఆదివారం థాయ్‌లాండ్‌లోని ఖోన్ కావేన్‌లో జరిగిన 51 ఏళ్ల రస్తామీ ములిచాన్ అనే మహిళ హత్య కేసులో అతడు అనుమానితుడిగా ఉన్నాడు. అప్పట్నుంచి పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

బుధవారం ఉదయం ఒక యువ జంట రైల్లో వెళ్తోంది. వారి ఎదురుగా సోమ్‌కిద్ కూర్చున్నాడు. జంటలోని అమ్మాయి, అతడి నుదుటి మీద ఎడమ కనుబొమ్మపైన ఉన్న గాటును గమనించారు. పోలీసులు విడుదల చేసిన 'వాంటెడ్' పోస్టర్లలోని ఫొటోతో అతడి రూపాన్ని సరిపోల్చుకున్నారు.

తర్వాత జంట మరో చోటకు వెళ్లి కూర్చుంది. అప్పటివరకు కూర్చున్న చోట ఎందుకు అసౌకర్యంగా అనిపించిందో ఆ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్‌కు వివరించారు. ఆ యువకుడు మొదట కూర్చున్న చోటకు వెళ్లి, సోమ్‌కిద్‌ను ఫొటో తీసి, పోలీసు స్టేషన్‌కు పంపించారు.

రైలు పాక్ చోంగ్ స్టేషన్‌కు చేరుకోగానే అధికారులు రైల్లోకి వచ్చి సోమ్‌కిద్‌ను అరెస్టు చేశారు.

ఆ యువకుడు ఓ విద్యార్థి. భద్రతా కారణాల రీత్యా జంట వివరాలు వెల్లడించలేదు.

నుదుటిపై ఉన్న గాటును చూసే అతడు సోమ్‌కిద్ అని నిర్ధరించుకున్నానని యువకుడు థాయ్ టీవీతో చెప్పారు.

ఫొటో సోర్స్, EPA

ఎవరీ సోమ్‌కిద్?

సోమ్‌కిద్ ప్రమాదకరమైన వ్యక్తని అరెస్టుకు ముందు పోలీసులు వ్యాఖ్యానించారు.

న్యాయవాదినని అబద్ధం చెప్పి సోమ్‌కిద్ ఫేస్‌బుక్ ద్వారా రస్తామీతో స్నేహం చేశాడని, ఈ నెల 2 నుంచి ఆమె ఇంట్లో ఉంటున్నాడని అధికారులు ఆరోపిస్తున్నారు.

సోమ్‌కిద్ రస్తామీ ఇంటికి వెళ్లిన తర్వాత రెండు వారాలకు ఆమె ఇంట్లోనే హత్యకు గురైనట్లు బ్యాంకాక్ పోస్ట్ పత్రిక చెప్పింది.

2005లో ఐదుగురు మహిళల హత్య కేసులో సోమ్‌కిద్ దోషిగా తేలాడు. బాధితుల్లో కొందరు నైట్‌క్లబ్‌లలో గాయనులు. మరికొందరు హోటళ్లలో మసాజ్ సేవలందించేవారు.

2012లో అప్పీళ్ల కోర్టు అతడికి జీవిత ఖైదు శిక్ష వేసింది. జైల్లో సత్ప్రవర్తనతో ఉన్నాడనే ప్రాతిపదికపై ఈ ఏడాది మేలో అతడిని పెరోల్‌పై ముందస్తుగా విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)